Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 64


    "పక్కన కూర్చో కాసేపు కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు శాస్త్రి.
    ఇద్దరూ కూర్చుని రైల్లో టికెట్టు లేకుండా ప్రయాణం చేసేవాళ్ళ గురించీ, అందువల్ల ప్రభుత్వానికి కలిగే నష్టం గురించీ సంభాషణ మొదలుపెట్టారు.
    శాస్త్రికి ఎదురుగా కూర్చున్నతను కుతూహలంగా, "ఏమండీ, ఇంతకీ మీ దగ్గర నిజంగా టికెట్లున్నాయా, లేవా?" అనడిగాడు.
    శాస్త్రి అతడివంక అదోలా చూసి, "మీ రేమీ అనుకోనంటే ఓ మాటంటాను. టికెట్ కలెక్టరు కే ఈ ప్రశ్నకు జవాబివ్వలేదు. నేను మీ కెలా యిస్తాననుకున్నారు?" అన్నాడు.
    అంతా నవ్వారు.
    ఎదుటి మనిషి కాస్త నొచ్చుకున్నాడు. కానీ ఏమనడానికీ భయపడి ఊరుకున్నాడు.
    కాసేపట్లోనే కండక్టరు అక్కడికి వచ్చి శాస్త్రి వంక చూసి "నీ మిత్రుడు వచ్చాడా?" అన్నాడు.
    శాస్త్రి శర్మను చూపించి "మీట్ మై డియరెస్ట్ ఫ్రెండ్ శర్మ!" అన్నాడు.
    శర్మ చేయి జాపి కండక్టరుతో కరచాలనం చేసి-"కూర్చోండి సార్" అంటూ మర్యాద చేశాడు!
    కండక్టరు కూర్చుని-"టికెట్ ప్లీజ్!" అన్నాడు.
    "అబ్బ-అదొక్కటి తప్ప యింకేధైనా అడక్కూడదూ!" అన్నాడు శాస్త్రి.
    "టికెట్ ప్లీజ్-" అన్నాడు కండక్టర్.
    "సరే-తీస్కోండి-" అంటూ శర్మ జేబులోంచి ఒక టికెట్ తీసి కండక్టర్ కిచ్చాడు.
    "ఒకటే యిస్తున్నారేమిటి?" అన్నాడు కండక్టర్.
    "ఒకటి కాకపోతే ఎన్నిస్తారేమిటి?"
    "ఇద్దరు మనుషులకు రెండు టికెట్లు-" అన్నాడు కండక్టర్.
    "అయితే ఇది కూడా ఉంచండి-" అంటూ ఇంకో టికెట్ ఇచ్చాడు శర్మ.
    కండక్టర్ రెండు టికెట్సునీ పరీక్షించాడు-"అదే దీనిలో ఒకటి టికెట్-రెండోది సీటు-"
    "బాగుందండీ-టికెట్ కొన్నవాడి కెలాగూ సీటుంది కదా-అందుకని ఒకటి టికెట్టూ ఇంకోటి సీటూ కొన్నాం. టికెట్ కొన్నవాడికి సీటుండదని మీరు చెప్పండి" అన్నాడు శర్మ.
    "నేను చెబుతున్నాను-" అన్నాడు కండక్టర్.
    "టికెట్ ఖరీదేమో ఇరవైకి పైన. సీటు ఖరీదేమో రూపాయి చిల్లర. టికెట్ కొన్నవాడికి సీటు లేదనడం చాలా అన్యాయం. పోనీలెండి. ఈ దేశంలో ఎన్నో అన్యాయాలు భరించాం. భరిస్తున్నాం. ఇదీ భరిస్తాం-" అని శాస్త్రివంక చూసి "డియర్ ఫ్రెండ్ నీకు టికెట్ కావాలా, సీటుకావాలా" అన్నాడు శర్మ.
    "నాకు టికెట్టే కావాలి సీటు నువ్వే ఉంచుకో అసలే నీకు వంట్లో బాగోలేదు-" అన్నాడు శాస్త్రి.
    "వద్దు డియర్ ఫ్రెండ్. అప్పర్ బెర్త్ మీద పడుకోగలవాణ్ణి నేనొక్కన్నే. సీటు నువ్వే ఉంచుకుని టికెట్ నా కిచ్చేసేయ్-" అన్నాడు శర్మ.
    "నీ యిష్టం. నీ మాట నే నెప్పుడు కాదన్నాను...." అన్నాడు శాస్త్రి.
    కండక్టర్ చిరాగ్గా-"ఏమిటి మీరు మాట్లాడేది?" అన్నాడు.
    "ఏమీలేదు సార్-సీటు నా స్నేహితుడి కిచ్చేస్తున్నాను. టికెట్ నాది-నేను ఆ లగేజి బెర్తుమీదకు పోయి పడుకుంటాను-" అన్నాడు శర్మ.
    "మిస్టర్! వేళాకోళంగా ఉందా? మీ యిద్దర్లో ఒక్కరికే టిక్కెట్సున్నాయి. రెండోవాళ్ళు డబ్బు కట్టాలి-" అన్నాడు కండక్టర్ కోపంగా.
    "ఇద్దరున్నాం. రెండు టికెట్సున్నాయి. ఇరవై పెట్టి టికెట్ కొనుక్కుని కూడా సీటు లేకుండాపోయినా సహించాము. రూపాయ్ టికెట్ కి సీటిచ్చినా సరిపెట్టుకున్నాను. ఇంకా యెందుకు బాధిస్తారు నన్ను!" అన్నాడు శర్మ.
    "ఏమిటి-వేళాకోళంగా ఉందా-ఈ ట్రయిన్ లో టికెట్ లేకపోతే ఏడాది జైలు-" అన్నాడు కండక్టర్.
    "జైలంటే నాకేమైనా భయమా- ఈ కండల్ని నేను జైల్లోనే పెంచాను-" అంటూ శర్మ లేచి నిలబడి కండలు ఉబ్బించాడు. అతడి అవయవ సౌష్టవం చక్కగా ఉంది.
    "అయితే నువ్వు జైలు పక్షివన్న మాట-" అన్నాడు కండక్టర్.
    "అవును కానీ నేను మొదటిసారి జైలుకెందుకెళ్ళానొ తెలుసా? ఒక అపరిచితుడు నన్ను నువ్వని పిలిచాడు. ఆ తర్వాత నాకు వళ్ళు తెలియదు. ఆ తర్వాత కాస్సేపటికి జైల్లో ఉన్నాను-" అన్నాడు శర్మ.
    "బెదిరిస్తున్నావా?" అన్నాడు కండక్టర్.
    శాస్త్రి కలగజేసుకుని-"ఎందుకు సార్? అనవసరంగా గొడవపెట్టుకుంటారు. నేను నువ్వంటే ఊరుకుంటాను కానీ మావాడు ఊరుకోడు. జైలు వాడికి అలవాటే-మరి దెబ్బలు మీకు అలవాటో కాదో చూస్కోండి-" అన్నాడు.
    "అక్కడికి నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతావేమిటి?" అన్నాడు కండక్టర్.
    "నన్నే కాదు. నా స్నేహితుణ్ణి కూడా నువ్వంటే ఊరుకోను. టికెట్ లేదనుకుంటే జైలుకి పంపించు. కానీ నువ్వని మాత్రం అనకు. అందమైన పదహారేళ్ళ ఆడపిల్ల వచ్చి నువ్వన్నా నేను సహించను. నువ్వంటే సహిస్తానా?" అన్నాడు శర్మ.
    "మీతో నాకేంటి? మీ దగ్గర టికెట్సు లేవు. అనుభవిస్తారు" అన్నాడు కండక్టర్.
    "అనుభవించేదేదో మేమే అనుభవిస్తాం గదా-మీరు వెళ్ళండి సార్-బెజవాడ చేరడం మాకు ముఖ్యం. అక్కడ మమ్మల్నాపడం మీకు ముఖ్యం. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం-" అన్నాడు శాస్త్రి.
    "తప్పించుకుపోగలమని అనుకోకండి. బెజవాడలో మీ పని పడతాను. ఇక్కన్నించి స్టేషనుకు మాట్లాడే సదుపాయముంది. ట్రయిన్ ఆగగానే ఈ కంపార్ట్ మెంటును రైల్వే పోలీస్ చుట్టుముడతారు-" అన్నాడు కండక్టర్.
    "అమ్మో-ట్రయిన్ అప్పుడే సామర్లకోట దాటుతోంది. మధ్యలో గొలుసు లాగి దిగిపోతే ఏం చేస్తారు?"
    "ఈ ట్రయిన్ కి గొలుసు సదుపాయం లేదు. ఎవరైనా మధ్యలో ట్రయిన్ ఆపాలంటే నాకు చెప్పాలి. నేను డ్రైవర్ కి సమాచారం అందజేయగలను-" అంటూ నవ్వాడు కండక్టర్.
    "అంటే మాలో ఒకరికి ఏడాది జైలు తప్పదన్న మాట-" అన్నాడు శాస్త్రి నీరసంగా.
    కండక్టరు వికటంగా నవ్వేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    "లాభంలేదు. మధ్యలో రైల్లోంచి దూకేయాలి-" అన్నాడు శర్మ.
    "అలా చేస్తే ఏ కాళ్ళో చేతులో విరుగుతాయి. అప్పుడు నెలల తరబడి హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. అంతకంటే ఏడాది జైలే నయం-" అన్నాడు శాస్త్రి.
    అతడి పక్కనున్నతను "బాబూ, నాకు తెలియ కడుగుతాను. ఇంత స్పీడుగా వెడుతున్న రైల్లోంచి దూకాడంటే మనిషి చచ్చిపోతాడా, కాలూ చెయ్యి మాత్రమే విరుగుతుందా?" అనడిగాడు.
    శాస్త్రి అతడి వంక క్షణం పరిశీలనగా చూసి, "ఏదీ మీ చెయ్యోసారిలా పారేయండి" అన్నాడు. అతని చేతినే కాక కాలు కూడా పరీక్షించాడు. అతడు పంచె ధరించి ఉండడంవల్ల ఇంచు మించు తొడల వరకూ పరీక్షచేశాడు. తర్వాత ఓ క్షణం పెదవి విరిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS