రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న శిశు మరణాలు
posted on Aug 18, 2012 @ 2:17PM
తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు మరో నలుగురు చిన్నారులు చనిపోయారు. మృత్యువాత పడిన వారంతా వాయల్పాడు, పుత్తూరు, మదనపల్లెలకు చెందినవారు. చికిత్స పొందుతున్నవారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ మేరకు తాజా మెడికల్ బులిటెన్‌ను శనివారం వైద్యులు విడుదల చేశారు. గత మూడు రోజుల్లో 19మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలపై ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యే వైద్య బృందం ఈరోజు మధ్యాహ్నం తిరుపతి వెళ్లనుంది. ఈ బృందంలో నీలోఫర్ వైద్యులు హిమబిందు, సుబ్రహ్మణ్యం, మురళీరావు ఉన్నారు. శిశువుల మరణాలపై వీరు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నారు.