జగన్ కోర్టుకి రావాల్సిందే!
posted on Feb 5, 2014 @ 1:25PM
తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయి వున్న జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. 16 నెలలు జైల్లో గడిపి బయటకి వచ్చిన జగన్‌ని మొన్నటి వరకూ సీబీఐ కోర్టు అనేక విధాలుగా కట్టడి చేసింది. హైదరాబాద్ దాటి వెళ్ళకూడదని ఆంక్షలు కూడా విధించింది. అయితే ఈమధ్యకాలంలో మాత్రం జగన్ మొరపెట్టుకుని మొత్తుకోవడంతో హైదరాబాద్ దాటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది.
అయితే జగన్ అందినదానితో సంతృప్తి చెందకుండా అసలు కోర్టు విచారణకే హాజరు కాకుంటే ఎలా వుంటుందన్న ఐడియా వచ్చింది. వెంటనే జగన్ కోర్టుకు విన్నవించుకున్నాడు. తానొక పార్టీ అధ్యక్షుడిగా వున్నాడు కాబట్టి చాలా బిజీగా వుంటానని, కాబట్టి సీబీఐ కోర్టు విచారణకు తాను హాజరు కాలేనని, తన తరఫున తన లాయర్ హాజరవుతాడని రిక్వెస్ట్ చేశాడు. అయితే కోర్టు ఈ విషయంలో జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆర్థిక నేరాలు ఆవేశంలో చేసే హత్య కంటే తీవ్రమైనవి. విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడానికి ఇదేమీ చెల్లని చెక్కుల కేసు లాంటి సాధారణమైన కేసు కాదు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి నీతిబాహ్యమైన అభియోగాలు ఎదుర్కొంటున్న కేసు. ఈ కేసు విచారణకు హాజరు విషయంలో ఎలాంటి మినహాయింపులు కుదరవు’’ అని వ్యాఖ్యానిస్తూ జగన్ చేసుకున్న విన్నపాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది.
‘‘దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్ని బలహీనం చేసే స్థాయి అభియోగాలు మీ మీద వున్నాయి. కోర్టుకు హాజరు నుంచి మీకు మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి కారణాలూ కనిపించడం లేదు. రోజువారీ వేతనం, ప్రభుత్వ విధుల్లో బిజీగా వుండేవారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వొచ్చు’’ అని కోర్టు పేర్కొంది.