Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 65


    స్నానం చేసేటప్పుడు సెంటు తీసుకొని వెళ్ళలేదు. ఆఫీసు కెళ్ళేటప్పుడు లవర్స్ సెంటు వాడడం ప్రమాదమని నాకనిపించింది.
    ఉదయం భోజనానికి కూర్చున్నప్పుడు-"రాత్రి రొంపపట్టేలాగుందన్నారు. ఇంకా పట్టినట్లు లేదే-" అంది శ్రీమతి.
    "ఏం బాధగా వుందా?" అన్నాను చిరాగ్గా.
    "అదేంటండీ అలాగంటారు?" అంది శ్రీమతి నొచ్చుకుంటున్నట్లు.
    "మరేం చేయను? రాత్రి రొంప పడుతుందా అనిపించింది. ఇప్పుడు పట్టలేదేమని నిలదీస్తే నేనేం చేసేది?"
    నాకు చిరాగ్గా ఉందని కనిపెట్టి శ్రీమతి మరి మాట్లాడలేదు. నేను మామూలుగా ఆఫీసుకు వెళ్ళిపోయాను. మనసులో చిరాకు, భయం ఉనంప్పుడు నేనాఫీసుకు కొంచెం పెందరాళే వెళ్ళడం మామూలు. ఆ రోజు పావుగంట ముందు వెళ్ళాను. నేను వెళ్ళీ వెళ్ళగానే సూర్యప్రభ తప్ప ఇంకెవ్వరూ లేరు. అంత భయంలోనూ అక్కడ మేమిద్దరమే ఒంటరిగా ఉన్నామని గ్రహించే సరికి నా మగబుద్ధి నన్ను లవర్స్ సెంటులో స్నానంచేసి రాలేదని తిట్టింది.
    అయితేయేం-ఎన్నడూ లేనిది సూర్యప్రభ ఆ రోజు నాతో వచ్చి మాట్లాడింది-"మేనేజరింకా రాలేదు-" అందామె నాతో.
    "ఆయనొచ్చే టైమింకా కాలేదుగా...." అన్నాను.
    "వచ్చినా నువ్వు భయపడక్కర్లేదు ఏ పరిస్థితుల్లో నువ్వు మాధురింట్లో ఉన్నావో నేను విజయ్ కు చెప్పాను" అంది సూర్యప్రభ.
    "అంటే?"
    "ఆయన నీ అమాయకత్వాన్నీ, అసహాయతనూ అర్ధం చేసుకున్నాడు. మాధురి అసలు రంగూ తెలుసుకున్నాడు. నీకింకేమీ భయంలేదు. ఎటొచ్చీ నువ్వింకెప్పుడూ మా యింటికి రాకు..." అంది సూర్యప్రభ.
    "ఎందుకని?"
    "విజయ్ కు నచ్చదు...."
    "నచ్చకపోతే?"
    "విజయ్ ఎవరినీ రెండుసార్లు క్షమించడు....."
    నేను మాట్లాడలేదు. నా వల్ల సూర్యప్రభ చాలా గొప్ప కార్యాన్ని సాధించింది. ఇప్పుడు నన్ను వదల్చుకోవాలనుకుంటోంది.
    "మిస్ సూర్యప్రభా! నా కారణంగా నీకు ఆర్ధికంగా లాభం వచ్చింది. నాకూ కొంత వాటా యివ్వాలి...." అన్నాను.
    సూర్యప్రభ తెల్లబోయి-"వాటా ఏమిటి?" అంది.
    "నాకో అయిదువేలియ్యి. లేదా నీ యింటికి వస్తాను. విజయ్ నా అసహాయతనూ, అమాయకత్వాన్నీ మరో సారి అర్ధం చేసుకోగలడని నా నమ్మకం-" అన్నాను.
    "నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు...." అంది సూర్యప్రభ.
    "తెలివి ఒకరి సొత్తు కాదు, నువ్వు నన్నాశపెట్టి మోసం చేశావు..."
    "నేను నిన్నాశపెట్టినమాట నిజం. కానీ నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. అప్పుడెందుకో నిజంగానే నాకు నీమీద మోజు కలిగింది. కారణం చెప్పలేను. ఏదో తాత్కాలికమైన బలహీనత...." అంది సూర్యప్రభ.
    అది నాకు తెలుసు. అంతా లవర్స్ సెంటు ప్రభావం లేకుంటే నాలో ఏం విశేషముందని! కాలేజీలో నన్నెవ్వరూ ప్రేమించలేదు. మా బంధువులమ్మాయి లెందరో ఉన్నారు. ఒక్కరూ నేనంటే మోజుపడలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నాకో కోరికుండేది. ధైర్యంచేసి యెవరినైనా ప్రేమిద్దామనుకున్నా నాకు భయం. ఎవరినుంచీ రవంత ప్రోత్సాహం లభించలేదు.
    నిన్న ఒక్క రోజులో ఇద్దరాడపిల్లలు నా వెంట బడ్డారు. అది లవర్స్ సెంటు ప్రభావమా? లేక నేను ధైర్యం చేస్తే సులభంగా నాకడపిల్లలు వశమవుతారా?
    "నీ బలహీనత నా బలహీనతను రెచ్చగొట్టింది. నాకు డబ్బో, నువ్వో-యేదో ఒకటి కావాలి...."
    "ఒకసారి డబ్బిస్తే మళ్ళీ మళ్ళీ వేధించవని నమ్మక మేమిటి?"
    "నేను బ్లాక్ మెయిలర్ని కాదు. నువ్వు చేసిందానికి నీకు గుణపాఠం చెప్పడానికే డబ్బడుగుతున్నాను....."
    ఏమనుకుందో-"ఆల్ రైట్-మధ్యాహ్నానికల్లా డబ్బిస్తాను. కానీ మళ్ళీ మళ్ళీ డబ్బడిగావో నువ్వు నాకు చెప్పినకంటే బాగా నేను నీకు గుణపాఠం చెప్పగలను. నా చేతిలో పలుకుబడిగల మనుషులు చాలామందున్నారు" అంది.
    అంత సులభంగా అయిదువేలివ్వడానికామె ఒప్పుకుంటుందని నేననుకోలేదు. ఆ ఆనందంలో-"నువ్వు నాకైదువేలిచ్చావంటే-నేను మళ్ళీ నిన్ను వేధించడం సంగతటుంచు. నీకు ఋణపడి ఉన్నానని కూడా భావిస్తాను...." అన్నాను.
    సూర్యప్రభ యేదో అనబోయింది. ఆఫీసుకు జనం రావడం ప్రారంభమైంది. సూర్యప్రభ వెంటనే-"వస్తాను, థాంక్స్!" అని వెళ్ళిపోయింది.
    ఆమెనూ నన్నూ చూసినవాళ్ళు విపరీతంగా ఆశ్చర్యపోయారు. సూర్యప్రభ ఆఫీసులో వాళ్ళందర్నీ పురుగుల్లా చూస్తుంది. ఆ పురుగుల్లోకల్లా హీనాతిహీనమైన పురుగును నేను-ఆడవాళ్ళకు సంబంధించినంతవరకూ! నా స్నేహితులు నన్ను నెమ్మదైనవాడు అంటారు. మిగతా వాళ్ళు డల్లర్డ్ అంటారు.
    సూర్యప్రభ నాతో మాట్లాడమే కాకుండా మిగతా వాళ్ళు రాగానే చటుక్కున సంభాషణ త్రుంచేసి వెళ్ళి పోయింది. ఇది అందర్నీ యెక్కువగా ఆకర్షించింది. వీలైనప్పుడల్లా అందరూ ఆ విషయమే మాట్లాడుకున్నారని నాకనిపించింది.
    ఒకరిద్దరు నా దగ్గరకు వచ్చి నన్నభినందించారు. ఒక అసూయాపరుడు మాత్రం-"ఏ మాత్రం ఖర్చుపెట్టావేంటి గురూ!" అన్నాడు.
    నేనేమీ మాట్లాడలేదు.
    మధ్యాహ్నం సూర్యప్రభ ఓ పొడవాటి కవరును ఫ్యూన్ ద్వారానా దగ్గరకు పంపించింది. కవర్లో అయిదువేలున్నాయి. వాటితోపాటు ఓ కాగితముంది.
    ఇంకా కావాలని ఆశపడ్డావో అన్న వాక్యం పక్కన ఒక పుర్రె రెండు బొమికలు-బొమ్మ వేసి వుంది.
    నాకీ అయిదువేలూ చాలు, ఇంక ఆశపడను.
    లవర్స్ సెంటు నాకు అమ్మాయిలనే కాదు. డబ్బు కూడా సంపాదించి పెడుతోంది. అలా అనుకోగానే నాలో యింకో ఆశకూడా బయల్దేరింది. డబ్బున్న అమ్మాయి నన్ను ప్రేమించిందంటే యెంత బాగుంటుంది!
    అయిదు వేలంటే నాకు సామాన్యమైన మొత్తం కాదు. ఆ డబ్బును ఒక్క పూటలో నాకిచ్చేసింది సూర్యప్రభ పడితే అలాంటమ్మాయిని పట్టాలి.
    నేను డబ్బును రెండు మూడుసార్లు లెక్కపెట్టుకున్నాను.
    ఇప్పుడీ డబ్బునేం చేయాలి?
    నా చెవుల్లో శ్రీమతి కోరికలు గింగురుమన్నాయి. కానీ అంతకంటే బిగ్గరగా రంగారావు మాటలు వినపడసాగాయి. క్రమంగా శ్రీమతి మాటలు ఆగి వాడి మాటలే వినపడసాగాయి.
    'ఇప్పుడు బార్లకు వెళ్ళడం మానేశాను. సిగరెట్లు మానేశాను. మానేసినట్లు నా భార్యకు తెలియదు. ఖర్చు లామెకు చెబుతూనే ఉన్నాను. ఆ డబ్బంతా దాస్తున్నాను. ఏడాదిలో వెయ్యి రూపాయలు దాచాను....' అన్నాడు రంగారావు.
    నాకంత బాధలేదు. ఏ శ్రమా లేకుండా అయిదువేలు సంపాదించాను.
    ఇంక నేను ఆలోచించలేదు. వెంటనే రంగారావుకు ఫోన్ చేశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS