Previous Page Next Page 
ఒక అక్క ప్రేమ కధ పేజి 4


                                      ఒక అక్క ప్రేమ కధ
                                                                                వసుంధర

                                     


         

    నా భర్త తర్వాత నేనెక్కువగా ప్రేమించేది నా అక్కే నని నా నమ్మకం. అందుకే అక్కయ్య వస్తోందని తెలియగానే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను .
    చిన్నప్పట్నించి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమ పరంగా నేను బాగా పేదరికం అనుభవించాను. నాకు నాలుగైదేళ్ళప్పుడు తల్లి పోయింది. నాన్న రెండో పెళ్ళి చేసుకున్నాడు. సవతితల్లి మంచిది కాదు. అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ ఇరవై నాలుగ్గంటలూ నన్నాడి పోసుకుంటూ ఉండేది. నాన్న ఆమె నేమీ అనేవాడు కాదు. ఆయనకూ అమ్మంటే భయం.
    అయితే అమ్మకు అక్క భయపడేది కాదు. దాని మనస్తత్వం వేరు. అది నాకంటే నాలుగేళ్ళు పెద్దది. ఎవరి చేతా మాట పడదు. కొట్టినా లెక్క చేయని పెంకితనం దానిది. మా సవతితల్లికి మాటల తోటే తప్ప చేతులతో హింసించడం ఇష్టముండేది కాదు. అందువల్ల అక్కకు బాగానే ఉండేది. దానితో పడలేక అమ్మ ఆ కక్ష కూడా నామీదనే చూపించేది. అదుండగా నన్నేదైనా అంటే అక్క క్షణం కూడా ఊరుకునేది కాదు. అందుకని అమ్మ అది లేనప్పుడే నన్ను బాధించేది.
    చిన్నప్పట్నించి కూడా నేను నోరు లేని దానిగా పేరు పడ్డాను. ఎవ్వరేమన్నా పడడమూ, ఇది కావాలని ఎప్పుడూ నోరు విడిచి అడక్క పోవడమూ నాకు మామూలు. పండుగలోచ్చినా , పుట్టిన రోజు లోచ్చినా అక్కే నా తరపున దెబ్బలాడి నా గురించి అన్నీ సాధించేది. నా గురించి చౌక వస్తువులేమైనా కొంటె అది తిప్పి కొట్టించేది. దాని ప్రేమాభిమానాలకు నేను మనసులో చాలా ఇదై పోతుండేదాన్ని.
    అక్కకు పెళ్లై కాపురానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌగలించుకుని ఏడ్చేసింది. నోరులేని నేను ఆ యింట్లో ఎలా బ్రతుకుతానోనని వాపోయింది. నాకైతే - అంతకాలం ఉంటున్న ఏకైక ఆలంబన వెళ్ళిపోతున్న భావం కలిగింది.
    అక్క వెళ్ళిపోయాక నా పాట్లు దేవుడి కెరుక. 'అమ్మతో మంచిగా ఉండు ' అనడం మినహాయించి మరేం చేసేవాడు కాదు నాన్న' ఆయనకు నా మీద ప్రేమభిమానాలున్నాయని నాకు తెలుసు. కాని ఒక ఆడది మగవాణ్ణి ఎంత అసహయుడిగా మార్చగలదో అప్పుడే నా కర్ధమైంది. ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లీ, తండ్రి కూడా లేరు. ఉన్న ఒక్క అక్కా నన్ను వదిలి వెళ్ళిపోయింది.
    అయితే అక్క నన్ను వదిలి పెట్టలేదు. నా గురించి పెళ్ళి సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. ఆ కష్టాల్లోంచి బయట పడడానికి పెళ్ళి ఒక్కటే మార్గమని దానికి తోచినట్లుంది. దాని ప్రయత్నాల ఫలితంగా ఓ మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అక్కకు అయిన రెండేళ్లకే నా వివాహం కూడా జరిగింది. వివాహంలో అక్క ప్రముఖ పాత్ర వహించింది.
    నా భర్త విద్యాధికుడు. మీదు మిక్కిలి ఆయనకు నాపై అపరిమితమైన ప్రేమ. నన్నంతగా ప్రేమిస్తూ నాకోసమే తన జీవితాన్నంకితం చేసిన మనిషి దగ్గర ఉండడం నాకేదో వింతగా కలలా ఉండేది. అదే నన్నాయనకు ఆరాధకురాల్నిగా మార్చింది. ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు.
    అయితే నా భర్త కూడా నాకు లాగే నోరు లేని వాడు. అయన చదువాయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది. అందువల్ల మేము సాధారణ మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం. అక్క సంగతి అలా కాదు. దాని భర్త ఆఫీసరు.
    పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలోనూ కొట్టోచ్చినట్లు కనబడేది. అక్క ఎప్పుడూ రెండొందలకు తక్కువ చీర కట్టేది కాదు, నా ఖరీదైన చీరే ఏ అరవయ్యో, డెబ్బయ్యో ఉండేది. వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది. నేను స్టీలు గిన్నె కూడా కొనుక్కోలేక పోయేదాన్ని.
    ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది. పెళ్ళయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలు పెట్టింది. నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది. ఈ కారణం వల్ల అక్కంటే నాకు చాలా అభిమానమున్నప్పటికీ - అదుండగా పుట్టింటికి వెళ్ళాలనిపించేది కాదు.
    అంతేకాదు - బావ పెద్ద ఆఫీసరు, చాలా పలుకుబడి కలవాడు. అందువల్ల బావ రాగానే ఊళ్ళో చాలా మంది అతన్ని పలకరించడానికి, మాట్లాడడానికీ మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఈయన వస్తే ఎవరూ పట్టించుకునే వారు కాదు. నాకు చిన్నతనం జరిగినా ఫరవాలేదు కానీ ఆయన చిన్న బుచ్చుకుంటారని నాకు చాలా భయంగా ఉండేది. అయితే ఇలాంటి పట్టింపులు ఆడవారి కున్నట్లుగా మగవాళ్ళ కుండవనుకుంటాను. అయన చాలా సంతోషంగా బావతో మాట్లాడే వారు. బావ ఈయన్ను పెద్దగా పట్టించుకునే వాడు కాదని నా అనుమానం.
    నా బాధ ఒకసారి చూచాయగా అక్క దగ్గర వెళ్ళ బుచ్చుకున్నాను. అక్క నన్ను ప్రేమాభిమానాలతో తిట్టి -" అభిమానానికి, డబ్బుకీ లంకె పెట్టకు" అంది. ఎలాంటి కాంప్లెక్సు కూ గురి కావద్దని మరీ మరీ హెచ్చరించింది. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు - ఇద్దరం దాని చీరలే కట్టుకునే వాళ్ళం.
    నాకు సంబంధించిన వ్యవహాలన్నీ స్వయంగా చూసేది అక్క . నాకు కొడుకు పుట్టినప్పుడు , అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడ్డానికి వచ్చి వాణ్ణి ఆశీర్వదించి మంచి బహుమతి కూడా ఇచ్చి వెళ్ళింది.
    నాకు నోములు, వ్రతాలు గురించి సరిగ్గా తెలియవు. సంప్రదాయాలకు సంబంధించిన ఏ వ్యవహారం గురించి అయినా అక్కకే రాసి తెలుసుకునే దాన్ని.
    నేనెప్పుడైనా అయన ప్రేమకు అబ్బురపడితే, అయన ---"భర్త ప్రేమించడం పెద్ద విశేషం కాదు, నీనుంచి నాకు లభించే ఎన్నో ప్రతిఫలాల ముందు నా ప్రేమ చిన్నబోతుంది. ఏ ప్రతి ఫలమూ ఆశించకుండా నిన్ను ప్రేమించే మీ అక్క గురించే ఆశ్చర్యపడాలి . అలాంటి అక్క ఉండడం నీ అదృష్టం." అన్నారు. అది నిజమేనని పించింది నాకు.
    క్రమంగా నాలో వ్యక్తిత్వం సంతరించుకుంటోంది. నా ఆర్ధిక స్థితి గతులు మారాయి. అయన కిప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. అయన జీతం బావకంటే ఎక్కువ వస్తోంది. నేను ఇప్పుడు ఆర్ధిక వసతులు అనుభవించగలుగుతున్నాను. పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది.
    అమ్మ తన పిల్లల్ని మా దగ్గరకు పంపించాలని కూడా - అనుకుంటోంది. ఎందుకంటె నేను అయన కూడా క్రమశిక్షణ పాటిస్తాము. అన్నీ ఒక పద్దతిలో నడుపుతాము. నా సవతి తమ్ముడొకడు కాలేజీ చదువుకు ఎదిగాడు. ఈయన ప్రయత్నంతో మా వూళ్ళో వాడికి సీటు కూడా వచ్చింది.
    ఇలాంటి పరిష్టితుల్లో నేను, వారు కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దామనుకొని, అక్క కూడా వస్తుందేమోనని ఉత్తరం రాశాము. ఇటీవల మేము ఎక్కువగా కలుసుకోవడం లేదు. ఈ ప్రయాణం పేరు చెప్పి ఓ రెండు వారాలు అంతా కులాసాగా గడపవచ్చునని మా ఆశ.
    అక్క అంగీకరిస్తూ జవాబు వ్రాసింది. నాకు కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. టికెట్స్ ఏర్పాట్లన్నీ ఈయన చేశారు. నేను దాని రాకకోసం ఎదురుచూస్తున్నాను.
    అక్క రానే వచ్చింది. దాని కిద్దరు పిల్లలు , పెద్దవాడు మగపిల్లవాడు. రెండోది ఆడపిల్ల. నాకిద్దరు పిల్లలు. పెద్దది ఆడపిల్ల, రెండోవాడు మగపిల్ల వాడు. ఓరెండు మూన్నేళ్ళ తేడాలో ఉన్నారు వాళ్ళందరూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS