Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 60


                                 లవర్స్ సెంట్
                                                                                    --వసుంధర


    ఒక్కన్నీ యింట్లో వున్నాను. మంచంమీద పడుకుంటే నిద్రపట్టడంలేదు. పుస్తకం చదువుదామంటే ఎక్కడం లేదు. తలనొప్పిగా లేదుకానీ చిరాగ్గా వుంది.
    చిరాకు నాకు చాలా కాలంగా వుంటోంది. అందుకు కారణముంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని స్థితి నాది.
    ఏ ఆలోచనా ముందుకు వెళ్ళని పరిస్థితిలో మా ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. అప్పుడు నాకు కలిగిన చిరాకు ఇంతా అంతా కాదు.
    వచ్చిందింకెవరై వుంటారు-శ్రీమతి తప్ప!
    ఈ మధ్య శ్రీమతిని చూస్తూంటే నాకు చాలా చిరాకు కలుగుతున్నది. నేను మామూలు ఉద్యోగిని. నా నెల జీతం వెయ్యి రూపాయలు. నాకు పెళ్లై రెండే ళ్ళయింది. ఇంకో ఏడాది దాకా పిల్లలు వద్దనుకున్నాం.
    నా భార్య పేరు కమల. యెంతో మంచిది. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. అందువల్లనే ఏమో ఆర్నెల్లలోనే ఆమె అంటే నాకు మొహం మొత్తింది. నా మనసు పరాయి స్త్రీలమీదకు పోతోంది. పరాయి అంటే ఫలానా అనిలేదు. ఎవరో ఒకరు కమల తప్ప!
    అందుకు పూర్తిగా కమలనూ తప్పుపట్టలేదు. అలాగని నా మనసునూ తప్పుపట్టలేను. కొంతవరకూ నా మిత్రుడు రంగారావు కారణమని చెప్పాలి.
    మనిషన్నవాడు అన్నీ అనుభవించాలిట. మగాడికి ఆడది ఓ పెద్ద వరమట. వయసులో వుండగానే వెరైటీ చూడాలట!
    "మరి శ్రీమతికి తెలిస్తే?" అన్నాను.
    "తెలియనివ్వకూడదు. అదే ఆర్టు. ఇంకా చెప్పాలంటే అదే పెద్ద అడ్వెంచర్-"
    "అడ్వెంచర్ సంగతి సరే-పెళ్ళయిన వాడితో కులకడానికి యే పిల్ల ఒప్పుకుంటుంది?" అన్నాను.
    "డబ్బు-డబ్బుండాలి. అంతే!" అన్నాడు రంగారావు.
    "నీకు డబ్బు లేదుగదా-"
    "అదే నా బాధ..అందుకే ఇప్పుడు బార్లకు వెళ్ళడం మానేశాను. సిగరెట్లు మానేశాను. మానేసినట్లు నా భార్యకు తెలియదు. ఖర్చులామెకు చెబుతూనే వున్నాను. ఆ డబ్బంతా దాస్తున్నాను. ఏడాదిలో వెయ్యి రూపాయలు దాచాను....."
    "అయితే రంగంలోకి దిగుతావా?"
    "రంగంలోకి దిగడమంటే ఏమిటి నీ ఉద్దేశ్యం?"
    "లాడ్జికి వెళ్ళడం-"
    "ఛా-లాడ్జికి వెళ్ళాలనుకుంటే వెయ్యిరూపాయలెందుకూ? యెక్కడో వలవేసి ఓ పెళ్ళికాని పిల్లను పట్టి ప్రేమ వ్యవహారం నడపాలి. ప్రేమించి కులికితేనే బ్యూటీ-తెలిసిందా?" అన్నాడు రంగారావు.
    నాకు ముందు అర్ధం కాలేదు. రంగారావే వివరించి చెప్పాడు.
    "ఇరవై యేళ్ళొచ్చినా పెళ్ళికాని ఆడపిల్ల లెందరో వుంటారు. ఏ కట్నం సమస్యవల్లనో వాళ్ళకు పెళ్ళి కాదు వాళ్ళు మగాడినుంచి రవంత సానుభూతి ఆశిస్తూంటారు. అలాంటి వాళ్ళలో మనకు నచ్చిన ఓ అందమైన పిల్లను పట్టాలి. స్నేహం పెంచుకోవాలి. తల్లిదండ్రుల మాట విని కట్నానికి ఆశపడి ఓ పిల్లను పెళ్ళి చేసుకున్నాననీ జీవితంలో సుఖం లేకుండా పోయిందనీ చెప్పాలి.
    "ఇలాంటి వ్యవహారంలో కొంత నిజాయితీ కావాలి. ఆ పిల్లను మనం పెళ్ళిచేసుకోమని తెలియాలి. స్నేహం తప్ప మరే భావమూ ఆ పిల్లపట్ల లేనట్లు నటించాలి. పెళ్ళైన మగాళ్ళకు నటన పెద్ద కష్టంకాదు. నేనైతే పెళ్ళికాకముందే ఓ పిల్లను బుట్టలో వేసుకున్నాను....." అన్నాడు రంగారావు.
    "ఎలా?"
    "అప్పుడు నా దగ్గర డబ్బులు దండిగా వుండేవి. ఆ పిల్లకోసం చాలా చాలా కొనేవాన్ని. నా దురదృష్టం. ఆమెను భార్యగా పొందలేక పోవడమేనని చెప్పేశాను. ఇంటి పరిస్థితులు, డబ్బు అవసరం భయంకరంగా వర్ణించి చెప్పాను. కాబోయే భార్య నాకు యాభైవేలు కట్నం తెస్తోందని అబద్ధం చెప్పాను. ఆమె నమ్మింది. పెళ్ళికి ముందు యిద్దరం ఎంజాయ్ చేశాం. తర్వాత ఒకరికొకరు మరచిపోయాం-"
    "అది సాధ్యమా?" అన్నాను.
    రంగారావు అదోలా నవ్వి-"ఈ ప్రపంచంలో ఆడవాళ్ళంత మంచివాళ్ళూ, అమాయకులూ వుండరు. వాళ్ళు మోసాన్ని సహించలేరు తప్పితే దేనికైనా ఒప్పుకుంటారు. ముందే అన్నీ చెప్పేస్తే యే బాధా వుండదు. ఎటొచ్చీ వాళ్ళు డబ్బుతో ప్రేమను కొలుస్తారు కాబట్టి డబ్బును బాగా వెదజల్లాలి...." అన్నాడు.
    వాడి మాటలు నాకు బాగా పట్టాయి. అప్పట్నించీ ఈ విషయమై ఆలోచిస్తున్నాను. కానీ దారి దొరకలేదు. ధైర్యం చాలలేదు. శ్రీమతిమీద విరక్తి మాత్రం ప్రారంభమయింది. అయితే అది బయటకు ప్రదర్శించకుండా జాగ్రత్తపడేవాణ్ణి. ఎందుకంటే రంగారావు చెప్పనే చెప్పాడు-భార్యను ఒసం చేయాలనుకున్న వాడు-ఆమెమీద మామూలుగాకంటే కాస్త ఎక్కువగా ప్రేమను చూపించాలి. ఆడవాళ్ళను ప్రేమతో సాధించి నట్లు-విసుగుతో సాధించలేము.
    కానీ కొద్ది నెలలుగా నేను కమలమీద విసుక్కుంటున్నాను. కమలకు ఇప్పుడు డబ్బు పిచ్చి యెక్కువయింది. అలాగని డబ్బు అడగదు. అన్నీ కొనాలంటుంది. ఆమె కోరికలకు అంతుండడంలేదు.
    "నా జీతం నెలకు వెయ్యి రూపాయలు మాత్రం!" అని ఆమెకు గుర్తుచేశానోసారి.
    "మీరడిగినవన్నీ నేనిస్తున్నాను నేనడిగినవన్నీ మీరివ్వాలి-" అని నవ్వింది కమల.
    నిజానికి ఆమె అడిగినవన్నీ నేను కొనగలను. ఆ డబ్బు నా దగ్గరుంది. ఆ విషయం కమలకు తెలియదు. తెలియకూడదనే నా ఉద్దేశ్యం. ఆ డబ్బును నేను లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం దాస్తున్నాను.
    కానీ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి?
    ఈ విషయం ఆలోచించడంకోసమే ఈ మధ్య నేను యెక్కువగా ఏకంతాన్ని కోరుతున్నాను - ఇంట్లో కూడా! అందువల్ల బజారుకు శ్రీమతి ఒక్కతే వెళ్ళి వెచ్చాలు, కూరలు తెచ్చుకుంటోంది. సినిమాలకు కూడా ఒక్కతే వెడుతోంది.
    "నీ కోరికలు న్యాయమైనవి. అందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదింఛే మార్గాలు నేనాలోచిస్తున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఏకాంతానికి వదిలిపెట్టు. నేనేంచేసినా నీకోసమే!" అన్నాను భార్యతో.
    ఈ అందమైన అబద్ధాన్ని శ్రీమతి నమ్మింది. అందుకే నాకు వీలైనమ్తఃగా ఏకాంతాన్నిచ్చి సహకరిస్తోంది.
    ఈ రోజు ఆదివారం ఆమె నన్ను ఇంట్లో వదిలి మ్యాట్నీకి వెళ్ళింది. టికెట్సు దొరకలేదో, మూడ్ మారిందో యేమో అప్పుడే తిరిగి వచ్చేసింది.
    కాలింగ్ బెల్ మరోసారి మ్రోగింది.
    నేను పరుగున వెళ్ళి తలుపుతీసి ఉలిక్కిపడ్డాను. ఆశ్చర్యపడ్డాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.
    నా ఎదురుగా ఓ అందాల భరిణ నిలబడి వుంది.
    
                                      2

    "నా పేరు కుసుమ!" అన్నదామె.
    "ప్లీజ్-లోపలకు రండి!" అన్నాను తడబడుతూ.
    ఆమె లోపలకు వచ్చింది. తలుపులు తీసే వున్నాయి. ఇద్దరం చెరో కుర్చీలో కూర్చున్నాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS