తీర్ధంకాలేని నీళ్ళు
గూండా వీరన్న గుడిసెలో కూర్చుని దర్జాగా బీడీ కాలుస్తూండగా సత్యనారాయణ దగ్గర్నుంచి పిలుపు వచ్చింది. కాలుస్తున్న బీడీ పారేసి వాడు సత్యనారాయణ ఇంటికి పరుగున వెళ్ళాడు.
సత్యనారాయణ ఆ ఊళ్ళో ఓ పెద్దమనిషి. లక్షాధికారి ఆయన పిలిచాడంటే వీరన్నకు మంచి బేరమే తగుల్తుంది.
"వచ్చావా-నీతో చాలా పెద్దపనే పడింది...." అంటూ సత్యనారాయణ వాణ్ణి రహస్యంగా ఓ గదిలోకి పిల్చుకు వెళ్ళి-"ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న పని నాకెంతో ముఖ్యమైనది" అన్నాడు.
"చెప్పండి..."
"జగన్నాధాన్ని చంపేయాలి..." అన్నాడు సత్యనారాయణ.
వీరన్న ఉలిక్కిపడ్డాడు. మనుషుల్ని చంపడం వాడికి కొత్తకాదు. అయితే వాడు చంపిన వాళ్ళందరూ చిన్న మనుషులే కానీ పెద్దమనుషులు కారు. జగన్నాధం చిన్న మనిషి కాకపోవడం సంగతి అటుంచితే సత్యనారాయణ కంటే కూడా కాస్త ఎక్కువ పెద్ధమనిషే! వీరన్న అతడి క్కూడా చాలా పనులు చేసిపెట్టాడు.
"అసలేం జరిగింది బాబూ...." అన్నాడు వీరన్న.
"ఏం జరిగిందా - ఉచ్చంనీచం తెలీకుండా నా కూతురి జోలికి వచ్చాడు...." అన్నాడు సత్యనారాయణ కోపంతో బుసలు కొడుతూ.
జరిగిందేమిటంటే ఓ రోజు సత్యనారాయణ కూతురు రమ జగన్నాధం ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో జగన్నాధం తప్ప ఇంట్లో మరెవ్వరూ లేరు. అప్పుడాయన రమ చేయి పట్టుకుని బలవంతం చేయబోయాడు. అతి కష్టంమీద రమ తప్పించుకుని వచ్చి తండ్రికి జరిగింది చెప్పింది. సత్యనారాయణ వీరన్నను పిలిపించాడు.
వీరన్న ఆశ్చర్యపోయాడు. సత్యనారాయణ కూతురికి ఇరవై ఏళ్ళుంటాయి. చక్కనిచుక్క. బంగారుబొమ్మ అంతమాత్రాన యాభై పైబడ్డ జగన్నాధం ఆమె చేయి పట్టుకుంటాడా? పట్టుకుంటే ఆ మాత్రానికే సత్యనారాయణ జగన్నాధాన్ని చంపాలనుకుంటాడా?
"ఏమిట్రా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు సత్యనారాయణ.
"ఆయన చాలా పెద్దోడు. అలాంటోన్ని చంపడానికి వీలు కుదుర్తుందాండీ?" అన్నాడు వీరన్న. వాడు వీలు గురించి తప్పితే హత్యగురించి బెంగపడడం లేదు.
"అది నువ్వాలోచించుకోవాల్సిన విషయం. పని జరిగితే పాతికవేలిస్తాను."
వీరన్న కళ్ళు మెరిశాయి. అంత డబ్బును వాడెన్నడూ కళ్ళతో చూడలేదు. సాధారణంగా వాడి పనులకు ప్రతి ఫలంగా ఏ తాగుడో దొరుకుతుంది. డబ్బిచ్చినా వెయ్యి రూపాయల లోపే! అది వాడు తాగుడుకీ, జూదానికీ క్షణాల మీద ఖర్చుపెట్టేస్తాడు. పాతిక వేలంటే మాటలుకాదు. దాంతో తన జాతకమే మారిపోవచ్చు.
"అడ్వాన్సివ్వండి" అన్నాడు వీరన్న.
2
వీరన్న గుడిసె చేరేసరికి వాడి పెళ్ళాం ఇంట్లో ఉంది. "ఇప్పుడే జగన్నాధంగారి మనిషొచ్చి వెళ్ళాడు-"అని కబురు చెప్పిందామె. వెంటనే వీరన్న జగన్నాధం ఇంటికి వెళ్ళాడు. జగన్నాధం వాణ్ణి రహస్యంగా ఓ గదిలోకి తీసుకెళ్ళి-"నువ్వు సత్యనారాయణను చంపేయాలి...." అన్నాడు.
వీరన్న తెల్లబోలేదు కానీ-""ఎందుకండీ...." అనడిగాడు.
"వాడు తన కూతుర్ని నామీదకు గూఢచారిలా ప్రయోగించాడు...." అన్నాడు జగన్నాధం.
జరిగిన దేమిటంటే ఓ స్మగ్లింగ్ ఆపరేషన్లో కొంత రహస్య సమాచారం ముందు జగన్నాధాన్ని చేరినట్లు సత్యనారాయణకు తెలిసింది. అది రాబట్టడానికి ఏ ఉపాయమూ దొరక్క చివరికి తన కూతుర్నే జగన్నాధం ఇంటికి పంపి ఎలాగో అలా ఆ రహస్యం తెలుసుకురమ్మన్నాడు. ఆ పిల్ల తళుకు బెళుకుల ప్రదర్శన మొదలయ్యేసరికి జగన్నాధం ఉద్రేకపడి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె కంగారు పడి పోయి అసలు విషయం చెప్పి పారిపోయింది. స్మగ్లింగ్ ఆపరేషన్లో ఆ ఊళ్ళో జగన్నాధం, సత్యనారాయణ లాంటి పెద్దమనుషులు పన్నెండుగురున్నారు. వాటిలో రెండు పార్టీలున్నాయి. జగన్నాధం పార్టీ పెద్దది. అందులో ఎనమండుగురు పెద్దమనుషులున్నారు. ఒక పార్టీవాళ్లు ఒకరినొకరు మోసం చేసుకోకూడదన్నది వారి నియమం. సత్యనారాయణ నియమోల్లంఘన కావించాడు. అందుకు శిక్ష చావు ఒక్కటే!
"ఆయన పెద్దమనిషి ఎలా హత్య చేసేది?" అన్నాడు వీరన్న.
"నువ్వు తల్చుకుంటే సాధించగలవు. అందుకు నీకు మంచి ప్రతిఫలం కూడా వుంటుంది. ఒక్క హత్యకు పాతికవేలు!" అన్నాడు జగన్నాధం.
వీరన్న సందిగ్ధంలో పడ్డాడు. తనిప్పుడేం చేయాలి?
ఇద్దరిలో ఎవర్ని చంపాలి?.....ఇద్దరినీ చంపుతానని ఇద్దరిదగ్గరా అడ్వాన్స్ తీసుకుంటే ఆ మోసం వాళ్ళు సులభంగా కనిపెట్టేస్తారు. తన మోసం బైటపడిందంటే తనకు పులుసులోకి ఎముకలుండవు. పెద్ద మనుషుల్తో వ్యవహారం. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ అని ఇద్దరి దగ్గరా డబ్బు తీసుకుని-ఇద్దర్నీ చంపేస్తే-తను పట్టుబడడం తథ్యం. అప్పుడు తన్ను రక్షించేవాళ్ళుండరు. ఇద్దిరిలో ఒకరు తనకు అండగా నిలిస్తే తప్ప తను బ్రతికి బట్ట కట్టలేడు.
వీరన్న క్షణం ఆలోచించాడు. అప్పుడు వాడికి తను చూసిన పాండవోద్యోగ విజయాలు నాటకం గుర్తొచ్చింది. అందులో కృష్ణుడు కౌరవులకు సాయపడలా, పాండవులకు సాయపడాలా అని ఆలోచించి-తను ముందుగా చూసిన అర్జునుడికే మొదటి అవకాశం ఇస్తాడు. తనిప్పుడు ముందు సత్యనారాయణ చూశాడు. ఆయన దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అందువల్ల తను జగన్నాధాన్నే చంపాలి.
"ఏమిట్రా ఆలోచిస్తున్నావ్?...." అన్నాడు జగన్నాధం.
"హత్యలు చేయడం నా వల్ల కాదు బాబూ-....." అన్నాడు వీరన్న.
"ఏమిట్రా-ఇంతవరకూ ఎవర్నీ చంపనట్లే మాట్లాడతావ్!" అన్నాడు జగన్నాధం.
"ఎవర్నైనా చంపినా వాళ్ళంతా చిల్లరమనుషులు పెద్ద మనుషుల నీడలో బ్రతికే నేను పెద్దమనుషుల్ని చంపలేను" అన్నాడు వీరన్న.
వాడి మాటల్లో ఏదో సందేశం కనపడింది జగన్నాధానికి. పెద్దమనుషుల్ని చంపే అలవాటు వీరన్నలాంటివాడికి చేయడం తమబోటి పెద్దమనుషులకు యెంతవరకూ మంచిది!
వీరన్న ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. వెళ్ళే ముందు జగన్నాధం వాడితో-"బాగా ఆలోచించుకో-కావాలంటే ఇంకో అయిదువేలెక్కువిస్తాను. ఏ సంగతీ రేపు చెప్పు!" అన్నాడు.
