Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 60


    ఆ దంపతులు యింట్లో ఖర్చుపెట్టిన ప్రతి పైసకూ పద్దు వేస్తారు. ఆ డబ్బు పోయినట్లు పద్దులో రాశాడు సూర్యం.
    మర్నాడు సూర్యం నిద్ర లేచేసరికి త్రిలోకసుందరి యెప్పటిలాగానే యిల్లూడుస్తోంది. నిజం చెప్పాలంటే ఆమె చీపురు చప్పుడు వింటూనే అతను నిద్ర లేస్తాడు. ఆమె యిల్లూడుస్తోండగా క్షణం కూడా మిస్సవకుండా చూడడం అతడి దినచర్యలో భాగమైపోయిందిప్పుడు. అందమైన దాని ముఖం చూస్తూంటే అది దొంగ అనుకోవడానికి సూర్యాని కే మాత్రమూ మనసొప్పలేదు. చటుక్కున అతను మంచంమీంచి లేచి కూర్చుని-"ఇలా రా!" అన్నాడు.
    అది ఆచ్చాదనలేని ఉపరిభాగంతో అలాగే అతడివద్దకు వచ్చింది. ఎంతవద్దనుకున్నా సూర్యం ఆమె గుండెల వైపున్న దృష్టిని మరల్చుకోకుండా ఉన్నాడు.
    "ఏం బాబూ-" అంది త్రిలోకసుందరి అతడికి బాగా దగ్గరగా వచ్చి నిలబడి.
    "ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నువ్వు నాకు నచ్చావు. పని బాగా చేస్తున్నావు. నీకు డబ్బు అవసరమైతే అడిగి తీసుకో-తప్పితే కక్కుర్తిపనులు చేయకు-" అన్నాడు సూర్యం.
    "ఇదంతా యెందుకు చెబుతున్నారు బాబూ-" అంది త్రిలోకసుందరి.
    "నిన్న నువ్వు పదిరూపాయలు తీశావని అమ్మగారికి అనుమానం వచ్చింది. ఆవిడ నిన్ను పని మాన్పించేయాలని కూడా అనుకుంటోంది-" అన్నాడు సూర్యం.
    త్రిలోకసుందరి నిర్లక్ష్యంగా-"కష్టపడి పని చేసుకునే దాన్ని-పని తీసేస్తే నాకేంటి భయం!" అంది.
    దాని ఆత్మవిశ్వాసానికి అబ్బురపడ్డాడు సూర్యం. ఉద్యోగం పోతుందంటే మతులు పోగొట్టుకుని కూర్చుంటారు మధ్యతరగతివాళ్ళు.
    "అది కాదే-నీకు మంచి పేరుండాలిగదా!" అన్నాడు సూర్యం.
    త్రిలోకసుందరి చటుక్కున రహస్యం చెబుతున్నట్లుగా సూర్యం ముఖంమీదకు వంగింది. సూర్యానికి గుప్పుమని పరిమళం వేసింది. త్రిలోకసుందరి పనిమనిషే కావచ్చు కానీ అది నిత్యశోభాయమానంగా ఉంటుంది.
    "నిజం చెప్పమంటారా బాబూ-" అంది త్రిలోకసుందరి.
    "ఊఁ" అన్నాడు సూర్యం. అతడి వళ్ళు వేడెక్కింది. చటుక్కున త్రిలోకసుందరిని దగ్గరకు లాక్కోవాలని కూడా అతననుకున్నాడు. కానీ అతి కష్టంమీద నిగ్రహించుకున్నాడు.
    "అమ్మగా రా పదిరూపాయలూ నాకు ఇచ్చి రహస్యంగా ఓ మంచిగంధం పెన్ను తెచ్చిపెట్టమన్నారు-" అంది.
    "ఎందుకని?"
    "నేనూ అడిగాను బాబూ-దీనికి రహస్యమెందుకూ అని. పెన్ను రహస్యంమేనట. ఇంట్లో మీరు వద్దేసుకుంటారు గదా-అందుకని డబ్బుపోయిందని చెబుతానన్నారు కానీ ఇలా నా మీద తోసేస్తారని తెలిస్తే నే నందుకు ఒప్పుకుని ఉండేదాన్ని కాదు-"
    సూర్యం ఆశ్చర్యపడ్డాడు. వాణికి మంచి గంధం పెన్నెందుకూ! యెవరైనా పుట్టినరోజు పేరంటానికి పిలిచారా?    
    "పెన్ను తెచ్చావా?" అడిగాడు సూర్యం.
    "తెచ్చాను బాబూ! తొమ్మిదిన్నరయింది. అర్ధరూపాయతిరిగి యిస్తే దేవుడి మందిరంలో పెట్టుకున్నారు-"
    సూర్యం ఆశ్చర్యపడ్డాడు-"ఎందుకు చెప్మా అది!" అనుకున్నాడతను కాస్త పైకే.
    "ఏమో బాబూ-ఇది నేను చెప్పినట్లు అమ్మగారికి చెప్పకండి. మీ దగ్గరేమన్నా నా దగ్గర అమ్మగారేమీ నా గురించి అనలేదు. నేనంటే గౌరవంగానే ఉన్నారు..." అంటూ వెళ్ళిపోయింది త్రిలోకసుందరి.
    సూర్యం అప్పటికప్పుడు లేచివెళ్ళి దేవుడిమందిరంలో చూశాడు. అర్ధరూపాయ బిళ్ళ వుంది. అతను వెంటనే భార్యదగ్గరకు వెళ్ళి-"నిన్నెవరైనా పుట్టినరోజు పార్టీకి పిలిచారా, యెవరికైనా మంచి గంధంపెన్ను కొనాలనుకుంటున్నావా?" అనడిగాడు.
    వాణి అతడి ప్రశ్నకు చాలా ఆశ్చర్యపడి-"మీకే దైనా మంచి గంధంపెన్ను ఊరికే దొరికిందేమిటి? అలా అడుగుతున్నారు?" అంది.
    సూర్యం ఏమీ మాట్లాడలేదు. పనిమనిషి మాటలు పట్టుకుని వాణిని నొక్కించదల్చుకోలేదతను ఎందుకంటే వాణి అబద్దం చెబుతోందంటే యెలాగూ నిజం వొప్పుకోదు. కానీ పనిమనిషి మాటలు నమ్మి తానామెను ప్రశ్నిస్తున్నా డని తెలిస్తే యింట్లో పెద్ద గొడవైపోతుంది. అందువల్ల ప్రస్తుతానికి ఊరుకోవడమే మంచిది. అసలు కథ ఏదో ఓ రోజున బైటపడకమానదు.
    మధ్యాహ్నం బట్టలుతకడానికి వచ్చినపుడు త్రిలోక సుందరి వాణిని పిల్చి "మీ పదిరూపాయలూ ఏమయ్యాయో తెలిశాయమ్మా-" అంది.
    "ఏమయ్యాయ్?" అంది వాణి ఆత్రుతగా.
    "అవి బాబుగారే తీశారు...." అంది త్రిలోకసుందరి తాపీగా.
    "బాగుంది ఆయన డబ్బు ఆయన తీయడమెందుకు?" అంది వాణి.
    "ఇంట్లో మీరు అన్నింటికీ పద్దు వేస్తారు గదా. మీకు తెలీకుండా ఆయనకు పది రూపాయలు కావలసొచ్చాయి. ఆ రోజు గదిలో నోటు కనబడిందట. తీసికెళ్ళి ఏమీ ఎరగనట్లు మళ్ళీ నిద్రకు వెళ్ళిపోయారట-"
    "ఇవన్నీ నీకెలా తెలిశాయే?"
    "ఈ రోజు అయ్యగారు...." అని ఆగిపోయింది త్రిలోకసుందరి ఏదో చెప్పకూడని విషయం అన్నట్లుగా.
    వాణి కుతూహలం పెరిగిపోయింది-"చంపక-త్వరగా చెప్పవే!" అంది.
    "నా చెయ్యి పట్టుకొన్నారు...." అంది త్రిలోకసుందరి.
    వాణి మ్రాన్పడిపోయింది. తర్వాత ప్రశ్న అడగడానికి ఆమెకు చాలాసేపు పట్టింది-"అప్పుడు నువ్వేం చేశావే! ఊరుకున్నావా?"
    "సాచిపెట్టి లెంపకాయ కొట్టాల్సిందే. కానీ చేతికి పదిరూపాయలిచ్చి ఈ మాట బైటకు రానివ్వద్ధన్నారు. దాంతో ఊరుకోవాల్సి వచ్చింది-" అంది త్రిలోక సుందరి.
    "బాగుందే-పదిరూపాయలిచ్చారుగదా అని ఊరుకుంటావా?" అంది వాణి కోపంగా.
    "డబ్బు చేదేంటమ్మా పది రూపాయలిస్తే చెయ్యట్టు కున్నా ఊరుకుంటాను-"
    వాణి కంగారుగా దానికేసి చూసి-"ఆ  డబ్బివ్వలాగివ్వు. ఆయన్ను నిలదీసి అడుగుతాను-" అంది.
    త్రిలోకసుందరి అదోలా నవ్వి-"రహస్యం బట్టబయలు కానంతవరకే మగాళ్ళ బెదురు. నాకు తెల్సినంత వరకూ యిలాంటి విషయాల్లో ఆడాళ్ళు దెబ్బలాడి నెగ్గుకు రాలేరు. ఆయనకు మీరంటే భయముంది. ఆ భయాన్ని పోనివ్వకండి. అది పోనిచ్చారంటే అప్పుడాయన మీ యెదురుగుండానే నా చెయ్యి పట్టుకుంటారు. అప్పుడేం చేస్తారో ఆలోచించండి-" అంది.
    వాణికి విపరీతమైన ఆవేశం రాగా అప్పుడు తనె ప్రవర్తిస్తుందో చెప్పేసింది. సూర్యాన్ని నడివీధిలోకి అల్లరి పెట్టేస్తుందిట. నలుగురి చేతా ఛీ అనిపించుకునేలా చేస్తుందిట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS