Previous Page
వసుంధర కధలు -3 పేజి 66


    "నేను ఎస్ అనే అంటాను. ముందా వెయ్యి రూపాయల నోటిలాగివ్వు-"
    "మీరు య్యా అంటేనే యిస్తాను-" అన్నాడు శాస్త్రి.
    కండక్టరు అదోలా శాస్త్రివంక చూసి-"య్యా-" అన్నాడు.
    "అయ్యో శాస్త్రీ-ఎంత పని చేశావు-తల వెనుక నుంచీ చేయి పెట్టి ముక్కు జూపించమని అడగాల్సింది" అన్నాడు శర్మ.
    "జరిగిందేదో జరిగిపోయింది-" అన్నాడు శాస్త్రి.
    "థౌజండ్ రుపీస్ నోట్ ప్లీజ్!-" అన్నాడు కండక్టర్.
    "ఏమిటి సార్-మీకు బొత్తిగా జోకులు రిసీవ్ చేసుకోవడం చేతకాదు. నేను థౌ'జండ్ రుపీస్ నోట్ ఇస్తాననగానే జోక్ అర్ధం చేసుకుని నవ్వాలి మీరు. మంచి జోకుపాడైపోయింది-" అన్నాడు శాస్త్రి.
    కండక్టరు నవ్వుతూ- "బాచ్ హౌస్ తెలుసా మీకు?" అనడిగాడు.
    "తెలిసినా తెలియకపోయినా మీరు చెప్పదల్చుకుంది చెప్పండి సార్-" అన్నాడు శాస్త్రి.
    "నార్త్ వియత్నాంలో అమెరికం సైనికుల వినోదం కోసం అతడి నక్కడకు పంపించారు. అతడొక చక్కని హాస్యనటుడే కాక-బయట కూడా అందర్నీ ఆనందింప జేయగలడు-" అన్నాడు కండక్టర్.
    "మీకు నిజంగా ఎన్ని విశేషాలు తెలుసు సార్!" అన్నాడు శర్మ.
    "ఇలాంటి విశేషాలన్నీ మీ కెక్కడ తెలుస్తాయి సార్!" అన్నాడు శాస్త్రి.
    "ఆ సంగతి మరోసారి మాట్లాడుకుందాం-మీరు జైలుకి వెడితే అక్కడి ఖైదీలకు మీ కారణంగా మంచి వినోదం లభిస్తుంది. ఆ విధంగా మీరు మానవసేవ చేసినట్లవుతుంది-" అన్నాడు కండక్టర్.
    "అయితే మీరు కూడా అక్కడకు వస్తారా సార్!" అన్నాడు శర్మ.
    "మధ్య నే నెందుకు?"
    "మా మనసేవకు మీరే ఇన్ స్పిరేషన్! మిమ్మల్ని చోదోఅగానే జోకులు వేయాలనిపిస్తుంది. అసలు జైల్లో మిమ్మల్ని వదిలేస్తే-ఖైదీలు కూడా మీ మీద జోకులు వేస్తారని నాకు అనిపిస్తోంది-" అన్నాడు శాస్త్రి.
    "అవన్నీ తర్వాత-మీ యిద్దరిలో ఎవరు జైలుకి వెడతారో తేల్చుకోండి-ట్రయిన్ ఏలూరు సమీపిస్తోంది" అన్నాడు కండక్టరు.
    "మేం విడిగా ఉండలేం-కలసే జైలుకి వెడతాం" అన్నాడు శర్మ.
    "విడిగా ఉండలేకే-మేం పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు-" అన్నాడు శాస్త్రి.
    "కానీ జైలుశిక్ష మీలో ఒక్కరికే-" అన్నాడు కండక్టర్.
    శాస్త్రి, శర్మ ముఖముఖాలు చూసుకున్నారు. శాస్త్రి ఆలోచించి-"ఓ పని చేద్దాం-మన దగ్గరున్న టికెట్ ని ఇంకెవరికైనా దానం చేసి-ఇద్దరం కలిసి జైలుకి పోదాం-" అని-"సార్! ఈ ట్రయిన్ లో టికెట్ లేకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి. మా టికెట్ వాళ్ళ కిచ్చేస్తాం-" అన్నాడు.
    "ఈ ట్రయిన్ లో అంతా పెద్ద మనుషులు-మీరు తప్ప! అందరికీ టికెట్సున్నాయి-" అన్నాడు కండక్టర్.
    "టికెట్ లేనివాడు పెద్దమనిషి కాదంటారు. అయితే మాలో ఎవడు పెద్దమనిషి అంటారు-"
    "అది మీరే తేల్చుకోండి-"
    "అన్నట్లు మీ దగ్గర టికెట్ ఉందా?" అనడిగాడు శర్మ.
    "కండక్టరుకి టికెట్ అవసరం లేదు-" అన్నాడు కండక్టర్.
    "పెద్దమనుషులకి టికెట్ ఉండాలి. కండక్టరుకి టికెట్ ఉండక్కర్లేదు. సార్-మీరూ మేమూ ఒక్కటే-" అన్నాడు శాస్త్రి.
    కండక్టర్ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    ట్రయిన్ సరిగ్గా టైముకి బెజవాడలో ఆగింది. కంపార్ట్ మెంట్ రెండు తలుపులవద్దా పోలీసులున్నారు. శాస్త్రి ఒక వైపూ, శర్మ ఒకవైపూ వెళ్ళారు. కండక్టర్ శాస్త్రితోటే వెళ్ళి-పోలీసుల్ని చూస్తూ-"ఇతనూ-ఇతని మిత్రుడూ ట్రయిన్ పొడుగునా చేసిన అల్లరింతా అంతా కాదు. హి యీజే టికెట్ లెస్ ట్రావెలర్" అన్నాడు.
    "ఒక్క క్షణం ఆగండి సార౧ నన్ను టికెట్ అడుగుతున్నారు మీరు. కానీ మీకు నేను టికెట్ లేకుండా బంగారు బిస్కట్సు చూపిస్తాను. నన్ను పట్టుకుంటారా, వాటిని చూస్తారా?" అన్నాడు శాస్త్రి.
    పోలీసులు కంపార్ట్ మెంట్ సెర్చిచేశారు. వాళ్ళకాట్టే శ్రమ లేకుండా శాస్త్రి, శర్మ సాయపడి సరైన చోటుకి తీసుకెళ్ళారు. ఈ పెద్దమనిషీ-రెండు సూట్ కేసుల బంగారమూ దొరికాయి.
    అనుకోకుండా ఆ పెద్దమనిషి దగ్గర బంగారాన్ని చూసిన శాస్త్రి, శర్మ పనిగట్టుకుని అతడికి తెలియకుండా వెన్నాడారు. అతడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్కడం చూసి తామూ అందులో ఎక్కారు. ట్రయిన్ లో ఉన్నంతసేపూ అతణ్ణి ఏదో సమయంలో కనిపెడుతూనే ఉన్నారు. టికెట్ కలెక్టర్ని రెచ్చగొడితే కానీ అతడు పోలీసుల్ని పిలిపించడు. నిజం చెబితే ట్రయిన్ లో ఎలాంటి గొడవలు జరుగుతాయో చెప్పడం కష్టం. అందుకని ఎవరికీ అనుమానం రాని విధంగా నాటకమాడారు శాస్త్రి, శర్మ!
    "ఈయనవద్ద టికెట్ ఉంది. దొంగబంగారం ఉంది. మరీయన పెద్దమనిషి అవునో కాదో మీరే చెప్పాలి-" అన్నాడు శాస్త్రి కండక్టరుతో.
    "ఆయన సంగతెలా ఉన్నా-టికెట్ లేని పెద్దమనుషులు మీరు-" అన్నాడు కండక్టర్.
    "అయ్యో-అలాగనకండి-" అంటూ శాస్త్రి, శర్మ కండక్టర్ చేతిలో రెండు జతల టికెట్లు పెట్టి-"ఇంక పోలీసు డిపార్టుమెంటు మాకేం బహుమతి నిస్తుందో చూడాలి-" అంటూ పోలీసుల వెనకే వెళ్ళారు.
    తన చేతిలోని రెండు జతల టికెట్సు వంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు కండక్టర్. అవి రెండూ కూడా వాల్తేర్ నుంచి విజయవాడకు టికెట్టూ, సీటూ-రెండు జతలు!


                                -:అయిపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS