"నేను నారాయణా ఇంజినీరింగ్ వర్క్స్ లో పని చేస్తున్నాను. మా కంపెనీ పెట్రోలింజన్ని డీ సెలింజనుగా మార్చడానికో కొత్త డిజైన్ రూపొందించింది. అది చాలా రహస్యం. ఆ రహస్యం సంపాదించి తనకివ్వమని ఓ వ్యక్తి నా వెంటబడ్డాడు. సంపాదిస్తే డబ్బిస్తాట్ట-యాభైవేలు. లేకుంటే ప్రాణం తీస్తాట్ట! అది నావల్ల కాదంటే నమ్మడు.....అతడికి భయపడి నేను తాత్కాలికంగా నా మకాం కూడా మార్చేశాను....."
"ఇందుకు నేనేం చేయాలి?"
"మీరతన్ని పట్టుకొని పోలీసుల కప్పగించాలి....."
"ఆ పని మీరే చేయొచ్చుగా!"
"నాకా దమ్ముల్లేవు...."
"నాకున్నాయని యెలాగనుకున్నారు?"
"మీ మీసాలు చూడగానే నాకలాగనిపించింది. నా అంచనా తప్పకూడదు....."
"ఇందులో నాకేమైనా ప్రయోజనముంటుందా?"
"నేను మీకు రెండువేల రూపాయలిచ్చుకుంటాను.."అన్నాడు విల్సన్.
"సరే-ఇప్పుడేం చేయాలి?"
"ఇద్దరం మా యింటికి వెడదాం-అది నా అసలిల్లుకాదు ప్రస్తుతం నేను రహస్యంగా వుంటున్న యిల్లు. అక్కడే నా భార్య కూడా వుంది. ఇద్దరంకలిసి అక్కడ కాసేపు చర్చించుదాం. మీరెలా చెబితే అలా చేస్తాను నేను...."
అంతా విచిత్రంగా అనిపించింది కిల్లర్ కి.
"అతడినెలా కలుస్తాం?" అన్నాడతడు.
"అతడంటే-నన్ను బెదిరించే వ్యక్తినేనా-? వాడు నన్నీరోజు పార్కులో కలుసుకుంటానన్నాడు. ఈ రోజు మనమిద్దరం కలిసి వెడదాం.....వాడు మీ మీసాలు చూడగానే కధ కొత్త మలుపు తిరుగుతుంది" అన్నాడు విల్సన్.
"మీ నమ్మకమంతా నా మీసాలమీదే ఉన్నట్లుంది...."
"అవును...." అని-"ఇదే ప్రస్తుతం నా ఇల్లు-" అన్నాడతడు.
కిల్లర్ ఆగాడు.
ఆ వీధిలో యిళ్ళాన్నీ విసిరేసినట్లున్నాయి.
అలాంటి వాటిలోని బంగళా పెంకింటి ముందు తామిద్దరూ నిలబడి వున్నారు.
వీధిలో జనంలేరు.
ఇంటిముందు మెట్లున్నాయి.
"రండి!" అంటూ మెట్లెక్కాడు విల్సన్.
కిల్లర్ అతడి ననుసరించాడు.
విల్సన్ గుమ్మం ముందాగి కాలింగ్ బెల్ మ్రోగించాడు.
రెండు నిముషాల్లో తలుపు తెరుచుకుంది. సుమారు ముఫ్ఫైఅయిదేళ్ళ యువతి వుంది గుమ్మానికవతల.
ఆమె ముఖంలో ఆశ్చర్యముంది.
"మీరు రేపు వస్తారనుకున్నాను-"అందామె.
విల్సన్ నవ్వాడు.
ఆమె తప్పుకుని ఇద్దరికీ దారిచ్చింది.
విల్సన్ కిల్లర్ ని ముదు వెళ్ళనిచ్చి తను తలుపు వేశాడు.
"మనం ఆ గదిలో మాట్లాడుకుందాం!" అన్నాడతడు కిల్లర్ తో.
కిల్లర్ అతడు సూచించిన విధంగా పక్కగదిలోకి వెళ్ళాడు.
గదితలుపులు బార్లా తెరిచి వున్నాయి. గదిలో సోఫా సెట్టుంది.
కిల్లర్ కి గదిలో మరింకే విశేషమూ కనబడలేదు.
అతడు సోఫావరకూ వెళ్ళి వెనక్కు తిరిగాడు.
గది తలుపులు బార్లా తెరిచి వున్న విషయం తెలుస్తోంది కానీ అతడికి గది బయట ఏం జరుగుతున్నదీ కనపడడం లేదు.
విల్సన్ ఇంకా గదిలోకి రాలేదు.
బహుశా భార్యతో మాట్లాడుతున్నాడేమో!
కిల్లర్ ఆలోచిస్తూండగానే కెవ్వుమన్న గొంతు వినబడింది.
అది ఆర్తనాదం.....
ప్రాణభయంతో సర్వశక్తులూ క్రోడీకరించుకున్న మనిషి గొంతునుండి వెలువడిన నాదమది!
ఆ గొంతు స్త్రీది!
కిల్లర్ పరుగున గుమ్మం వద్దకు వెళ్ళాడు.
అతడు గుమ్మం దాటేలోగా పైనుంచి యేదో చప్పుడయింది.
కిల్లర్ తెల్లబోయాడు.
గుమ్మానికి అడ్డంగా కటకటాలు!
అంటే ఈ యిల్లు సామాన్యమైనది కాదు.....
బోనులో చిక్కిన పులిలా కిల్లర్ గుమ్మం దగ్గర ఆగిపోయాడు.
గుమ్మం అవతల ఏం జరుగుతున్నదీ అతడు చూస్తున్నాడు.
విల్సన్ భార్య గోడకానుకుని ఉంది. విల్సన్ ఆమెకు సమీపంలో వున్నాడు. ఒకచేత్తో అతడామె నోటిని గట్టిగా మూశాడు. అతడి రెండో చేతిలో కత్తి వుంది.
ఆమె గిలగిల తన్నుకుంటోంది.
"ఏయ్ విల్సన్! ఏమిటిది?" అరిచాడు కిల్లర్.
విల్సన్ కిల్లర్ మాటలు పట్టించుకోలేదు భార్యను క్రూరంగా చూస్తున్నా డతను. "ఈ వయసులో నీకు వళ్ళు కొవ్వెక్కింది. నీ ప్రవర్తనను నేను క్షమించను. నన్నెవ్వరూ అనుమానించలేని విధంగా యేర్పాట్లు చేసుకున్నాను చావు....."
మరుక్షణంలో కత్తి ఆమె గుండెల్లో దిగబడింది.
చివ్వున చిమ్మింది రక్తం.
జరిగిందానికి కిల్లర్ మ్రాన్పడిపోయాడు.
ఎంత సాహసికైనా వళ్ళు జలదరించే దృశ్యమది!
హత్య.....కోల్డు బ్లడెడ్ మర్డర్!
విల్సన్ ఒక్క నిమిషం ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడు తర్వాత వదలిపెట్టాడు. ఆమె నేలమీదకు జారిపోయింది.
కొద్ది క్షణాల్లో జీవమున్న మనిషి శవంగా మారిపోయింది.
అప్పుడు విల్సన్ కిల్లర్ వంక తిరిగాడు.
కిల్లర్ యేదో అనాలనుకున్నాడు. కానీ అతడికి స్పృహతప్పుతోంది.
ఏం జరుగుతోందో కిల్లర్ కి అర్ధంకాలేదు. ముక్కుకి వాసనేమీ తెలియడం లేదు. కానీ కళ్ళు మూతలు పడి పోతున్నాయి.
కిల్లర్ కటకటాలు పట్టుకొని తన్ను తానదుపు చేసుకుందుకు ప్రయత్నిస్తూ కిందకు జారిపోతున్నాడు.
ఎవరో తలుపులు దబదబ బాదుతున్న చప్పుడతడికి వినిపించింది.
ఆ తర్వాతింకేమీ తెలియదు.
2
ఓ గంటలో మెలకువ వచ్చింది కిల్లర్ కి.
కళ్ళు నిలుముకుని చూసుకున్నాడతడు.
ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు. అందుకే అతడికి మెలకువ వచ్చింది.
కిల్లర్ కంతా మసకమసకగా వుంది.
మెదడింకా సరిగా పనిచేయడంలేదు.
చప్పుడు వింటున్నా లేవాలనిపించడంలేదు.
అతడు చూస్తూండగా తలుపులు బద్దలై ముందుకు పడ్డాయి.
కిల్లర్ కి మత్తు విడిపోయింది.
చటుక్కున లేచి నిలబడ్డాడతడు.
ఈలోగా ఇద్దరు పోలీసులు కిల్లర్ని సమీపించారు.
"ఏం జరిగింది?" అన్నాడు కిల్లర్.
అప్పటికి మరికొందరు పోలీసులు, జనం లోపలికి వచ్చారు.
"ఆగండి-లోపలకు రాకండి-ఇక్కడ హత్య జరిగింది....." అంటూ అరిచాడు ఇన్ స్పెక్టర్.
హత్య అన్నమాటతో కిల్లర్ కి చాలా విషయాలు గుర్తుకొచ్చాయి.
హత్య తన కళ్ళముందే జరిగింది.
ఇన్ స్పెక్టర్ కిల్లర్ని సమీపించి - "యూ ఆరండర రెస్ట్-" అన్నాడు.
