"ఇంకో కారణం కూడా ఉన్నదా?" అన్నాను. ఆమె చెప్పేలోగా ఆ కారణం ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను. మాకున్న స్వల్ప పరిచయంలో ఆమె నాతో అలా మాట్లాడుతుందని నేననుకోను. మనిషిని చూడగానే గౌరవం పుట్టించేలాగునే ఉంటుంది లిల్లీ.
"నేను ఎప్పుడూ నా అదుపులో ఉంటాను. ఈ సమాజంలో అందులోనూ ఓ ఆడపిల్ల చాలా జాగ్రత్తగా మసలాలన్న విషయం నాకు బాగా తెలుసు. అయితే నిన్ను చూడగానే నాకు పరాయివాడివనిపించలేదు. ఎప్పట్నించో తెలిసినట్లు, యెంతో ఆత్మీయుడవైనట్లు అనిపించింది. అందుకు కారణం బహుశా నాకే తెలియదు....."
నేను ఆశ్చర్యపోయాను. నేనూహించింనది లిల్లీ చెప్పిందానికి యెంతో దగ్గర్లో ఉన్నది. అయితే లిల్లీ నోట విన్నాక ఆ కారణం ఎంతో రమ్యంగా, ఆహ్లాదకరంగా ఉన్నది. "థాంక్స్-" అన్నాను.
"నేనే నీకు థాంక్స్ చెప్పాలి-నా వద్దకు వచ్చి నందుకు...."
4
లిల్లీ అందం మగవాళ్ళని రెచ్చగొట్టేదైతే-లిల్లీకే మగవాళ్ళను రెచ్చగొట్టడం తెలుసు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే నేను లిల్లీకి లొంగిపోయాను. అసలాయింట్లో నేను లిల్లీకోసం అడుగుపెట్టినట్లే ప్రవర్తించింది లిల్లీ.
మొదటిసారి లొంగిపోయాక నాకెంతో బాధనిపించింది. ఎంతోకాలంగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్న ఈ శరీరాన్ని ఎంత సులభంగా మలినపరిచాను?
నా మనసు నా బలహీనతను అంత సులభంగా ఒప్పుకోదల్చుకున్నట్లు లేదు. నేను లొంగకపోవడానికది కారణాలు వెతికిపెడుతున్నది. అందులో ఒకటి లత.
నేను పవిత్రంగా ఉండాలనుకున్నది లతకోసం. లత నాక్కాకుండా పోయిందని తెలిసేక ఆ పవిత్రతకు అర్ధంలేదు.
ఒక వేళ లత ప్రాణాలు రక్షించడంకోసం నేనామెను వివాహం చేసుకున్నా ఆమె పవిత్రురాలు కాదు. ఆ బాధ ఆమెను దహించకుండా నేనూ ఓ తప్పుచేశానని చెప్పుకోవచ్చు ఆమె మనసు కూరట కలిగించవచ్చు.
లతకోసం ఎన్ని ఎత్తులైనా అధిరోగించగలను. యెంత పాతాళానికైనా దిగిపోగలను.
"ఎంత నీచానీకైనా ఒడిగట్టగలవా?" అని మనసు వెనుకనుంచి అంతరాత్మలాంటిదేదో ప్రశ్నించబోయింది. మనసది వినిపించుకోలేదు.
లతకోసం నేను లిల్లీకి లొంగిపోయాను.
అయితే మొదటిరోజునే లిల్లీ నాతో అన్నది-"నువ్విక్కడ వారంరోజులుంటావూ-" అని!
నేను లతకోసమే లిల్లీకి లొంగిపోయి ఉండవచ్చు. కానీ లిల్లీకోసం లిల్లీ మాటకూడా వినగలిగాను. నేనామె చెప్పిన మాట విన్నాను.
నేనేంచేసినా లిల్లీ సంతోషంకోసమే అనుకున్నాను. నా సంతోషం గురించి ఒక్కసారికూడా అనుకోలేదు.
లిల్లీ నేనూ ఆ వారంరోజులూ కేవలం ఆ బంగాళా లోనే గడిపాననుకోవడం పొరపాటు. లిల్లీ నాకు చాలా పనులు చెప్పింది.
రోజంతా యెన్నో కార్యక్రమాలుండేవి. అన్నింటికీ ఓ టైముండేది. కార్యక్రమాల్లో ఆఖరున నేను లిల్లీతో గడపాలి. అదెలాగో కూడా ఆమె ముందే చెప్పేది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె నన్ను ఊరించేది. ఆ కార్యక్రమంకోసం అంతవరకూ లిల్లీ చెప్పిన పనులన్నీ చేసేవాణ్ణి-తూచా తప్పకుండా లిల్లీ నన్ను మెచ్చుకునేది. అన్నమాట తప్పకుండా ఆఖరి కార్యక్రమాన్నమలు పరిచేది.
ఒకరోజు నేను సేఠ్. దుర్గాదాస్ నగల దుకాణానికి వెళ్ళాను. లిల్లీ పేరు చెప్పగానే ఆయన నాకు చిన్న ప్యాకెట్ ఇచ్చాడు. అందులో ఏముందో చూసే అవకాశం నాకు కలగలేదు. అధిమమూలుగా బంగారు గొలుసులుండే పెట్టెలాగానే ఉన్నది. కానీ మూత తెరవడం నాకు సాధ్యపడలేదు.
ఆ ప్యాకెట్ తీసుకుని బృంధావన్ హోటలుకి వెళ్ళాను. మేనేజరుకి లిల్లీ పేరు చెప్పగానే-అయన నన్ను పక్క గదిలోకి తీసుకుని వెళ్ళాడు. నేనిచ్చిన ప్యాకెట్ తీసుకుని నాకో బ్రీఫ్ కేసు ఇచ్చాడు. అ బ్రీఫ్ కేసును ఇంకోచోట ఇచ్చాను. అలా రోజంతా వస్తువులు మార్పిడీ చేస్తూనే ఉన్నాను.
ఆఖరున మళ్ళీ నా చేతికి ఓ చిన్న ప్యాకెట్ వచ్చింది. మొదట నాకు దుర్గాదాస్ ఇచ్చినలాంటిదే. విచిత్ర మేమంటే నేను ఆ ప్యాకెట్ దుర్గాదాస్ కివ్వడంతో ఆనాటి కార్యక్రమం ముగుస్తుంది.
అయితే నా కార్యక్రమం నేననుకున్నంత సులభంగా ముగియలేదు.
నేను దుర్గాదాస్ షాపులో అడుగుపెట్టగానే పోలీసు డ్రస్సులోని ఓ మనిషి నన్నటకాయించాడు. అతడు ఇన్ స్పెక్టరయి ఉండాలనుకున్నాను. అతడి పక్కనే వున్న మరో పోలీసు-"సార్! అదే పాంటు-అదే షర్టు..." అన్నాడు.
"మిష్టర్-నీ చేతిలోని ఆ ప్యాకెట్ ఏమిటి?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అదా?" అన్నాను-"ఉదయం ఓ నాగ తీసుకుని వెళ్ళాను. అది నా లిల్లీకి నచ్చలేదు. తిరిగి ఇచ్చేస్తున్నాను."
"నేనోసారి ఆ ప్యాకెట్ తెరవ్వచ్చా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
నేను దుర్గాదాస్ వంక కంగారుగా చూశాను.
"ఉదయం నా దగ్గర అతడు నాగ తీసుకున్నాడు సార్! లిల్లీగారు మావద్ద తఃరచుగా షాపింగు చేస్తూంటారు. ఇందులో అనుమానించదగ్గదేమీలేదు సార్..." అన్నాడు దుర్గాదాస్ కంగారులో వినయాన్ని జోడించి.
లిల్లీ పేరు మరోసారి వినబడగానే ఇన్ స్పెక్టరు తడబడ్డాడు - "ఏమైనా ఒకసారి చూడాలి. ఇతగాడు లిల్లీ పేరు తన ప్రయోజనానికి వాడుకుంటున్నాడేమో-"
నాకు ఆశ్చర్యం వేసింది. లిల్లీ అందరికీ లిల్లీయేనా? అదే ఆమె అసలు పేరా? ఆమె కేదో పెద్ద పేరు ఉంటుందనీ కిషోర్ ఆమెకు లిల్లీ అన్న ముద్దు పేరుంచాడనీ నా అనుమానం. అయితే ఊరంతా ఆమెను లిల్లీ అనడమే కాక- ఆమెకు బాగా పలుకుబడి కూడా ఉన్నట్లు తోచింది.
నేను మాట్లాడకుండా ఇన్ స్పెక్టర్ కు ఒక ప్యాకెట్ అందించాను. ఆయన అది తెరిచాడు.
నాకు కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. ఆ పెట్టె అంత సులభంగా ఎలా తెరుచుకుంది? ఉదయం నేను చాలా తంటాలు పడ్డానే?
పెట్టెలో ఓ నగ వున్నది. అంతకుమించి అందులో ఇంకేమీలేదు.
దుర్గాదాస్ ఇన్ స్పెక్టర్ని ఆ నగ అందుకుని నా చేతికి ఓ నోట్లకట్ట ఇచ్చి-"ఉదయం మీరిచ్చిన పాతిక వేలూ తిరిగి ఇచ్చేస్తున్నాను-" అన్నాడు.
నేను ఉదయం సేఠ్ కు డబ్బివ్వలేదు. అయితే ఎక్కడా నేను ఏమీ యెదురు ప్రశ్నలు వేయరాదన్నది లిల్లీ ఉత్తరువు.
ఇంటికి వెళ్ళినపుడు లిల్లీని ఆశ్చర్యంగా నా కార్యక్రమం గురించి ప్రశ్నలు వేశాను. లిల్లీ అందంగా విసుక్కుని-"మన కార్యక్రమం గురించి నువ్వేమైనా ప్రశ్నలు వేస్తే నేను చాలా సంతోషిస్తాను-" అన్నది.
ప్రతిరోజూ నేను ఓ కొత్తచోటుకి వెడుతున్నాను. వెళ్ళిన చోటుకి మళ్ళీ వెళ్ళడంలేదు. నా పనేమిటో నాకు అర్ధంకావడంలేదు. కానీ మొత్తం నాలుగుసార్లు నన్ను పోలీసులు అనుమానించారు. నాలుగుసార్లూ సులభంగానే బయటపడ్డాను. అందువల్ల నామీద నాకే నమ్మకం కలిగింది. లిల్లీ చెప్పే పనుల్లో తేడా ఏమీలేదనీ అనిపించింది.
ఎందుకంటే మొదటి రోజున నా కార్యక్రమం చివర్లో పోలీసులు నన్నుమానించారు. మూడో రోజున నేను కార్యక్రమాన్ని ఓ బొమ్మల షాపులో ప్రారంభించాను. అక్కడ షాపువాడు నాకో ప్యాకెట్ ఇచ్చాడు. ప్యాకెట్ అందుకుంటూండగా పోలీసులు వచ్చారు.
