సారథి ముందుకు వంగి కళ్ళు కిందపెట్టి నిల్చున్నాడు. ఆర్తివైపు తిరుగుతూ "అంతేనా?" అన్నాడు.
"ఇంకా ఉంది. వేణు 'త్వరగా రా అక్కా' అంటూ దూరంగా వెళ్లాడన్నట్లు మాట దూరమైంది. దేవకి అత్తయ్యమాట వినబడ్డది."
"ఏమని?"
"రేపు.....అంటే....ఈ రాత్రి తెల్లవారు జామున, తూర్పు దిశన ఉషోదయమయ్యేవేళకు నేను. నేను..... మృత్యువువాత బడతానట..."
"ఆర్తీ!"
"అవును. నేను చనిపోయాక మీరు .... మీరు రెండవగంటలో నన్ను అనుసరిస్తారని..."
ముందు అడుగు వెయ్యబోతున్న సారథి గిర్రున వెనకకు తిరిగాడు. ఆర్తి దగ్గిరికి వచ్చి "ఏమన్నావు?" అని అడిగాడు.
"నేనది స్పష్టంగా విన్నాను. నాకు నమ్మకం లేక పోతే పడమటి దిశన కనబడే కాంతిపుంజం దీన్ని ఋజువు చేస్తుందిట."
"నిజంగానా, ఆర్తీ?"
"దేవదేవుని సాక్షి..."
"ఓహ్! అంతమాటనకూడదు. ధన్యురాలిని, ఆర్తీ!"
"నేనా?"
"అవును. ఏ వెలుగుబాటకోసమైతే నేను ఇన్నాళ్ళుగా ఈ అన్వేషణ చేస్తున్నానో అది నీకు దర్శన మిచ్చింది. ఆర్తీ, అది..... అదే భగవానుడు అనబడే మహాజ్యోతి. అందరికీ ఆ తేజస్సు కనబడదు. ఎవ్వరూ చూడలేని విరాట్ స్వరూపం నువ్వు.... నువ్వు చూడగలిగావు, ఆర్తీ!"
"మనం చచ్చిపోతామా?"
"తప్పదు. అనంతస్వరూపుని ఆదేశమే అది. నువ్వు మృత్యువుకు భయపడుతున్నావా, ఆర్తీ!"
"లేదు, లేదు. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను."
"మనం విముక్తులం కాబోతున్నాం. మన యాత్ర ఈ లోకాన ముగిసింది."
సారథి ఆమెకు మరింత దగ్గిరికి వచ్చాడు. ఆమె నయనాల్లోకి చూస్తూన్నాడు. "విశ్వసుందరివి.... విశ్వమాతవు. వేయిసూర్యుల కాంతి నీ కళ్ళలో ఉంది. నువ్వు.... నువ్వు..."
"మీ అర్ధాంగిని, మీ అర్ధాంగిని." అతని విశాలమైన బాహుద్వయం ఆమెను చుట్టివేసింది. వివశమైన స్వరాన "ప్రభూ .... ప్రభూ" అన్నది.
"దేవీ! నేను అదృష్టవంతుణ్ణి. నిన్ను అనుసరించగలగటం....నువ్వు నా అర్ధాంగివి కావటం...దేవీ...ఆర్తీ!"
కాలం ఒక్కసారి స్తంభించినట్లుగా అయిందొక క్షణం. పరిసరాలన్ని ఊపిరి బిగబట్టినట్లుంది.
కృష్ణమందిరంలో గంట మోగింది.
ఆర్తి అడుగు ముందుకువేసింది. ఆమెతోబాటు తనూ అడుగు వేశాడు సారథి.
రజని హాల్లో చదువుకొంటున్నది. తల్లిదండ్రుల నిద్ధరినీ చూసి పుస్తకం మూసేసి ఎదురువచ్చింది. "బాజీబావ నాతో చెప్పకుండా సినిమాకు వెళ్ళాడు" అంటూ ఫిర్యాదుచేసింది చిన్నపిల్లలా.
ఆర్తి ఏమనలేదు. సారథి ప్రేమగా చూశాడు.
"వెళ్ళి విశ్వం మామయ్యను పిలుచుకురా!"
ఎన్నడూ తనకు లోటు కలిగిందని అమ్మ మాట విని ఆశ్రమంవైపు పరుగుతీసింది రజని. వెళుతూంటే సారథి వెనకనుండి చూసి "ఆర్తీ, మన కన్నులపంట, మన ఆశయాలకు ఆదర్శరూపం....కదూ?" అన్నాడు.
"ఊఁ. ఊఁ!"
విశ్వం వచ్చాడు. రజనిని చదువుకోమని అక్కడే వదిలి గదిలోకి వెళ్ళారు. ఆర్తి పూసగుచ్చినట్లు అంతా చెప్పింది. విశ్వం తల పట్టుకున్నాడు.
"తమ్ముడూ, ఈ ఆవరణ మృత్యుప్రాంగణమే అయింది. ఎందుకో మేమిద్దరం ఇంకా జీవించేఉన్నాం. మాకూ పిలుపు అందింది .... నువ్విక్కడే ఉంటావా? మీ స్వగ్రామం వెళతావా?"
"అక్కడమాత్రం ఎవరున్నారు? ఏనాడైతే వేణు- నా తమ్ముడు- స్నేహితుడు అయ్యాడో ఆనాడే నేను నీ తమ్మున్ని అయ్యాను. నే నెక్కడికీ వెళ్ళను. ఇది మృత్యుప్రాంగణమైనా, అమరభూమి అయినా నా ఉద్దేశ్యం మారదు."
