Previous Page Next Page 
భరించువాడు పేజి 3


    అదంతా మీ భ్రమ. ఆవిడకు మొగుడంటే ప్రాణం. మాయా మర్మం తెలియని మనిషి...." అనేది ఇందుమతి.
    ఇందుమతి ఎటువంటి అడదో అప్పారావుకు అర్ధం కాదు. సాధారణంగా ఆడవాళ్ళు భర్తలను వేధించే విషయాలనేమి పట్టించుకోదు.
    అప్పారావు కాలేజీ రోజుల్లో తనకు ప్రేమ లేఖలు వ్రాసిన ఇద్దరమ్మాయిల గురించి చెప్పాడు . వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. విన్నాక చలించలేదు.
    జ్యోత్స్న పొరుగు ప్రమాదమని వేరే యిల్లు మారుదామని అంటే లెక్కచేయదు. ఇందుకు కారణమేమిటి?
    స్త్రీగా ఆమెలో లోపాలున్నాయా?
    లోపాల విషయమై అప్పారావు ఎక్కువగా ఆలోచించలేదు. కానీ, ఒక్క విషయం అతడికి స్పష్ట మయింది! రాత్రి ఆమె భర్త కోసమే తను ఏం చేసినా అన్నట్లు ప్రవర్తిస్తుంది. రోజంతా హడావుడి చేసి భర్తకు ఊపిరి సలపకుండా చేసే ఇందుమతి రాత్రి అయ్యేసరికి నిరాసక్తురాలిగా మారి పోతుంది.
    తమ దాంపత్య జీవితం యాంత్రికంగా ఉంటున్నదని అప్పారావుకు తెలుసు. కాని అందువల్ల అతడికేమీ నష్టం కనిపించలేదు.
    ఇందుమతి అతణ్ణి ప్రేమిస్తున్నది. ప్రేమగా చూసుకుంటున్నది.
    ఇందుమతి వంటి భార్య ఏ భర్తకైనా వరం లాంటిది.
    ఆఫీసులో చాలా మంది అప్పారావును అభినందిస్తుంటారు అతడి అదృష్టానికి!'
    అలా అభినందించిన వారిలో సుందర్రావు ఒకడు.
    సుందర్రావు మంచి చలాకీ అయినావాడు. అతడు కొత్తగా ఆ ఆఫీసులో చేరాడు. అప్పారావు అదృష్టం గురించి విని అతను ప్రత్యేకంగా అభినందించి, "నీలాంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. మూన్ లైట్ క్లబ్బులో చేరకూడదు" అన్నాడు.
    "ఏమిటా క్లబ్బు!" అన్నాడు అప్పారావు.
    "అందులో గొప్పగొప్ప వాళ్ళకే ప్రవేశముటుంది. అక్కడికి గొప్పింటి ఆడవాళ్ళు తరచు వస్తుంటారు. అక్కడ ఎవరికీ అడ్డు అదుపు వుండదు. నీలాంటి పర్సనాలిటీ వున్నవాడిని చూసి ఏ లక్షాధికారి కూతురో మోజు పడిందంటే అంతే. నువ్వు స్వర్గం చూస్తావు...." అన్నాడు సుందర్రావు.
    "నాలాంటి వాళ్ళకు అందులో ప్రవేశం ఎలా వస్తుంది" అన్నాడు అప్పారావు ఆశగా.
    "ఎలాగేముంది? నేను అందులో మెంబర్ని. నా భార్య బాధ భరించలేక అందులోంచి రిజైన్ చేస్తున్నాను. పాత మెంబరు రిజైన్ చేస్తూ కొత్త మెంబర్ని ప్రపోజ్ చెయ్యొచ్చు . ఆ విధంగా నువ్వు అందులో ప్రవేశిస్తావు. ఒక వారం రోజులు నువ్వు ప్రొబేషన్లో ఉంటావు. ఏ పిల్లైనా నువ్వంటే ఇష్ట పడిందా నీకు శాశ్వత సభ్యత్వం వస్తుంది. డబ్బుకూ లోటుండదు...."
    'అయితే నేనా క్లబ్బులో చేరతాను" అన్నాడు అప్పారావు.
    "ఇందుకు నీ భార్య ఒప్పుకోదు.'
    "ఒప్పుకుంటుంది ."
    'చాలెంజ్!" అన్నాడు సుందర్రావు.
    మర్నాడు అప్పారావు వచ్చి విషయం భార్యతో మాట్లాడాలని ఆమె ఒప్పుకుందనీ అంటే సుందర్రావు ఆశ్చర్యపడి , "యూ ఆర్ లక్కీ!" అన్నాడు.
    "క్లబ్బుకీ ఎప్పుడు వెడదాం?" అన్నాడు అప్పారావు.
    "నీకో చిన్న సలహా, క్లబ్బులో ఆడవాళ్ళు ఎక్స్ పెక్టేషన్ చాలా హైగా ఉంటుంది. నువ్వు నాటురకం ట్రిక్సులో వెడితే వారం రోజుల్లో అక్కణ్ణింఛి గెంటేస్తారు. ఈ వూర్లో నే సెక్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఈ పేరు మాధవరావు. యాభై రూపాయల ఫీజుకి అయిదు లక్షల విలువ చేసే సలహాలు, ఉపాయాలు చెబుతాడు. ముందు అయన సలహాలు తీసుకుని ఆ తర్వాత క్లబ్బులో చేరుదువుగానీ!!" అన్నాడు సుందర్రావు.
    అప్పారావు చాలా ఉత్సాహ పడ్డాడు. ఆరోజే అతడు మాధవరావును కలుసుకున్నాడు. యాభై రూపాయలు సమర్పించుకున్నాడు.
    మాధవరావు అప్పారావుకు గంట సేపు చాలా చాలా చెప్పాడు.
    'ఆడవాళ్ళను అవసరాలు తీర్చే యంత్రాల్లా కాక మనసున్న మనుషులుగా చూసుకోవాలి. వాళ్ళను లాలించాలి. అలరించాలి. అందుకు మానసికంగానూ , బౌతికంగానూ కూడా కొన్ని పద్ధతులున్నాయి" అంటూ శాస్త్ర బోధ చేశాడు.
    అయన చెప్పిన విషయాలేమీ అప్పారావుకు తెలియవు. అతను ఆశ్చర్యపోయి --" ఇన్ని విషయాలు తెలీకుండా ఇన్నేళ్ళు ఎలాగున్నాను?' అన్నాడు.
    "నువ్వే కాదు ఎందరో యువతీ యువకులకు ఇలాంటి విషయాలు తెలియవు. తెలుసుకోడానికి సిగ్గుపడి, తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు. భర్త వల్ల తృప్తి లేక భార్య భర్తను సాధిస్తుంది. భర్త విసుక్కుంటాడు." అన్నాడు మాధవరావు.
    "ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణి నాకు మీరు చెప్పినవన్నీ తెలియాక పోయినా ఇటువంటి బాధలు లేవు" అన్నాడు అప్పారావు. అతడికి సుందర్రావు రంగనాధం వగైరాలు పడుతున్న బాధ అర్ధమయింది. అయితే సుందర్రావుకీ మాధవరావు తెలుసు. అయినా అతడి జీవితంలో నరకం ఎందుకుంది?
    అది పరోక్షంగా మాధవరావు జవాబు చెప్పాడు.
    నేను మీకు కొన్ని ఉపాయాలు చెబుతున్నాను. అది ఆచరించడం మీ సామర్ధ్యం పై ఆధారపడి ఉంది."
    అప్పారావు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. ఆరోజు అతడు భార్య కోసం మల్లెపూలు కొని తీసుకుని వెళ్ళాడు ఇంటికి.
    మాధవరావు ఉపాయాలు మొదటి సారిగా భార్య మీదనే ప్రయోగించి ఫలితం చూడాలని అతననుకున్నాడు.
    ఆరోజు ప్రత్యేకంగా మంచం ఏర్పాటు చేయించాడు.
    భోజనాల వద్ద భార్యతో చిలిపిగా ప్రవర్తించాడు. ఆమె నోట్లో ముద్ద ఉండగా ముద్దు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు.
    ఆ రాత్రి ఒక వింత రాత్రి!
    దంపతులిద్దరూ ఎప్పుడో తెల్లవారు జామున నిద్ర పోయారు.
    నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమయింది. ఎన్నడూ లేనిదీ ఇందుమతి భర్తను చూసి సిగ్గు పడింది.
    అప్పారావు హడావుడిగా తెమిలాడు.
    "ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్ళద్దు" అన్నది ఇందుమతి.
    "ఎందుకు?"
    "నెమ్మదిగా తెమిలి, ఏ మూన్ షోకో వెడదాం" అన్నదామె.
    'సుందరరావుతో చెప్పాను --ఈ రోజు మూన్ లైట్ క్లబ్బుకు వెడదామని" అన్నాడు అప్పారావు కంగారుగా.
    "పెళ్ళయినాక కూడా మీకు ఇదేం బుద్దండీ . మీకు మూన్ లైట్ క్లబ్బు లోనే కాదు , ఏ క్లబ్బులోనూ చేరడానికి వీల్లేదు" అన్నది ఇందుమతి.  
    "ఎందుకని ?" అన్నాడు అప్పారావు   
    "పోనీ , నేనూ చేరనా?" అన్నది ఇందుమతి.
    "ఏమన్నావ్?" అన్నాడు అప్పారావు తెల్లబోయి.
    "నేను చేరడానికి మీకు అభ్యంతరాలుంటే అవే అభ్యంతరాలు నేనూ చెబుతాను" అన్నది ఇందుమతి.
    "మరి మొన్న అలాగన్నావు?"
    "మొన్నటి మీరూ, నిన్నటి మీరూ ఒకటి కాదు" అన్నది ఇందుమతి.
    చెళ్ళున కొట్టినట్లయింది. అప్పారావుకి. అతడింకేమీ మాట్లాడలేదు.
    ఆ ,మరునాడతడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు , సుందర్రావు అతణ్ణి పలకరించి, "నిన్న నీకోసం చూశాను" అన్నాడు.
    "నేను మూన్ లైట్ క్లబ్బులో చేరడం లేదు"
    "నీ భార్య ఒప్పుకోలేదా?"
    "లేదు"
    "కాంగ్రాట్యూలేషన్స్!" అన్నాడు సుందర్రావు.
    "ఎందుకని?" అన్నాడు అప్పారావు నీరసంగా.
    "నీ భార్య నిన్ను భర్తగా కాక - అంటే కేవలం భరించువాడుగా మాత్రమే గాక మగవాడిగా గుర్తించి నందుకు."
    అప్పారావు మాట్లాడలేదు.
    అతనికి అర్ధమయింది. ఇందుమతికి దాంపత్య జీవితమంటే ఏమిటో, అందులోని ఆనంద మేమిటో మగవాడిగా తానెంత సమర్థుడో అర్ధమయింది. ఆమె వెనువెంటనే అతనిని అనుమానించడం మొదలు పెట్టింది.
    ఇప్పుడు అప్పారావు శారదకు ప్రయివేట్లు చెప్పడం లేదు.
    పొరుగున జ్యోత్స్న ఉన్న కారణంగా వేరే ఇల్లు మారాడు.
    అంతకాలం తన అదృష్టంగా భావిస్తున్నది తన అసమర్ధతగా గుర్తించడం కోసం సుందర్రావు మూన్ లైట్ క్లబ్బును సృష్టించాడా అన్న అనుమానం అతడికి ఉన్నప్పటికీ -- సంసార జీవితం స్వర్గ తుల్యంగా ఉండడం వల్ల సుందర్రావు మీద కోపం మాత్రం లేదు.

                                         ***


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS