వీరవిధేయులకే వరాలిచ్చిన సోనియామాత!
posted on Oct 30, 2012 @ 1:39PM
ఈసారి మంత్రివర్గ విస్తరణలో సోనియా ఆచితూచి అడుగేశారు. రాహుల్ వర్గానికి పెద్దపీట వేస్తూనే ఉద్యమాలబాటలో ఉలికిపడ్డ నేతల్ని దూరంగా ఉంచారు. మధుయాష్కీ.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా పేరుపడ్డ ఎంపీ.. కానీ తెలంగాణ ఉద్యమంలో అధిష్ఠానాన్ని రూల్ చేసే రీతిలో మాట్లాడిన పాపానికి ఆయనకు ఛాన్స్ దక్కలేదు. నోరెత్తినవాళ్లకి పదవులు దక్కవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేందుకు అధిష్ఠానం ఈ స్థాయిలో కసరత్తు చేసిందని వినికిడి.
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పల్లెత్తు మాట అనకుండా ఉద్యమం చేశామంటే చేశామని.. హడావుడి చేసి కామ్ గా ఊరుకున్నవాళ్లని మాత్రం నెత్తినపెట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతంనుంచి సర్వేకి, బలరాం నాయక్ కి రెండు విధాలుగానూ లాభం జరిగింది. అటు తెలంగాణ ప్రజలు.. వీళ్లు మాకోసం తెగపాకులాడుతున్నారన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఇటు.. అధిష్ఠానంకూడా తమని ధిక్కరించే సాహసం చేయలేదన్న ఆలోచనకు వచ్చింది కాబట్టే ఛాన్స్ కొట్టగలిగారు.
వ్యాపారవర్గాలకు కూడా ఈ విస్తరణలో తీవ్రస్థాయి నిరాశే దక్కింది. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి దీనికి మంచి ఉదాహరణ. రాయపాటికీ, కావూరికీ సమైక్యవాదాన్ని నెత్తినేసుకోవడంవల్లే మంత్రిపదవి దక్కలేదన్న ప్రచారం జోరుగా సాగుతోందికానీ.. బిజినెస్ పీపుల్ ని దూరంగా పెట్టాలన్న నియమం ప్రకారమే వాళ్లకి ఛాన్స్ దక్కలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.