చంద్రబాబు మాట (విభజించి పాలించు-1 &2)
posted on Feb 1, 2014 @ 9:34PM
మొన్న ఉభయ సభలలో టీ బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి తీర్మానం ఆమోదింపజేసిన తరువాత, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని పక్కన బెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తీసుకువస్తున్నట్లుంది” అని అనడం చూస్తే ఈ అనుమానాలను పూర్తిగా కొట్టిపారేయలేమనిపిస్తోంది. ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి, రాష్ట్ర విభజనకి వ్యతిరేఖంగా చాలా చేసినట్లు పైకి కనబడుతున్నా, అధిష్టానానికి వారు ఇసుమంత నష్టం కూడా కలిగించలేదు. వారి రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు, దీక్షలు, ధర్నాలు గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.
ఇక, అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా ఎవరూ కూడా తెలంగాణా బిల్లుకి ఎటువంటి అడ్డంకులు కల్పించలేదు. డిల్లీలో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక పూర్తి చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం వారు కోరిన విధంగా అవసరమయిన అన్ని ఫయాల్లు, వివరాలు అందిస్తూ సహకరించింది. అందుకే చంద్రబాబు “విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు కేంద్రానికి ఫైళ్ళు పంపుతూ ఎందుకు సహకరించారని ముఖ్యమంత్రిని సభలోనే ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణా, డిల్లీ కాంగ్రెస్ నేతలందరు కలిసి ఒకరినొకరు తిట్టుకొంటూ, లోలోన సహకరించుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియను ఇంతవరకు సజావుగా పూర్తి చేయగలిగారు. ఇక బీజేపీ గనుక బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు కూడా చేస్తారు.
ఇప్పడు చివరిగా దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంటులు కూడా చెప్పుకొంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ విభజించి పాలించు వ్యూహం ఎంత పకడ్బందీగా అమలు చేసిందో అర్ధమవుతుంది.
కిరణ్ కుమార్ రెడ్డి, అతని కుటుంబము కాంగ్రెస్ పార్టీకి చాల విధేయులు, చాల సేవలు అందించారు. ఆయన పార్టీకి అత్యంత నమ్మకస్తుడయిన నాయకుడు.
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించారు. ఆయనే దీనిని చివరి వరకు పర్యవేక్షిస్తారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పినట్లే నడుచుకొంటారని నాకు నమ్మకం ఉంది. మేమే మా నేతలకు విభజన బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చాము. అందువల్ల ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. కనుక ముఖ్యమంత్రి తో సహా ఎవరిపైనా చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు.
బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం చేస్తారని మేము ముందే ఊహించాము. ఆర్టికల్:3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే హక్కు కేంద్రానికి ఉంది గనుక, ఆ తీర్మానం వలన బిల్లుకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.