ఉదయం చీర ఒకటి కనబడలేదుట. తను వెతుక్కుంటూంటే విషయం తెలుసుకుని పనిమనిషి వచ్చి-"అమ్మ గారూ ఈ చీర బాబుగారు నా కిచ్చేశారు" అందిట. క్రితం రోజు ఏదో పనిమీద వీధిలోంచి పోతూంటే తనే పిలిచిసూర్యం దాని కా చీర ఇచ్చాట్ట. పాతచీరే ఫరవాలేదు తీసుకోమన్నాట్ట.
"నీకూ తెలుసనుకున్నా నమ్మా" అందిట అది.
"రేపు రానివ్వండి. గుమ్మంలోపెట్టి కడిగేస్తాను. మరీ ఇంత నిలువునా అబద్దాలాడుతుందా అది?" అంది వాణి ఆశ్చర్యంగా.
సూర్యం పని పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. "మర్చిపోయా వాణీ-దానికి నిజంగానే నేను చీరచ్చాను" అన్నాడు.
వాణి మ్రాన్పడిపోయింది.
"నువ్వు గుడికెళ్ళాక అది మళ్ళీ వచ్చింది. ఇల్లు శుభ్రంగా లేదని మళ్ళీ ఊడ్చింది. దాని పనిశ్రద్ధకు ముచ్చటేసి ఏమయినా ఇవ్వాలనిపించింది. అది చీర కావాలంది. ఇచ్చేశాను" అన్నాడు సూర్యం.
వాణి కళ్ళు అనుమానంతో, భయంతో పెద్దవయ్యాయి. "దాన్నిచూసి నేనుండగా ఎప్పుడూ ముచ్చటపడినట్లు లేదు. నేను లేనప్పుడు ముచ్చటెందుకు వేసిందీ!"
సూర్యం కాస్త చిరాగ్గా "కైలాసం దగ్గర చందనం పెన్ను చూసినప్పుడు" అన్నాడు.
"కైలాస మేమిటి-చందనం పెన్నేమిటి?" అంది వాణి అర్ధంకాక.
"కైలాసం నీకు తెలుసు. చందనం పెన్నంటావా అది నువ్వు తనకిచ్చావని వాడు చెప్పాడు" అన్నాడు సూర్యం.
భార్యా భర్త లిద్దరూ కాసేపు దెబ్బలాడుకున్నారు. సూర్యం గసిరాడు. వాణి ఏడ్చింది. ఈ కొత్త వాతావరణంలో ఇమడలేక పిల్లలిద్దరూ భయపడి మూలకుపోయారు.
ఓ వారంరోజు లిలాగే గడిచాయి. భార్యా భర్తలిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. ఇంట్లోంచి చిన్నా, చితకా, చిల్లర వస్తువులూ, డబ్బులూ పోతున్నాయి. భార్యా భర్తలకు దెబ్బలాడుకుందుకే సరిపోతోంది.
వాణి పనిమనిషి మాన్పించేయాలంటుంది. సూర్యం వద్దంటాడు. చూసీ చూడకా త్రిలోకసుందరి అతడికి సరదాలు తీరుస్తోంది.
ఇలా మరికొన్ని రోజులు గడిచాయి.
"మీకు పనిమనిషి ముఖ్యమా-నేను ముఖ్యమా" అని నిలేసింది వాణి ఒకరోజున.
"నీకు దాన్ని తీసేయడం ముఖ్యమా? నేను ముఖ్యమా" అన్నాడు సూర్యం.
"అదుండాలన్న పట్టుదలెందుకు మీకు? దానిమీద మోజు కాకపోతే-" అంది వాణి.
"కట్టుకున్న మొగుడ్ని ఆమాత్రం నమ్మలేని ఆడదానివి నిన్ను నేనెలా నమ్ముతాను?" అన్నాడు సూర్యం.
వాణికి భర్త తన అదుపు తప్పుతున్నాడని తోచింది. ఆమెకింకే దారీ తోచలేదు. అతడినెలా దారికి తీసుకురావాలో తెలియలేదు. చివరి కామె ఇంటికి ఉత్తరం రాసింది. అటు అత్తగారికీ, ఇటు తల్లికీ కూడా ఆమె ఉత్తరాలు రాసింది. దాంతో అట్నించీ ఇట్నించీ ప్రతినిధులు వచ్చారు. అత్తగారి తఃరఫున ఆడపడుచూ, తల్లితరఫున మరదలూ అక్కడకు వచ్చారు.
వాళ్ళక్కడ వారం రోజులుండి విషయాలన్నీ కూపీ తీశారు. నిజం లాగడంకోసం వాళ్ళు త్రిలోకసుందరికి దండిగా లంచాలుకూడా ఇచ్చారు. చివరికి అది వాళ్ళకు అసలు సంగతి చెప్పేసింది.
"నన్ను పరీక్షించాలని ఆయమ్మ పదిరూపాయలు గదిలో పడేసింది. ఆ తర్వాతనుంచి నేనూ వాళ్ళను పరీక్షించడం మొదలు పెట్టాను. డబ్బులేదు కాబట్టి నాకు నీతీజాతీలేదు. మరి డబ్బున్న మీ సంగతేమిటి? మీరు ప్రోత్సహిస్తేనే గదా మేం తప్పులు చేసేది? అన్నింటికీ మమ్మల్ననుకోవడమెందుకు? నన్ను మనస్ఫూర్తిగా నమ్మి ఈ ఇల్లప్పగించమనండి. అందర్నీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను అనుమానిస్తే వాళ్ళలో వాళ్ళకే అనుమానాలు పెట్టి నా పబ్బం గడుపుకుంటాను" అంటూ అది క్లుప్తంగా జరిగింది చెప్పింది. తనకూ సూర్యానికీ ఏర్పడిన సంబంధమాత్రం చెప్పలేదది.
చందనం పెన్నుకథ ఎలా తయారయిందో తెలిసేసరికి సూర్యానికి తనంటే తనకే అసహ్యం వేసింది.
మర్నాడే త్రిలోకసుందరికి ఉద్వాసన చెప్పడం జరిగింది. వెళ్ళేటప్పుడు త్రిలోకసుందరి-"మీ ఇంటినుంచి ఆడవాళ్ళను రప్పించావు కాబట్టి మీ సమస్యతేలింది. అదే మగాళ్ళను రప్పించివుంటేనా ఈ ఇంట్లో ఇంకో ఇరవై ఏళ్ళు రాజ్యమేలేదాన్ని" అంది వాణితో.
ఆ మాటల్లోని భావం మాత్రం వాణికి ఇప్పటికీ అర్ధం కాలేదు.
-:అయిపోయింది:-
