Read more!

మేలుకోవోయి.. కంటిచూపు కాపాడుకోవోయి...

‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు. అంటే శరీరంలోని జ్ఞానేంద్రియాలలో కళ్లు ప్రధానమైనవని అర్థం. కంటిచూపు ఉంటే ప్రపంచాన్ని వీక్షించగలుగుతాము. లేకపోతే జీవితమంతా అంధకారమే మరి. జీవితమంతా చీకటిలోనే గడిచిపోతుంది. ఏ వ్యక్తి జీవితమైనా సాఫీగా, అందంగా  సాగాలంటే అత్యంత కీలకమైన ఈ కంటిచూపు గురించి, సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘అంతర్జాతీయ కంటిచూపు దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. దీనిని ప్రపంచ కంటి దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెల రెండో గురువారం నాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 12నా ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దినోత్సవం ప్రాధాన్యత, చరిత్రను గమనిస్తే..

1984లోనే మొదలు..

కంటిచూపుపై సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 1984 అక్టోబర్ నుంచి ప్రపంచ కంటిచూపు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు లయన్స్ క్లబ్ ఫౌండేషన్ రిపోర్ట్ పేర్కొంది. మొదట్లో ‘ విజన్ 2020’ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఐఏపీబీ (ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్) నిర్వహిస్తుండేది. . అయితే 2000 నుంచి ఐఏపీబీ అధికారిక కార్యక్రమంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచదేశాలు వేర్వేరు  కార్యక్రమాలతో ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

పని వద్ద కళ్లను ప్రేమించడం..  

ఈ ఏడాది థీమ్ ఇదే…
 

‘పని వద్ద మీ కళ్లను ప్రేమించండి’ అనే థీమ్ ఆధారంగా  ఈ ఏడాది ప్రపంచ కంటి దినోత్సవం సాగుతుంది.  పని చేసేచోట కంటిచూపు కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ థీమ్ చాటిచెబుతోంది. ప్రతి పని ప్రదేశంలో కంటి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీల యజమానులు, వ్యాపారవేత్తలకు పిలుపునివ్వడం దీని ఉద్దేశ్యం. ఇక ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని నిర్వహించేందుకు వేర్వేరు మార్గాలున్నాయి. కంటి పరీక్ష నిర్వహించుకోవడం ప్రధానమైనది. కంటి ఆరోగ్యం గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం రెండవ ప్రధానమైనది. ఇక కంటి ఆరోగ్యం బావుండాలని కోరుకునేవారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవడం, ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కంటిని రక్షించుకునేందుకు సన్‌గ్లాసెస్ వాడడం చాలా ముఖ్యం.  పౌష్టికాహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం తప్పనిసరి.  ధూమపానం, పొగాకు తీసుకోవడం, మత్తుపదార్థాల వాడకం వంటి అలవట్లు ఉంటే వెంటనే మానేయాలి.

జీవనశైలికి తగ్గట్టు కంటి రక్షణ ముఖ్యం..

రోజు రోజుకూ వేగంగా మారిపోతున్న జీవన శైలి కళ్లకు ముప్పుగా మారింది. ఆధునిక యుగంలో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు చూడనిదే పొద్దుగడవని పరిస్థితిని యువత ఎదుర్కొంటుంది. నిద్రలేచిన దగ్గరనుంచి రాత్రి నిద్రించే వరకు కంటిమీద ఒత్తిడి పడుతూనే ఉంటుంది. అయితే కంటిచూపుని మెరుగుపరచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కనులకు అందాల్సిన పోషకాలు, విటమిన్-ఎ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చు. ఇందులో క్యారెట్, పాలకూర, నట్స్ బాదాం, వాల్ నట్, అవకాడో, చేపలు, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కంటిచూపు మెరుగుదలకు గొప్ప మేలు చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా మీ రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోండి.


                                            *నిశ్శబ్ద.