కృష్ణా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర
posted on Jan 21, 2013 @ 9:51AM
చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కోస్తాలోకి ప్రవేశించనుంది. నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సమీపంలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆయనకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
అదే సమయంలో రాష్ట్ర విభజన అంశంపై తారస్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించనుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అప్పట్లో తెలంగాణలో పాదయాత్రకు అడ్డంకులు తప్పవని, గొడవలు జరుగుతాయని నాడు పలువురు భావించారు. అయితే..తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు.
కృష్ణా జిల్లాలో తొమ్మిది రోజులు పాదయాత్ర జరిపిన అనంతరం చంద్రబాబు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. 15 రోజుల పాదయాత్ర అనంతరం మళ్లీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి మరో 8 రోజుల పాటు పాదయాత్ర జరుపుతారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు.