తనంతవాడై చేతికందివచ్చిన ప్రయోజకుడైన కొడుకు, తన చితికి నిప్పంటిస్తాడనుకుంటే తన కళ్ళముందే దాటిపోయాడు. ఆఫీసు, ఫాక్టరీలు, బ్రాంచీలు అన్ని తెగనమ్మేశాడు గోవిందరావు. వేణు పోయిననాటినుండి ఆయన మానసికంగానూ, దైహికంగానూ కృశిస్తున్నాడు.
ఈ సంఘటనతో సారథి మరింత వైరాగ్యాన్ని పొందాడు. ఉదయం కృష్ణమందిరం దగ్గిరికి వెళ్ళి అక్కడ వేపచెట్టుకింద సాయంత్రం వరకూ కళ్ళు మూసుకుని మౌనిలా కూర్చుంటాడు. రాత్రి ఒక్కసారే అతని భోజనం.
ఆర్తి తన వైద్యశాలనుధర్మాసుపత్రిగా మార్చింది. ఆశ్రమం పేర విరాళాలు, రోగులు కృతజ్ఞతకోద్దీ ఇచ్చేడబ్బు.....ఇస్తే తీసుకుంటుంది. అదైనా ఆమెకాదు. విశ్వానికే ఆ భారం ఒప్పగించింది. ఆర్తి కోరటంవల్ల విశ్వం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నిర్మల తప్పు గ్రహించి అతని ననుసరిస్తూంది.
చెయ్యి తిరిగిన శిల్పి మలచిన పాలరాతి విగ్రహంలా ఉన్న రాధ అస్థిపంజరమే అయింది. మాటకూడా మాట్లాడదు. వేణు మరణించాక గోవిందరావు, రాధ ఇక్కడే ఆర్తి దగ్గర ఉంటున్నారు. తనే వాళ్ళను తీసుకు వచ్చింది ఆర్తి.
రఘుపతి, వర్ధనమ్మ రాధను తమతో తీసుకు వెళదామని వచ్చారు. రాధ ఎక్కడికీ రానని చెప్పేసింది. ఎవరు చెప్పినా వినలేదు. చేసేదిలేక వాళ్ళు దుఃఖిస్తూనే వెళ్ళారు. తరుచు వచ్చి చూసిపోతుంటారు.
రాధ ఒక రకమైన ఉన్మాదావస్థకు వచ్చింది. ఆకలి దప్పులను పట్టించుకోదు. అన్నం తింటే తింటుంది. లేకపోతే లేదు. గదిలో కిటికీ దగ్గిర పడుకొని దీనదృష్టులతో గోల్కొండవైపు తిరిగి 'ఎన్ని ప్రేమ గాథలు నీలో జీర్ణించుకున్నావు! మమ్మల్నీ అలాగే జీర్ణించుకొంటావా?' అనుకుంటుంటుంది.
లేకపోతే పెన్సిలు తీసుకుని, తెల్లకాగితాల పుస్తకంలో "మామయ్యా" అని వ్రాయటమో, వేణు బొమ్మ గియ్యటమో చేస్తుంది. ఆమెలో ఉన్మాదావస్థ అతని బొమ్మను చక్కగా చిత్రించేట్లు చేస్తుంది.
తను వేసిన బొమ్మను జాలిగా చూస్తుంది. "ఎందుకు నవ్వుతావు, మామయ్యా? నువ్వెక్కడికి వెళ్ళావు? నన్ను తీసుకువెళ్ళవూ?" అంటుంది.
ఆమెకూడా ఎన్నాలో బతకలేదు.
ఒక ఉదయం తొమ్మిది అయినా రాధ గదిలో నుండి రాలేదు. అలికిడికూడా ఉన్నట్లు లేదు. ఆర్తి తప్ప ఎవరు పిలిచినా మాట్లాడదు. రెండుసార్లు ఆర్తి పిలిచినా ఏవిధమయిన శబ్దము లేదు. తలుపులు నెట్టగానే తెరుచుకున్నాయి. దగ్గిరికి వెళితే మూసుకున్న రాధా కనురెప్పలమీద అనంతమైన నిశ్చలత.
గుండెమీద తెల్ల కాగితం. దానిమీద వేణు చిత్రం, మరికొన్ని మాటలు. "పిన్నీ, గోల్కొండ శిఖరాల మీదుగా మామయ్య పిలిచే పిలుపు నాకు వినవస్తూంది. ఇన్నాళ్ళబట్టి దానికోసమే ఎదురుచూస్తున్నాను. ఇంకా నా కిక్కడేం పని, పిన్నీ? వెళ్ళిపోతున్నాను. నీకు నమస్కారాలు. తాతయ్యకు, బాబాయికి, అమ్మా నాన్న...."
"చెబుతానమ్మా, చెప్పక నేను చేసేదేం ఉంది? ఇని చెప్పడానికే నేను జీవించిఉన్నాను, రాధా! అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళుతున్నారు.'
* * * *
పాలు, పళ్ళుతప్ప సారథి ఒక్కపూట భోజనం కూడా మానేశాడు. ఆర్తి హాస్పిటల్ భారమంతా భాగేశ్వరికే వదిలివేసింది. సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉంటుంది. గీతాపఠనమే ఆమె కాలక్షేపం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదువుతుంది. గీతలో ప్రతి అక్షరమూ ఆమె రక్తాణువుల్లో కరిగిపోయింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్లోకం గొణుగుతూనే ఉంటుంది.
అయిదు గంటలప్పుడు ఆమె సారథి దగ్గిరికి వెళుతుంది. మోకాళ్ళమీద కూర్చుని, తలమీద ముసుగుతో మూసినా కళ్ళతో తనూ మౌని అవుతుంది.
రజనీ ప్రియ ఎదిగింది. మాటలుపట్టుబడుతున్నాయి. బాజీ ఆ అల్లు నేర్చుకుంటున్నాడు. నిర్మల తనే ఇద్దరి బాధ్యత వహించింది.
నీలకంఠం, కరుణా స్వగ్రామంలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు.
యాదగిరి, సునీతల జాడ ఎవరికీ తెలియదు.
ఇప్పుడు కృష్ణమందిరం దగ్గిర ప్రార్ధనలు జరగటం లేదు. ఆ మందిరానికి ముందు రెండు సమాధులు వెలిశాయి,
ఒకరోజు గోవిందరావు అన్నాడు: "ఆనాడు అత్తయ్యను క్రూరంగా హింసించి, పాపకూ ఆమెకూ ఎడబాటు కలిగించినదానికి ఫలితం ఇదే కావచ్చు. ఒక మాతృమూర్తి ఆత్మహత్యకు కారకుడనయిన నేరానికి శిక్ష ఎక్కడో అవుపించని నరకంలో కాదు, ఇక్కడే అనుభవిస్తున్నానమ్మా. వేణును ఈ చేతులతోనే నీకు అప్పగించి, నిర్విచారంగా కన్ను మూద్దామనుకున్నా. కాని....కాని.... వాడే నీకు నన్ను ఒప్పగించి, తనదారిన తను వెళ్ళాడు. రాధకూడా..." ఆయన పూరించలేకపోయాడు.
"గంగోత్రి....హిమాలయా ఆ ప్రాంతాల్లో శేష జీవితాన్ని గడుపుతాను. సారథికోసం వెళ్ళినప్పుడు చూశాను. నేను అక్కడికే వెళతానమ్మా."
ఆర్తి బదులు చెప్పలేదు.
"ఏమమ్మా? నా కిక్కడ ఉండటం దుర్భరంగా ఉంది."
"వెళ్ళు, నాన్నా! వెళ్ళకమాత్రం చేసేదేంఉంది? వారికీ నాకూ విముక్తి లభిస్తే బాగుండును...."
ఆర్తి ఒక్కతే వెళ్ళి ఆయనను సాగనంపింది.
రోజులు చిక్కబడుతున్నాయి. నెలలవుతున్నాయి. నెలలు ఘనీభవించి కాలవాహినిలో కరిగిపోతున్నాయి.
వర్తమానం వేగంగా పరుగులుతీస్తున్నది. ఈ రోజు రేపు అవుతున్నది. రేపు ఎన్నడో అవుతున్నది. సంవత్సరాలు ప్రస్తుతాన్ని మరుపురాని గతంగా మాత్రమే మిగులుస్తున్నాయి.
ఇరవై బరువైన సంవత్సరాలు దొర్లాయి.
ఒకానొక సంధ్యాసమయం.
దినకరుడు పశ్చిమ దిగింతరేఖల్లోకి జారిపోతున్నాడు. యుద్ధరంగంలా రక్తాన్ని పులుముకున్న ట్లున్న నింగి రంగు మార్చుకొంటున్నది. సంధ్య మాసి చీకట్లు అలుముకొంటున్నాయి.
వయస్సు మళ్ళిన ఒకాయన కృష్ణమందిరం ముందు వేపచెట్టునీడలో మట్టిగద్దెమీద పద్మాసనం వేసుకుని మునీశ్వరునిలా మౌనవ్రతుడై రెండు చేతులు ఒడిలో ఉంచుకొని అర్ధనిమీలిత నేత్రాలతో ఆసీనుడై ఉన్నాడు, శరీరపోషణమీద శ్రద్ధ వహించినట్లు లేదు. అయినా శరీరంలో ఏదో తేజస్సు. శిరోజాలు పొడవుగా ఎదిగి జడలు కడుతున్నాయి. గడ్డం గుండెలను దాటుతూంది.
అతని కెదురుగా ఒక స్త్రీ కూర్చొని ఉంది. తల మీద ముసుగు, తెల్లని ఆమె దుస్తులు దేవదూతను పోలి ఉన్నాయి.
కృష్ణమందిరంలో ఎవరో కృష్ణ భగవానుని స్తోత్రం చేస్తున్నారు. శ్రావ్యమైన ఆ కంఠ ధ్వని విన సొంపై మరింత వినాలన్న ఆసక్తిని కలగజేస్తూంది.
వాళ్ళిద్దరూ మరికొంత సమయం ఆ నిరామయస్థితిలోనే గడిపారు.
ఉన్నట్లుండి ఆమె దిగ్గున లేచి నిల్చున్నది. ఎండిన ఆకులు ఆమె పాదాలకింద నలుగుతూ గలగల లాడాయి.
లేస్తూనే ఆమె పశ్చిమదిశగా చూసింది. ఒక అడుగు ముందుకువేసి అతన్ని ఊపుతూ "అటు....అటువైపు చూడండి. ఏమండీ" అంటూంది పడమటి దిశవైపు చూస్తూ.
ఆ స్పర్శకు, ఆమె మాటలకు అతను కళ్ళు తెరిచాడు.
"ఏమిటీ, ఆర్తీ?"
"అటు చూడండి....మీకేం కనబడటంలేదా?"
"ఏమీ లేదే? ఎర్రని సూర్యబింబం తాలూకు పై అంచుమాత్రమే నాకు కనబడుతున్నది." ఏమీ కనబడని సారథి అన్నాడు.
"ఏమీ లేదా? కాదు, ఉన్నది. సూర్యునికి కొద్దిగా కుడిపక్కన.....తెల్లని కాంతిపుంజం ..... తెల్లగా ఉన్నది.
"కాంతిపుంజమా?"
"ఆ, అవును. అదుగో! పూర్తిగా అదృశ్యమవుతున్నది."
సారథి తల పైకెత్తి ఆకాశంవైపు చూశాడు.
"ఆర్తీ, అది నాకు కనబడదు. నీకే... నీ దివ్య దృష్టికిమాత్రమే అది పరిమితం. అది నీకేవిధంగా కనబడ్డది?"
"పొడవైన అయిదురేఖల్లా."
"అది ఆ వైపు ఉందని నువ్వెలా చూశావు?"
"నేను మీముందు కూర్చున్నాను. ఎవరో 'ఆర్తీ, ఆర్తీ!" అని పిలిచారు. కళ్ళు తెరుద్దామన్నా సాధ్యం కాలేదు. లేవబోతే ఎవరో ఒత్తిపట్టి కూర్చోబెట్టిన ట్లనిపించింది. అట్లాగే కూర్చున్నాను. తరవాత రాధ 'పిన్నీ, పిన్నీ' అని పిలిచినట్లయింది. వేణు నవ్వుతూ 'అక్కయ్యా, సునీత నా దగ్గిరికే వచ్చింది. నువ్వూ బావా రండి, చూద్దురుగాని' అన్న మాటలు వినబడ్డాయి."
