8
రంగారావు క్షణాల మీద సరాసరి ఆఫీసుకు వచ్చేశాడు. పర్మిషన్ తీసుకుని నేను బైటకు వెళ్ళాను. ఇద్దరం దగ్గర్లోని పార్కులోకి వెళ్ళాం.
"ఏమిటి కథ?" అన్నాడు వాడు.
"అనుకోకుండా నా దగ్గర కొంత డబ్బు చేరింది. యెన్నడూలేని ధైర్యమూ నన్నావహించింది. ఇదంతా నీ ప్రభావమే ననుకుంటాను....."
రంగారావు ముఖం వెలిగింది-"ఇప్పుడు నన్నెందుకు పిలిచావో చెప్పు...."
"నువ్వు చాలా గొప్పవాడివి నాకో అమాయకురాలీని వెతికిపెట్టు. అందంగా ఉండాలి. వయసులో ఉండాలి. ఆమెను ఆకర్షించుకోవడం నా వంతు....."
"ఏం-నువ్వు వెతుక్కోలేవా?"
"ఈ ఆధునిక యుగంలో అనుభవముంటే తప్ప మంచికీ చెడ్డకూ తేడా తెలియదు. నాకు అనుభవంలేదు" అన్నాడు.
రంగారావు కాసేపాలోచించి"-అయితే నీకు రాధను సజెస్ట్ చేస్తాను...." అన్నాడు.
"రాధ ఎవరు?" అన్నాను. రంగారావు చెప్పాడు.
రాధ అందమైన మధ్య తరగతి అమ్మాయి. మెట్రిక్ తో చదువాపేసింది. ఇటీవల ఆమె తల్లికి జబ్బు చేసింది. జబ్బు చేయకముందైతే రంగారావామెను మోసం చేయాలనుకున్నాడు. ఎందుకంటే రాధకప్పటి కున్న సరదాలు చిన్నచిన్నవి. సినిమాలు హోటళ్ళు, బట్టలు-యివే ఆమె కోరికలు. వీటిని తీర్చడం పెద్ద కష్టం కాదు.
"రాధ శ్రమజీవి. యింట్లో బట్టలు కుడుతుంది. ఎంబ్రాయిడరీ చేస్తుంది. ప్లాస్టిక్ వైర్లతో రకరకాల వస్తువులు చేసి అమ్ముతుంది. ఆమె సంపాదన నెలకైదారు వందలకు తక్కువకాకుండా వుంది. ఆ డబ్బుతో విలాసాలు కుదరవు కానీ ఆమెకూ, ముసలి తల్లికీ రోజులు వెళ్ళిపోతాయి. రాధకు అందముంది. అభిరుచి ఉంది. తన అందంతో ఓ డబ్బున్న యువకుడిని ఆకర్షించి జీవితంలో తనకున్న తీరని కోరికలన్నీ తీర్చుకోగలనని ఆమె నమ్ముతోంది. అలాంటమ్మాయిని వల్లో వేసుకోవడం చాలా సులభం" అన్నాడు రంగారావు.
ఇప్పుడు రాధ తల్లికి జబ్బు చేసింది. కనీసం రెండు వేలైనా అర్జంటుగా ఉంటే తప్ప రాధకు తల్లి దక్కదు. రంగారావు దగ్గర అంత డబ్బు లేదు. అదీకాక మొదటి సారే రెండు వేలిచ్చి ఆమె నాదుకుంటే అందువల్ల ఆమె ప్రేమ దొరికినా దొరక్కపోయినా-ఏడాదిలో కనీసం ఓ అయిదువేలైనా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.
"అయిదువేలా?" అన్నాను. అంత డబ్బు యిప్పుడే నా దగ్గరుంది.
"ఇప్పుడు రెండువేలిచ్చావంటే ఆమె జీవితాంతం నీకు ఋణపడి వుంటుంది. ఆమెకు తల్లి దక్కుతుంది. తరచుగా నీవామె యింటికి వెడుతూండవచ్చు. ఎటొచ్చీ రొమాన్స్ లోనికి దిగడానికి మాత్రం ఇది తగిన సమయం కాదు. కొంతకాలం వేచి వుండాలి...."
"అదంతా నే చూసుకుంటాలే! నువ్వు నాకు రాధ అడ్రసివ్వు-"అన్నాను. నా వద్ద లవర్స్ సెంటుంది. దాని ప్రభావంతో ఎలాగూ రాధను వశంచేసుకోగలను.
రంగారావు నాకామె అడ్రసిచ్చి-"నీ జీవితంలో ఆరోగ్యకరమైన మార్పు వస్తోంది. అందుకు నాకు సంతోషంగా ఉంది-" అన్నాడు.
పేకాట, గుర్రప్పందాలు, త్రాగుడు-యిలాంటివి వ్యసనాలని సమాజం చెబుతోంది. కానీ ఈ వ్యసనాలున్న వారందరూ అందర్నీ తమవైపు ఆకర్షించాలనీ, తమలో కలుపుకోవాలనీ ప్రయత్నిస్తారు. తమ ప్రయత్నాలు ఫలిస్తే ఆనందిస్తారు. అదే వ్యసనపరుల గొప్పతనం. తమ సుఖాన్ని పదిమందికీ తెలియజెప్పి-అది పదిమందీ అనుభవించేలా చేస్తారు.
అదే మంచివాడైతే అలా కాదు. తన బ్రతుకేదో తను బ్రతుకుతాడు, అడిగిన వాళ్ళకు సాయం చేస్తాడు తప్పితే తన చుట్టూ ఉన్న వారిలో మంచితనాన్ని నింపడానికి ప్రయత్నించడు. ప్రయత్నించినా-ఆ ప్రయత్నం సఫలమయ్యేటంత ఆకర్షణ అతడిలో ఉండదు.
అందుకే ఒక్క వ్యసనపరుడు వందమంది వ్యసనపరుల్ని తయారుచేస్తూంటే పదిమంది మంచివాళ్ళు కలిసి కూడా ఒక్క మంచి వాణ్ణి తయారు చెయ్యలేక పోతున్నారు.
ఈ సమాజం వ్యసనాలకూ, మంచితనానికీ నిర్వచనాలైనా మార్చాలి. మంచితనపు ఆకర్షణనైనా పెంచాలి.
అందాకా నేను రంగారావు దారిలోనే వెడతాను.
9
ఆఫీసు వదిలిపెడుతూనే తిన్నగా రాధ యింటికి వెళ్ళాను.
అదో చిన్న పెంకుటిల్లు. ఇంటికి కాలింగ్ బెల్ కూడా లేదు. నేను తలుపు తట్టగా ఓ యువతి తలుపుతీసింది.
పువ్వుల చీర కట్టుకున్న ఆ యువతి తనే ఓ పువ్వులా ఉంది. ఆమెను చూడగానే అనిపిస్తుంది-అందం ఈ ప్రపంచంలో ఆడదాని సొత్తు మాత్రమేనని.
ఆమె ప్రశార్ధకంగా నా వంక చూసింది.
"మీ పేరు రాధ కదూ!" అన్నాను.
ఆమె తలూపింది.
"నన్ను రంగారావు పంపాడు...."
"రంగారావుగారా?" అందామె.
ఆమె అలా అనగానే నాలో రెండు రకాల భావాలు కలిగాయి. రంగారావుని పెళ్ళాం కూడా ఏమండీ అని మన్నించదు. వాణ్ణికూడా రంగారావుగారని మన్నించే వాళ్ళున్నారా అన్న ఆశ్చర్యమొకటైతే-రంగారావుకూ రాధకూ మధ్య పరిచయం మన్నింపు వదిలిపెట్టే స్థాయి చేరుకోలేదన్న ఆనందం రెండవది.
"లోపలకు రావచ్చా?" అన్నాను.
ఆమె తడబడుతూ-"రండి-లోపలకు...." అంది.
లోపలకు వెళ్ళాను. ముందు గదిలోనే ఓ కుట్టు మిషనుంది. దానికి ముందో స్టూలుంది. ఆ స్టూలుకి కాస్త దూరంగా ఓ స్టీలు చెయిర్ ఉంది. ఆమె నాకు కుర్చీ చూపించి తను స్టూలుమీద కూర్చుంది.
"నేను మీకు సాయపడాలని వచ్చాను-" అన్నాను.
ఆమె అర్ధంకానట్లు చూసింది.
"మీకు నేనెలా సాయపడగలనో మీరే చెప్పాలి!"
క్షణమాలోచించి-"మా అమ్మ హాస్పిటల్లో ఉంది" అంది రాధ.
"ఊఁ" అన్నాను.
"నేను ఊఁ అంటే ఆపరేషన్ జరుగుతుంది. ఆమెను ప్రైవేట్ నర్సింగ్ హోంకు మార్చాలి. అక్కడ వారం పదిరోజులుండాలి. మొత్తం రెండువేలవుతుంది....."
"ఊఁ" అన్నాను.
"పదిరోజుల్లోగా ఆపరేషన్ జరక్కపోతే అమ్మనాకు దక్కకపోవచ్చు-" అంది రాధ.
"అయితే పదిరోజులెందుకు-రేపే వెళ్ళి ఊఁ అనండి....."
"అలాగే అంటాను. కానీ డబ్బెవరిస్తారు-మీ రిస్తారా?"
"ఊఁ."
రాధ తెల్లబోయి-"మొత్తం రెండువేలూ మీ రిస్తారా?" అంది.
"అవును-కానీ మీ తల్లి ప్రేమను పరీక్షించి....
"అంటే?"
"తల్లి ప్రాణాలు రక్షించుకోవడం కోసం అశాశ్వతమైన శరీరానిక్కూడా విలువనివ్వకూడదు మీరు....."
"అంటే?"
"రేపు మధ్యాహ్నానికి నేను డబ్బు తీసుకొని వస్తాను. అందాకా అయిదువందలు అడ్వాన్సుగా యిస్తాను....." అంటూ జేబులోంచి అయిదు వందరూపాయల నోట్లుతీసి ఆమె కందించాను. వణుకుతున్న చేతులతో వాటినందుకుందామె.
"మీకు చాలా చాలా థాంక్స్!" అందామె.
"థాంక్స్ చెప్పే పద్ధతి యిది కాదు. నేను రేపు మధ్యాహ్నం పదిహేనొందలూ తీసుకొని వస్తాను. నేను కోరిన విధంగా థాంక్స్ చెప్పాలి-" అన్నాను.
ఆమె భయంగా నా వంక చూసింది.
