అప్పటికి నా బుర్ర పనిచేయసాగింది.
ఆమె ఎవరు? ఎవరికోసం వచ్చింది? ఆమెను చూడగానే వివరాలేమీ అడక్కుండా నే నెందుకు లోపలకు రమ్మన్నాను? ఆమె కూడా వివరాలేమీ అడక్కుండా వెంటనే లోపలకు యెందుకు వచ్చింది?
ఇన్ని ఆలోచిస్తున్నా పైకేమీ అనలేదు నేను. అమర్యాద అనుకున్నా సరేనని ఆమె వంకే కళ్ళప్పగించి చూస్తున్నాను.
ఆమె భుజానికి ఓ సంచీ వ్రేలాడుతోంది. అందులోంచీ ఓ చిన్న సీసా తీసిందామె. చూడగానే సెంటు సీసా అని తెలిసిపోతుంది. సీసా తీయగానే గదిలో వాసన పరిమళం గుప్పుమంది. ఆ పరిమళం నాకెంతో నచ్చింది.
"ఇది లవర్స్ సెంట్!" అన్నదామె.
"అంటే?" అన్నాను.
"వివాహం కాక మునుపు ప్రేయసీ ప్రియుల మధ్య ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వుంటుంది. అందుకు కారణం తెలుసా మీకు?" అంది కుసుమ.
"నాకు తెలియదు. మీరే చెప్పండి!" అన్నాను.
ఆమె మాటలు యెంతో తియ్యగా వున్నాయి. ఆమె ప్రేమ గురించీ, ప్రేయసీ ప్రియుల గురించీ మాట్లాడడం నా అదృష్టం. ఇదే టాపిక్ మీద ఆమెచేత యింకా మాట్లాడించాలని ఉంది నాకు.
మానవ శరీరమంతా రసాయనాలు అంటే కెమికల్స్ తోనే నడుస్తోంది. మెదడులో తయారయ్యే ఆనేక రసాయనాలే మనలోని కోపం, శాంతం, ప్రేమ-వగైరా భావాలను సృష్టించి అదుపు చేస్తున్నాయి. నూతన ప్రేమికులొకరికొకరు ఎదురైనపుడు మెదడు కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. వాటి కారణంగా ఆ ప్రేమికుల శరీరాలకు-ఓ వింత పరిమళం యేర్పడుతుంది. తమకు తెలియకుండానే నూత్న ప్రేమికులా పరిమళానికి పరస్పరం ఆకర్షించబడతారు-" అంది కుసుమ.
"కొత్త విషయం చెప్పారు. చాలా థాంక్స్!" అన్నాను.
"ప్రేయసీ ప్రియులొకరికొకరు దగ్గరయ్యాక, వారి మధ్య చనువు పెరిగాక మెదడులో రియాక్షన్సు ఆగిపోతాయి. అంతా యాంత్రికం అయిపోతుంది. కొత్తగా రసాయనాలు విడుదలకావు. పరిమళాలుండవు. అందువల్ల భార్యాభర్తల మధ్య ఆదిలో వున్న ఆకర్షణ వుండదు" అంది కుసుమ.
"కరెక్టుగా చెప్పారు...." అన్నాను.
"ఈ లోపం సవరించడానికీ-ప్రపంచంలో ప్రేమ కలకాలం వర్ధిల్లడానికీ కనిపెట్టబడింది లవర్స్ సెంట్! ఇది రాసుకున్న ప్రేయసీ ప్రియులు యెప్పటికీ కొత్త ప్రేమికుల్లాగే వుండిపోతారు. తొలి ప్రేమ ఊహల్లో మెదడు సృష్టించే రసాయనాలేమిటో పరిశోధించి తెలుసుకొని వాటిని కృత్రిమంగా సృష్టించి తయారు చేయబడిన సెంటు ఇది. సీసా వెల పాతిక రూపాయలు మాత్రమే!"
ఆమె సేల్సు గర్ల్ అని అర్ధమైంది నాకు.
ఈ సెంటు యెవరు తయారుచేస్తున్నారో కానీ వారిని అభినందించాలి. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికీ యేదో సైంటిఫిక్ వివరణ యివ్వడం ఫ్యాషనై పోయింది. ఆమె చెప్పింది నిజమనీ, సెంటు అలాగే పని చేస్తుందనీ అనుకునేందుకు లేదు. కానీ ఈ వివరణ చెప్పి ఈ సెంటు అమ్మడానికి కుసుమవంటి అమ్మాయిని నియోగించిన ఆ కంపెనీని అభినందించాలి. అయితే నేను వెంటనే ఆ సెంటు సీసా కొనదల్చుకోలేదు.
"మీ సెంటువల్ల నాకు ప్రయోజనముండదు-" అన్నాను.
"మా సెంటు గురించి మీకు తెలీదు. ఒకసారి వాడి చూస్తే ఈ మాట అనరు మీరు-" అందామె.
"సెంటు గురించి నాకు తెలీదు, నా భార్య గురించి మీకు తెలీదు!"
కుసుమ వళ్ళంతా కదిలేలా నవ్వింది. అప్ప్డుడామె యెంత బాగుంది? కళ్ళప్పగించి ఆమె వంక చూస్తూండి పోయాను.
"మీరు చాలా సరదాగా మాట్లాడతారు. మీవంటి భర్త వున్న భార్యకు యిలాంటి సెంటు అవసరముండదు. కానీ బంగారానికైనా గోడచెరుపు కావాలంటారు. ప్లీజ్-ఒక సీసా తీసుకోండి-" అన్నదామె.
"ఈ సీసాను తప్పక తీసుకుంటాను. కానీ నా భార్య కోసం కాదు. మీకోసం!" కావాలనే ద్వంద్వార్ధం ధ్వనించేలా చేశాను.
"ఏమన్నారూ?" అందామె తడబడుతూ.
"చూడండి-మీకు పెళ్ళయింది కదూ!"
"ఊఁ" అందామె అదోలా.
ఉలిక్కిపడ్డాను. అంతవరకూ ఆమెకు పెళ్ళి కాలేదనుకున్నాను.
"అయాం సారీ!" అన్నాను అప్రయత్నంగా.
"సారీ నాకొద్దు. సీసా కొనండి...." అంది కుసుమ.
"మీ సీసామీద నాకు నమ్మకం కుదర్లేదు-" అన్నాను.
"ఈ రోజు సెంటు వాడండి. గుణం కనిపించకపోతే రేపిదే సమయానికి నేను వస్తాను. మీకు డబ్బు వాపసిచ్చేస్తాను...." అంది కుసుమ.
"ఒకసారి డబ్బు తీసుకున్నాక మీరు మళ్ళీ నాక్కనిపిస్తారా?" అన్నాను.
ఆమె దెబ్బ తిన్నట్లు-"మీరు చాలా అనుమానస్థుల్లా గున్నారు. పోనీ ఈ రోజుకు కొంత అడ్వాన్సివ్వండి. మిగతా సొమ్ము రేపివ్వండి-" అంది.
ఆమెకు పదిరూపాయ లిచ్చాను. ఒకవేళ తర్వాత ఆమె రాకపోయినా ఈ సెంటు సీసా ఆమాత్రం విలువ చేస్తుంది.
కుసుమ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ-"వేడినీళ్ళ స్నానం చేయండి. బకెట్లో రెండేరెండు సెంటు చుక్కలు వేసుకోండి. ఆ తర్వాత చూడండి. మీ భార్యనూ అదే విధంగా స్నానం చేయమనండి-" అని చెప్పింది.
3
టైము నాలుగయేసరికి నేనిల్లు వదిలిపెట్టాను. కుసుమ యిచ్చిన లవర్స్ సెంట్ తో స్నానం చేశాను. వళ్ళంతా ఘుమఘుమలాడిపోతూ నామీద నాకే ప్రేమను పుట్టిస్తోంది. నేనెక్కడికి వెళ్ళాలో ముందే నిర్ణయించుకున్నాను.
సూర్యప్రభ మా ఆఫీసులో స్టెనో టైపిస్టు మనిషి అందంగా ఉండదని అంతా అంటారుకానీ ఆమెను చూస్తే నాకు చచ్చేంత ఆకర్షణగా ఎప్పుడూ ఆధునికమైన దుస్తులు వేసుకుంటుంది. అధునాతనంగా వుంటుంది. డాషింగ్ గా వుండేవాళ్ళంటే నాకెంత యిష్టమో అంత భయంకూడా!
సూర్యప్రభ యెప్పుడూ మేనేజరు గదిలోనే ఉంటుంది. మేనేజరుతో తప్ప వేరెవ్వరితోనూ మాట్లాడదు. ఆమెకు చాలా గర్వమని అంతా చెప్పుకుంటారు. ఆమెతో కాసేపు కబుర్లు చెప్పాలన్నది నా సరదా. ఈ రోజు లవర్స్ సెంట్ రాసుకున్నాను కాబట్టి ఆమె నాతో మాట్లాడ్డానికి సుముఖంగానే ఉంటుందని భావించాను.
సూర్యప్రభ ఒంటరిగా ఉంటోందనీ ఆదివారాలు ఇల్లు కదలదనీ కూడా నాకు తెలుసు. నేను సూర్యప్రభ యింటికే వెళ్ళాను.
తలుపు సూర్యప్రభ తనే స్వయంగా తీసింది. ఆమెను చూసి ఆశ్చర్యపడ్డాను. మనిషి చాలా సీదాసాదాగా వుంది. ఆఫీసుకు వచ్చే సూర్యప్రభ యిలాగుండదు.
ఆమె కూడా నన్ను చూసి ఆశ్చర్యపడుతూ-"నువ్వా? లోపలకు రా-" అని ఆహ్వానించింది.
లోపల గది చాలా నీటుగా అలంకరించి ఉంది. సూర్యప్రభ అభిరుచి అభినందించతగ్గది. కానీ మేకప్ లేకపోయేసరికి ఆమె రూపం నన్ను నిరుత్సాహపరచింది.
గదిలో ఖరీదైన సోఫాసెట్టుంది. ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆమె నా వంక అదోలా చూస్తూ "ఏమిటి విశేషం?" అంది.
"ఎందుకో యీ రోజూ మీ యింటికొచ్చి నిన్ను చూడాలనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది-" అన్నాను. ఈ మాటలనడానికి లవర్స్ సెంటు నాకు తగినంత ధైర్యాన్నిచ్చింది.
