Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 55


    "సార్-అదే మనిషి-" అన్నాడు ఇన్ స్పెక్టర్ పక్క పోలీసు.
    ఇన్ స్పెక్టర్ నా చేతిలోని ప్యాకెట్ చెక్ చేశాడు. అందులో ఓ బొమ్మ ఉన్నది. బొమ్మ అందమైనది. ఖరీదైనది. పోలీసులకు సంబంధించినంతవరకూ అది సాధారణమైనది.
    "ఈ బొమ్మ దేనికి నీకు?" అనడిగాడు ఇన్ స్పెక్టర్.
    "నా స్నేహితుడి పాపకీరోజు పుట్టిన రోజు-" అన్నాను.
    ఇన్ స్పెక్టరు నాతో వచ్చాడు. నేను స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. అతడెవరో నాకు తెలియదు. కానీ తలుపు తీస్తూనే అతడు నన్ను చూసి-"హలో-టైముకొచ్చేశావా - అయినా నీ పంక్ట్యుయారిటీ నాకు తెలియంది కాదులే-" అన్నాడు.
    అతడి చనువుకు నేనాశ్చర్యపోయాను.
    అప్పుడతడు నా వెనుకనున్న పోలీసుల్ని చూశాడు "అరె-వీళ్ళెవరు?" అన్నాడు.
    "ఈయనతో నాకు మొన్న పరిచయమయింది. ఈయనకీఊరు క్రొత్తగా ట్రాన్సుఫరయిందట. ఇళ్లకోసం అన్వేషిస్తున్నారు. నువ్వేమైనా సాయపడగలవని తీసుకొచ్చాను-" అన్నాను.
    "ఓ-ష్యూర్-మీరు కూడా లోపలకు రండి-" అన్నాడతడు.
    అంతా లోపల అడుగుపెట్టాం. అప్పుడు వచ్చింది అతడి భార్య. నన్ను చూస్తూనే-"వచ్చారా అన్నయ్యగారూ-టైమంటే మరీ అంత కరెక్టుగా ఉండాలా? అన్న టైముకి ఓ అరగంట ముందువస్తే మీ సొమ్మేంపోయింది?" అన్నదామె.
    నేను తెల్లబోయాను. ఆమెను నేను ఒక్కసారికూడా చూడలేదు. ఏమనాలో తెలియక-"పప్పీ ఏదీ?" అన్నాను. ఆ పాప పేరు పప్పీ అని లిల్లీ నాకు చెప్పింది.
    "మీకోసం ఒకటే మారాం చేస్తోంది ఇందాకట్నుంచీ! ఇప్పుడే దొడ్లో జారి పడింది. బాత్రూంలోకి వెళ్ళింది వళ్ళు కడుక్కుందుకు. అదృష్టంకొద్దీ ఇంకా కొత్త బట్టలు వేసుకోలేదు. మీరు వచ్చేకనే వేసుకుంటుందిట. మీరే దానికి తొడగాలిట...." అన్నదామె.
    ఇంతలో ఓ పాప అక్కడకు వచ్చి నన్ను చూస్తూనే "అంకుల్!" అంటూ ఒక్కసారి మీదపడి నా మెడ చుట్టూ తన రెండు చేతులూ వేసింది.
    ఆ పాపకు అయిదారేళ్ళు మాత్రం ఉంటాయి. నే నెప్పుడూ ఆ పాపను చూడలేదు. అంత చిన్న పాప నన్ను గుర్తుపట్టి నామీద పడడం నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే అలా మీదపడే పిల్లలంటే నాకు అసహ్యం. అయినా ప్రకటించలేదు.
    ఇన్ స్పెక్టరు లేచి-"మరి నేను వస్తాను..." అన్నాడు.
    ఆ పాప కూడా నన్ను గుర్తుపట్టి మీద పడటంతో నామీద ఆయనకు కలిగిన సందేహాలన్నీ పటాపంచలైనట్లున్నాయి.
    "వచ్చిన పని మరిచిపోయారా?" అన్నాను.
    ఇన్ స్పెక్టరు కళ్ళు తుడుచుకుని-"జీవితంలో నాకు స్నేహితులు లేరు. మా యింట్లో కుటుంబ సభ్యులమే అంటీ ముట్టనట్లుంటాము. మీ స్నేహం చూస్తూంటే నా మనసేదోలాగైపోయింది. నాకూ ఇలాంటి స్నేహితులుంటే యెంతో బాగుండుననిపిస్తోంది-" అన్నాడు.
    ఇన్ స్పెక్టరు ముఖం చూశాను. ఆయన్ను చూస్తూంటే నిజంగానే చలించిపోయిన వాడిలాగున్నాడు.
    మా స్నేహం ఆయన్ను కదిలించింది. కానీ మా స్నేహం ఒక నాటకం.
    తెరపై అమితాబ్ బచ్చన్, శతృఘ్నసిన్హా ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులు. కానీ తెర వెనుక.....! ఆ సంగతి చాలామందికి తెలియదు. ఆ నటుల పాత్ర పోషణలో వారి స్నేహం నిజమవుతుంది. మేము కూడా ఇప్పుడు అటువంటి అధ్బుతరస పోషణ చేస్తున్నాము.
    నేను చూస్తూండగా అతడు ఇన్ స్పెక్టరుకు స్వీట్సు పెట్టి-ఇళ్ళ వివరాలిచ్చి పంపించాడు. నాతో నాటకం యధాప్రకారం కొనసాగించాడు. నేను పాపకు స్వయంగా బట్టలు తొడిగాను. బొమ్మను బహుమతిగా ఇచ్చాను.
    అతడు నాకో చిన్న సంచీ యిచ్చాడు. అది తీసుకుని ఇంకోచోటకు బయల్దేరాను. అలా అన్నీ పూర్తిచేసుకుని లిల్లీ వద్దకు వచ్చాను. ఆమెను ఉదయపు విశేషాల గురించి ప్రశ్నించకుండా ఉండలేకపోయాను.
    "ఆ సమయంలో నాకు నువ్వూ, నీకు నేనూ తప్ప మరేమీ కనిపించకూడదు. అర్జునుడి ఏకాగ్రత ఉండాలి. మన మనసుల్లో మన గురించి తప్ప మరో ఆలోచన ఉండకూడదు...."
    లిల్లీ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసి మైమరిపిస్తోంది. కానీ అదెంతసేపు?
    ఆ యింట్లో అతడు, ఆమె, ఆ చిన్న పాప-అంతలా ఎలా నటించగలిగారు? ఒక పోలీసు ఇన్ స్పెక్టర్నే కదిలించ గలిగిన విశేషమది!
    నాకు ఆశ్చర్యంగా వున్నది లిల్లీ. చెప్పడంలేదు.
    మరో రెండుసార్లు నేనూ ఇన్ స్పెక్టర్ తటస్థపడ్డాము.
    "మాటిమాటికీ మీ వెంటబడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మాకు ఆకాశరామన్న ఫోన్ వస్తున్నది. దాని మీద యాక్షన్ తీసుకోవాలని బయల్దేరితే మీరు తటస్థ పడుతున్నారు. ఆ ఫోన్ చేస్తున్నదెవరో తెలుసుకుందామంటే రోజుకొక టైములో-రోజుకొక చోటు చొప్పున మార్చేస్తున్నాడు. సాధారణంగా పబ్లిక్ బూత్ ఉపయోగిస్తున్నాడు-"అన్నాడు ఇన్ స్పెక్టర్ నాతో మూడవ సారి మేమిద్దరం కలిసినప్పుడు.
    ఆయన చివరి రెండు పర్యాయాలూ నామీద అనుమానంతో కాక తను సక్రమంగా బాధ్యతను నిర్వహించానన్న తృప్తికోసం నన్ను పరీక్షించి చివర్న సారీ కూడా చెప్పాడు. ఆయన నాకు స్నేహితుడైనాడని చెప్పుకోవాలి.
    ఆఖరు రోజున నేను లిల్లీని మరీమరీ నొక్కించాను.
    "నా మనసును ఎన్నో ప్రశ్నలు దొలిచేస్తున్నాయి. అలాంటప్పుడు అర్జునుడిలా ఏకాగ్రత వహించడం ఎలా కుదురుతుంది?" అన్నాను.
    "ఇన్నాళ్ళూ కుదిరి ఇప్పుడెందుకు కుదరదు? నీకు నా మీద వ్యామోహం తగ్గి పోయిందన్న మాట...." అన్నది లిల్లీ.
    "పోనీ అలాగే అనుకో-అయితే అందుకు కారణం నువ్వనుకుంటున్నది కాదు. నా నుంచి నువ్వు రహస్యాలు దాచడం...." అన్నాను.
    "నీనుంచి రహస్యాలు దాచడం నీకిష్టంలేదు. ఆ సంగతి నువ్వు నాకు చెప్పేశావు అంటే......ఇంక రేపు నీవు ప్రయాణం కావచ్చు-" అన్నది లిల్లీ.
    అర్ధమయింది నాకు.
    లిల్లీ ఓ పెద్ద ఆకర్షణ! ఆ ఆకర్షణలో యెవరైనా ఎటువంటీ పనైనా చేయగలరు? కానీ ఆ ఆకర్షణ యెన్నాళ్లు? అందుబాటులో వున్న ఆడది మగవాడికి లోకువకావడానికి ఎన్నాళ్ళో పట్టదు! ఏ రోజునైతే మగవాడిమీద లిల్లీకి అదుపు తప్పుతుందో-ఆ రోజే వాడికీ లిల్లీకీ ఋణం తీరిపోతుంది.
    బహుశా మరో కొత్తవాడు లిల్లీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇదీ కిషోర్ ఆడుతున్న నాటకం!
    నాకు కోపం వచ్చింది. లిల్లీ నన్ను ప్రేమించలేదు. మోహించలేదు. ఆదుకుంది. నాతో తన పనులకు నన్నుపయోగించుకుంది.
    నేను మగవాణ్ణి లిల్లీ ఆడది!
    ఆ యింట్లో మేమిద్దరమే ఉన్నాం. లిల్లీ చేత నేను నిజం చెప్పించలేనా? చెప్పించలేకుంటే నా మగతనం ఏమున్నది?
    "చూడు....నీమీద చేయి చేసుకొనడం నాకిష్టంలేదు. కానీ నువ్వేమిటో నీ కధేమిటో నువ్వు నాకు చెప్పాలి..." అన్నాను.
    "చెప్పకపోతే...." అన్నది లిల్లీ. ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనబడింది. బహుశా నా ఉద్దేశ్యం ఆమెకు అర్ధమయే ఉంటుంది.
    "ఇంతకాలం నా ప్రేమను రుచిచూశావు. ఈ రోజు ద్వేషాన్ని రుచిచూస్తావు...." అన్నాను.
    "నన్ను ద్వేషించడం నీకు అసాధ్యం..." అన్నది లిల్లీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS