విభజించి పాలించు-2
posted on Feb 1, 2014 @ 9:40PM
1. ఎన్నికల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సజావుగా నడవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. వారిపై వేటు వేసి చేజేతులా తన ప్రభుత్వాలను తనే కూల్చుకొని కొంటే, దానివలన తనకే తీవ్ర నష్టం కలుగుతుంది. రెండు చోట్ల అధికారం తన చేతుల్లో ఉన్నపుడే ఎన్నికలను సులువుగా చక్కబెట్టుకోగలదు. కనుకనే కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా దిక్కరిస్తున్నపటికీ, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపలేదు.
2. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు ఎంత ధిక్కార స్వరం వినిపిస్తున్నపటికీ, పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, వారందరిచేత దానికి అనుకూలంగా ఎలా ఓటు వేయించాలో అధిష్టానానికి బాగా తెలుసు. అంతే గాక కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండేందుకు కూడా వారి మద్దతు అవసరం ఉంది. గనుకనే వారిని ఉపేక్షిస్తోందని భావించవచ్చును.
3. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినపటికీ కాంగ్రెస్ అధిష్టానం ముందుకే సాగుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీని బలిపెట్టుకొని రాష్ట్ర విభజన చేసేంత తెలివి తక్కువది కాదు. రాష్ట్ర విభజన జరగాలి. కానీ సీమాంధ్రలో పార్టీ గెలవాలి. బహుశః అందుకే ముఖ్యమంత్రికీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకీ కావలసిన మైలేజీ స్వయంగా కల్పిస్తోంది. ఆ మైలేజీ కోసమే ముఖ్యమంత్రి చేత టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించి ‘సమైక్య ఛాంపియన్నుఇప్పుడు ‘సమైక్య సింహం’గా చేసింది.
వచ్చే ఎన్నికల తరువాత తనకు మద్దతు ఇస్తాడనుకొంటున్నతన మరో ‘సమైక్య ఛాంపియన్’ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నమ్మకోవడం కంటే తన “స్వంత సింహాన్నే” నమ్ముకోవడం మేలనే జ్ఞానోదయం బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి కలగి ఉండవచ్చును. లేదా వచ్చే ఎన్నికలలో కేంద్రంలో ఓడిపోయినా రాష్ట్రంలోనయినా తన సమైక్య సింహం అధికారంలో ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇదంతా కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా నడిపిస్తోందేమో!
4. ఇక ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోతే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందదు. కానీ, రాష్ట్ర విభజనకు పూనుకొన్న కారణంగా సీమాంధ్రలో అందుకు పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒకవేళ బిల్లుకి మద్దతు దొరికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినా కూడా సీమాంధ్రలో మూల్యం చెల్లించక తప్పదు. ఈ గండం గట్టేక్కెందుకే కాంగ్రెస్ అధిష్టానం తన సమైక్య సింహానికి అవసరమయిన మైలేజీ అందిస్తోంది.
ఆయన డిల్లీలో దీక్షలు, పాదయాత్రలు చేస్తే పార్టీ పరువు పోవచ్చును. అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును. బహుశః సుప్రీం కోర్టు చేత మళ్ళీ చివాట్లు కూడా తినవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయినా, భవిష్యత్ ప్రయోజనాలతో పోల్చుకొంటే ఈ కష్టాలు, అవమానాలు చాలా చిన్నవిగా కనబడతాయి. బహుశః అందుకే ఈ తిప్పలన్నీనేమో!