లత తండ్రి రఘు తండ్రికి ఏదో దూరపు వరుసలో తమ్ముడవుతాడు తప్పితే అసలు తమ్ముడు కాడు. అందువల్ల వాళ్ళ అన్నాచెల్లెళ్ళ బంధం కూడా బలహీనమైన దేనని బంధువర్గాల్లో కొందరనుకునేవారు. దానికి తోడు లత తల్లిదండ్రులిద్దరూ ఆమెకు పదిహేనేళ్ళప్పుడు కారు యాక్సిడెంట్లో మరణించడంవల్ల ఆమె వారి ఇంటనే వుండవలసి వచ్చింది. ఆమె పేరున బ్యాంకులో డెబ్బై వేల రూపాయలకు డిపాజిట్ వున్నది. అయినప్పటికీ ఈ అన్నాచెల్లెళ్ళ బంధంలోని అతి ఎన్నో అపార్ధాలకు దారితీసింది.
"అంతగా అదంటే నీకంత ఇష్టమైతే దాన్నే పెళ్ళిచేసుకో-తప్పులేదు-" అని కూడా రఘు తండ్రి ఓసారి అతడితో అన్నాడు.
"ఓ అన్న చెల్లెల్ని పెళ్ళాడతాడా?" అన్నాడు రఘు.
వారి బంధం అపార్ధం చేసుకోబడ్డదని వారిరువురూ అంటారు. ఏమైతేనేం లతకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదు. ఆమెకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆమె కారణంగా ఆ కుటుంబానికీ ఇబ్బందిగా వున్నది. అమెకా యింట్లో గౌరవంలేదు. రఘు ఒక్కడే ఆమెఉ ఓదార్చే వాడు.
చివరకు లత మేనేజరుగానే ఆ యిల్లు వదిలిపెట్టి తన దారి తను చూసుకుంది. అయిన వాళ్ళంతా వుండి ఆమెకు యెందుకూ కొరగాకుండా పోయారు. రఘుతానొక్కడూ వెళ్ళి ఆమెను చూసి వస్తూండేవాడు. అది తెలిసి తండ్రి కంగారుపడి అతడికి తొందరగా వివాహం జరిపించేశాడు. అతడి భార్య సరసుకు చూచాయగా ఈ విషయాలు తెలుసు. అయితే ఆమె భర్తను నమ్మింది. ఈ రోజులో ఆ నమ్మకం వమ్మయింది. తన ఆగ్రహాన్ని ప్రదర్శించిందామె.
ఆమె కాస్త శాంతించాక-"మీరీమెకు ఏం చెప్పారో నేను తెలుసుకోవచ్చా?" అన్నాడు రఘు తాపీగా.
అతడి ముఖం చూస్తూంటే నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. యెంతకైనా తగినవాడనిపించింది. ఆ రోజు హోటల్లో లతను అంత దుఃఖంలో బయటకు పంపినపుడూ అతడి ముఖం అలాగే వున్నది.
నేను లాడ్జిలో అతడినీ లతనూ కలిపి చూడడం, నేను విన్నవారి సంభాషణ చెప్పాను.
రఘు నిట్టూర్చి-"మీరు చూసినదేమిటి - అర్ధం చేసుకున్నదేమిటి-ఇలాంటి అపార్ధాలతోనే యెందరో మా జీవితాలను నరకం చేస్తున్నారు-" అన్నాడు.
"నాది అపార్ధం అర్ధం మీరు చెప్పండి-" అన్నాను.
"లత ఓ మోసగాడి వలలో చిక్కుకుంది. మోసపోయింది. ఆ మోసగాడినుంచి తనను రక్షించమని వేడుకునేందుకు నా వద్దకు వచ్చింది. ఆ మోసగాడికి సంబంధించిన కొన్ని రహస్యాలు నాకు తెలుసు. అవి బయట పెడతానని బెదిరించి వాడిని తనతో పెళ్ళికి ఒప్పించమంది. ఆ పని నావల్ల కాదన్నాను. అయితే తన బ్రతుకు అన్యాయమై పోతుందంది. కాని నేను ఏం చేయను?"
"నువ్వెంతగానో ఆమెను ప్రేమించావుగదా-ఆమె కోసం ఆమాత్రం చేయలేవా?" అన్నాను వెటకారంగా.
అతడూ సంబోధన మార్చి-"మిస్టర్! నేను లతను అభిమానించినప్పటికీ-అంతకంటే యెక్కువగా నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. నా జీవితంలోకి సరసువచ్చి నప్పట్నించీ-అది మా యిరువురికీ మరింతగా పరిమితమై పోయింది-" అన్నాడు.
"ఆమెకు కాపాడ్డంలో అంత ప్రమాదమున్నదా?"
"మాస్కో వెళ్ళి బ్రెజ్నెవ్ ను తిడితే ప్రమాదముంటుందా అన్న అనుమానం యెవరికైనా వుంటుందా?"
"దానికీ దీనికీ సంబంధమేమిటి?" అన్నాను.
"అయితే కిషోర్ సంగతి నీకు తెలియదన్నమాట!"
కిషోర్ పేరు వింటూనే ఉలిక్కిపడి-"కిషోర్-అంటే ఏ కిషోర్...." అన్నాను.
అతడు చెప్పిన వివరాలు నా స్నేహితుడు కిషోర్ కు సరిపోయాయి. ఆ తర్వాత నాకు నోటమాట రావడానికి కొంతసేపు పట్టింది.
రఘు చెప్పుకుంటూ పోయాడు. లత కిషోర్ ని ప్రేమించింది. అతడూ తన్ను ప్రేమించాడని నమ్మింది. ఓ బాలహీన క్షణంలో అతడికి లొంగిపోయింది. తర్వాత ఆమెను కిషోర్ వివాహం చేసుకుందుకు నిరాకరించాడు. ఆమె రఘు సాయం కోరింది. కిషోర్ కు భయపడి అతడు నిరాకరించాడు.
అతడు చెబుతూంటే నేను వినడంలేదు. ఆలోచిస్తున్నాను. ఇందులో కిషోర్ పాత్ర నిజంగా వున్నదా? అతడే ఆమెను మోసం చేశాడా? అందుకే నన్ను పొరుగూరు పంపేశాడా?
నేను కిషోర్ తో యేమన్నాను? వారం రోజుల్లో ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారకుడైనవాడి బ్రతుకు బయటపెడతానని! లతను నేను కలుసుకుంటే అసలు నిజం నాకు తెలిసి బయటపెడతానని కిషోర్ భయపడ్డాడా?
"నువ్వు చెప్పింది నిజం కావచ్చు. కానీ నమ్మదగ్గదిగా లేదు-" అన్నాను నేను రఘుతో.
"అన్నీ లతచేతే నీకూ, సరసుకూ కూడా చెప్పిస్తాను...."
"ఇంకా లత ఎక్కడుంది రఘూ - ఆమె జరిగిన అన్యాయానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది-" అన్నాను.
రఘు తెల్లబోయాడు. తర్వాత అతడు ముఖం చేతులతో కప్పుకుని ఏడ్వనారంభించాడు. అప్పుడు నరసు ప్రేమగా అతడితో అన్నది-"నా కోసం మీరు లతను కాపాడగలిగీ కాపాడలేదు. ఇది నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను-"
రఘు ఇంకా ఏడుస్తూనే వున్నాడు.
అప్పుడామె నావంక తిరిగి-"మీ పగ ఇప్పుడా కిషోర్ మీదకు మళ్ళి వుండవచ్చు. కానీ ఆ కిషోర్ వద్ద ఈయన పేరు చెప్పి మా జీవితాల్లోకి తుఫాను తీసుకురాకండి. పోయిన లత యెలాగూ బ్రతకదు-" అన్నది.
నేను లేచాను.
నా మనసంతా అయోమయంగా వున్నది.
లతను కులట అన్నాడు కిషోర్. రఘువల్ల ఆమె మోసపోయిందని తననుకున్నాడు. కిషోర్ ఆమెను మోసగించాడని రఘు అంటున్నాడు.
ఇందులో ఏది నిజం?
8
బస్సు దిగుతూనే గదికి వెళ్ళాను. గదిలో మూడుత్తరాలున్నాయి. ఒకటి నాన్నగారి దగ్గర్నుంచి మిగతా రెండింటిపైనా దస్తూరీ చూడగానే మనసేదో లా అయిపోయింది. ఆ దస్తూరీ లతది!
అంటే లత నాకుత్తరాలు రాసిందన్న మాట. అప్పిఉడు నేనూళ్ళోలేను.
ఒక వుత్తరం చిన్నది.
"మైడియర్!
జీవితంలో అనుకోనివిధంగా మోసపోయాను. నీతో అర్జంటుగా మాట్లాడాలి ఎల్లుండి "కోరుకున్న మొగుడు" పిక్చర్ కి మొదటి ఆటకురా- అన్నీ అక్కడ మాట్లాడుకుందాం-
నీ
లత."
రెండో వుత్తరం కాస్త పెద్దది.
"మైడియర్!
నువ్వు రాలేదు. నీ వునికి కూడా తెలియనివ్వకుండా ముఖం చాటేసి నీ మగబుద్ధిని ఋజువు చేసుకున్నావు. ఒకసారి జీవితంలో మోసపోయాక అది తెలిసి నీ జీవితంలోకి నేను ప్రవేశిస్తానని భయపడ్డావనుకుంటాను. ఈ లతను నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావు.
నీకు నామీద ప్రేమ ఉన్నదని తెలుసు. అది ఇంకా వుంటుందని నేననుకోవడం లేదు. ఈ ఉత్తరం నీకు అందే సమయానికి నేను నీకు అందని చోటుకు వెళ్ళిపోతాను.
