ఆమె అడగ్గా-లతను రఘు ప్రేమించినట్లూ-ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడినట్లూ-ప్రస్తుతం ఆమె గర్భవతి అనీ చెప్పాను.
ఆమె అంతా విని-"నేనెవరో మీకు తెలుసా?" అన్నది.
"తెలియదు-" అన్నాను.
"పోనీ ఈ యింట్లో యెందుకుంటున్నారో ఊహించుకోగలరా?" అన్నది.
నాలో సస్పెన్సు రేకెత్తించాలని ఆమె ప్రయత్నిస్తున్నదని గ్రహించాను. అందుకు నేనూ సహకరించాలనుకున్నాను.
"వయసుకు బాగా చిన్నవారిలాగున్నారు. మీరతడి చిట్టిచెల్లెలై ఉండాలి-" అన్నాను.
ఆమె ఈ పొగడ్తకు సంతోషించింది. ముఖం కాస్త ఎర్రబడింది. కానీ తొందరగానే తమాయించుకుని-"ఏ చెల్లెలైనా అన్నను మీరని మన్నిస్తుందా?" అంది.
"అరే-ఆ విషయం నేను గమనించనేలేదు-" అన్నాను.
"నేనాయన భార్యను-"
షాక్ తిన్నట్లు నటించాను.
"మీరామాత్రం ఊహించి వుండాల్సింది-" అన్నదామె.
"ఎలా ఊహిస్తాను? రఘును నేను మర్యాదస్థుడిగా భావిస్తున్నాను. కేవలం పెళ్ళిమాటలకోసం వచ్చాను నేను-" అన్నాను.
ఆమె ముఖం అదొకలాగైపోయింది-"అది సాధ్యపడదని ఇప్పుడు గ్రహించారా?" అంది నెమ్మదిగా.
"ఎందుకు సాధ్యంకాదో తర్వాత ఆలోచిస్తాను. ముందు నేనతడితో చాలా మాట్లాడవలసి వున్నది-" అన్నాను కోపంగా.
"ప్లీజ్!" అన్నదామె అనునయంగా-"సాయంత్రం బీచికి రండి. అక్కడకు నేను మావారిని తీసుకుని వస్తాను-"
"ఇదేమైనా విహారయాత్రా బీచికి వెళ్ళడానికి...." అన్నాను.
"విహారయాత్ర కాదు. కానీ మేమిక్కడ నాలుగిళ్ళ మధ్య మర్యాదస్థుల్లా బ్రతుకుతున్నాం. ఆయనకిక్కడ మంచి పేరున్నది. ఇప్పుడు మీరిక్కడ రభసచేస్తే అది నలుగురికీ తెలిస్తే ఆయన నలుగురిలో తలెత్తుకోలేరు-" అన్నదామె.
"నలుగురిలో తలెత్తుకోలేనిపని చేశాక తప్పదుకదా!" అన్నాను.
"నాకు వారిమీద నమ్మకమున్నది. మీరాయన్నపార్దం చేసుకుని వుండాలని నా అనుమానం-" అన్నదామె.
"హిందూదేశంలో ప్రతి భార్యా ఈ విధంగా అనుకోవడంవల్లనే ప్రతి భర్తా తప్పులు చేస్తున్నాడు. ఫలితంగా ఆడదే నష్టపోతున్నది-" అన్నాను.
"ఒక్క క్షణం ప్లీజ్!" అన్నదామె-"మీరు నాణేనికి ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. ఆడది భర్తను అనవసరంగా అనుమానించడంవల్ల కూడా ఎన్నో సంసారాల్లో కలతలు రేగుతున్నవన్న విషయమూ మీకు తెలిసే వుంటుంది-"
"అంటే?"
"మీరు లతకు స్నేహితుడి నని చెప్పారు. ఆ అమ్మాయి ప్రేమించి మోసగించబడితే-మావారివద్దకు రావడానికి ఆమెకు అయిన వాళ్ళెవ్వరూ లేరా?"
"వున్నారు కానీ అయిన వాళ్ళతో కంటే మీతో యెక్కువ చనువు ఉన్నదన్నమాట-అందుకు కారణం ఏమిటి? మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులా?"
"కాదు...." అన్నాను.
"పోనీ మీ యిరువురిదీ హఠాత్తుగా ఏర్పడిన అన్నా చెల్లెళ్ళ బంధమా?"
ఏం జవాబు చెప్పాలో నాకు తెలియలేదు.
"జవాబేం చెప్పాలో అలోచిస్తున్నారా?" అన్నదామె.
"మీకు నిజం చెప్పేస్తున్నాను. ఆమెను నేను ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించినదీ లేనిదీ తెలియదు. ఆమెకు నా ప్రేమ గురించి చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. ఈలోగా ఈ విషయం తెలిసింది. ఇప్పుడైనా ఆమె నన్ను పంపలేదు. నా లతకు జరిగిన అన్యాయానికి నాలో కలిగిన ఆవేశం నన్నిందుకు అయత్తపరిచింది-" అన్నాను.
"ఆయన తనకు ఆ న్యాయం చేసినట్లు లత మీకు చెప్పిందా?"
నాకు చిరాకేసింది-"ఇవన్నీ మీరెందుకడుగుతున్నట్లు?" అన్నాను.
"ఎందుకంటే...." అని ఆగిందామె-"మీరు చెప్పిన ఊళ్ళోనే లత అనే ఆమె వున్నదనీ ఆమెకు అన్యాయం జరిగితే తను రక్షించలేకపోయాననీ ఆయన కొద్ది రోజులుగా నావద్ద బాధపడుతున్నారు....."
"ఆ అన్యాయం తనవల్లనే జరిగిందని ఆయన చెప్పలేదా?"
"ఆయన లతకు అన్యాయం చేస్తారని నేననుకోవడం లేదు....."
"ఎందుకని?"
"ఆయన వావివరసలు పాటించని మనిషి కాదు. లత ఆయన పినతండ్రి కూతురు-" అన్నదామె.
నేను చటుక్కున లేచి-"సరే-ఆయన్ను బీచీవద్ద కలుసుకుంటాను-" అన్నాను. సంకేత స్థలం ఆమె చెప్పింది.
7
రఘు భార్యను నేను పూర్తిగా నమ్మలేదు. నన్ను తాత్కాలికంగా వదిలించుకునేందుకామె నాకు చాలా పెద్ద అబద్ధం చెప్పిందని అనుమానంగా వున్నది.
బీచివద్ద కూర్చుని ఆలోచిస్తున్నాను. రఘుకీ లతకూ శారీరక సంబంధమున్నదనడానికి నావద్ద తిరుగులేని సాక్ష్యమున్నది. రఘు భార్య నమ్మినా నమ్మకపోయినా వారిరువురి విషయంలో నేను ప్రత్యక్ష సాక్షిని.
టైము సరిగ్గా ఆరయింది. తలెత్తి చుట్టూ చూశాను.
దగ్గర్లోనే ఆమె కనిపించింది. ఆమె పక్కనే రఘు వున్నాడు. ఆమె నన్ను చూపిస్తోంది. రఘు నన్ను గుర్తు పట్టినట్లు లేదు.
ఎలా గుర్తుపడతాడు? మేమిద్దరం ఒకేసారి ఒకరి కొకరం యెదురుపడి ముఖాముఖీ చూసుకున్నాం. ఒక అపరిచితుడిలా అతడు నన్ను చూశాడు. అతడి ముఖం గుర్తుంచుకొనడంకోసమే నేనతన్ని చూశాను.
ఇద్దరూ నన్ను సమీపించారు.
అతడు నన్ను చూస్తూనే-"మిమ్మల్నెక్కడా చూసిన గుర్తులేదు...." అన్నాడు.
ఇద్దరూ కూర్చున్నారు. ఆమె నాతో -"మీరు చెప్పినవేమీ నేనీయనకు చెప్పలేదు. మీరు తనను కలుసుకోగోరినట్లు చెప్పాను-" అన్నది.
నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకే కాబోలు అతడి ముఖం ప్రసన్నంగా వున్నది. నేనేమి చెప్పబోతున్నానో అతడికేమీ తెలియదనే అనిపిస్తున్నది.
"అయితే మళ్ళీ మొదలుపెట్టాలా?" అన్నాను.
"అవసరంలేదు-" అన్నదామె-"నేను మిమ్మల్ని బీచివద్ద వుండమని యెందుకు చెప్పానో తెలుసా?"
తల అడ్డంగా ఊపాను.
"నాకు ఆవేశం యెక్కువ. మనసులోని కోపం మాటల్లో పోతే తప్ప నేను త్వరగా మామూలు మనిషిని కాలేను. అందుకని ఈయన్ను మీ యెదురుగా పెట్టి బీచివద్ధ కడిగేయాలనుకున్నాను. ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడినా బాధలేదు-ఎవ్వరూ వినరు!"
అప్పుడు నేను అసలు సిసలు భార్యను చూశాను.
ఆమె ఆగ్రహావేశాలతో భర్తను నానా మాటలూ అన్నది. ఆమె అన్నదాన్నిబట్టి నేను గ్రహించిన కథ ఇది.
లత తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఆమెకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేకపోవడంవల్ల తోడుకోసం మహాతాపత్రయపడేది. ఆమెకు రఘు చాలా నచ్చాడు. అతడితో చాలా చనువుగా వుండేది. అతడామెను చెల్లాయ్ అనేవాడు. ఆమె అతడిని అన్నయ్యా అనేది. అయితే వారి అనుబంధం సినిమా అన్నాచెల్లెళ్ళ అనుబంధంలా ఎబ్బెట్టుగా ఉండేది.
