అయితే ఒక చిన్న మనవి. నా దుర్గతికి కారకుడు కిషోర్. చాలా తెలివిగా వాడు నన్ను మోసగించాడు. వాడి మోసంలో భయంకరమైన స్వార్ధమున్నది. వాడి వివరాలు ఈ ఉత్తరంలో ఇస్తున్నాను. నాకు అయినవాళ్ళే శక్తి వుండీ కిషోర్ జోలికి వెళ్ళడానికి భయపడ్డారు. నువ్వేదో చేస్తావన్న ఆశ నాకు లేదు. ఏదో ఓ రాయి విసిరి చూస్తున్నాను. అంతే! నీకింకా నామీద ప్రేమ మిగిలి వుంటే-ఆ రాక్షసుడు కిషోర్ బ్రతుకు బయటపెట్టు. అదొక్కటే నిన్ను కోరేది!
మరి నీ నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోనా?
నీకేమీకాని
లత."
ఉత్తరం చదవగానే నా పిడికిళ్ళు బిగిశాయి.
కిషోర్ నాకెంత మిత్రద్రోహం చేశాడు?
అంటే రఘు చెప్పిందంతా నిజం.....అనవసరంగా అతడిననుమానించాను. అతడి కాపురంలో నిప్పులు పోయాలనుకున్నాను.
కిషోర్ ఆయువుపట్లు చాలా తెలుసు నాకు. బయట పెడితే?
కిషోర్ ప్రమాదకరమైన మనిషి. లతను చిన్నప్పట్నించీ ఎవరెన్ని విధాల అపార్ధం చేసుకున్నా లెక్క చేయక ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రఘు-కిషోర్ కి భయపడి ఆమెను ఆత్మహత్య చేసుకోనిచ్చాడు.
అంటే కిషోర్ యెంతటి ప్రమాదకరమైన మనిషి......అయినా నేను లెక్క చేయదల్చుకోలేదు. అప్పటికప్పుడు కిషోర్ వద్దకు వెళ్ళాలనుకున్నాను.
అప్పుడు నేను నాకు వచ్చిన మూడో ఉత్తరాన్ని గమనించాను.
నాన్నగారు వ్రాశారది. అంతవరకూ చదవనేలేదు కవరు చించి ఉత్తరం తీశాను.
"చిరంజీవి బుచ్చిని దీవించి వ్రాయునది-" నాన్న యెప్పుడూ నన్ను బుచ్చి అనే పిలుస్తాడు. ఉత్తరాల్ల్లోనూ అలాగే వ్రాస్తాడు. ఏమిటో ఆ సంబోధన చూడగానే మనసేదోలాగైపోయింది. ఒక్కసారిగా నా వయసు తగ్గిపోయి చిన్నపిల్ల వాడినైపోతాను.
"నీవు తక్షణం నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడకు రావలసింది. నీకో మంచి పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మాయి కుందనపు బొమ్మ. వారిది లక్షల ఆస్తి. కొత్తగా మన ఊరు వచ్చి స్థిరపడ్డారు. వారూ మనం ఏక కుటుంబంగా కలిసి పోయాం. తల్లితండ్రులకు ఒక్కతే కూతురు....." ఉత్తరం చదువుతూంటే నాకు మతిపోయినట్లయింది.
లత గురించి బెంగపడుతూ నేనావేశపడుతూంటే ఈ ఉత్తరం నామీద నీళ్ళు చిలకరించినట్లయింది.
ఒకప్పుడు లతకోసం ఏమైనా చేయాలనుకున్నాడు ఇప్పుడు లత లేదు. అయినా నా ప్రేమని నిరూపించుకునేందుకు లత అవకాశమిచ్సింది. కానీ లత నాకోసం ఏమిచేసిందని నేనామేకోసం ఏమైనా చేయాలి? చిన్నతనంనుంచీ చెల్లిగా ప్రేమించిన రఘు చేయలేని త్యాగం నేనెందుకు చేయాలి? చేసి మాత్రం ప్రయోజనమేమిటి? ఇప్పుడు లత ఎలాగూ లేదు.
నేను కిషోర్ వద్దకు వెళ్ళాను. అతడు నన్ను చూసి తడబడ్డాడు.
"రఘును కలిశావా?" అన్నాడు.
"లేదు. లత నాకుత్తరం వ్రాసింది. అది చదివాక అతడిని కలవాల్సిన అవసరం లేదనిపించింది-" అన్నాను.
"మరి నన్నెందుకు కలుస్తున్నావు?" అనుమానంగా అడిగాడు.
"లత మోసపోయింది నీ వల్లనే అని నాకు తెలిసిపోయింది-"
"అయాం సారీ-" అన్నాడు కిషోర్.
"కిషోర్! ఇలా ఎందుకు చేశావ్?" అన్నాను.
"లతను నువ్వు ప్రేమించావని నాకు ముందే తెలిసివుంటే ఈ పని జరిగుండేది కాదు. నువ్వు నాకా విషయం యెన్నడూ చెప్పలేదు-" అన్నాడతను.
"నేనడుగుతున్నది మిత్ర ద్రోహం గురించి కాదు. లతకెందుకు ద్రోహం చేశావని!" అన్నాను నెమ్మదిగా.
"ఆ విధంగా చెప్పాలంటే నేను నీకు ఉపకారమే చేశాను. లత నిజంగా మంచిది కాదు. సమాజంలో నాకున్న హోదాను, పలుకుబడిని ఆమె ప్రేమించింది. నన్ను పెళ్ళాడాలనుకుంది. ఓ రోజున ఏకాంతంలో నన్ను ప్రోత్సహించి, రెచ్చగొట్టింది. మోసపోయింది ఆమె కాదు-నేను!"
"ఏమైతేనేం-చివరికి నష్టపోయింది ఆమె కదా!" అన్నాను.
"నన్ను మోసం చేయాలనుకున్న వారందరూ నష్టపోతారు-" అన్నాడు కిషోర్.
"కానీ యెల్లకాలం అసాధ్యపడదు...."
"ఏమిటి నువ్వనేది? లత గురించి నువ్వు నాకు ఎదురు తిరుగుతావా?" అన్నాడు కిషోర్.
"నేను మిత్రద్రోహం గురించి మాట్లాడలేదు. నువ్వు చేసుకునే ఆత్మవంచన గురించి చెబుతున్నాను....."
కిషోర్ కోపంగా-"నువ్వు నన్నేమైనా చేయగలననుకుంటున్నావేమో-నీ జీవితం నా గుప్పిట్లో వున్నది- అన్నాడు.
"నేను నీ గురించి ఆలోచించను కూడా ఆలోచించను ఇప్పుడు నేనిక్కడికి యెందుకు వచ్చాను? నేనీ ఊరువదిలి వెడుతున్నాను. నీ ఆశీర్వచనం కావాలి-" అంటూ నాన్నగారి ఉత్తరం గురించి చెప్పాను.
"వెరీ గుడ్-ఐ విష్ యూ ఆల్ ది బెస్టు!" అన్నాడు కిషోర్.
9
నాకు పెళ్ళయి మూడు సంవత్సరాలయింది. జీవితం సుఖంగా కొనసాగిపోతున్నది. కిషోర్ మళ్ళీ నా జోలికి రాలేదు.
అనుకోకుండా కారు చెడిపోవడంవలన ఆ ఊళ్ళో ఆగవలసి వచ్చింది.
ఆ ఊరు నాకు బాగా గుర్తున్నది. నిజం చెప్పాలంటే నాకు ఆ ఊరి పేరు వినగానే లిల్లీ గుర్తుకొస్తుంది. లిల్లీతో గడిపిన వారం రోజులూ నేను మరిచిపోలేను. మగవాడిని ఎలా సుఖపెట్టాలో ఆమెకు తెలిసినంత బాగా కనీసం నా భార్యకు తెలియదని నేను ఒప్పుకోక తప్పదు.
కారును గ్యారేజీలో వదిలి సేఠ్ దుర్గాదాస్ షాపుకు వెళ్ళాను. అది కాకతాళీయమో ఏమో మరి-అప్పుడే ఒకతను దుర్గాదాస్ తో-"నన్ను లిల్లీ పంపింది!" అన్నాడు. దుర్గాదాస్ అతడికి ఏదో ప్యాకెట్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. అతడు సాయంత్రం దాకా ఇల్లు చేరుకోడు.
నా మనసు లిల్లీవైపు లాగింది.
ఇప్పుడు ఇంట్లో లిల్లీ ఒంటరిగా ఉంటుంది. ఒక్కసారి నేను వెడితే ఏం చేస్తుంది? నాతో ఏమని మాట్లాడుతుంది.
సాయంత్రందాకా కారు సిద్ధం కాదు. అంతవరకూ లిల్లీతో కాలక్షేపం చేయాలనుకున్నాను.
ఆమె ఇంటికి వెళ్ళాను. లిల్లీయే స్వయంగా వచ్చి తలుపు తీసింది. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు.
"గుర్తున్నానా?" అన్నాను.
ఆమె తల ఊపింది.
"నీతో గడిపిన ఆ వారం రోజుల అనుభూతీ ఈ జన్మకు సరిపోతుంది-" అన్నాను ఆమె వంకనే పరిశీలనగా చూస్తూ.
ఆమె మాట్లాడలేదు.
"మరో జన్మకు సరిపడా అనుభూతులకోసం ఇక్కడకు వచ్చాను-" అన్నాను.
ఆమె మాట్లాడలేదు.
నేనామెను సమీపించి-"ఏళ్ళు గడిచినా నీ వంటి నునుపులో యేమీ మార్పులేదు-" అన్నాను.
అప్పటికీ ఆమె మాట్లాడలేదు.
"మాట్లాడవేం లిల్లీ!" అంటూ ఆమెను సమీపించి ఆమె మేలి ముసుగును తొలగించి ఉలిక్కిపడ్డాను.
ఆమె లిల్లీ కాదు.
నేను చనిపోయిందని భావిస్తున్న లత!
"లతా!" అన్నాను ఆశ్చర్యంగా.
"నా పేరు లత కాదు. లిల్లీ!" అన్నదామె.
"ఏమిటీ మాయ?" అన్నాను అర్ధంకాక.
"లత నీకో ఉత్తరం రాసింది. దానిమీద వెంటనే నీవు చర్య తీసుకుని వుంటే లత లిల్లీగా మారివుండేది కాదు.....
"లత లిల్లీగా మారడమేమిటి?"
"లిల్లీలకోసమే కిషోర్ ఆడపిల్లలను మోసం చేస్తూంటాడు. మోసపోయిన ఆడదానికి వేరేదారి లేకుండాచేసి అప్పుడు తన నీడలో శిక్షణ ఇస్తాడు. ఈ యింట్లో లిల్లీ వుండదు. ఈ యింట్లో వుండే ఆమె పేరు లిల్లీ! నెల నెలా ఇక్కడి లిల్లీ మారుతూ వుంటుంది. మారిన లిల్లీ మరో ఊళ్ళో రోజీ అవుతుంది...."
"లతా-నిన్నీ నరకంనుంచి తప్పిస్తాను...." అన్నాను.
"నన్ను లతా అనకు. నన్నిక్కన్నించి తప్పించడం నీవల్ల కాదు. తప్పుకోవడం నాకు క్షేమం కాదు-" అన్నది లత.
"నేను బలవంతంగా నిన్నక్కన్నించి తీసుకునిపోయి నీకు మంచి వరుణ్ణి చూసి...."
"నేనింకా యేదో అనబోతుంటే-నీలో అంత సంకల్ప బలముంటే అందుకు ప్రేమ కారణమయుండాలి. నీలో అంత ప్రేముంటే ఈనాడు నేనిలా మారి వుండే దాన్ని కాదు. ఇప్పుడు నేను నీకంటే బలవంతురాల్ని- నన్ను బలవంతంగా ఇక్కన్నించి తీసుకుని వెళ్ళడం నీవల్ల కాదు-" అన్నది లత.
హఠాత్తుగా నాకు ఆనాటి లిల్లీ గుర్తుకు వచ్చింది. ఆమె నా వద్దనుంచి కాసెట్టును యెంత సులభంగా లాక్కుంది?
నేను మారు మాట్లాడకుండా అక్కణ్ణించి బయట పడ్డాను.
తనచుట్టూ జరిగే అన్యాయాలను పట్టించుకోకుండా తన బ్రతుకు బ్రతికే సామాన్యుడు భారత పౌరుడు. నేను భారత పౌరుణ్ణి!
-:ఐపోయింది:-
