Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 68


    నేను కావాలనే శ్రీమతిని తీసుకుని అక్కడకు వచ్చానని ఆమె భావించినట్లుంది. అలాంటి యువతి నైట్ డ్రస్సులో ఒంటరిగా నన్ను చూస్తే యేమనుకుని ఉండేది? ఇప్పుడు రాధ కళ్ళలో కనబడుతున్న కృతజ్ఞతల వెలుగులు నేనంత నీచత్వానికి సిద్దపడ్డానో చెబుతున్నాయి.
    ఏమైతే నేం ఆమెవద్ద సెలవు తీసుకొని నేను, కమల తారాచంద్ దుకాణానికి వెళ్ళాం. దుకాణదారామెను చూస్తూనే-"మీరు చెప్పిన ఉంగరం తయారైందమ్మా-" అన్నాడు. అది విని నేనాశ్చర్యపడ్డాను.
    సుమారు అరకాసు బరువున్న ఉంగరానికి ఒకపక్క నలు చదరపు పలకపై "ఓం" అని చెక్కి వుంది. ఇలాంటి ఉంగరం చేయించుకోవాలని నేను చాలా కాలంగా మనసు పడుతున్నాను.
    దుకాణదారు శ్రీమతికి అందిస్తే శ్రీమతి నా వ్రేలికి తొడిగిందా ఉంగరం. సరిగ్గా సరిపోయింది.
    "ఇదేమిటి కమలా?" అన్నాను.
    "నేను మిమ్మల్ని తారాచంద్ దుకాణానికి రమ్మన డానికి కారణమిదే!" అంది కమల.
    అప్పుడు నేనామెకు మనస్ఫూర్తిగా రెండువేలుపెట్టి ముత్యాల లోలాకులు కొన్నాను.

                                   11

    శ్రీమతి లవర్స్ సెంటుకు సేల్సు ఉమన్ గా ఉంటూ ప్రతి నెలా కొంత డబ్బు సంపాదిస్తోంది. ఆమె ఈ ఉద్యోగం ప్రారంభించి అప్పుడే మూడు నెలలు దాటింది. ఎవరికీ చెప్పనని ఒట్టేయించుకొని శ్రీమతి లవర్స్ సెంటు గురించిన పరమ రహస్యం నాకు చెప్పింది.
    లవర్స్ సెంటు మనుషుల మధ్య ప్రేమను పుట్టిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బాగా కలిగించడానికి ఓ సంస్థ ప్రయత్నిస్తోంది. అందుకని యెందరినొ ముఖ్యంగా ఆడవారిని లవర్స్ సెంటు సభ్యులుగా చేర్చుకుంటోంది. సభ్యులందరికీ నెలకింత అని పారితోషికం ముడుతుంది. సభ్యులు చేయవలసిందల్లా లవర్స్ సెంటు వాసన సోకినప్పుడు తామాకర్షించబడినట్లు నటించాలి. ఆ తర్వాత యేదో ట్రిక్కు చేసి తప్పించుకోవాలి-ఆకర్షణ మరింత దూరం వెళ్ళకూడదనుకుంటే! ఈ లవర్స్ సెంటు సభ్యుల్లో యెక్కువమంది కాల్ గర్ల్స్. లవర్స్ సెంటు ఫలానా వారిమీద పనిచేయలేదని ఫిర్యాదు వస్తే వారిపై సంస్థ తీవ్రమైన చర్య తీసుకుంటుంది. ఇప్పటికే లవర్స్ సెంట్ కు కొంత ప్రచారం లభించింది. కోరిక ఉండీ ధైర్యంలేని వాళ్ళకు ధైర్యాన్నివ్వడంతో దీనివల్ల కాల్ గర్ల్స్ కి వ్యాపారాభివృద్ధి జరుగుతోంది.
    లవర్స్ సెంటు అమ్మినవారికి సీసాకు అయిదు రూపాయలిస్తారు. ఆ సీసా ఖరీదు ఒక రూపాయైనా ఉంటుందో ఉండదో కానీ అప్పుడే దాని గురించి ప్రజల్లో కొంత సంచలనం ప్రారంభమైంది. కొంతకాలంలో ఈ సెంటును దుకాణాల్లో కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. శ్రీమతి మూడు నెలల్లో మూడువందలకుపైగా సీసా లమ్మింది.
    ఒకసారి సంచలనం కలిగి మార్కెట్లోకి వచ్చేక- సెంటు అదే నిలబడగలదని లవర్స్ సెంట్ సంస్థ నమ్మకం.
    లవర్స్ సెంట్ అమ్మడానికి కమలవస్తే నన్నక్కడ కలుసుకుంది.
    "ఇంతకీ ఈ సెంటుకి ప్రభావముంటుందా?" అన్నాను యేమీ ఎరగనట్లు. సూర్యప్రభ, మాధురి లవర్స్ సెంటు సభ్యురాండ్రై ఉంటారనీ-మాధురి నన్ను తప్పించుకుందుకే స్నానం చేయమన్నదనీ నాకర్ధమైంది.
    "ఉంటుందనుకోను. ఈ సెంటు గురించి తెలియగానే నేనే ముందు వాడి చూశాను...." అంది కమల.
    "ఎవరిమీద?" అన్నాను కంగారుగా.
    "మీరుండగా ఆకర్షించబడ్డానికి నేనింక వేరెవరిని వెతుక్కుంటానో చెప్పండి...." అంది కమల.
    ఎప్పుడో కొద్ది నెలల క్రితం ఆమె యేదో సెంటు రాసుకున్న గుర్తుంది కానీ నేనప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడామె మాటలు నాకు చురుక్కుమని తగిలాయి. ఆమె లవర్స్ సేమ్టును నామీద ప్రయోగిస్తే-నా మనసు మాత్రం వేరే తప్పుదార్లు తొక్కింది.
    తను కష్టపడి సంపాదిస్తూ ఆ డబ్బును నా సరదా కోసం వెచ్చించాలనుకున్న శ్రీమతి ప్రేమ పరిమళాన్ని మించిన ఆకర్షణ యే లవర్స్ సెంటివ్వగలదు?
    ఈ సత్యం గ్రహించేక నా మనసెప్పుడూ శ్రీమతిని దాటిపోలేదు. రంగారావు మాత్రం నా మనసులోంచి యెప్పుడో జారిపోయాడు.

    
                             -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS