Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 71


    కిల్లర్ కంతా అయోమయంగా వుంది.
    "అవును-గదిలో హత్య జరిగింది, నేను హంతకుణ్ణి కళ్ళారా చూశాను-" అన్నాడు.
    "అవును-నేనూ చూశాను-" అన్నాడు ఇన్ స్పెక్టర్ నవ్వి.
    అదెలా సాధ్యం-హత్య జరిగినప్పుడు మీ రిక్కడ లేరే?" అన్నాడు కిల్లర్.
    "హత్యచేసి నువ్వింకా ఇక్కడే వుండిపోయావుగా" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నేను హత్య చేయడమా?" అన్నాడు కిల్లర్.
    "పశ్నలు తర్వాత....నాతో పద..." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "మీతో వస్తాను కానీ నేరస్థుడిగా కాదు...." అన్నాడు కిల్లర్.
    "గదిలో శవముంది. శవం గుండెల్లో కత్తి వుంది. రక్తం గదినిండా చిమ్మింది. ఆ చిమ్మిన రక్తం నీ బట్టల మీద కూడా వుంది. శవం పక్కనే నువ్వు వున్నావు.....నువ్వు నేరస్థుడివి కాదు. అవునా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కిల్లర్ తెల్లబోయి తన్నుతాను చూసుకున్నాడు.
    తన చొక్కానిండా రక్తం......
    అంతేకాదు.....ఆ చొక్కా తనది కాదు.....
    చొక్కాయేకాదు....పాంటుకూడా తనదికాదు.
    "మోసం!" అనుకున్నాడతడు.
    విల్సన్ చాలా తెలివిగా తన్నీ హత్యకేసులో ఇరికించాడు.
    బహుశా కత్తిమీద వేలిముద్రలు కూడా తనవే అయుంటాయి.
    తను స్పృహ తప్పివున్న సమయంలో అతడు తన నిష్టంవచ్చినట్లు కదిపి వుంటాడు.
    "ఏమంటావు మిస్టర్!' అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కిల్లర్ తలవంచుకున్నాడు.
    ఈలోగా ఫోటోగ్రాఫరతన్ని సమీపించి నాలుగు యాంగిల్స్ లో ఫోటోలు తీసుకున్నాడు.
    జనం కొందరు గది గుమ్మం దగ్గర నిలబడి వున్నారు. వాళ్ళంతా కిల్లర్ వంక కుతూహలంగా చూస్తున్నారు!
    అంతమంది తనను హంతకుడన్న దృష్టిలో చూస్తున్నారన్న భావం కిల్లర్ని కించపరిచింది.
    కానీ మనిషి పరిస్థితులకు బానిస.
    "ఇన్ స్పెక్టర్! నిజంగా నేనీ హత్యచేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పుకోవాల్సిన కధ ఒకటి వుంది-" అన్నాడు కిల్లర్.
    "చెప్పు-" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కిల్లర్ చెప్పాడు.
    "అచ్చా-"అన్నాడు ఇన్ స్పెక్టర్ "అంటే ఈ యింట్లో యెన్నో మాయాజాలాలున్నాయంటావు....."
    "అవును...."
    ఇన్ స్పెక్టర్ అక్కడున్న జనాన్ని ప్రశ్నలువేశాడు.
    "ఆ యింట్లో రెండు సంవత్సరాలుగా వుంటున్నది హతురాలు. ఆమె క్రిస్టియన్ కాదు. పేరు సుజాత. మనిషి యెంతో మంచిది చేతనైనంతలో పదిమందికీ సాయపడుతుంది. వీధిలో చాలామందికామె అవసరానికి డబ్బిచ్చి ఆదుకుంది.
    విసిరేసినట్లున్నాయి ఇళ్ళన్నీ ఆ వీధిలో ఒకింట్లో జరిగే విషయమింకో యింట్లో తెలియదు.
    సుజాత ఒంటరి ఆడది-అయినప్పటికీ-ఆమెనా వీధి వారందరూ గౌరవభావంతోనే చూసేవారు. అందగత్తె అయినప్పటికీ ఆమె అందం యెవరి చర్చల్లోకీ వచ్చేది కాదు.
    వీధిలో నడుస్తున్న ఓ వ్యక్తికాయింట్లోంచి ఆర్తనాదం వినబడి కంగారుపడి వెళ్ళి తలుపుతట్టాడు.
    ఎవరూ తలుపులు తీయలేదు.
    అతడు కాసేపు తలుపులు బాదాడు.
    లోపల నిశ్శబ్దం!
    అప్పుడతడు ఇరుగుపొరుగులను పిలిచాడు. అంతా వచ్చి తలుపులు బాదారు. లోపల నిశ్శబ్దం!
    తను ఆర్తనాదం విన్నానని అతడు మరీ మరీ చెబుతున్నాడు.
    అతడు భ్రమపడ్డాడని ఇరుగుపొరుగుల అనుమానం.
    అయితే లోపలున్నవారు తలుపులెందుకు తీయరు?
    లోపలేదైనా అఘాయిత్యం జరిగితే మనిషి బయటకు పోవడానికి వేరే మార్గంలేదు.
    అందుకని జనమంతా ఇంటిముందు కాపలా వుండిపోలీసులకు కబురుపెట్టారు. పోలీసులు వచ్చి తలుపులు బాది-తర్వాత తలుపులు బద్దలు కొట్టారు.
    గదిలో శవం.....శవం పక్కన కిల్లర్!
    "నువ్వు గదిలో దేనికోసమో వెతుకుతున్నావు. జనం కాసేపు తలుపులు బాది ఊరుకోగానే-వెళ్ళిపోయాడనుకొని చాలా ధైర్యంగా వున్నావు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టుకొని లోపలకు వస్తారని ఊహించి వుండవు. నీ ధైర్యం పోలీసు డిపార్టు మెంట్లో రాణించేది. అభినందించబడేది. తమ తమ సెలవులు తప్పిన తను మిత్రులు శత్రులౌట తథ్యము..." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నా నిర్దోషిత్వాన్ని నేను ఋజువు చేసుకుంటాను..." అన్నాడు కిల్లర్.
    "ఎలా?"
    "కాసేపు నన్ను వదిలిపెట్టండి...."
    "నో జోక్స్!" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "అయాం సీరియస్...." అన్నాడు కిల్లర్.
    ఇన్ స్పెక్టర్ నవ్వి-"సీరియస్ గా జైల్లో కూర్చుందువుగాని....." అన్నాడు.
    ఈలోగా అక్కడ పరీక్షలు-వగైరాలు ముగించుకుని పోలీసు పరివారం ఇన్ స్పెక్టర్ని చుట్టుముట్టారు.
    "పద-మిస్టర్!" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నా పేరు కిల్లర్!" అన్నాడు కిల్లర్.
    "అఫ్ కోర్స్-యూ ఆరే కిల్లర్!" అని ఇన్ స్పెక్టర్ కిల్లర్ చేయి పుచ్చుకున్నాడు.
    అప్పుడు కిల్లర్ ఇన్ స్పెక్టర్ని ఒక్కతోపు తోశాడు.
    అతడి చుట్టూ పరివారాన్ని ఒక్కసారి విదిలించాడు.
    ఒకేఒక్క గెంతులో గమ్యం చేరాడు.
    అక్కడున్న జనం అప్రయత్నంగా పక్కకు తప్పుకుని అతడికి దారి నిచ్చారు.
    కిల్లర్ రోడ్డుమీదకు వచ్చాడు.
    పోలీసు జీపు సిద్దంగా వుంది.
    ఇన్ స్పెక్టరు, పరివారం రోడ్డుమీదకు వచ్చేసరికి జీపు స్టార్టయింది.
    ఇన్ స్పెక్టరు జాప్యం చేయలేదు. క్షణాలమీద పరివారానికి ఆర్డరిచ్చాడు.
    వీధిలో సిద్దంగా వున్న రెండు మోటారు సైకిళ్ళమీద అతడు, సబ్ ఇన్ స్పెక్టరు బయల్దేరారు.
    అసలా మోటారు సైకిళ్ళెవరివీ, యే కండిషన్ లో ఉన్నాయో అని కూడా వారాలోచించలేదు.
    ఇతర పరివారంలో కొందరు టెలిఫోన్ చేయాలనీ, కొందరు దగ్గర్లో వున్న పోలీసు స్టేషన్ కీ అలా బయల్దేరారు.
    కొందరు శవం దగ్గర కాపలాగా వుండిపోయారు.
    అక్కడ చేరిన జనం మాత్రం జరిగిందేమిటో అర్ధం కాక-ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయారు.

                                    3

    జీపులో కిల్లర్......
    జీపు వెనుక మోటార్ సైకిల్సు.....
    ఇలాంటి పరిస్థితి యెదురౌతుందని కిల్లర్ అనుకోలేదు.
    ఎప్పుడూ పోలీసులకు సాయపడే తానీరోజు వాళ్ళకు భయపడి పారిపోతున్నాడు.
    తాను చిక్కుకున్న మాయాజాలమేమిటో అతడికి తెలియదు. దాన్నించి యెలా తప్పించుకోవాలో అతడికి తెలియదు.
    ముందుగా తాను స్వతంత్రుడు కావాలి.
    అదే అతడి ఆలోచన......
    జీపు శరవేగంతో దూసుకుపోతోంది.
    కిల్లర్ కా వీధులట్టే తెలియవు.
    కనబడిన సందుల్లోకి జీపుని తిప్పేస్తున్నాడు.
    మోటారు సైకిళ్ళతన్ననుసరించి వస్తూనే వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS