Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 56


    నేను చటుక్కున గది తలుపులు మూశాను. లిల్లీ నా వంక ఆశ్చర్యంగా చూస్తూండగా-"బహుశా పులుసు లోకి కూడా ఎముక మిగలదు...." అన్నాను.
    నేను లిల్లీని యెక్కువగా హింసించవలసిన అవసరం లేకపోయింది. చిన్న శాంపిల్ దెబ్బలకే ఆమె భయపడి పోయి నిజం చెబుతానన్నది.
    ఆ గదిలో టేపురికార్డరున్నది. ఓ కాసెట్టుని లోడ్ చేసి ఆమె చెప్పిందంతా రికార్డు చేశాను.
    లిల్లీ ఓ పెద్ద స్మగ్లింగ్ గ్యాంగుకు చెందిన మనిషి. ఆమెకు సంఘంలో మంచి పలుకుబడి ఉన్నది. ఎందరో రాజకీయ నాయకులు, పురప్రముఖులు, పోలీస్ ఆఫీసర్లు ఆమెకు అనుకూలురు. ఆమె బంగళాలో ఒంటరిగా వుంటున్నది. కానీ రాత్రిళ్ళు జంటగా లేని రోజు అరుదు.
    స్మగ్లింగ్ అపరేషన్సు కు పథకాలు వేయడంలో ఆమె అందెవేసిన చేయి. అయితే ఆమెకు అప్పుడప్పుడు కొత్త మనుషులు అవసరపడుతూంటారు. అందుకు కిషోర్ లాంటి వాళ్ళు సాయపడుతూంటారు. లిల్లీ పథకాలెంత పకడ్బందీగా వుంటాయో నేనే స్వయంగా చూశాను. అయిదారేళ్ళ పసిపాపలకు కూడా తను కోరిన విధంగా శిక్షణ ఇవ్వగల సామర్ధ్యం ఆమెకున్నది.
    నేను ఆ కాసెట్టే తీసుకుని జేబులో వేసుకుని-"ఇది ఎప్పుడెలా నాకు అవసరపడుతుందేమోనని దగ్గరుంచుకుంటున్నాను. నీకు చెప్పకుండా మాత్రం దీన్ని ఉపయోగించనని హామీ ఇస్తున్నాను- అన్నాను.
    లిల్లీ నావంక చూసి-"ఇప్పుడేనా నీకు నా ప్రేమ మీద నమ్మకం కలగలేదా?" అన్నది.
    "అంటే?" అన్నాను.
    "నేను నిన్ను నిజంగా ప్రేమించాను. అందుకే నా వివరాలు నా నోటితో చెప్పాను-"
    "నువ్వు ప్రేమతో నాకీ వివరాలు చెప్పలేదు. భయంతో -"అన్నాను.
    లిల్లీ నవ్వి -"నాకు భయమా-అందులోనూ నువ్వంటే!" అన్నది.
    "నా జేబులోని ఈ కాసెట్టే నీ భయానికి నిదర్శనం."
    "నామీద నీకున్న అపోహను పోగొట్టి-నా ప్రేమను ఋజువు చేసుకోక తప్పదు-" అన్నది లిల్లీ.
    అప్పుడు చూశాను నేను లిలీ అసలు ప్రతాపం.
    నన్ను లోమ్గాదీసి అశక్తున్ని చేయడానికి ఆమెకు సరిగ్గా రెండేరెండు నిముషాలు పట్టింది. అంతవరకూ నేను మగాణ్ణి, ఆమె ఆడది అని భావిస్తూ వచ్చాను. నా వెర్రిగానీ-ఓ పెద్ద స్మగ్లింగ్ గ్యంగును నడుపుతున్న ఆడది సామాన్యురాలవుతుందా.
    ఆమె నా భుజాలమీద, నడుం పక్కన, మోకాళ్ళకు పైన-మూడు దెబ్బలు వేసింది. తిరుగు దెబ్బతీసే అవకాశం నాకివ్వలేదు. నా వద్దనున్న కాసెట్టే తీసుకుంది. రికార్డర్లోవేసి ఆన్ చేసింది.
    "నువ్వు టేప్ చేసిందంతా కానుకగా నీకే ఇచ్చేయాలనుకున్నాను. ఆ టేపు నన్నేమీ చేయలేదని నాకు తెలుసు. కానీ నువ్వు నా ప్రేమను అనుమానించావు. అందుకే మొత్తం చెరిపేస్తున్నాను-" అన్నది లిల్లీ.

                                     5

    కిషోర్ కిమ్మని లిల్లీ నాకో వాచీ ఇచ్చింది. దాన్ని భద్రంగా కిషోర్ కి అందజేశాను.
    "ఎలా గడిచిందీ వారం రోజులూ!" అన్నాడు కిషోర్. అతడి ముఖం చూస్తూంటే ఎలా గడిచిందీ తెలిసినవాడిలాగే వున్నాడు.
    నేను నవ్వాను.
    "లిల్లీ ఈజే స్వీట్ గర్ల్-" అన్నాడు కిషోర్.
    అంటే అతడికి వ్యవహారం పూర్తిగా తెలుసునన్న మాట!
    "నీ కళ్ళలో వెలుగు కనబడుతోంది. అదే నేను చూడాలనుకున్నది-" అన్నాడు కిషోర్ మళ్ళీ.
    "థాంక్స్!" అన్నాను. "అన్నట్లు లత ఎలాగున్నది?"
    కిషోర్ ముఖం అదోలా అయిపోయింది-"లతా గురించి నువ్వు ఆలోచించక పోవడం మంచిది-" అన్నాడు.
    "ఏమయిందో చెప్పు-" అన్నాను.
    "లత ప్రవర్తన మంచిదికాదు. ఆమె బారినుంచి తప్పించుకోవడం నీ అదృష్టం. ఆమెకు చాలామంది పురుషులతో సంబంధం ఉన్నది. అయితే నీ ఒక్కడికి తప్ప ఆమె పరిచయస్థులందరికీ ఆమె గురించి తెలుసు-" అన్నాడు కిషోర్.
    "నేనోసారి లతను కలుసుకుని మాట్లాడతాను. ఆమె అలా యెందుకు ప్రవర్తించిందో తెలుసుకోవాలి-" అన్నాను ఆవేశంగా.
    "లతను కలుసుకొనడం నీవల్లకాదు-ఆమె ఈ లోకంలో లేదు-" అన్నాడు కిషోర్. అతడి ముఖంలో ఏ విధమైన భావమూ లేదు.
    కూర్చున్నవాడిని చటుక్కున లేచి నిలబడి-"ఏమన్నావ్?" అన్నాను.
    "లత ఆత్మహత్య చేసుకుంది-"
    "ఆమె ప్రవర్తన మంచిదికానప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేముంది?" అనడిగాను.
    "ఆమె రఘును పెళ్ళి చేసుకోవాలనుకుంది. అతడికి తన గురించి తెలియదనుకుంది. అతడు తెలివిగా ఆమెను అనుభవించి తను వివాహితుడినని చెప్పాడు. అప్పుడామెకు ఏం చేయాలో తెలియలేదు. రఘు ఆమెకు ఉపాయం చెప్పాడు. నిన్ను ట్రాప్ చేయాలనుకున్నారు. కానీ నువ్వూ ఆమెకు ముఖం తప్పించావు-" అన్నాడు కిషోర్.
    "నేను ముఖం తప్పించలేదు. నువ్వే నన్ను బైటకు పంపావు-"
    "నేను నా అభిప్రాయం చెప్పడంలేదు. లత ఏమనుకుని ఆత్మహత్య చేసుకున్నదో చెప్పాను-" అన్నాడు కిషోర్.
    "లత చచ్చిపోతుందని తెలిస్తే నేనామెను వదిలివెళ్ళి వుండేవాణ్ణి కాదు. కలుసుకుని ధైర్యం చెప్పి ఉండేవాణ్ణి-" అన్నాను దిగులుగా.
    "ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని నేనూ అనుకోలేదు. వయసు తొందరలో కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు సవరించుకోలేనని గ్రహించి నిరాశచెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ దేశంలో ఆడది జాగ్రత్తగా వుండాలి. లేకుంటే లత గతే అందరికీ పడుతుంది-" అన్నాడు కిషోర్.
    "వస్తాను కిషోర్ -" అంటూ లేచాను.
    "ఎక్కడికి బయల్దేరుతున్నావ్? కాసేపిక్కడేవుండు" అన్నాడు కిషోర్ జాలిగా నావంక చూస్తూ.
    "ట్రయిన్ దిగుతూనే నీ వద్దకు వచ్చాను. రూంకు వెళ్ళాలి-" అన్నాను.
    కిషోర్ నవ్వి ఊరుకున్నాడు.
    
                                      6

    అయితే నేను నా గదికి వెళ్ళలేదు. నాలో ఆవేశం రగుల్తున్నది. లత ప్రవర్తన మంచిదికాదని కిషోర్ చెప్పినప్పటికీ-నాకు మాత్రం రఘు పాత్ర ఇందులో చాలా ఉన్నదనిపిస్తున్నది.
    ముందు రఘు అంతం చూడాలి!
    రఘు చిరునామా నాకు పూర్తిగా గుర్తున్నది. అందుకే తిన్నగా బస్ స్టాండుకు వెళ్ళాను. సరిగ్గా గంటలో రఘు ఊరు చేరుకున్నాను. అతడి ఇంటికి వెళ్ళాను. ఓ అందమైన యువతి తలుపు తీసింది.
    "రఘు ఇంట్లో వున్నాడా?" అన్నాను.
    "లేరు-" అన్నదామె.
    ఆమె అన్నదాన్నిబట్టి ఆమె రఘు భార్య అని అర్ధం చేసుకోగలిగాను. ఇంత అందమైన భార్య వుండగా రఘు మరో ఆడదాని బ్రతుకు బండలు చేశాడు. అయితే తప్పు కొంత లతలోనూ ఉన్నది.
    "నేను లోపలకు రావచ్చా?" మర్యాదగా అడిగాను.
    "మీరెవరు?" అన్నదామె.
    "నేను లతకు స్నేహితుడిని-" అన్నాను.
    "లత ఎవరు?" అన్నదామె.
    "రఘుకు కాబోయే భార్య-"
    ఆమె ఉలిక్కిపడి - "లోపలకు రండి-" అన్నది. తానెవరో నేను గ్రహించలేదనుకున్నదో ఏమో తను చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS