త్రిలోక సుందరి
కొత్తగా ఆ పేటలోకి వచ్చింది వాణి. వాణికి పెళ్లై ఆరేళ్ళయింది. వయసు పాతికేళ్ళకు మించదు కానీ ఇంకా చిన్నదానిలా ఉంటుంది. ఆమె కిద్దరబ్బాయిలు. ఒకడికి రెండు. ఇంకోడికి నాలుగేళ్ళు. వాణి భర్త సూర్యం బ్యాంకులో గుమస్తా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అన్యోన్య దాంపత్యం వారిది.
వాణి అక్కడకు రాగానే ముందు పనిమనిషి గురించి వాకబు చేసింది.
ఆ పేటలో పనిమనుషుల ధరలు మండిపోతున్నాయి. నెలకు యాభై రూపాయలేనా యివ్వాలి వాణిక్కావలసిన పనులు చేయడానికి. అలాగని వాణికున్న పనులు మరీ విశేషమైనవేం కాదు. రెండుపూటలా గిన్నెలు తోమాలి. ఒకసారి బట్టలుతకాలి. ఇల్లు తుడవాలి. వారానికో రోజు యిల్లు కడగాలి.
"డబ్బు యెక్కువనుకుంటే త్రిలోకసుందరిని పెట్టుకో పాతిక రూపాయలకే పని చేస్తుంది. కానీ దాని బుద్ధులు మంచివి కాదు. చేతికందినది పట్టుకుపోతుంది-"అంది ఆ పేటలో ఒకావిడ.
వాణి కిది నచ్చలేదు. సాధారణంగా ప్రతివాళ్ళూ ఇంట్లో యేదైనా పోతే పనివాళ్ళ మీద అనుమానపడతారు. వాళ్ళు డబ్బు లేనివారుకదా అని బుద్దులూ అంతే అని అంచనా వేస్తారు. అందితే వస్తువులు పట్టుకుని పోయేవారు పని మనుషుల్లోనే కాదు-అందరిలోనూ ఉన్నారు. మన జాగ్రత్తలో మనముంటే యెవ్వరూ యేమీ తీసుకెళ్ళలేరు.
వాణి త్రిలోకసుందరి యెవరో తెలుసుకోవాలనుకుంది.
త్రిలోకసుందరి అసలు పేరు త్రిలోకసుందరి కాదు. అది చూడ్డానికి పనిమనుషుల్లో తప్పబుట్టిన రాకుమారిలా ఉంటుంది. దాని ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వుంటుంది. దాని పేరు ఏ పేరమ్మో వుండొచ్చు కానీ ఏ శుభముహూర్తానో ఎవ్వరో దానికీ పేరు పెట్టారు. అదే అసలు పేరుగా స్థిరపడిపోయింది.
వాణి దాని గురించి వాకబు చేస్తూంటే-"అలాంటిదాన్ని పెట్టుకోకమ్మా-ప్రమాదం చేతనైతే నీ యింటి పన్లు నువ్వే చేసుకో లేదా యింకో పాతిక యెక్కువిచ్చుకో పాతిక లాభం చూసుకుంటావుగానీ ఆ తర్వాత అంతకు మించే లాగేస్తుందది-" అంటూ ఒకావిడ వాణిని హెచ్చరించింది.
వాణి ఒకరాత్రి భర్తతో ఈ విషయం చర్చించింది. పాతిక్కి యాభైకీ చాలా తేడా ఉంది. అందులోనూ ఇది నెల ఖర్చు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన దేమీలేదు. కొన్నాళ్ళు త్రిలోకసుందరి వ్యవహారం చూసి అప్పుడే అంతగా అవసరమనుకుంటే మానిపించేయొచ్చు. త్రిలోకసుందరి వ్యవహారంలో భార్యాభర్తలిద్దరూ చాలా తొందరగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు.
త్రిలోకసుందరి పక్క పేటలో పనిచేస్తుంది. మొత్తం మీద ఇతర పనిమనుషుల ద్వారా దానికి కబురు రాగా అదివాణిని కలుసుకుంది. దాన్ని చూసి వాణి చాలా ముచ్చటపడింది. దానికి ఇరవై ఏళ్ళకంటే ఉండవు. ముఖం ఎంత అందంగా వుందో మనిషి అంత ఆరోగ్యంగా ఉంది. అందానికి తగ్గ శుభ్రం కూడా ఉంది దాని దగ్గర వాణి వెంటనే దాన్ని పనిలో చేర్చేసుకుంది.
రెండునెలలు ఏ విధమైన సంఘటనలూ జరగలేదు. ఈ రెండు నెలల్లోనూ త్రిలోకసుందరి వాణి యింట్లో చాలా మెప్పు సంపాదించింది. అది తరచుగా వాణి అందాన్ని పొగిడేది. పిల్లల్ని ముద్దు చేసేది. పని శుభ్రంగా చేసేది. చకచకా యేమీ చెప్పించుకోకుండానే అన్నీ చేసుకుపోయేది.
సూర్యానికి కూడా అది నచ్చింది. మనిషి చాలా అందంగా ఉండటం అందుకొక కారణం తర్వాత అది గదులూడ్వడానికొచ్చినప్పుడు పైట తీసేసి మొలచుట్టూ తిప్పి దోపుకునేది. అది చిన్నపిల్ల కాదన్న విషయం పైట ఉన్నప్పుడే తెలుస్తుంది. పైట లేనప్పుడైతే మగాడి కళ్ళు చెదిరిపోయేలాంటి యౌవనసంపద దానిది.
ఒకరోజు సూర్యం లేచేసరికి అది ఆ పరిస్థితిలో గది ఊడుస్తోంది. అతడు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతను తన వంక చూస్తున్నాడో లేదో అది పట్టించుకోలేదు. తన పని తను చేసుకువెళ్ళిపోయింది అప్పట్నించీ సూర్యం కాస్త ఆలస్యంగా లేవడం మొదలుపెట్టాడు.
రెండునెల్లు గడిచినా యెలాంటి సంఘటనా జరక్క పోవడం వాడికంటే ఆమె యిరుగుపొరుగులకు యెక్కువ బాధ కలిగించింది. పనిలేని ఆడవాళ్ళంతా చేరి రోజూ ఈ విషయమై చర్చించసాగారు. వాళ్ళమధ్య వాణి గర్వంగా తను అందరిలాంటిదీ కాదనీ బహు జాగ్రత్తపరురాలనీ చెప్పింది.
"అదీ సంగతి! లేకపోతే దాన్ని అదుపుచేయడం కష్టం. అయినా పనిమనిషిని పెట్టుకున్నాక హాయిగా మన పన్లు చేసుకుపోవాలిగానీ కూడా కూడా తిరుగుతూంటే యింక సుఖమేముంది? మేమల్లా చేయలేం బాబూ-" అందింకో ఆవిడ.
"అయినా యెంతకనీ జాగ్రత్తగా వుండగలమండీ-దాని బుద్దికూడా మంచిదే అయుండాలి-"అంది వాణి.
"అయితే రేపు యేదైనా గదిలో వో పదిరూపాయల నోటు పడేసి అదేం చేస్తుందో చూడు-" అంది ఒకావిడ.
వాణికి కూడా త్రిలోకసుందరిని పరిక్షించాలనే అనిపించింది. మర్నాడుదయం ఆ పని చేసింది.
త్రిలోకసుందరి ఆ గదిలో యిల్లూడుస్తూ కనపడ్డ పదిరూపాయల నోటును సంతోషంగా రొంటిన దోపుకుంది. కాసేపయ్యాక వాణి దాన్నిపిలిచి-"అన్నట్లు ఆ సామాన్ల గదిలో నా చేతిలోంచి పది రూపాయలనోటు పడిపోయి నట్లు గుర్తు ఉందేమో చూడవే-" అంది.
"ఇప్పుడే కదమ్మా ఆ గది తుడిచాను. అక్కడేమీ లేదు-" అంది త్రిలోకసుందరి.
వాణి గుండె గుభీలుమంది ప్రయోగం పేరు చెప్పి పదిరూపాయలూ పోలేదు గదా!
"సరిగ్గా చూశావా?" అంది వాణి.
"చూశానమ్మా-అయినా మీరు కలగన్నారేమో-లేకపోతే చేతిలోంచి నోటు జారిపోతే అప్పు డూరుకుని ఇప్పుడడగడమేమిటి?" అంది త్రిలోకసుందరి.
వాణికి తన పొరపాటు అర్ధమయింది. తనకు సరిగ్గా అబద్దమాడ్డం కూడా చేతకాదు. ఇప్పుడేం చేయాలి? యిన్నాళ్ళ నమ్మకంబట్టి అది మరీ అంత తక్కువ బుద్దులున్నదని తననుకోలేదు.
"ఇంట్లో యింట్లో ఏమైపోతాయని అజాగ్రత్తగా ఉన్నాను. ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మకూడదు. ఇక్కన్నించీ చాలా జాగ్రత్తగా వుండాలి-" అంది వాణి.
"అవునమ్మా-అందులోనూ నాది అసలే దొంగబుద్ధి. మీరు యింకా జాగ్రత్తగా ఉండాలి-" అని తన పని లోకి వెళ్ళిపోయింది త్రిలోకసుందరి. వాణి దాని జవాబుకు అవాక్కయిపోయింది.
అది వెళ్ళిపోయాక వాణి భర్త దగ్గర జరిగింది చెప్పుకుని వాపోయింది. సూర్యం ఆమెను ఓదార్చి-"అయాచితంగా వచ్చే డబ్బు యెవరికీ చేదుకాదు. అందులోనూ అలాంటివాళ్ళకు మరీను. అంచేత యింకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకు. పోయిం దెలాగూ పోయింది-" అన్నాడు.
