Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 57


    
                                       5

    "ఎంత బాగుందో" అంది ఇల్లంతా కలయదిరుగుతూ మంగమ్మ.
    బయటకంటే లోపల ఇంకా అందంగా ఉందా యిల్లు. పడకగది, స్నానాలగది, వంటగది చూస్తూ "ఈ యింట్లో నేనా మనముండేది?" అంది మంగమ్మ ఆశ్చర్యంగా.
    "అవును దీన్ని సంపాదించడానికి నేనేమైనా కష్టపడ్డాననుకుంటున్నావా? లేదు. ఆదాయాన్ని వృధా చేయకుండా పైసాపైసా కూడబెట్టి నాలుగేళ్ళలో ఇవన్నీ సిద్ధంచేశాను. కాబోయే పెళ్ళాం సుఖం ఒక్కటే నా ధ్యాస. మీ అన్న వున్నాడు.....చెల్లెలి పెళ్ళో చెల్లెలి పెళ్ళో అనడమేకానీ ఆ గుడిసె బ్రతుకునించి బైటపడాలని చూశాడా? సంపాదించిం దంతా వాడి తాగుడుకీ, జూదానికీ చాలదు - నా కలాంటి పాడు అలవాట్లేమీ లేవు. ఇంతవాణ్ణయ్యాను" అన్నాడు సూరిగాడు గర్వంగా.
    "నువ్వు చాలా గొప్పవాడివి...." అది మంగమ్మ. ఆమె కళ్ళల్లో అతడిపట్ల ఆరాధన కనబడింది.
    ఇద్దరూ కాసేపు కబుర్లు సెప్పుకున్నాక "మనిద్దరం ఎలాగూ ఇందులో కాపురం పెట్టబోతున్నాం. బీరువాలోంచి వచ్చిన బట్టలు తీసుకుని స్నానాల గదికి వెళ్ళి స్నానంచేసి అవి కట్టుకునిరా. వాటిల్లో చూడాలని చాలాకాలంగా నా కోరిక...." అన్నాడు.
    మంగమ్మ బీరువా తెరిచింది. అంత మంచి బట్టలు ఎన్నడూ చూసి వుండకపోవడంవల్ల - బట్టల ఎన్నికకు చాలాసేపు పట్టింది ఆఖరికి ఏవో ఎన్నుకుని స్నానాలగదికి వెళ్ళింది. లోపల స్నానం చేస్తూంటే ఎంతో హాయిగా వుందామెకు.
    "ఎన్ని సుఖాలిక్కడ? గుడిసెలో నా బ్రతుకు ఓ బ్రతుకేనా? ఏమైనా సరే సూరిగాన్నే పెళ్ళి చేసుకుని తీరాలి" అనుకుంటూ ఆమె వళ్ళు తుడుచుకుని ఆ బట్టలు కట్టుకుని బైటకు వచ్చింది.
    సూరిగాడామెను చూసి "ఎవరది? మా మంగమ్మే? స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసేమో ననుకున్నాను" అంటూ కవిత్వం చెప్పాడు.
    మంగమ్మ సిగ్గుపడుతూనే పడగ్గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి తన్నుతనే తనివితీరా చూసుకుని నేను నేనేనా అని ఆశ్చర్యపడింది.
    అక్కడ వున్న పౌడరు, స్నో, సెంట్లు అన్నీ ఎలా వాడుకోవాలో సూరిగాడు ఆమెకు వివరంగా చెప్పాడు. కొద్ది క్షణాల్లో మంగమ్మ ఘుమఘుమలాడిపోయింది.
    ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు.
    "నువ్వెంత అందంగా ఉన్నావంటే ఇప్పుడే నిన్ను పెళ్ళాడేయాలనిపిస్తోంది. కానీ, నిన్ను తాకనైనా తాకను. పెళ్ళయ్యేవరకూ ఆడాళ్ళను ముట్టుకోనని మా అమ్మకు మాటిచ్చాను...." అన్నాడు సూరిగాడు.
    మంగమ్మ ఆశ్చర్యంగా-"నువ్వెంత నీతిమంతుడివి? నీలాంటి వాణ్ణి గురించి మా అన్నెలాంటి తప్పుడు మాట లన్నాడు? ఈ రోజుల్లో నీకులాంటి వాళ్ళుండరు మగాళ్ళలో!" అంది.
    "ఏమన్నా డేమిటి మీ అన్న నా గురించి!" అన్నాడు సూరిగాడు కుతూహలంగా.
    "డబ్బుకోసం పెళ్ళాన్నికూడా వ్యభిచారంలోకి దింపేరకానివట...." అంది మంగమ్మ. అలా అన్నప్పుడామె ముఖంలో ఆ మాటలన్న అన్నపట్ల చులకనభావం కనబడింది.
    సరిగ్గా అప్పుడే వీధి తలుపులు తెరుచుకున్నాయి. గదిలో జగన్నాధం ప్రవేశించాడు. అతడిచేతిలో రివాల్వరుంది. అతణ్ణిచూసి సూరిగాడు భయం నటిస్తూ లేచినిలబడ్డాడు.
    జగన్నాధం రివాల్వర్ ఢాంమంది. సూరిగాడు కెవ్వున కేకపెట్టి పడిపోయాడు. మంగమ్మ కంగారుగా సూరిగాన్ని సమీపించబోయింది.
    "ఆగు...." అన్నాడు జగన్నాధం-రివాల్వర్ ఝుళిపిస్తూ.
    మంగమ్మ ఆగిపోయింది.
    "నేను చెప్పినట్లు వినకపోతే నీ ప్రాణాలు దక్కవు. ముందా గదిలోకి నడు..." అన్నాడు జగన్నాధం.
    గత్యంతరం లేక మంగమ్మ ఆ గదిలోకి నడిచింది. అది పడకగది!
    జగన్నాధం ఆమె వెనుకనే గదిలో ప్రవేశించి తలుపులు మూస్తూ-"ఇది సౌండ్ ప్రూఫ్ గది! నువ్వెంత అరిచినా బైటవాళ్ళకు వినపడదు" అన్నాడు.

                
                                      6

    సత్యనారాయణ నిద్రపోవాలనుకునే సమయానికి తన కోసం ఎవరో వచ్చినట్లు కబురొచ్చింది. మరొకరూ మరొకరూ అయితే అతనా సమయంలో ఎవర్నీ కలుసుకుని ఉండేవాడు కాదు.
    వచ్చింది వీరన్న....గూండా వీరన్న!
    "ఏమిట్రా ఈ సమయంలో వచ్చావ్-కొంపదీసి అప్పుడే జగన్నాధాన్ని చంపేసి వచ్చావేమిటి; డబ్బులకంత తొందరెందుకూ? పొద్దున్నదాకా ఆగలేక పోయావా?" అన్నాడు సత్యనారాయణ.
    వీరన్న బొడ్లోంచి నోట్లకట్ట తీసి సత్యనారాయణ కందించి-"మీ డబ్బు మీకు తిరిగిచ్చేద్ధామని వచ్చానండి-" అన్నాడు.
    సత్యనారాయణ ఆశ్చర్యంగా "ఏమయింది? నువ్వు జగన్నాధాన్ని చంపకూడదనుకుంటున్నావా? ఇంతలో నీ కేమయింది? అన్న మాట తప్పవని ప్రగల్భాలు పలికావు కదా-ఇదేనా నీ సత్య సంధత!" అన్నాడు.
    వీరన్న నిదానంగానే "అన్నమాట నేనెన్నడూ తప్పను. జగన్నాధాన్ని చంపి తీరతాను" అన్నాడు.
    "మరి డబ్బు వెనక్కిచ్చేశావేం? ఇచ్చిన అడ్వాన్సు చాలదా?"
    "డబ్బెందుకిచ్చేశానంటే...." ఒక్క క్షణం ఆగాడు వీరన్న "ఆ జగన్నాధాన్ని మీ కోసం చంపడం నా కిష్టం లేదు. వాణ్ణి ఆ వెధవని నేను నాకోసం చంపుతాను. నాకోసం మాత్రమే చంపుతాను. ఆ తృప్తికోసమే మీ డబ్బు మీ కిచ్చేస్తున్నాను...."
    సత్యనారాయణ మత్తు వదిలిపోయింది "ఏమయిందిరా నీకు!" అన్నాడు.
    "వాడు.....ఆ జగన్నాధం-నా చెల్లెల్ని చెరిచాడు. దాన్ని అమానుషంగా అనుభవించాడు. ఆ వెధవని బ్రతకనివ్వను. నా చేతుల్తో నేనే చంపుతాను. వాణ్ణి చంపడం నా పని. నా పనికి మీ దగ్గర డబ్బులు తీసుకోను. డబ్బులు తీసుకుంటే అది మీ పని అయిపోతుంది అలా అవడం నా కిష్టం లేదు" అన్నాడు వీరన్న కసిగా.
    సత్యనారాయణ ఆశ్చర్యంగా వీరన్నవంక చూసి- "నీ చెల్లెలెలాగుంది? ఏమీ ప్రమాదం లేదుకదా!" అన్నాడు ఎంతో దిగులునూ, బాధనూ అభినయిస్తూ.
    "ప్రస్తుతానికి ఏడుస్తోంది. నా పెళ్ళాం దగ్గరుండి ఓదారుస్తోంది. మీ యిళ్ళల్లోలా మా యిళ్ళలో యిలాంటి వాటికి ఆడాళ్ళు ప్రాణం తీసుకోరులెండి. కానీ ఆడదాన్ని బలాత్కరించడం ప్రాణం తీసుకోరులెండి. కానీ ఆడదాన్ని బలాత్కరించడం జగన్నాధంలాంటి పెద్దమనిషికి తగునంటారా? మీరే చెప్పండి బాబుగారూ...." అన్నాడు వీరన్న.
    "ఇంత పని చేశాక ఇంకా వాడు పెద్దమనిషేమిట్రా?" అన్నాడు సత్యనారాయణ.
    "అంత మాటన్నారు అదే చాలు బాబూ-వాణ్ణి చంపేసేక ముందు కబురు మీకే చెబుతాను..." అంటూ అక్కన్నించి వెళ్ళిపోయాడు వీరన్న.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS