అమరావతి అందరి రాజధాని.. హైకోర్టు చీఫ్ జస్టిస్ క్లారిటీ!
posted on Nov 16, 2021 @ 2:40PM
ఏపీ రాజధాని అమరావతే. అన్నివర్గాల నుంచి, అన్ని వ్యవస్థల నుంచి ఈ విషయం పదే పదే స్పష్టమవుతోంది. సోమవారం అమరావతినే ఏపీ రాజధాని అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్టీ నేతలకు తేల్చి చెప్పగా.. మంగళవారం హైకోర్టు సీజే సైతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే అంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. అమరావతి ఉద్యమం 700 రోజులకు చేరిన సందర్భంలోనే ఇలా రెండు రాజ్యాంగ వ్యవస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఏపీ కేపిటల్ అమరావతి అని స్పష్టం చేయడం కీలక పరిణామం అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని, రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని కోసం 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే.. అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని సీజే వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని అన్నారు. ఆ స్వాతంత్య్రం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.