Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 62


    "థాంక్స్-నేనూ కంపెనీకోసం చూస్తున్నాను-" అంటూ సూర్యప్రభ లేచి వెళ్ళి వీధి తలుపులు వేసివచ్చింది.
    అప్పుడే లవర్స్ సెంటు పనిచేస్తోందా అన్న అనుమానం నాక్కలిగింది. కానీ నేనప్పుడే బయటపడదల్చుకోలేదు.
    సూర్యప్రభ నాకోసం కాఫీ కలిపి తెచ్చింది. నేను తాగాను. అప్పుడామె నా పక్కనే కూర్చుని-"కాఫీ బాగుందా?" అనడిగింది.
    "నీకంటే కాదు..." అన్నాను చటుక్కున.
    "ప్లీజ్ - నన్ను పొగడొద్దు-"అంది సూర్యప్రభ.
    "ఎందుకని?"
    "నన్ను పొగిడే మగాడిని చంపబుద్ది వేయదు నాకు."
    "అంటే?"
    అప్పుడు సూర్యప్రభ లేచి ఓ మూలగా వున్న పొడువాటి పెట్టెను నా ముందుకు లాక్కుని వచ్చింది. పెట్టి మూత తెరిచి అందులోని వీణను తీసి లోపలెక్కడో పెట్టి వచ్చింది.
    "చూశావా-పెట్టి కాళీచేశాను...." అంది సూర్యప్రభ.
    "ఎందుకు?" అన్నాను.
    "తర్వాత తెలుస్తుందిలే!" అందామె.
    నేను మాట్లాడలేదు. ఉన్నట్లుండి నన్ను మత్తు ఆవహించసాగింది. కాళ్ళూ చేతులూ స్వాధీనం తప్పసాగాయి.
    "నాకేదో అవుతోంది-" అన్నాను కంగారుగా.
    "కంగారుపడకు. కాఫీలో నిద్రమాత్రలు కలిపాను. నిన్నీ పెట్టెలో పెట్టి భద్రంగా నీ యింటికి చేరవేసే పూచీ నాది-" అంది సూర్యప్రభ.
    ఏమో అందామనుకున్నాను కానీ నిద్ర ముంచుకొచ్చేసింది.

                                                          4

    నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి గదిలో బల్బు వెలుగుతోంది. నేను మంచంమీద పడుకొని వున్నాను. ఏం జరిగిందీ గుర్తుచేసుకుందుకు ప్రయత్నించే లోగా-"మెలకువొచ్చిందా?" అన్న గొంతు వినబడి ఉలిక్కిపడి అటు తిరిగాను.
    సూర్యప్రభ!
    అది సూర్యప్రభ బెడ్ రూం. నేను ఆమె బెడ్ మీద పడుకొని వున్నాను. ఆమె గది గుమ్మం దగ్గరుంది. అయితే ఆమె ఇందాకటిలా లేదు. ఫుల్ మేకప్ లో నేనాఫీసులో చూసే అందాల దేవతలాగుంది.
    అప్పుడు నాకంతా గుర్తుకొచ్చింది.
    "నువ్వు నన్ను మా యింటికి పంపలేదా?" అన్నాను.
    "పంపాలనే అనుకున్నాను. నిన్ను వీణపెట్టిలోనికి తరలించాలనుకునేసరికి యేమిటో ఉన్నపళంగా నీవంటే యేదో ఆకర్షణ బయల్దేరింది. నీతో మాట్లాడి నీ మనసు తెలుసుకోవాలనిపించింది-" అంది సూర్యప్రభ.
    నాక్కలిగిన ఉత్సాహమింతా అంతా కాదు. అంటే లవర్స్ సెంట్ పనిచేసిందనే అనుకోవాలి. ఆ సెంటు కనిపెట్టిన సైంటిస్టుకు శతాధికాభివందనాలు!
    నేను లేచి కూర్చుని-"నా మనసు తెలుసుకోవడమంటే?" అన్నాను.
    "నువ్విక్కడి కెందుకొచ్చినట్లు?" అందామె.
    "నిన్ను చూడాలని!"
    "నన్నే యెందుకు చూడాలనుకున్నట్లు?"
    "ఏమో-చెప్పలేను....."
    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అందామె.
    "ఊఁ."
    "కానీ నీకు పెళ్ళయింది కదూ...."
    "అవును. అది నా దురదృష్టం...."
    "నీ పెళ్ళానికి విడాకులిస్తావా?"
    "ఇవ్వలేను. అదీ నా దురదృష్టమే!"
    "నీ దురదృష్టాలు నాకు నచ్చలేదు కానీ నీ నిజాయితీ చాలా నచ్చింది-"
    ఆమె మెప్పుకోలు వినగానే నాకు రంగారావు గుర్తు కొచ్చాడు. ఆడది మోసానికి లొంగదు కానీ నిజాయితీకి లొంగుతుంది-అన్నాడతను. అది నిజమవుతోంది.
    "నీతో మాట్లాడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు ధైర్యంచేశాను-"అన్నాను.
    "ఇప్పటికైనా మంచి పనిచేశావు. నాకూ నువ్వంటే యిష్టమే!" అంది సూర్యప్రభ.
    నాకు చాలా ఉత్సాహం కలిగింది-"థాంక్స్!" అన్నాను.
    "ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. మగాడు స్వార్ధంతో ప్రేమిస్తాడు. అవునా?" అంది సూర్యప్రభ.
    "నాకు స్వార్ధంలేదు...." అన్నాను.
    "ఋజువు చేసుకోగలవా-అవకాశమిస్తాను!" అంది సూర్యప్రభ.
    ఆ రోజుబీచ్ వద్ద ఓ అమ్మాయిని కలుసుకోవాలి. ఆమె పేరు మాధురి. మనిషి వగలాడి. ఆమెతో రెండు గంటలు గడిపి పవిత్రంగా ఉండాలి. అప్పుడు సూర్యప్రభ నా ప్రేమను నమ్ముతుంది.
    సూర్యప్రభ నాకా అమ్మాయి ఫోటో కూడా యిచ్చింది. ఫోటోలో అమ్మాయి సూర్యప్రభకంటే వెయ్యిరెట్లు బాగుంది. అందువల్ల ఈ పందెంలో ఓడినా గెల్చినా నాకు ఆనందమే!

                                     5

    సరిగ్గా ఏడుంపావుకి నేను బీచ్ దగ్గరున్నాను. సూర్యప్రభ చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నాక మాద్రిని కనిపెట్టడం నాకు పెద్ద కష్టం కాలేదు.
    ఆమె ఒంటరిగా కూర్చుని ఇసుకలో చేత్తో గీతలు గీస్తోంది.
    నేనామెను సమీపించి-"హలో-మీ పేరు మాధురి కదూ!" అన్నాను.
    ఆమె తెల్లబోయి నా వంక చూసింది. అప్పుడామె అందాన్ని మాటల్లో వర్ణించి చెప్పలేను. ఫోటో ఆమె అందంలో నూరోవంతు కూడా పట్టుకోలేకపోయింది.
    "నా పేరు మీ కెలా తెలుసు?" అందామె.
    "మిమ్మల్ని చూడగానే మీకాపేరొక్కటే తగుననిపించింది...."
    "అబద్ధం-ఇంత కచ్చితంగా నా పేరూహించారంటే మీకింకా యేమో తెలిసుండాలి-...." అందామె అనుమానంగా.
    "ఇఫ్ యూ డోంట్ మైండ్" అంటూ ఆమె పక్కన కూర్చున్నాను.
    ఆమె యిబ్బందిగా ముఖం పెట్టింది.
    "ఒక్కన్నీ బీచ్ కొచ్చాను. యేం తోచడంలేదు. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లనిపించింది. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని తర్వాత యెవరికి వారే యమునాతీరే అన్నట్లు విడిపోవచ్చు! మీకిబ్బందని పిస్తే చెప్పండి-యిప్పుడే లేచి వెళ్ళిపోతాను....." అన్నాను.
    "నో.....నో...ఇట్సాల్ రైట్-"అందామె మొహమాటంగా.
    నేను కబుర్లు ప్రారంభించాను.
    ఆమెకూడా సూర్యప్రభకిలాగే ఒంటి పక్షి. ముందు మొహమాటం చూపించినా తర్వాత హుషారుగానూ చలాకీగానూ మాట్లాడింది. ఆమె మాటలు వింటూంటే ఆమెను వగలాడి అనడంలో తప్పులేదనిపించింది. ఆమె అమాయకత్వాన్ని మోతాదుకు మించి నటిస్తోంది.
    ఉన్నట్లుండి ఆమె-"మీలో ఏదో ప్రత్యేకత నన్నా కర్షిస్తోంది-" అంది.
    "ఓహో-సెంటు పనిచేస్తోందన్న మాట-'అనుకున్నాను. పైకి ఆమెతో-"మిమ్మల్నాకర్షించి ధన్యమైన ఆ ప్రత్యేకథ యేమిటో నాకు తెలుసుకోవాలనుంది....." అన్నాను.
    "చెప్పలేను కానీ మనం ఒకరికొకరు మన్నించుకో వద్దు-" అందామె.
    "ఎందుకని?"
    "ఐ లవ్ యూ...."
    ఆమె తీయని పెదవుల మధ్యనుంచి వెలువడిన ఆ అక్షరాల నందుకోవాలని గాలిలోకి చేతులు సాచాను. ఆమె నన్నపార్దం చేసుకుని-"ఇది బీచ్!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS