అక్టోబర్‌లోపే మూడో ముప్పు.. మరో రెండేళ్లపాటు కరోనా కల్లోలం..!
posted on Jun 19, 2021 @ 11:15AM
ఫస్ట్ వేవ్ ఫసక్ అనిపించింది. సెకండ్ వేవ్ చంపిపారేస్తోంది. ఇక సీజన్ 3 కూడా ఉందనే వార్తలు వణికిస్తున్నాయి. థర్డ్ వేవ్ మరెంతో దూరంలో లేదని.. ఈ అక్టోబర్‌లోనే అల్లాడించబోతోందని ప్రపంచ శాస్త్రవేత్తల మాట. మరో ఏడాది వరకూ కరోనాదే కాలమని.. మామూలు రోజులు ఇప్పట్లో రావంటూ చావుకబురు చల్లగా చెబుతున్నారు. ప్రతిష్టాత్మక రాయ్‌టర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్‌లో పలువురు వైద్యులు థర్డ్‌వేవ్ గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రైటర్స్.. జూన్ 3 నుంచి 17 మధ్య 41 మంది ఆరోగ్య రంగ నిపుణులతో ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలు మీ కోసం....
థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు 24 మంది వైద్య నిపుణులు స్పందించారు. ఎక్కువ మంది అక్టోబరు నాటికి థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉందని అంచనా వేశారు. అయితే, కొందరు సైంటిస్టులు ఆగస్టు అంటే.. మరికొందరు సెప్టెంబరులో వస్తుందన్నారు.
రెండో వేవ్ నియంత్రణతో పోలిస్తే థర్డ్ వేవ్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించగలమని భావిస్తున్నారు. కొంతమంది వైద్యులు థర్డ్‌వేవ్ మరింత ఘోరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొంత మంది మాత్రం తీవ్రత దాదాపు సెకండ్ వేవ్ లాగానే ఉండొచ్చన్నారు.
మూడో వేవ్ 18 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదం అనే అనుమానంపై 40 మందిలో 26 మంది అవుననే సమాధానమే ఇచ్చారు. మిగిలిన 14 మంది నిపుణులు మాత్రం పిల్లలకు మూడోవేవ్‌లో అంత పెద్ద ముప్పు ఉండదన్నారు.
భవిష్యత్తులో వచ్చే వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అన్న ప్రశ్నకు 38 మందిలో 25 మంది.. పనిచేస్తాయనే అభిప్రాయపడ్డారు. 34% మంది పనిచేయవన్నారు.
మరో ఏడాది పాటు భారత ప్రజారోగ్యానికి కరోనా ముప్పుగానే ఉంటుందని చెప్పారు. 11 మంది.. కరోనా ముప్పు ఏడాదిలోపే ఉంటుందని అభిప్రాయపడగా, 15 మంది రెండేళ్లలోపు ఉంటుందని, 13 మంది రెండేళ్లకన్నా ఎక్కువగా ఉంటుందని, ఇద్దరేమో.. కరోనా ముప్పు ఎప్పటికీ పోదని అభిప్రాయపడ్డారు.
రైటర్స్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైరస్ మనుషులకంటే తెలివిగా ప్రవర్తిస్తున్నట్టే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పరివర్తనం చెందుతూ.. కొత్త కొత్త వేరియంట్లతో ముందుకొస్తోంది. మందుల నుంచీ ఎస్కేప్ అవుతోంది. మరింతగా కణాల్లోకి వ్యాపిస్తూ.. మరింత ఖతర్నాక్‌గా మారుతోంది కరోనా. వైరస్ ఎంతగా డ్రామాలు చేసినా.. మనం జాగ్రత్తగా ఉంటే అది ఏమీ చేయలేదనే విషయం మాత్రం మరవొద్దు. మాస్క్, శానిటైజర్ అస్సలు మరవొద్దు.