Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 63


    అప్పుడు నేను వెంటనే-"బీచ్ కాకపోతే నీ కభ్యంతరంలేదా?" అన్నాను.
    "నా మనసులో పుట్టిన ప్రేమ నన్ను నీ చేతుల్లో చేరమంటోంది-"అంది మాధురి నిస్సంకోచంగా.
    "హేట్సాఫ్ టూ యూ లవర్స్ సెంట్!" అనుకున్నాను.
    ఇది చాలా తమాషాగా ఉంది. ముక్కూ ముఖం యెరుగని ఆడపిల్లలు ఠకీమని నా వశమైపోతున్నారు. లవర్స్ సెంట్ ఈ శతాబ్ధానికే ఓ గొప్ప డిస్కవరీ!
    "నీకభ్యంతరం లేదంటే నీకు నా ఇల్లు చూపిస్తాను" అంది మాధురి.
    "అదృష్టానికెవరైనా అభ్యంతరం చెబుతారా?" అన్నాను.
    ఇద్దరం లేచాం. ఆమె స్కూటర్ మీద నా వెనుక కూర్చుంటే అంతవరకూ యెన్నడూ చెందని ఓ కొత్త అనుభూతి నాలో కలిగింది.
    ఆమె చెప్పిన ప్రకారం వెడుతూ సరిగ్గా పది నిమిషాల్లో ఆమె ఇల్లు చేరుకున్నాము. అదో చిన్న బంగళా! బంగళాచుట్టూ పూలతోట.
    మాధురి తనే యింటి తలుపు తాళంవేసి దీపాలువేసి నన్నో సోఫాలో కూర్చోమని తను నాకెదురుగా కూర్చుంది. పక్కన కూర్చుంటే బాగుండునని ఆశపడ్డాను కానీ అడగలేదు.
    ఆమె ఎదురుగా ఉంటే కంటికి విందు. పక్కనుంటే వంటికి విందు.
    ప్రస్తుతానికి కంటికే విందుగా వుంది.
    "కాఫీయా బోర్న్ విటానా?" అందామె.
    "నొ డ్రింక్స్ ప్లీజ్!" అన్నాను సూర్యప్రభ ఇంట్లో జరిగిన అనుభవాన్ని పురస్కరించుకుని.
    "పోనీ ఏం కావాలో చెప్పు!"
    "నాకు నువ్వే కావాలి" అనేసి నా ధైర్యానికి నేనే ఆశ్చర్యపడిపోయాను. లవర్స్ సెంట్ నాలో దైర్యాన్ని మరీమరీ పెంచుకుపోతోంది. ఇది దేనికి దారితీస్తుందో!
    "అతిథి మర్యాదలో నాకు నేనే సాటి.....అందాకా ఈ పత్రిక చూస్తూండు...." అని ఆమె లోపలకు వెళ్ళింది.
    నా దృష్టి పత్రికమీదకు మరలినా ఆలోచనలు మాధురి చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. మాధురి నిజంగా నాకు అందుతుందా అన్న సంశయం నన్ను పీడిస్తోంది. మాధురి కోసం సూర్యప్రభ చేసిన సవాల్లో ఓడిపోదలిచాను. మాధురి సూర్యప్రభను మించి ఎన్నో రెట్లు అందంగా వుంది.
    మాధురి మళ్ళీ అక్కడకు రావడానికి ఓ యిరవై నిమిషాలు పట్టింది. పత్రికలోకే చూస్తున్న నేను-"ఇప్పుడు నేనెలాగున్నానో చెప్పు!" అన్న మాధురి గొంతు విని ఉలిక్కిపడి తలెత్తి చూశాను.
    అప్పుడు మాధురి మానవకాంతలా లేదు. దేవకన్యలా వుంది.
    లేత గులాబీ రంగు మాక్సీ వేసుకుందామె. అదామె వంటి రంగులో కలిసిపోయినట్లుంది. అదే రంగు బొట్టు పెట్టుకుంది. జుత్తును విరబోసుకొని అలాగే వదిలేసింది. ఆమెను చూడగానే అప్పుడే స్నానంచేసి వచ్చిందని అర్ధమవుతుంది.
    "నువ్వుకూడా స్నానం చేసిరా-ఫ్రెష్ గా ఉంటుంది" అందామె.
    ఆమె నాకు బాత్రూముకు దారి చూపించింది. అందులో అన్ని ఆధునిక సదుపాయాలూ వున్నాయి. నేను తలుపులు వేసుకోబోతుండగా మాధురి నాకు ఇస్త్రీ చేసిన పూల లుంగీ, అదే రంగు నైటీ అందించింది.
    అదృష్టమిక పూర్తిగా నన్ను వరించినట్లే!
    హాయిగా వేడినీళ్ళ స్నానం చేశాను. లవండర్ డ్యూ సబ్బుతో వళ్ళు రుద్దుకున్నాను. ఘుమఘుమలాడే టర్కిష్ టవల్ తో వళ్ళు శుభ్రంగా తుడుచుకుని లుంగీ వేసుకున్నాను. నైటీ తొడుక్కున్నాను.
    ఉరకలు వేసే ఉత్సాహంతో బాత్రూం తలుపులు తెరిచి మ్రాన్పడిపోయాను.
    అక్కడ నాకు యెదురుగా మా మేనేజరు కనిపించాడు. ముందాయన కళ్ళు కోపంతో ఎర్రగా వున్నాయి. నన్ను గుర్తించగానే ఆ కళ్ళు అదోలా రెపరెపలాడాయి. ఆయన చటుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం ఏకంగా ఇంట్లోంచే వెళ్ళిపోయాడు.
    నాకు మతిపోయినట్లయింది. ఈ యింట్లోకి మా మేనేజరెలాగొచ్చాడు? ఆయనంత కోపంగా యెందుకున్నాడు? ఆయనిక్కడ నన్ను చూడ్డంవల్ల రేపు ఆఫీసులో విశేషమేదైనా జరుగుతుందా?
    నేనలాగే నిలబడి వుండగా-"ఈ లుంగీకూడా వేసుకున్నావూ-ఇక నా పని అయిపోయింది-" అన్న మాటలు వినపడ్డాయి.
    అది మాధురి గొంతు.
    నేనీలోకంలోకి వచ్చి-"ఏం జరిగింది మాధురీ!" అన్నాను.
    "సర్వనాశనం!" అంది మాధురి.
    "అంటే?"
    "ఆ వచ్చినాయన నిన్నూ నన్నూ చూసి అనుమానించాడు...."
    "అనిమానిస్తే?"
    "బంగారు పిచ్చుక ఎగిరిపోయింది!" అంది మాధురి దీనంగా.
    "నీ మాటలు నాకేమీ అర్ధం కావడంలేదు...." అన్నాను.
    "మగాళ్ళెందరాడళ్ళాతో తిరిగినా తప్పులేదు. ఆడది రెండో మగాడితో మాట్లాడినా వాళ్ళకనుమానమే!" అంది మాధురి యేడుపు గొంతుతో.
    అసలు విషయం తెలుసుకోడానికి నాకు కాసేపు పట్టింది.
    నా మేనేజరు పేరు విజయ్. అతడికి చెప్పుకోదగ్గ స్త్రీ వ్యసనముంది. తనకు నచ్చిన స్త్రీకోసం అతడెంతైనా వెచ్చిస్తాడు. అయితే ఆ స్త్రీ పూర్తిగా అతడికే కట్టుబడి ఉండాలి.
    "అంటే నువ్వు డబ్బుకోసం ఆయన కమ్ముడు పోయావా?"
    మాధురి అదోలా నవ్వి-"అతఃదికమ్ముడుపోయి డబ్బు సంపాదిస్తాను. తర్వాత ఆ డబ్బుతో ఓ మొగుణ్ణి కొనుక్కుంటాను. తప్పా?" అంది.
    "తప్పే మరి...." అని - "నేను నీ అదృష్టంకొద్దీ యిక్కడకొచ్చి విజయ్ నుంచి నీకు విముక్తి కలిగించాను. ఇంతవరకూ నువ్వు సంపాదించింది చాలు. ఇకమీదట నీతిగా వుండు-" అన్నాను.
    "అంటే నెలకు పదివేలూ యికనుంచి నువ్విస్తావా నాకు?" ఆశగా అడిగింది మాధురి.
    "నెలకు పదివేలా?" తెల్లబోయాను.
    "అవును నాకింకా పాతికవేలు అప్పుంది. ఆ అప్పు తీరితే ఈ యిల్లు, ఫర్నిచర్ - అన్నీ నా స్వంతమై పోతాయి. ఆపైన ఒకటి రెండు లక్షలైనా రొక్కం పోగుచేయాలి. విజయ్ సావాసంలో ఇంకో మూడేళ్ళులో అన్నీ సాధించగలననుకున్నాను. కానీ నీ మూలంగా అన్నీ పాడైపోయాయి. ఇప్పుడతన్ని నా దారికి మళ్ళించా లంటే నేను చేయవలసిన కృషి ఇంతా అంతా కాదు-" అందామె.
    ఇది వినగానే ఒక్కసారిగా నేనెంతో పేదవాడినని పించింది. మాధురి నా కారణంగా బాగా నష్టపోయిన మాట నిజం. ఆమె నోదార్చడంకోసం నేనుకూడా తక్కువ నష్టపోలేదన్న విషయం ఆమెకు చెప్పాలనుకున్నాను.
    "మాధురీ! నీకంటే నేనే నష్టపోయాను...." అన్నాను.
    "ఎలా?" అందామె.
    "మా ఆఫీసులో నాకు మేనేజర్ విజయ్! నీకూ అతడికీ యిలాంటి సంబంధముందని నాకు తెలియదు. ఆఫీసులో రేపు నాకేం జరుగుతుందో...."
    మాధురి కంగారుగా-"అంటే వాళ్ళ కంపెనీలో నువ్వు విజయ్ సబార్దినేటువా?" అంది.
    "అవును..."
    "చచ్చాను. అయితే నాకిక విజయ్ ని కలుసుకునే అవకాశం లేదు..." అంది మాధురి నీరసంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS