Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 69


                                 లై డిటెక్టిర్
                                                          ----వసుంధర


    మొబైల్ వ్యాను-ఒక పక్కగా ఆపి అందులోంచి దిగాడు డిటెక్టివ్ కిల్లర్.
    బయట ఎండ మండిపోతోంది.
    కిల్లర్ కి కడుపులో నకనకలాడుతోంది.
    వీధిలో జనం అట్టేలేరు.
    అతడు టైము చూసుకున్నాడు. టైము రెండుగంటలు.
    చక చకా అడుగులు వేశాడతడు.
    రోడ్డుకు అటూ యిటూకూడా హోటళ్ళున్నాయి.
    కిల్లర్ పేర్లు చదువుతూ పోతున్నాడు.
    చివరికి దొరికింది-అతడిక్కావాల్సిన హోటలు.
    ఆ హోటలు ప్రత్యేకత యేమీలేదు-ఏసీ కావడం తప్ప!
    కిల్లర్ హోటల్లో అడుగుపెట్టాడు-అద్దాల తలుపులు తీసుకుని.
    లోపల చల్లని గాలి......
    ఒక్కసారి స్వర్గంలో అడుగుపెట్టినట్లనిపించిందతడికి!
    హోటల్ బాగా రష్ గా వుంది.
    లోపల చాలా గదులున్నాయి.
    ఒక్కసారి వందమందికి భోజనం పెట్టడానికి సదుపాయాలున్నాయక్కడ!
    కానీ బయట వేడిగా వుండడంవల్ల-లోపలకు వచ్చే జనం ఓ పట్టాన బయటకు వెళ్ళడంలేదు.
    భోజనం కోసం కిల్లర్ అరగంటసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా అందుకతడు విచారించలేదు.
    లోపల హాయిగా వుంది.
    భోజనం తాపీగా, తృప్తిగా చేశాడు కిల్లర్.
    వంటకూడా రుచిగా వుంది.
    "బిల్లెంతైనా ఫరవాలేదు-చాలా మంచి భోజనం" అనుకున్నాడు కిల్లర్.
    క్లీనర్ వచ్చి అతడి ముందున్న మీల్సు ప్లేటు తీసుకుని వెళ్ళిపోయాడు.
    సర్వరు బిల్లుతీసుకొని వస్తాడని ఎదురుచూస్తున్నాడు కిల్లర్.
    అతడు లేస్తాడని మరో వ్యక్తి ఆత్రుతగా యెదురు చూస్తున్నాడు.
    అతడి అసహనాన్నీ, ఆకలినీ అర్ధంచేసుకుని కిల్లర్ తనే లేచి నిలబడ్డాడు.
    అతడు కూర్చున్నాడు.
    కిల్లర్ హోటల్లోని వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. బయటి ఎండనీ లోపలి చల్లదనాన్నీ సరిపోల్చి చూసుకుంటున్నాడు.
    అలా ఎంతసేపు నిలబడ్డాడో అతడికే తెలియదు.
    ఈలోగా అతడి స్థానంలో కూర్చున్న వ్యక్తి భోజనం కూడా అయిపోయింది. అతడు బిల్లందుకుని వెళ్ళిపోతూ-"ఏమిటి సార్! మళ్ళీ భోంచేస్తారా?" అన్నాడు.
    కిల్లర్ ఉలిక్కిపడ్డాడు.
    అతడు వెళ్ళిపోయాడు.
    అవును-సర్వర్ తనకింకా బిల్లివ్వలేదు. అడక్కుండానే బిల్లిస్తాడని తను చూస్తూన్నాడు ఇంకా ఇవ్వలేదేం?
    ఈ రష్ లో సర్వర్ తన గురించి మర్చిపోయాడా?
    తను భోజనానికి నిలబడ్డాడని అతడనుకున్నాడేమో?
    సర్వర్ టేబిల్ దగ్గరకు రాగానే కిల్లర్ అతణ్ణి పలకరించి-"నువ్వు నాకింకా బిల్లివ్వలేదు-" అన్నాడు.
    సర్వర్ నవ్వి-"మీ పేమెంటైపోయింది సార్!" అన్నాడు.
    "అదెలా సాధ్యం?" అన్నాడు కిల్లర్ ఆశ్చర్యంగా.
    సర్వర్ అతడికి దూరంగా వేలుపెట్టి చూపించాడు.
    అక్కడో సోఫా వుంది. అందులో ఇద్దరు మగాళ్ళు కూర్చుని వున్నారు.
    "ఆ పొడుగు చేతుల చొక్కాఆయన మీ బిల్లు పే చేశారు-" అన్నాడు సర్వర్.
    కిల్లర్ అతడినే చూశాడు.
    వయసు నలభైలోపుండవచ్చు. మనిషి హుందాగా వున్నాడు. తననే చూస్తున్నాడు.
    "అతడెవరో నాకు తెలియదు-" అన్నాడు కిల్లర్.
    "నాకూ తెలియదు సర్-" అన్నాడు సర్వర్.
    "అలాంటప్పుడు నాకెందుకు చెప్పలేదు?"
    "ఆయన మీకు చెప్పొద్దన్నారు సార్! మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యొద్దన్నారు. ప్రత్యేకించి మీరడిగితే తప్ప పలకరించి ఏమీ చెప్పొద్దన్నారు. నాకు పదిరూపాయలు టిప్పిచ్చారు కూడా!"
    కిల్లర్ సర్వర్తో దెబ్బలాడాలనుకున్నాడు. కానీ ఇందులో అతడి తప్పేముంది?        
    "సరేలే-" అని కిల్లర్ సోఫా దగ్గరకు వెళ్ళాడు.
    పొడుగు చేతుల చొక్కా వ్యక్తి చటుక్కున లేచి నిలబడి-"మీకోసమే చూస్తున్నాను. మీతో నాకు పని వుంది-" అన్నాడు.
    "నేనెవరో మీకు తెలుసా?" అన్నాడు కిల్లర్.
    "తెలియదు-" అన్నాడు.
    "తెలియని వ్యక్తితో మీకేం పని?"
    "అన్నీ వివరంగా చెబుతాను. నాతో బయల్దేరి రండి-" హడావుడిగా అన్నాడతడు.
    "ఎక్కడికి?"
    "ప్లీజ్-ఇక్కడేమీ అడగొద్దు-"
    కిల్లర్ మాట్లాడకుండా అతడితో బయటకు నడిచాడు.
    ఆ వ్యక్తి ఎవరు? తన బిల్లెందుకు పేచేశాడు? అతడికి తనతో వున్నపనేమిటి?
    ఆలోచన తీవ్రతలో కిల్లర్ కి బయట ఎండ తెలియలేదు.
    ఆ వ్యక్తి ఓ రిక్షాను బేరమాడాడు.
    ఇద్దరూ రిక్షా ఎక్కారు.
    "ఇప్పుడు కూడా నన్నేమీ అడక్కండి. సరిగ్గా పది నిమిషాల్లో రిక్షా దిగుతాం మనం-" అన్నాడా వ్యక్తి.
    కిల్లర్ మాట్లాడలేదు.
    పదినిమిషాల తర్వాత ఇద్దరూ రిక్షా దిగారు.
    ఆ వ్యక్తి రిక్షా అతడికి డబ్బిచ్చాడు.
    అతడు కిల్లర్ చేయిపట్టుకుని తనతో నడవమన్నట్లు ముందుకి నడిచాడు.
    ఇద్దరూ ఓ సందులోకి వెళ్ళారు.
    "నా పేరు విల్సన్!" అన్నాడతడు నడుస్తూనే.
    "ఊఁ" అన్నాడు కిల్లర్.
    "నేనిప్పుడు చాలా ప్రమాదంలో వున్నాను...."
    "ఊఁ."
    "నన్ను మీరే రక్షించాలి-"
    "నేనా?"
    "అవును-మీరే!"
    కిల్లర్ ఆశ్చర్యంగా -"నే నెవరో మీకు తెలుసుకదూ!" అన్నాడు.
    "తెలియదు. హోటల్లో మిమ్మల్ని చూశాను. మీ ముఖంలో ఒక వింత తేజస్సు మీ మీసాల్లో ఓ ప్రత్యేకత.....నిజం చెప్పొద్దూ.....మీ మీసాల్లో నాకు రక్షణ కన్పడింది....."
    కిల్లర్ తెల్లబోయి అతడి వంక చూశాడు.
    అతడు దృఢంగా వున్నాడు. ఎత్తుగా వున్నాడు.
    "మీరు నాకంటే బలంగా వున్నారు-" అన్నాడు కిల్లర్.
    "బలం మనిషికి బలాన్నివ్వదు-" అన్నాడు విల్సన్.
    "అంటే?"
    "ఒక వ్యక్తి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. అతణ్ణి నేను తప్పించుకుని తిరుగుతున్నాను. కానీ ఎన్నాళ్ళో తప్పించుకోలేదు...."
    "ఎవరతడు? మిమ్మల్నెందుకు బెదిరిస్తున్నాడు?" అన్నాడు కిల్లర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS