7
"అలా కూర్చో వీరన్నా! మనసు మార్చుకున్నావా? నేనడిగింది చేసిపెడతావా?" అనడిగాడు జగన్నాధం.
వీరన్న అటూ యిటూ చూసి-"మీతో ఓ రహస్యం చెప్పాలి. గదిలో ఇంకెవ్వరూ లేదుకదా-" అనడిగాడు. జగన్నాధం చెప్పకుండానే గదిలో ఇంకెవ్వరూ లేదని తెలుస్తూనే వుంది.
"ఇక్కడున్నది మనమిద్దరమే! ఏం చెబుతావో చెప్పు!"
"మీరంటే నాకు చాలా గౌరవం బాబూ - మీలాంటి వాళ్ళు సిద్దపడితే నా చెల్లెలు వయసులో మీకంటే ఎంత చిన్నదైనా-దాన్ని మీకిచ్చి పెళ్ళిచేస్తాను...." అన్నాడు వీరన్న.
"ఏమిట్రా-ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు...."
"మీకు నా చెల్లెలంటే ఇష్టమేగా-పెళ్ళి చేసుకుందుకు అభ్యంతరమా?"
"ఎవర్రా నీ చెల్లెలు-అదెవ్వరో నాకు తెలియదు" అన్నాడు జగన్నాధం.
"మరి నిన్న సాయంత్రం నువ్వు బలవంతం చేసిన ఆడదెవరనుకున్నావ్?" అన్నాడు వీరన్న.
"అది.....అది......అదు నీ చెల్లెలా?" అన్నాడు జగన్నాధం తడబడుతూ.
"అవును..." అన్నాడు వీరన్న.
జగన్నాధం పొరపాటై పోయిందన్నాడు. వీరన్న చెల్లెలని తెలిసుంటే తను దాని జోలికి వెళ్ళి వుండేవాణ్ణి కానన్నాడు. ఇలాంటి పొరపాటు మళ్ళీ ఎన్నడూ జరక్కుండా చూస్తానన్నాడు.
"జరిగింది జరిగిపోయింది. జరిగేదీ జరిగిపోతుంది...." అన్నాడు వీరన్న.
"ఏమిట్రా జరిగేది?" అన్నాడు జగన్నాధం మేకపోతు గాంభీర్యంతో.
"నీ చావు..." అంటూ బొడ్లోంచి కత్తి తీశాడు వీరన్న.
"ఆఁ.....నన్ను చంపుతావా?" అన్నాడు జగన్నాధం.
"అవును నిన్ను చంపాలనే వచ్చాను. చంపుతాను. ఇది నీకే కాదు. నీలాంటి మగాళ్ళందరికీ వో పాఠంలో. చచ్చే ముందు ఓసారి నీ పాపాలన్నీ తలచుకుని దేవుణ్ణి ప్రార్ధించుకో..." అన్నాడు వీరన్న కత్తిని తళతళ లాడిస్తూ.
"నన్ను చంపితే నీకేం లాభం? నేను బ్రతికుంటే నీ చెల్లెలి పెళ్ళికి డబ్బిస్తాను. నీ అవసరాలన్నీ గడుపుతాను. నీకెన్నో సదుపాయాలు చేస్తాను" అన్నాడు జగన్నాధం.
"నా చెల్లెలి వంటిమీద చెయ్యివేసిన వెధవదగ్గర మళ్ళీ డబ్బుచ్చుకుంటానా? నేనంత నీతిలేనివాడి ననుకున్నావా?" అంటూ కత్తిని గాలిలో తిప్పాడు వీరన్న.
వాడా మాటలు పూర్తి చేసేసరికి గదిలో సోఫా క్రింద నుంచీ, బీరువా పక్కనుంచీ ఒక్కసారిగా నలుగురు మనుషులు వచ్చి వీరన్నమీద పడ్డారు. క్షణాలమీద వీరన్న నిరాయుధుడుగా వాళ్ళ మధ్య నిలబడ్డాడు.
"ఎంత మోసం? గదిలో ఎవరూ లేరని చెప్పి అబద్దమాడి..." అని మాటరాక ఆగిపోయాడు వీరన్న.
"విష సర్పాలతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పగబట్టిన పామువి...." అన్నాడు జగన్నాధం.
"నేను పగబట్టిన పామునే-ఏదో ఓ రోజున నిన్ను కాటేస్తాను..." అన్నాడు వీరన్న.
"నువ్వు చస్తే ఏమయ్యావని కూడా ఎవ్వరూ అడగరు. నీలాంటి అనామకుడు నన్ను చంపడానికి వస్తే బ్రతకనిస్తానా? ఇంక నువ్వు ఈ లోకాన్ని చూడవు. కాటికిపోతూ కాటు గురించి ఆలోచించకు...." అన్నాడు జగన్నాధం.
8
"నువ్వు హెచ్చరించకపోతే నా ప్రాణాలు నిజంగానే పోయుండేవి. నీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడంలేదు సత్యనారాయణా!" అన్నాడు జగన్నాధం.
"చూడు జగన్నాధం-మనలో మనకు యెన్ని గొడవలున్నా అవి మనం మనం చూసుకోవాలి. ఓ బ్రతుకు తక్కువమనిషి మనలాంటివాళ్ళమీద పగబట్టడమన్నది నేను సహించలేదు. నాకోసం వీరన్న నిన్ను చంపినా నాకు బాధ లేదు. కానీ తనకోసం నిన్ను చంపాడంటే సహించలేను. నా కూతురి గురించి నేను యెలా పగ తీర్చుకోవాలను కుంటున్నానో, వాడి చెల్లెలిగురించి వాడూ అలాగే పగ తీర్చుకోవాలనుకుంటే ఇంక నా కూతురి గొప్పేం యేడిసింది? వాళ్ళ నెప్పుడూ వాళ్ళ స్థానంలో వుంచాలి. అందుకే వాడు నా దగ్గరకొచ్చి నిన్ను చంపుతాననగానే నీకు హెచ్చరిక పంపాను" అన్నాడు సత్యనారాయణ.
"సత్యనారాయణా! నీ కూతురిపట్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించు" అన్నాడు జగన్నాధం.
"నేను నీ దగ్గర్నుంచి రహస్యాలు తెలుసుకోవాలను కున్నందుకు నన్నూ నువ్వు మన్నించాలి." అన్నాడు సత్యనారాయణ.
ఇద్దరూ ఒకర్నొకరు కౌగలించుకున్నారు. అప్పుడు సత్యనారాయణ నెమ్మదిగా "అవును వీరన్న చెల్లెలు ఎలా వుంటుందేమిటి?" అన్నాడు.
"ఓ రాత్రి చూడదగ్గ మనిషే!" అన్నాడు జగన్నాధం.
ఆ తర్వాత ఓ రాత్రి మంగమ్మ తన స్థానంలోనే తనుండి-సత్యనారాయణకు అతడి భార్యస్థానంలో ఉండే మనిషి కూడా అందించిలేని ఆనందం అందించింది. శంఖువులో పోయని నీరు తీర్ధం కాలేదుకదా-అందుకని జగన్నాధంలాంటి వాళ్ళకనుభవాలందించినా-మంగమ్మ సూరి గాడికి మాత్రమే పెళ్ళామయిందని వేరే చెప్పనక్కర్లేదు!
-:అయిపోయింది:-
