3
వీరన్న నారాయణను కలుసుకుని జరిగుందంతా చెప్పి-"నా బేరం పెంచడం కోసం మీ కీ సంగతి చెప్పడంలేదు. వీరన్న మాటంటే మాటే! పాతికవేలకే మీ పని చేస్తాను. కానీ జగన్నాధం కూడా మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. ఆ విషయం తెలుసుకుని మీ జాగ్రత్తలో మీ రుంటారని చెప్పడంకోసం వచ్చాను...." అన్నాడు.
"ఆయనక్కూడా నువ్విలాగే చెప్పలేదుగదా-" అన్నాడు సత్యనారాయణ అనుమానంగా.
"గూండా పని నా వృత్తి కావచ్చు. కానీ నేను మనుషుల్నిమోసం చేయను...." అన్నాడు వీరన్న.
"అయితే ఆయన్నెప్పుడు చంపుతావు?" అన్నాడు సత్యనారాయణ.
"బాగా ఆలోచించుకుని ఏ సంగతీ రేపొచ్చి చెప్పమన్నాడాయన. అది చెప్పడానికి వెళ్ళినట్లు వెళ్ళి చంపేసి వస్తాను. ఆ తర్వాత నన్ను మీరే రక్షించుకోవాలి...." అన్నాడు వీరన్న.
"జగన్నాధం ప్రాణాలు నువ్వు తీశావంటే ఆ తర్వాత నీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు-" అన్నాడు సత్యనారాయణ.
వీరన్న తిన్నగా యింటికి వెళ్ళాడు. అప్పటికి యింట్లో పెళ్ళామే కాకుండా చెల్లెలు కూడా ఉంది.
"కాఫీహోటల్ కాఫీ హోటల్ అని చాలా రోజుల్నుంచి కాల్చేస్తున్నారు గదా-అందుక్కావలసిన ఏర్పాట్లన్నీ చేస్కోండి. ఎల్లుండి మీకు డబ్బిస్తాను...." అన్నాడు వీరన్న.
"ఎక్కడిదిరా అంత డబ్బు!" అనడిగింది వీరన్న చెల్లెలు మంగమ్మ.
"పెద్దోళ్ళ పరిచయాలు. డబ్బు కావాలనుకోవాలిగానీ సంపాదించడం యెంతసేపు?" అన్నాడు వీరన్న నిర్లక్ష్యంగా.
"ఎవన్ని చంపుతానని ఒప్పుకున్నాడో ఏమో-" అంది వీరన్నభార్య రంగమ్మ.
"ఎవన్ని చంపితే మీ కెందుకు? మిమ్మల్ని చంపనంత కాలం మీకే బెంగా ఉండదు కదా!" అని-"కాఫీ హోటలు పెట్టామంటే మన పరువు పెరుగుతుంది. మంగమ్మకు మంచి సంబంధం వస్తుంది...." అన్నాడు వీరన్న.
పెళ్ళి అనగానే మంగమ్మ కాస్త సిగ్గుపడింది-కానీ మనసులో భయపడింది.
మంగమ్మను మళ్ళీ చేసుకుంటానని చాలా రోజులుగా సూరిగాడు తిరుగుతున్నాడు. సూరిగాడు ఎర్రగా బుర్రగా ఉంటాడు. సినిమా కబుర్లు చెబుతాడు. మంగమ్మకు వాడంటే ఇష్టమే! కానీ వీరన్నకు సూరిగాడంటే ఇష్టం లేదు. వాణ్ణి "నీతీ జాతీ లేని వెధవ" అని తిడతాడు వీరన్న. సూరిగాడు మంచివాడు కాదుట. డబ్బుకోసం ఎంత కక్కుర్తి పనైనా చేస్తాట్ట. పెళ్ళి చేసుకుంటే పెళ్ళాన్ని కూడా వ్యభిచారంలోకి దింపుతాడట.
సూరిగాన్ని పెళ్ళి చేసుకోవడం మంగమ్మ కిష్టమే! కానీ వీరన్న ఒప్పుకోని సంబంధం ఆమె చేసుకోదు. వీరన్న చెల్లెలికోసం కాస్త మంచి సంబంధాలే చూస్తున్నాడు. పెళ్ళికి అయిదారు వేలు ఖర్చయినా వెడతానంటున్నాడు. అలాంటివాడు రమణ ఉన్నాడు. రమణ ముభావం మనిషి. ఏదో కంపెనీలో వాచ్ మన్ గా పని చేస్తున్నాడు. నెలకు నాలుగొందలు జీతం. మంగమ్మను చేసుకోవడం అతగానికిష్టమే-కానీ వాళ్ళమ్మ కట్నం కావాలంటోంది. పెళ్ళి ఘనంగా చేయాలంటోంది.
డబ్బు చేతిలోపడితే ఈ సంబంధం స్థిరపరచాలని వీరన్న అభిప్రాయం. మంగమ్మకు రమణ అట్టే నచ్చలేదు. రమణ సరదాగా కబుర్లు చెప్పడు. సూరిగాడంత బాగుండడు. కానీ అన్న చెబితే అతణ్ణి పెళ్ళాడే టందుకు అభ్యంతరంలేదు. అన్న ఎలాగూ రమణసంగతే చెబుతాడు. రమణకు నీతీ జాతీ ఉన్నాయట. గౌరవంగా బ్రతుకుతున్నాట్ట.
అన్నకు డబ్బు జతపడగానే తన పెళ్ళి రమణతో జరుగుతుందని మంగమ్మకు తెలుసు. అందుకే డబ్బు జతపడకూడదని మనసులో కోరుకుంటోంది. వాటం చూస్తే అన్నకు పెద్ద మొత్తమే దొరికినట్లుంది. తనకు పెళ్ళి చేస్తానంటున్నాడు. కాఫీహోటల్ పెడతానంటున్నాడు....
ఈ విషయం సూరుగాడితో చెప్పాలనుకుంది మంగమ్మ.
వీరన్న తన రొంటిన ఉన్న డబ్బు కట్టనోసారి తడుముకున్నాడు. అప్పుడే అది ఇంట్లో చూపించాలన్న కోరిక కలిగింది వాడికి. అయితే డబ్బు చూశారంటే ఆడాళ్ళు కదలరు. ఇప్పుడే ఏమైనా ఖర్చులంటారు. అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ పని పూర్తి చేయకుండా అందులో పైసా కూడా వాడు కోడు వీరన్న. "ఎందుకొచ్చిన తొందర-రేపెలాగూ పని పూర్తిచేసుకుని వస్తాగా-అందాకా-అదిక్కడే భద్రంగా ఉంటుంది-"అనుకున్నాడు వీరన్న.
4
మంగమ్మ చెప్పిందంతా విని "అయితే వ్యవహారం పీకలమీదకు వచ్చిందన్న మాట!" అన్నాడు సూరిగాడు.
"నువ్వేమైనా చేయగలిగితే చేయి" అంది మంగమ్మ.
"మీ అన్నంటే నాకూ భయమే. అయితే ఓ ఉపాయం లేకపోలేదు" అన్నాడు సూరిగాడు. వాడి బుర్రలో రక రకాల ఆలోచనలు మెదుల్తున్నాయి. ఆలోచనలమధ్య జగన్నాథం వున్నాడు.
జగన్నాధానికి ఆడాళ్ళు కావాలి. ఆడాళ్ళలోనూ వెరైటీ కావాలి. వెరైటీకోసం ఆయన సూరిగాడిలాంటి వాళ్ళను చాలామందిని పోషిస్తున్నాడు. ఈ రోజు సూరిగాడు ఆయనకో చక్కనిచుక్కను తెచ్చిస్తానని వాగ్ధానం చేసి అడ్వాన్సు పుచ్చుకున్నాడు. మంగమ్మను ఒక్కరాత్రికి ఆయనకు అప్పగించాడంటే మంగమ్మ చెడిపోయినట్లే! అప్పుడు రమణ గాడు దాన్ని చేసుకోడు. దాన్ని చేసుకునేవాడు తనొక్కడే!
సూరిగాడు మంగమ్మను కాసేపు కబుర్లలోపెట్టి దాని మనసు తెలుసుకున్నాడు. అది అగ్గిలాంటిది. తను చెప్పే పనికి ఒప్పుకోదు. అందుకు వేరే వుపాయం చూడాలి. ఇందులో తన ప్రమేయం ఉన్నట్లు వీరన్నను తెలిసిందంటే వాడు తనని బ్రతకనివ్వడు.
సూరిగాడికి బుర్ర చురుగ్గా పనిచేస్తోంది.
ఊళ్ళో జగన్నాధానికి చిన్న పెంకుటిల్లుంది. అది కేవలం ఆడవాళ్ళను అనుభవించడంకోసమే ఆయన ఉంచుకున్నాడు. ఆ యింటికి యెలాగో అలా మంగమ్మను తీసుకుని వెళ్ళాలి.
సూరిగాడు మంగమ్మతో "మీ అన్నకు నా గురించి పూర్తిగా తెలియదు. నా కూళ్ళో మంచి ఇల్లుంది. ఆ ఇంట్లో మన సంసారం కోసం ఒక్కొక్కటే అమర్చుకుంటూ వస్తున్నాను. పెళ్ళై కాపురం పెట్టాలిగానీ చీరలతో సహాఅన్నీ సిద్దంగా వున్నాయి. ఒక్కసారి నువ్వొచ్చి చూడు. నచ్చితే మీ అన్నకు నచ్చజెప్పొచ్చు" అన్నాడు.
"ఎక్కడుందా యిల్లు?" అనడిగింది మంగమ్మ ఆతృతగా.
సూరిగాడు చెప్పాడు.
"అయితే యెప్పుడు చూపిస్తావ్?" అనడిగిందామె.
"సాయంత్రం మొదటాటకని చెప్పి యింట్లో బయల్దేరు. సినిమా హాల్దగ్గర నిన్ను కలుసుకుంటాను. ఇద్దరం కలిసి మా యింటికి వెడదాం. మా యిల్లు చూసి నీకు నచ్చితే మనం మనువాడేద్దాం. నాకైతే కట్నం కూడా అక్కర్లేదు."
మంగమ్మ ఆలోచనలు పరుగెడుతున్నాయి. సూరిగాన్ని చూడగానే గొప్పవాడనిపిస్తుంది. అలాంటి మొగుడే కావాలనిపిస్తుంది. వాడికిల్లు కూడా ఉందిట. ఇవన్నీ అన్నకు తెలియవా. ఆ చచ్చు రమణంటే అన్న యెందుకు పడిచస్తున్నాడు? సూరిగాడు అన్నకెందుకు నచ్చడు?
"నన్ను పెళ్ళాడితే నువ్వు తనకంటే గొప్పదానివై పోతావని వాడి భయం. నాకూ వాడంటే భయమే-నీకూ వాడంటే భయమే-మన పెళ్ళి జరగాలంపే నువ్వైనా ఇష్టపడితే నాక్కస్త ధైర్యంగా వుంటుంది" అన్నాడు సూరిగాడు.
