"నన్ను రంగారావు పంపాడు. నేను మీకు సాయపడాలని వచ్చాను...." అన్నాను నర్మగర్భంగా.
అప్పుడు రాధ మిషనుకున్న సొరుగును లాగింది. అందులోంచి ఓ తాళంచెవి నాకిచ్చి-"హాస్పిటల్లో డాక్టరుది రేపు మధ్యాహ్నం డ్యూటీ. ఆయనే టైము కొస్తాడో సరిగ్గా చెప్పలేను. నేను అమ్మకన్ని ఏర్పాట్లూ చేసి వస్తాను. రావడం ఆలస్యమైతే మీరు ఇంట్లోనే ఉండడానికి వీలుగా డూప్లికేట్ కీ యిస్తున్నాను. నేను పదకొండింటికి యిల్లు వదులుతాను. రెండింటికల్లా వచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు దాటదు....." అని చెప్పింది.
అప్రయత్నంగా -"థాంక్స్!" అన్నాను.
10
ఆ రోజు ఆఫీసుకు బయల్దేరేముందు లవర్స్ సెంటు జేబులో ఉంచుకున్నాను. ఆఫీసుకు తీసుకెళ్ళే బ్రీఫ్ కేసులో నైట్ డ్రస్ ఉంచాను. ఈ రెండు విషయాలూ కమలకు తెలియవు.
నా మనసు ఊహల్లో తేలిపోతోంది. రాధ చాలా సులభంగా ఒప్పుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అయినా నేను చేస్తున్న త్యాగం మాత్రం గొప్పదా? సరైన సమయంలో రెండువేలిచ్చి నిండుప్రాణాలను నిలబెడుతున్నాను.
ఈ ప్రపంచంలో యేదైనా ప్రాణాలు నిలబెట్టుకున్న తర్వాతనేనని విశ్వామిత్రుడంతటి ఋషే చెప్పాడు. పోయే ప్రాణాలు నిలబెట్టుకోవడంకోసం అయన కుక్క మాంసం తిని అది తప్పు కాదనీ, శాస్త్ర సమ్మతమనీ అన్నాడు.
రాధ ఒప్పుకుంటే నేను చేయబోతున్నదీ తప్పుకాదు. రాధ ఒప్పుకుందంటే ఆమెదీ తప్పుకాదు. ఈ ప్రపంచంలో ప్రాణాలు తీయడం తప్పు. పోతున్న ప్రాణాలను నిలబెట్టక పోవడం తప్పు. అందుకోసం ఏం చేసినా తప్పుకాదు.
కథ ఇంతవరకూ వచ్చేక నాలో తప్పొప్పుల సంఘర్షణ బయల్దేరింది. కమల కన్యాయం చేస్తున్నానన్న భీతి కల్గుతోంది. అయినా ముందడుగు వేస్తూనే ఉన్నాను.
వెళ్ళడం అఫీసుకు వెళ్ళాను. సరిగ్గా పన్నెండు గంటలకు నాకు కడుపునొప్పి వచ్చింది. ఆఫీసు నుంచి తిన్నగా రాధ ఇంటికి వెళ్ళాను. ఇల్లు తాళం పెట్టి ఉంది. తాళం తీసుకుని లోపలకు వెళ్ళాను. రాధ యింటిముందు స్కూటరెక్కువసేపుంచే ప్రమాదముంటుందని అసలింటి దగ్గర బయల్దేరినప్పుడే స్కూటర్ తీయలేదు.
లోపలకు వెళ్ళి మంచంమీద పడుకున్నాను. అది కావడానికి పట్టె మంచమేకానీ నులకమంచంలాగుంది. దుప్పటీ యెత్తిచూస్తే అడుగున కనీసం బొంతైనాలేదు. పట్టెడకు సవాలక్ష ముళ్ళున్నాయి.
సుకుమారి రాధ ఆ మంచంమీద పడుకుందంటే నాకు బాధ కలిగింది. ఇప్పుడు నేను రాధ బాధల గురించి ఆలోచిస్తున్నాను. ఆమె కష్టాల్లో పాలెలా పంచుకోవాలా, ఆమె కష్టాలనెలా తొలగించాలా అని బాధపడుతున్నాను.
అలాగే టైము ఒంటి గంటయింది. ఇంకా యెక్కడా రాధ జాడలేదు.
అప్పుడు నాకు గుర్తుకొచ్చింది.
రాధ వచ్చేసరికి లవర్స్ సెంటుతో స్నానమైపోవాలి. అందు గురించి ఇల్లంతా కలియ దిరిగాను.
బాత్రూం ఒకటి ఉంది. అందులో నీళ్ళకుండీ ఉంది. కుండీ నిండా నీళ్ళున్నాయి. పక్కనే రెండు బకెట్లు న్నాయి. ఆశ్చర్యమేమిటంటే అంత పేదింట్లోనూ ఓ ఇమ్మర్షన్ హీటరుంది. బహుశా రాధ తల్లి వేన్నీళ్ళ స్నానంకానీ చేయలేదేమో మరి!
నేను వేన్నీళ్ళు కాచుకుని లవర్స్ సెంటుతో స్నానం చేసి నైట్ డ్రస్ లోకి మారాను. అప్పుడు నాకు బాగా ఫ్రెష్ గా అనిపించింది.
ఇప్పుడు రాధ ఇంటికి వస్తే నా మనసులోని మాట చెప్పకుండానే అర్ధమవుతుంది ఆమెకు.
వెళ్ళి మంచంమీద కూర్చున్నాను. టైము గడవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు దాటదంది. అంటే ఆమె మూడుదాకా రాదేమో!
నాకు బెంగ పట్టుకుంది. కానీ టైము సరిగ్గా అయిదు నిమిషాల తక్కువ రెండయ్యేసరికి ఎవరో యింటి తలుపు తట్టారు. తప్పకుండా రాధే అయుండాలనుకున్నాను. ఇప్పుడు నన్ను రాధ యిలా చూస్తే.....ఏమనుకుంటుంది? యెంత థ్రిల్లింగ్ ఉంటుంది?
నేనాలోచిస్తూండగా మరోసారి తలుపు తట్టిన చప్పుడయింది. ఉత్సాహంగా వెళ్ళి తలుపు తీశాను.
ఎదురుగా ఓ యువతి....
ఆమెను పరీక్షగా చూసి మ్రాన్పడిపోయాను. నన్ను చూసి ఆమె మ్రాన్పడిపోయింది.
"నువ్వా?" అన్నాను.
"మీరా?" అందామె. ఆమె నా భార్య కమల!
నేను వెనకడుగు వేశాను. ఆమె లోపలకు వచ్చింది.
"మీరిక్కడ.....ఈ నైట్ డ్రస్సులో...." అని-"ఆఫీసుకు వెళ్ళలేదా?" అంది కమల.
ఏ అబద్ధం చెబితే అతుకుతుందో తెలియక-"నువ్విక్కడి కెందుకొచ్చావు?" అని యెదురు ప్రశ్న వేశానామెను.
మామూలు మనుషులం కావడానికిద్దరికీ కాసేప్పట్టింది.
ఆప్పుడామె భుజాన వ్రేలాడుతున్న సంచిని గమనించాను.
"అదేమిటి?" అన్నాను.
చెప్పడానికామె తటపటాయించింది.
నేను చనువుగా ఆ సంచీలో చేయిపెట్టాను. లోపలేవో బాటిల్సున్నాయి. ఓ బాటిల్ బైటకు తీశాను.
చిన్న సెంటుసీసా.
"అరే-లవర్స్ సెంట్!" అన్నాను ఆశ్చర్యంగా.
"అరే-లవర్స్ సెంట్ మీకెలా తెలుసు?" అంది శ్రీమతి ఆశ్చర్యంగా.
"నువ్వు లవర్స్ సెంట్ అమ్ముతున్నావా?" అన్నాను.
"ఇది మీకెవరైనా అమ్మారా?" అంది శ్రీమతి.
ఇద్దరం ఒకరి ప్రశ్నలొకరు పట్టించుకోవడంలేదు. క్రమంగా నాకంటే శ్రీమతి బలం పెరిగింది. నేనక్కడెందుకున్నానని ఆమె నిలదీస్తోంది. రాధ వచ్చేలోగా యేదో చెప్పాలని నాలో తాపత్రయం బయల్దేరింది. ఆఖరికబద్ధం చెప్పేశాను.
"మా ఆఫీసులో ఒకతను రాధకు సాయపడతానని నాకు రెండువేలిచ్చి పంపారు. ఆ డబ్బామె కివ్వాలనిక్కడకు వచ్చాను." ఆమెకు రాధ పరిస్థితి చెప్పాను.
"మరీ నైట్ డ్రస్సేమిటి?"
"రాధకెవరో వచ్చి డబ్బిస్తే అనుమానం వస్తుంది కదా! అందుకని నేనామె బంధువులా ఇంటికి వచ్చి ఇక్కడ స్నానంచేసి ఇంట్లో మనిషిలా మసలాలని నా మిత్రుడు కోరాడు....."
"మీరు చెప్పేది అర్ధం పర్ధం లేకుండా వుంది....."
అప్పుడు నా బుర్రలో యేదో మెరిసింది-"ఇంకా అర్ధం పర్ధంలేని విశేషమింకొకటుంది...." అన్నాడు.
"చెప్పండి!" అంది కమల.
"ఈ అర్ధం పర్ధంలేని పనికి ఒప్పుకున్నందుకు నా మిత్రుడు నాకో రెండు వేలిచ్చాడు...." అన్నాను.
"నిజమా?" అంది కమల.
"ఆ రాధకు డబ్బివ్వగానే నేను నీ దగ్గరకే వచ్చి వాలుదామనుకుంటున్నాను. యెందుకంటే నీకో నగకొనాలిగా!" అన్నాను.
"నాకు నగెందుకూ?" అంది కమల.
"నాకు డబ్బెందుకూ-నీకు నగ కొనడానికి కాకపోతే!"
"అయితే తారాచంద్ దుకాణాణానికి వెడదామండీ-అక్కడ ముత్యాల లోలకులు బాగుంటాయి. వాటిమీద నాకెంత కాలంగానో మనసు...."
సరిగ్గా మూడింటికి రాధ వచ్చింది. ఆమెకు పదిహేను వందలూ ఇచ్చి శ్రీమతిని పరిచయం చేశాను.
రాధ ఆశ్చర్యపోయి-"మీవంటి ఉదాత్త పురుషులను నేనెక్కడా చూడలేదు. నిన్న అయిదువందలూ యిచ్చి నపుడు కూడా మీ ప్రవర్తన యెంతో ఉదాత్తంగా ఉంది. మీ సహాయం నేను తప్పక గుర్తుంచుకుంటాను" అంది.
