టికెట్ లేని పెద్దమనుషులు
వాల్తేరులో ట్రయినెక్కారు శాస్త్రి, శర్మ వారి ప్రయాణం విజయవాడదాకా.
వాళ్ళెక్కిన ట్రయిన్ కొత్తగా వచ్చింది. వాల్తేరు నుంచి విజయవాడ దాకా ఎక్కడా ఆగకుండా పోతుందది. ప్రయాణ సమయం అయిదు గంటలు. ఆ ట్రయిన్ కి మొత్తం ఎనిమిది కంపార్టుమెంట్సు. ప్రతి కంపార్టు మెంట్ కీ ఓ కండక్టరుంటాడు. ఎక్కడా ఆగని ట్రయిన్ కాబట్టి టికెట్ లేకుండా ఎక్కేవాళ్ళకి ఆ ట్రయిన్ గొప్పదే. అయితే అందులో పట్టుబడిన వాళ్ళకి ఏడాది ఖైదు వుంటుంది.
ట్రయిన్ కదిలి వేగం పుంజుకుంది. శర్మ సామాన్లుంచుకునే బెర్త్ ఎక్కి పడుకుని పుస్తకం చదువుకుంటున్నాడు. శాస్త్రి కాసేపు ట్రయిన్లో వున్నవాళ్ళనీ, కాసేపు ప్రకృతి సౌందర్యాన్నీ చూస్తున్నాడు. అదృష్టమో, దురదృష్టమో అతడికి దగ్గర్లో అందమైన ఆడపిల్లలు లేరు.
ట్రయిన్లోకి చూస్తున్నపుడు శాస్త్రికి దూరంగా ఉన్నా తమవైపే చూస్తూ వస్తున్న కండక్టర్ కనబడ్డాడు.
"డోయ్ డోయ్ డోయ్ డోయ్ వస్తున్నాడోయ్...." అంటూ పాడాడు శాస్త్రి.
ఆ పాట వింటూనే శర్మ బెర్తుదిగి ఏదో పనివున్న వాడిలా చటుక్కున్న చకచకా లెట్రిన్ వైపు దూసుకుపోయాడు.
కండక్టర్ సమీపించి టికెట్సు అడిగాడు.
"వస్తూనే నన్నడుగుతా రేమిటి సార్ - ఇంతమందిలో నే నొక్కడినే కనబడ్డానా?" అన్నాడు శాస్త్రి. అతడి వేషం డాబుగా ఉండడంవల్ల అతడి జోక్ కు అక్కడున్నవారంతా నవ్వారు.
కండక్టరుకి మాత్రం ఆ జోక్ నచ్చలేదు. "నా యిష్టం వచ్చిన వారిని నే నడుగుతాను. టికెట్ చూపించండి" అన్నాడు కోపంగా. శాస్త్రి జోక్ వేయకపోతే అతడి కంత కోపం వచ్చి ఉండేది కాదు.
"లేదు సార్!" అన్నాడు శాస్త్రి.
"టికెట్ లేకుండా ట్రయినెక్కావా?" అన్నాడు టికెట్ కండక్టర్.
"ఏమిటి సార్ వింతగా అడుగుతారు. టికెట్ లేకుండా ఇన్ని సార్లు రైలెక్కాను" అంటూ జుట్టు చూపించి "కానీ ఎవ్వరూ నన్ను మీకులా అడగలేదు. అయినా మీ కీ ఉద్యోగం కొత్తాండీ" అన్నాడు శాస్త్రి.
కండక్టర్ కి ఉద్యోగం నిజంగా కొత్త ఏమో - అతను కాస్త తడబడ్డాడు. "కొత్తో పాతో మీ కెందుకు? టికెట్లయినా చూపించండి. లేదా ఫైన్ కట్టండి."
"ఫైన్ కట్టడ మెందుకూ?" అన్నాడు శాస్త్రి.
"టికెట్ దగ్గర లేకుండా ప్రయాణం చేయడం నేరం" అన్నాడు కండక్టర్.
"ఒక్క చిన్న సందేహం సార్ - మొగుడూ పెళ్ళాం ప్రయాణం చేస్తున్నారనుకోండి. ఇద్దరూ చెరో టికెట్టూ దగ్గరుంచుకుంటారా - లేక రెండూ ఎవరో ఒకరి దగ్గిర ఉంటాయా?" అన్నాడు శాస్త్రి.
"ఒకరి దగ్గరే వుంటాయి" అన్నాడు కండక్టర్ సీరియస్ గా.
"మరి రెండోవాళ్ళ దగ్గర టికెట్ లేనట్లేగా - అది నేరమేనా?" అన్నాడు శాస్త్రి.
"ఏడిసినట్లుంది. టికెట్ కొనడం ముఖ్యం. దగ్గరుంచుకోవడం ముఖ్యం కాదు."
"చూశారా సార్ - మరి నేనూ టికెట్ కొన్నాను. కానీ దగ్గ్రరుంచుకోలేదు" అన్నాడు శాస్త్రి.
చుట్టూ వున్న వారి కిది వినోదంగా ఉంది. శాస్త్రి మాటలు వింటూనే అంతా గొల్లుమన్నారు.
కండక్టర్ కోపం తారాస్థాయి చేరుకుంది. "టికెట్ కొన్నట్లు సాక్ష్యం కావాలి" అన్నాడు.
"సాక్ష్యాని కేముంది సార్! కోర్టుకి పాతిక మందిని తీసుకొస్తాను" అన్నాడు శాస్త్రి మళ్ళీ అంతా నవ్వారు.
"ఆ సాక్షుల కిచ్చే డబ్బులో పదో వంతిస్తే వాల్తేరు నించి విజయవాడకు నాలుగు టికెట్లు కొనచ్చు."
"భలేవారే సర్ ఇలా అని మీరు నన్నూ నా స్నేహితుల్నీ కూడా అవమానిస్తున్నారు. మీ మాటల అర్ధం నేను టికెట్ కొనలేదని నా స్నేహితులు సాక్ష్యానికి డబ్బుచ్చుకుంటారని.... ...."
"ఆపవయ్యా నీ రొద. నువ్వు టికెట్ కొంటే సరిపోదు. నాకు చూపించాలి" అన్నాడు కండక్టర్.
"బాగుందండీ మీరు పెళ్ళి చేసుకున్నానంటే సరి పోదూ, అది నా ముందు ఋజువు చెయ్యాలి అన్నట్లుంది. అలా అంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?" అన్నాడు శాస్త్రి.
"ముందు టికెట్ చూపించు" అన్నాడు కండక్టర్.
శాస్త్రి పక్కనున్నవాడికేసి తిరిగి, "సార్, నేనే టికెట్ చూపించాలని పట్టుబడుతున్నా డీయన. ఓసారి మీ టికెట్టివ్వండి, ఆయనకు చూపించి మళ్ళీ యిచ్చేస్తాను" అన్నాడు.
"వేళాకోళంగా వుందా?" అన్నాడు కండక్టర్.
"మీతో నాకు వేళాకోళాలేమిటి సార్! మీ ముఖం చూస్తేనే జోకులు చచ్చిపోతాయి."
"టికెట్ ప్లీజ్!" అరిచాడు కండక్టర్.
శాస్త్రి చటుక్కున జేబులోంచి ఓ టికెట్ తీసి కండక్టర్ చేతిలో పెట్టాడు. కండక్టర్ దా న్నందుకుని చూసి "అరే, యిది ఫ్లాట్ ఫారం టికెట్" అన్నాడు.
"మీరు టికెట్ కావాలన్నారు, నే నిచ్చాను అది ఫలానా అని నాకు చెప్పలేదు."
"సరే అయితే యిప్పుడడుగుతున్నాను. వాల్తేర్ టూ విజయవాడ టికెట్ చూపించు."
"లేదు."
"అయితే డబ్బులు కట్టు."
"టికెట్ కొన్నానని ముందే చెప్పాను. కొన్నాక డబ్బులు కట్టడ మెందుకు?"
"టికెట్స్ ట్రయిన్లో లేవు కాబట్టి."
"లేకేం నేను కొన్న టికెట్స్ ఈ ట్రయిన్ లోనే వున్నాయి" అన్నాడు శాస్త్రి.
"అయితే ఏవీ?"
"నా స్నేహితుడిదగ్గరున్నాయి."
కండక్టర్ ఉలిక్కిపడి, "ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా" అని, "ఇంతకీ నీ స్నేహితుడేడీ?" అన్నాడు.
"లెట్రిన్ కి వెళ్ళాడు. అతను కాస్త బ్రహ్మదేవుడు" అన్నాడు శాస్త్రి.
"సరే" అంటూ కండక్టర్ విసుక్కుని, "నీలాంటి బేరం ఒక్కటి తగిలితే చాలు. చెకింగ్ అయినట్లే" అని పక్కవాళ్ళని చెక్చేయసాగాడు.
వినోదం అప్పుడే ముగిసినందుకు అందరికీ అసంతృప్తిగా వుంది.
కండక్టర్ ఆ ప్రాంతాల్నించి బాగా ముందుకి వెళ్ళాక శర్మ తిరిగొచ్చి "వెళ్ళిపోయాడా?" అన్నాడు.
"వెళ్ళాడు. కానీ మళ్ళీ వస్తాడు" అన్నాడు శాస్త్రి.
"బండి చాలా కాళీగా వుంది. కనీసం ఇరవై సీట్లు మిగిలిపోయాయి" అన్నాడు శర్మ.
