"ఏమిటండీ!" అన్నాడు ఆ వ్యక్తి ఆత్రుతగా.
"మీరు ఆడపిల్లగా పుట్టవలసింది" అన్నాడు శాస్త్రి.
"అంత అందంగా ఉన్నానా నేను" అన్నాడా వ్యక్తి సిగ్గుపడుతూ.
"అడగ్గానే ఇంతలా పరీక్షించనిస్తున్నారని అలా అన్నాను" అన్నాడు శాస్త్రి.
"అది సరే నన్నింతకూ ఎందుకు పరీక్ష చేసినట్లు?"
"మనిషి మనిషికీ తేడా లుంటాయి. కొందరి వళ్ళు గట్టిగా వుంటుంది. కొందరి బుద్ధి గట్టిగా ఉంటుంది. నేను రైల్లోంచి దూకాననుకోండి - కాలో చెయ్యో విరుగుతుంది అంతే! మీరు బాత్రూంలో జారిపడ్డా సరే చచ్చిపోతారు" అన్నాడు శాస్త్రి.
ఎదుటి సీట్లలో కూర్చున్న ముగ్గురూ నవ్వారు. వారిలో మధ్య వ్యక్తి "మీలాంటివాళ్ళుంటే-ఇలాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో గంటలు సెకండ్లలా గడిచిపోతాయి" అన్నాడు.
"మీమీద జోక్ వేయనంతసేపే మీ రా మాట అంటారు సార్!" అన్నాడు శాస్త్రి నీరసంగా.
ఎదుటి వ్యక్తి మరి మాట్లాడలేదు. ఆ పక్క వ్యక్తి మాత్రం-"ఇందాకా ఓసారి అడిగి చీవాట్లు తిన్నాను. ఒకే ప్రశ్నకు అస్తమానూ ఒకేలా సమాధానమిచ్చే రకంలా మీరు లేరు. అందుకని మళ్ళీ అడుగుతున్నాను. మీ దగ్గర నిజంగా టికెట్స్ లేవా?" అన్నాడు.
"అంతా మీరే చూశారు. రామాయణమంతా విని రాముడికి సీతేమౌతుందిట-అనడిగినట్లుంది-మీ ప్రశ్న-" అన్నాడు శాస్త్రి.
ఇంతలో అక్కడికి కండక్టర్ మళ్ళీ వచ్చి-"మీ గురించి స్టేషన్ కు ఫోన్ చేశాను. అక్కడ మీకు చక్కటి స్వాగతం పలకబడుతుంది-" అన్నాడు.
"ఫైన్ ఎంత కట్టాలి!" అన్నాడు శర్మ.
"అలా దారికి రండి-" అంటూ కండక్టర్ ఏవో లెక్కలు గణించి కొంత మొత్తం చెప్పాడు.
"దానికేముంది సార్-యిచ్చేస్తాం-" అన్నాడు శర్మ.
"శర్మా-నువ్వివ్వొద్దు-నేనిస్తాను-" అన్నాడు శాస్త్రి.
"వద్దు-నేనే యిస్తాను-" అన్నాడు శర్మ.
"సరే-అయితే పోనీ నువ్వే ఇవ్వు నీ మాట నే నెప్పుడు కాదన్నాను గనుక-" అన్నాడు శాస్త్రి.
శర్మ చొక్కా జేబులో చేయిపెట్టి కొన్ని కాగితాలు బయటకు తీసి-"అన్నీ కాగితాలే-" అని మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు. రెండోజేబులో చెయ్యిపెట్టి బైటకుతీస్తే టికెట్స్ వచ్చాయి-"సార్-ఇవి మీరు చూచేశారు కదూ, మళ్ళీ చూస్తారా?" అనడిగాడు. కండక్టర్ తన విసుగుదలను మాటల్లో కాక ముఖంలో చూపించాడు. తర్వాత పాంట్ జేబులు రెండింట్లోనూ చేతులుపెట్టి- ఏమిటి సార్-జేబులో బొత్తిగా డబ్బు లేదు-" అన్నాడు కండక్టరుతో.
కండక్టరు ముఖం మాడ్చుకుని శర్మవంకే చూస్తున్నాడు.
శర్మ ఉన్నట్లుండి హిప్ పాకెట్ లో చేయిపెట్టి-"హిప్ పాకెట్-హిప్ హిప్ హుర్రే-దొరికింది-" అన్నాడు.
"ఏమిటి?" అన్నాడు శాస్త్రి.
"మనీపర్సు-" అంటూ జేబులోంచి త్వరగా ఓ పర్సు బైటకు తీసి-గబగబా వెతికి-"ఇందులోనూ డబ్బు లేదు. ఇదేమిటి సార్-మనీపర్సుని తీస్తే ఇది ఉత్త పర్సయి ఊరుకుంది-" అన్నాడు శర్మ.
"అయితే మీ దగ్గర డబ్బులు లేవా?" అన్నాడు కండక్టరు.
"మీ అదృష్టం బాగోలేదు. ఇందులో ఒక్క పైసా కూడా లేదు-" అన్నాడు శర్మ.
"మధ్య నా అదృష్టమేమిటి? డబ్బు లేకపోతే జైలుపాలయ్యేది మీరు!" అన్నాడు కండక్టరు.
"అవునవును ఆ సంగతే మర్చిపోయాను. అవసరం మాది కదూ-" అని-"శాస్త్రీ! ఈ సారికి పోనీ నువ్వే డబ్బిచ్చేయకూడదూ-" అన్నాడు శర్మ.
"నేనే యిస్తాను-" అంటూ శాస్త్రి కండక్టరుతో-"సార్! పెద్ద నోటు తీసుకుంటారా-చిల్లర కూడా అడగను. ఇప్పుడే ఇచ్చేస్తాను-" అన్నాడు స్వరం కాస్త తగ్గించి.
కండక్టరు ముఖం కాస్త విప్పారింది-"పెద్దనోటంటే?" అన్నాడు.
"వెయ్యి రూపాయల నోటు-" అన్నాడు.
"మీరు కానీ పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వస్తున్నారా?" అన్నాడు కండక్టర్.
"ఏమో సార్-ట్రయిన్ లోకి మీ వెనకే ఎక్కాం" అన్నాడు శాస్త్రి.
"పాపం-డబ్బు లివ్వకపోతే జైలుకెడతారు-" అని వెళ్ళిపోబోయాడు కండక్టర్.
శాస్త్రి, శర్మ యిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. శర్మ గబుక్కున ఓ అడుగు ముందుకువేసి కండక్టరుని ఆపి-"పాపం-అన్నారంటే మీది తప్పక జాలిగుండే అయుండాలి. మాకు జైలుకు వెళ్ళాలని లేదుసార్. ముష్టి పాతికరూపాయలు సంపాదించడమెంతసేపు? ట్రయిన్ లో తలో రూపాయీ అడుక్కునైనా డబ్బు సంపాదిస్తాను. జాలిగుండెగల మీరే ముందు మాకో రూపాయివ్వండి-" అంటూ చేతులు సాచాడు.
"ఇది చాలా బాగుంది-ఫైన్ అంటే టికెట్ ధర ఇవ్వడం కాదు. డబుల్ ఛార్జి కట్టాలి-" అన్నాడు కండక్టర్.
"దానికేముంది సార్-రూపాయకు బదులు రెండ్రూపాయలడుక్కుంటే సరిపోతుంది. ఏమైనా బోణీ మీదే కదా-రెండ్రూపాయ లివ్వండి-" అన్నాడు శర్మ.
"టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ట్రైన్ కండక్టర్ని డబ్బులడగడం చూడ్డం నా జీవితంలో యిదే మొదటి సారి-"
"ఎంతమందికో ఎన్నో కొత్త అనుభవాలివ్వడం మా ప్రత్యేకత. ఇంకా మీ అనుభవంలోకి రాని విశేషాలేమైనా ఉంటే చెప్పండి-ఆ లోటు తీరుస్తాం-" అన్నాడు శాస్త్రి.
"మిమ్మల్ని జైలుకు పంపడం-" అన్నాడు కండక్టర్.
"వెయ్యిరూపాయల నోటు ఇస్తానన్నా తీసుకోకపోతే నేనేం చేసేది సార్!" అన్నాడు శాస్త్రి.
"నిజంగా నీ దగ్గర వెయ్యి రూపాయల నోటుందా?" అన్నాడు కండక్టర్ అనుమానంగా.
"డీమోనెటైజ్ చేసిన రోజుల్లో నేనో బ్లాక్ మార్కెటీరు ఇంట్లో ఇల్లు చక్కబెడుతూండేవాణ్ణి. స్వీపరు ఊడ్చేస్తూంటే సరదాగా నలుగు తీసి దాచుకున్నాను. రెండు నోట్లు-మా పాకెట్ నోట్ బుక్స్ కి అట్టగా వేసుకున్నాం. ఓసారిలా రైలు ప్రయాణం చేస్తూ ఓ పాప ఏడుస్తూంటే గుండె కరిగిపోయి-కాగితంబుట్ట చేసిపెట్టాం. ఇంకొక్కటి మిగిలింది. మీ కివ్వాలని ముచ్చట పడుతున్నాను."
"చాలా థాంక్స్ ఆ నోటు ఇలా యివ్వు-" అన్నాడు కండక్టర్.
"నిజంగా తీసుకుంటారా సార్-" అన్నాడు శాస్త్రి.
"ఎస్-"
"మీరు చూస్తే కుర్రాళ్ళలా కనబడుతున్నారు. ఇంకా పాతకాలం వాళ్ళలా ఎస్సంటారేమిటండీ-య్యాయ్యా- అనాలి-అలా అంటేనే మీకు నప్పుతుంది-" అన్నాడు శాస్త్రి.
