Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 64


    "ఎందుకని?"
    "తన సబార్డినేట్సంటే విజయ్ కు బాగా చిన్నచూపు. నీవంటి వారితో తిరిగే ఆడవారిని కన్నెత్తి చూడ్డానిక్కూడా అతడసహ్యించుకుంటాడు. అందువల్ల విజయ్ కు సంబంధించినంతవరకూ అనివైపులనుంచీ నాకు ద్వారాలు మూసుకుని పోయాయి...."
    ఈ మాటలు నాకు చాలా అవమానంగా తోచాయి.
    విజయ్ కి సబార్దినేటు నైనంత మాత్రాన నేను మనిషిని కానా? నన్ను పలకరించిన ఆడవాళ్ళు మైలపడిపోతారా?
    పెద్దవాళ్ళంతా చేరి కులతత్వాన్ని ఎద్దేవా చేస్తారు కానీ-కులతత్వం డబ్బులోనూ, అధికారంలోనూ వుంది. ఈ రెండూ వున్నవాళ్ళకు లేనివాళ్ళు అంటరానివాళ్ళు.
    "విజయ్ కు నచ్చజెప్పుకో-నేను వచ్చిన పని వేరని చెప్పు...."
    "ఆ అవకాశమూ పోయింది. నువ్వు కట్టుకున్న లుంగీ నేను విజయ్ కోసమని ప్రత్యేకంగా కొన్నాను. అది తనకోసమే వాడతానని చెప్పాను. నిన్ను విజయ్ ఆ లుంగీతో చూడనే చూశాడు. ఇదంతా చూస్తే ఎవరో తెలివిగా ఆడించిన నాటకంలాగుంది. లేకుంటే ఈ సమయంలో ఫోన్ చేయకుండా విజయ్ రావడమేమిటి?" అంది మాధురి.
    "ఇందులో యెవరి నాటకమూ లేదు. నువ్వే నన్ను స్వయంగా నీయింటి కాహ్వానించావు-...." అన్నాను.
    "ఆహ్వానిస్తే ఆహ్వానించి వుండొచ్చు. కానీ నువ్వు నేనెవరో తెలియకుండా నాపేరెలా చెప్పగలిగావు? ఎవరో నిన్ను పంపారు.....అవునా?" అంది మాధురి.
    "నన్నెవరు పంపుతారు?" అన్నాను తడబడుతూ.
    "అవునూ-నువ్వు విజయ్ కంపెనీలోనే కదా పని చేస్తున్నావు. అంటే సూర్యప్రభ నీ కొలీగే అయుండాలి. అదే నిన్ను పంపి ఉంటుంది. విజయ్ ని తనక్కాకుండా చేశానని దానికి నామీద మహామంటగా వుంది. నాకూ విజయ్ కీ చెడగొట్టడానికి అది వేసిన పథకంలో భాగానివి నువ్వు...." అంది మాధురి కోపంగా.
    ఇప్పుడు నాక్కూడా సూర్యప్రభమీద అనుమానం కలిగింది. తప్పకుండా ఇదామే పథకమే! తన అవసరానికి చాలా తెలివిగా ఆమె నన్నుపయోగించుకుంది.
    విషయం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. విజయ్ కు పెళ్లైందని నాకు తెలుసు. అతడికిద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురి వయసు పన్నెండు. చూడ్డానికి పదహారేళ్ళ పిల్లలా వుంటుంది. రెండో కూతురికి పదేళ్ళు.
    అలాంటి విజయ్ తను తప్పుదారిన నడుస్తూ తన ఉంపెడుకత్తె నీతి తప్పకూడదనుకుంటున్నాడు. ఇది డబ్బతడికిచ్చిన అవకాశం!
    "మాధురీ! సూర్యప్రభ నాకు కొలీగ్ కావచ్చు. కానీ ఆమె చాలా అహంకారి. మేమిద్దరం యెప్పుడూ మాట్లాడుకోనైనా లేదు. నేను నిన్ను బీచ్ వద్ద పలకరించి పక్కన కూర్చున్నాను. అంతవరకూ నా తప్పు. అటుపైన నీదే తప్పు! నన్నాహ్వానించి నాలో ఆశలురేపి నన్నిప్పుడు నిందిస్తున్నావు. నువ్వు రమ్మంటేనే కదా నీ యింటికొచ్చాను. నీవిచ్చావనేకదా ఈ బట్టలు కట్టుకున్నాను...." అన్నాను.
    "అవును.....నీలో నాకలాంటి ఆకర్షణ అగుపడింది. ఆ ఆకర్షణకులోనై నిన్ను నా ఇంటికి తీసుకుని వచ్చాను" అంటూ మాధురి నన్ను సమీపించింది. బాగా దగ్గరగా వచ్చింది.
    ఆమె దుఃఖంలో ఉందని నాకు తెలుసు. ఆమెకు ముఖ్యమయిన ప్రియుడు డబ్బున్న విజయ్ అనీ నాకు తెలుసు. అయినా లవర్స్ సెంట్ ప్రభావంతో ఆ అందాల యువతి ఒక్కసారి నా వశమైతే నేను తప్పక ఆనందిస్తాను. అందుకే ఆమె సామీప్యం నాలో మళ్ళీ ఆశలను చిగురింపజేసింది.
    "ఎందుకలా భ్రమపడ్డానో నాకర్ధంకావడంలేదు. నాకు నువ్వంటే యేవిధమైన ఆకర్షణా కలగడంలేదు. అంతా నా దురదృష్టం. తఃక్షణం యిక్కన్నించి వెళ్ళిపో!" అంది మాధురి ఉన్నట్లుండి తీవ్రంగా.
    నేను తెల్లబోయి-"ఏమంటున్నావ్?" అన్నాను.
    "గెటౌట్!" అంది మాధురి.
    ఏ బట్టలతో ఆ యింట్లో అడుగుపెట్టానో అదే బట్టలతో మళ్ళీ బయటకు వెళ్ళాను. ఇంక సూర్యప్రభ దగ్గర క్కూడా వెళ్ళలేదు.
    
                                                      6

    ఇల్లు చేరేసరికి టైము తొమ్మిదయింది. శ్రీమతి గుమ్మంలోనే ఎదురై-"ఎక్కడకు వెళ్ళారూ?" అంది.
    నేను మాట్లాడకుండా బట్టలు మార్చుకున్నాను.
    "అదోలాగున్నారేంటండీ...." అంది శ్రీమతి.
    నేను బదులివ్వలేదు. భోంచేసి పడుకున్నాను. శ్రీమతి గిన్నెలూ అదీ సద్దుకుని నా పక్కలో చేరి-"ఏమయిందండీ-అదోలాగున్నారు...." అంది.
    "ఏమీలేదు. రొంపపట్టేలాగుంది. అంతే!" అన్నాను.
    ఆ తర్వాత శ్రీమతి నన్ను పలకరించలేదు. తను చాలా తొందరగా నిద్రపోతుంది.
    నా బుర్రలో మాత్రం రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి.
    లవర్స్ సెంట్ వ్యవహారం విచిత్రంగా వుంది.
    సూర్యప్రభ నేను తనింటికి వచ్చానని అసహ్యించుకుంది. నాకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకుంది. కాఫీలో నిద్రమాత్రలు వేసింది. నన్ను వీణపెట్టెలో ఉంచాలనుకుంది. అప్పుడామె నాకు బాగా దగ్గరగా వచ్చింది. లవర్స్ సెంటు పనిచేసింది. మనసు మార్చుకుంది. ఆమెకు నేనంటే ఆకర్షణ కలిగింది. తను నాకు వశమై పోవాలనుకుంది. కానీ ఆడబుద్ధి!
    నా కారణంగా తను తన కార్యం సాధించాలనుకుంది. అంటే ప్రతిఫలం లేకుండా ఆమె నాకు వశంకాదల్చుకోలేదు.
    నన్ను మాధురి వద్దకు పంపించింది. నేను మాధురి యింట్లో ఉండగా విజయ్ కు కబురందించింది.
    అదలాగుంచితే మాధురి కూడా లవర్స్ సెంట్ ప్రభావానికి గురైంది. నన్ను తనింటి కాహ్వానించింది. అయితే నేను స్నానంచేసి వచ్చేక ఆమెకు నాపై ఆకర్షణపోయింది. అందుకు కారణం విజయ్ వచ్చి వెళ్ళడం కాదు. నేను చేసిన స్నానం-ఆపైన వాడిన లవండర్ డ్యూ  సబ్బు-నా వంటికున్న లవర్స్ సెంట్ పరిమళాన్ని పోగొట్టాయి. అందుకే మాధురి నన్ను గెటౌట్ అంది.
    లవర్స్ సెంట్ పరిమళం నా వంటికి లేదు. కాబట్టే నేనూ సూర్యప్రభ యింటికి వెళ్ళలేదు. ఆమె కూడా నన్ను గెటౌట్ అనే ప్రమాదముందని నాకు తెలుసు.
    ఇంతకీ నన్ను కొన్ని అనుమానాలు పట్టి పీడిస్తున్నాయి. లవర్స్ సెంట్ కు నిజంగా ప్రేమికుల నాకర్షించే శక్తి ఉందా? సూర్యప్రభ ఆ శక్తికి ఆకర్షించ బడిందా? మాధురి కూడా ఆ శక్తికే ఆకర్షించబడిందా?
    మాధురి నన్నే ఉదేశ్యంతో తనింటికి పిలిచింది. లవర్స్ సెంట్ గురించి ఆమెకు తెలుసా? తనా ప్రభావానికి గురై నాచే ఆకర్షించబడుతున్నానని ఆమె గ్రహించిందా? ఇంటికి వెళ్ళాక ఆమె నన్ను స్నానం చేయమంది. లవర్స్ సెంట్ ప్రభావం పోవడానికే ఆమె అలా చెప్పిందా?
    ఎక్కడో యేదో తిరకాసుందని నా కనిపించినా ఒక్క విషయం నాకు సంతోషంగా ఉంది. లవర్స్ సెంటు రాసుకుని వెళ్ళి నేను నవ్వులపాలు కాలేదు. మాధురి నన్నవమానించినా అందుక్కారణం లవర్స్ సెంటు కాదు.
    రేపు నేనేంచేయాలీ అన్నది కూడా నాకు తోచడం లేదు. ఆఫీసుకు వెడితే విజయ్ ఏమంటాడు?
    ఆలోచనల మధ్య యెప్పుడో నాకు నిద్రపట్టింది. అందులో మంచి కల. ఎందరో ఆడపిల్లలు నావంటి కున్న లవర్స్ సెంటు పరిమళానికాకర్షించబడి నావైపు పరుగున వస్తున్నారు. అప్పుడున్నట్లుండి మురళీనాధం వినిపించింది. ఆడపిల్లలంతా అటు తిరిగారు.
    మురళిని వాయిస్తున్నది శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అచ్చం విజయ్ లాగున్నాడు.
    అంతే! మంచి కల కాస్తా పీడకలగా మారిపోయింది.

                                     7

    ఉదయం లేచి స్నానానికి వెడుతున్నప్పుడు నాకు లవర్స్ సెంటు గుర్తుకొచ్చింది. అది భద్రంగా శ్రీమతికి కనబడకుండా అల్మారాలో నా బట్టలకు మూలగాపెట్టి ఉంచాను. శ్రీమతికి కనబడి అది వాడిందంటే తనంటే నాకు ఆకర్షణ పుట్టుకొచ్చేస్తుందేమోనని నాకు భయం. ఎందుకంటే ప్రస్తుతం నాకు మంచి అవకాశాలు దొరికే లాగున్నాయి. భార్యపట్ల ఆకర్షణ పెరిగితే పరాయి ఆడదాని గురించి ఆలోచించడం కూడా కష్టమవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS