Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 61


    త్రిలోకసుందరి బట్టలుతుకుతూ ఆమె చెప్పేవన్నీ ప్రశాంతంగా వింది.
    అప్పటికి వాణి ఆవేశం తగ్గి వాస్తవంలోకి వచ్చింది. నిజంగా తన భర్త తెగిస్తే తనేం చేయగలదు? అతడి నల్లరిపెట్టడంవల్ల తను అల్లరిపడి నలుగురిలోనూ లోకువవడం తప్ప ప్రయోజనం లేదు.
    "నేనేమీ నీతిలేని దాన్ని కాదమ్మా-ఇంకోసారి చెయిపట్టుకుంటే పదితో వదలిపెట్టను. పాతి కడుగుతాను-" అంది త్రిలోకసుందరి.
    దాని పని పూర్తయ్యేసరికి వాణికి కళ్ళమ్మట నీళ్ళ పర్యంతం అయింది. ఆమెకేమీ గత్యంతరం తోచలేదు.
    త్రిలోకసుందరి ఎంతటి ప్రమాదకరమైన మనిషో అప్పటికి అర్ధమయింది వాణికి. అయితే దాన్ని మానిపించడమమెకు ఇష్టంలేదు. ఆవిధంగా చుట్టుపక్కల తను లోకువయి పోతుంది. అందరి మాటలూ కాదని తను దాన్ని పెట్టుకుంది. ఈ మాత్రం సాధించలేదా తను.
    ఆత్మస్థయిర్యం కోసం వాణి గుడికి వెళ్ళింది. నాలుగేళ్ళ కుర్రాణ్ణి కూడా తీసుకెళ్ళింది. రెండేళ్ళ బాబును నిద్రోపెట్టింది. భర్త ఇంట్లోనే వుండిపోయాడు. వాణి తిరిగి వచ్చేలోగా త్రిలోకసుందరి ఆ ఇంటికి వెళ్ళింది.
    "అమ్మగారు లేరా?" అంది.
    "గుడికివెళ్ళింది అన్నాడు.
    త్రిలోకసుందరి గదిచూసి-"వెళ్ళేటప్పుడు ఊడ్చి వెళ్ళాను. అప్పుడే ఇలాగయిపోయిందేంటి బాబూ-" అంటూ పైటతీసి మొలచుట్టూ చుట్టి దోపింది. చీపురు మూలనుంటే అందుకుంది. అది ఇల్లూడుస్తూంటే సూర్యం ఆలోచనలు పరిపరివిధాల పోయాయి. అతడివళ్ళు కాస్త వేడెక్కింది. రోజూచూసే త్రిలోకసుందరి రూపమూ, ఆమె ఇల్లూడ్చేటప్పుడు వంగినతీరూ ఆ వేడిని పెంచుతున్నాయి. వాణి గుడికి వెళ్ళింది. అది యెవరో పదేపదే తనకు చెవిలో చెబుతున్నట్లు అనిపించింది అతనికి.
    ఇల్లూడుస్తూ త్రిలోకసుందరి సూర్యాన్ని సమీపించి "కాళ్ళు కాస్త పైకి తీసుకోండి బాబూ" అంది.
    సూర్యం పడక్కుర్చీలోంచి లేచినిలబడి దానికి కాస్త వెనకగా వెళ్ళాడు. అతని శరీరం వణుకుతోంది.
    త్రిలోకసుందరి చటుక్కున నిటారుగా నిలబడి-"బాబూ నేను మీకో రహస్యం చెప్పాలని వచ్చాను-" అంది.
    "ఏమిటది?"
    త్రిలోకసుందరి అతడి ముఖంమీదకు వంగింది, చక్కటి పరిమళం గుప్పుమంది.
    సూర్యం అది చెప్పేది వినకుండా చటుక్కున కౌగలించుకున్నాడు.
    "ఇదేంటి బాబూ-" అంది త్రిలోకసుందరి వదుల్చుకునే ప్రయత్నం చేయకుండా.
    ఆ స్పర్శలో, ఆ కౌగిలిలో సూర్యం కొత్త ఆనందం అనుభవిస్తోన్నాడు. త్రిలోకసుందరి వాణికంటే ఆరోగ్యంగా వుంది. వయసుకు ఆరిగ్యం మరింత ఆకర్షణ. అందులోనూ అది పరాయి ఆడది.
    "అబద్దమాడకు. నువ్వే నన్ను రెచ్చగొట్టావ్-" అన్నాడు సూర్యం.
    "నేను రెచ్చగొడితే మీరు రెచ్చిపోవాలా?"
    "ఊఁ" అన్నాడు సూర్యం తన బంధాన్నింకా బిగిస్తూ.
    "భలేవారే" అంది త్రిలోకసుందరి.
    "మరి నీ కిష్టమేనా?" అన్నాడు సూర్యం.
    "పాతికరూపాయ లిచ్చారంటే అన్నిటికీ ఒప్పుకుంటాను."
    "నిజంగానా?" ఆత్రుతగా అన్నాడు సూర్యం.
    "నాకు నీతి లేకపోవచ్చు కానీ మాటకు నిలబడతాను నేను" అంది త్రిలోకసుందరి.
    అప్పుడు సూర్యం, త్రిలోకసుందరికూడా మాట నిలబెట్టుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు యెంతో దగ్గరయి నపుడు త్రిలోకసుందరి-"అమ్మగారు కొన్న చందనం పెన్ను కైలాసం బాబుగారి దగ్గర చూశాను" అంది.
    "కైలాసం ఎవరు?"
    సూర్యం ప్రశ్న అడిగాడు కానీ కైలాసం ఎవరో అతడికి తెలుసు. అతడు పక్కవీధిలో వుంటున్న పాతికేళ్ళ యువకుడు. అచ్చోసిన ఆంబోతని అంతా అంటారు. ఆడవాళ్ళందరికీ నిర్మొహమాటంగా ఫోజులు కొడుతూంటాడు. మనిషి చాలా బావుంటాడు.
    త్రిలోకసుందరి చెప్పగానే కైలాసం ఎవరో సూర్యానికి బాగా తెలిసింది.
    "వాడెలాంటి వాడు?"
    "ఎలాంటివాడో తెలియదు కానీ ఆడాళ్ళే ఆ బాబుకు బహుమతులిస్తారని చెప్పుకుంటారు!"
    సూర్యానికి  అప్పటికి ఆ క్షణంలో ఆ ఆలోచన ఉత్సాహాన్ని కలిగించింది. ఆ ఉత్సాహం కారణంగా త్రిలోకసుందరితో అతఃడు మరింత ఆనందాన్ని పంచుకోగలిగాడు. అది వెళ్ళిపోయాక అతను వాస్తవంలోకి వచ్చి నిర్వీర్యుడైపోయాడు.
    తను తప్పుచేశాడు. పెళ్ళయ్యాక తనుచేసిన మొదటి తప్పు ఇదే! అదిసరే-కానీ వాణి సంగతేమిటి? వాడికి ఆ కైలాసంగాడికి ఆమె బహుమతి ఎందుకిచ్చింది?
    వాణి గుడినుంచి రాగానే అతడామెను దులిపేయాలనుకున్నాడు. కానీ తనుచేసిన తప్పు అతన్ని నొక్కిపట్టింది. కైలాసం సంగతి ముందు తేల్చాలనుకున్నాడు.
    ఆరాత్రి భార్యా భర్తలిద్దరూ ఒకరితో ఒకరు ముభావంగా గడిపారు. పరస్పరానుమానాలతో రాత్రంతా నిద్రపోలేదు.
    మర్నాడు సూర్యం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కైలాసాన్ని చూడబోయాడు. అతను వెళ్ళేసరికి కైలాసం వీధరుగుమీద కూర్చుని వుత్తరం రాసుకుంటున్నాడు. అతడిచేతిలో ఓ పెన్నుంది. అది చందనం పెన్ను.
    సూర్యం కైలాసాన్ని పలకరించాడు. ఆమాటా యీ మాటా చెప్పి పెన్ను బాగుందని మెచ్చుకుని ధరడిగాడు.
    "బజారంతా తిరిగితే దీని ధర తెలియకపోదు. కానీ ప్రియురాలి బహుమతి ఇది. నేను దీనికి వెలకట్టలేను-" అన్నాడు కైలాసం పరవశాన్నభినయిస్తూ తర్వాత అతను సూర్యంమీద జాలిపడ్డాడు. "చూడండి నాకు పాతికేళ్ళు మీకూ నాకంటే ఎంతో యెక్కువ వయసుండదు. కానీ పెళ్ళిచేసుకుని నలభై ఏళ్ల వారిలా అయిపోయారు. అదీ కాక పెళ్ళిచేసుకుంటే ఒక్కతే ఆడది! పెళ్ళి కాకపోతే యెందరో ప్రియురాళ్ళు నా ప్రియురాళ్ళలో పెళ్ళయిన వాళ్ళుకూడా ఉన్నారు."
    అతణ్ణి కలుసుకున్నందుకు యెంతగానో విచారించి సూర్యం అక్కణ్ణించి బయటపడ్డాడు.
    సాయంత్రం అతనాఫీసునుంచి ఇంటికి వెళ్ళేసరికి వాణి మంచి కోపంలోవుంది. అతన్ని చూస్తూనే "ఇంట్లో చీర ఒకటి మాయమయింది. దాన్నిగురించి మీకుగానీ ఏమయినా తెలుసా?" అంది.
    "చీరల గురించి నాకేం తెలుస్తుంది?" అన్నాడు సూర్యం.
    "ఎవరికయినా ఇచ్చారేమోనని!" అంది వాణి.
    "బాగుంది-నీ చీరలు నే నెవరికయినా ఎందుకిస్తాను? అన్నాడు సూర్యం.
    "అమ్మయ్య-ఆ త్రిలోకసుందరి మాటలు నిజమేమో నని హడలి చచ్చాను. కాదన్నమాట" అంటూ తృప్తిగా నిట్టూర్చింది వాణి.
    త్రిలోకసుందరి పేరు రాగానే కలవరపడ్డాడు సూర్యం వాణి వివరించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS