ఊహించిందే జరిగింది.. వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్
posted on Jan 26, 2019 @ 11:13AM
సీఐ గోరంట్ల మాధవ్. కొద్ది రోజుల క్రితం ఈ పేరు వార్తల్లో మారుమోగిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎంపీకే మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఐ మాధవ్ తెరపైకి వచ్చారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
అయితే ఈమధ్య.. గోరంట్ల మాధవ్ త్వరలో వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారు అంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఊహించినట్లుగానే నేడు మాధవ్ వైసీపీలో చేరారు. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ జగన్ సమక్షంలో తాజాగా వైసీపీలో చేరారు. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను వైసీపీ హైకమాండ్ కోరడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు వైసీపీలో చేరారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. మరి రాజకీయాల్లో ఆయన జీవితం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.