"సరే! స్నేహితుడుగా తటస్థపడ్డా, వేణు మరణించాక ఆ లోటు తీర్చావు. ఇక.... ఇక.... ఈ గీతాభవనాలన్నీ నీవే! ఈ ఏడయితే రజని ఎమ్.బి.బి.ఎస్. పూర్తి అవుతుంది. దాని బాధ్యత నువ్వే తీసుకో. నీ కోడలుగా చేసుకో, తమ్ముడూ."
విశ్వం తల ఊపాడు. రెండు కన్నీటిబిందువులు కింద రాలాయి.
"మృత్యువు నెవరూ తప్పించుకోలేరు. కాకపోతే కొద్దిగా ముందువెనకలు. మృత్యువే లేకపోతే మనిషికి బతకటం మీద మోజు ఉండదు. విసుగు పుడుతుంది."
రజనికి ఏదో చెప్పి నిర్మల దగ్గిరికి పంపించారు పడుకోటానికి. తెల్లవార్లూ ఆర్తి మాట్లాడుతూనే ఉన్నది. ఆమె పక్కనే సోఫాలో సారథి. ఎదురుగా విశ్వం. ఆమె చెప్పేవన్నీ వింటూ మసక వెన్నెల వెలుతురులో కనబడుతున్న గొల్కొండను చూస్తూ కూర్చున్నాడు విశ్వం.
"తమ్ముడూ, సునీత నిష్క్రమణంతో ప్రారంభమైన ఈ తుఫాను మాతోనే అంతం అవుతుంది. అందరమూ ఎవరి తీరాలకు వాళ్ళు చేరుకున్నాం."
"నేను మిగిలి ఉన్నాను, అక్కా!"
"నువ్వు మిగలాలి కొన్నాళ్ళవరకు. నీ కర్తవ్యం ఇంకా మిగిలి ఉంది."
గడియారం ఒకటి కొట్టింది.
విశ్వం ఉలిక్కిపడి చూస్తే నాలుగున్నర.
ఆర్తి వెనక్కు వాలి కళ్ళు మూసుకుని, "రజనిని, బాజీని, నిర్మలను పిలిపించు, విశ్వం" అంది.
విశ్వం తానే వెళ్ళి వాళ్ళను తీసుకువచ్చాడు.
తల్లి ముఖంలో కాంతి రజనిని ఆశ్చర్యపరిచింది. "ఎందుకమ్మా పిలిచావు?"
"ఏమీలేదు, చూద్దామని. నాన్నగారు చూడాలనుకుంటున్నారు.... మేము వెళ్ళిపోతున్నామమ్మా!"
"ఎక్కడికి, అత్తయ్యా?" బాజీ అడిగాడు.
"మనుష్యులందరూ వెళ్ళేచోటికి."
వాళ్ళిద్దరూ అయోమయంగా చూశారు.
"మీరు వెళ్ళండి." సారథి అన్నాడు.
"వద్దు. ఉండనివ్వండి. ఎవ్వరూ సద్దుచెయ్యవద్దు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి."
చీమ చిటుక్కుమన్నా వినబడేటంత నిశ్శబ్దం.
ఒక్కొక్క నిమిషమే జారిపోతున్నది. కొద్దిక్షణాల్లే ఏం జరుగుతుందో తెలిసిన విశ్వానికి గుండె వేగాన స్పందిస్తున్నది.
నాలుగుగుమ్ముప్పావు అయ్యేవరకు ఆర్తిలో ప్రాణాధారమైన శ్వాస ఆడుతూనే ఉన్నది. క్రమంగా శ్వాస బరువెక్కుతున్నది.
సారథి పక్కకు వంగి ఆమె ముఖాన్ని చూస్తూ "ఆర్తీ!" అని పిలిచాడు.
"ఊఁ ! ఊఁ!"
"వెళుతున్నావా?"
"అవును. నన్ను మీ కౌగిలిలోకి చేర్చుకోండి."
ఆర్తిని దగ్గిరికి తీసుకున్నాడు. అతని ఛాతీమీద ఆమె తలను ఆన్చింది. సారథి ఆమెను పొదివి పట్టుకున్నాడు.
"మీరు.....మీరు.....వస్తున్నారు కదూ?"
"వస్తున్నాను. వస్తాను, ఆర్తీ!
"స్వామీ.... ప్రభూ..."
"ఆర్తీ .... ఆర్తీ ...."
హాస్పిటల్ లో రోగి ఎవరో మేలుకుని ఊరుకోలేక "హే మాలిక్ తెరే బందెహమ్" అంటూ పాడుతున్నాడు.
వెన్నెలవల్ల కాంతివిహీనమై, రాబోయే సూర్య కిరణాలలో తను ప్రకాశించలేనని తెలుసుకున్న నక్షత్రం ఒకటి రాలి భూమివైపుకు పడుతూంది.
భూమిమీద ఒక ప్రాణి అనంత శూన్యంలో లీనం కాబోతున్నది.
తూర్పుదిశను ఉషారేఖలు అలుముకుంటున్నాయి.
ఆర్తి మరి మాట్లాడలేదు. ఆమె శరీరం చల్లగా అనిపించింది సారథికి.
ఒక ప్రాణిలో జీవం-ఆత్మ-భౌతికదేహాన్ని వీడిసర్వ జగత్సృష్టికి కారణభూతమైన ఒక అజ్ఞాత మహాశక్తిలోకి పయనించింది.
నక్షత్రం వాతావరణంలో రాపిడికి భూమిని చేరుకోకముందే నుసిఅయి మరి కనిపించలేదు.
రోగి పాట పూర్తి చేశాడు.
ఉషస్సు లోకాన్ని పూర్తిగా ఆవరించింది.
సారథి లేచాడు. ఆర్తి మృతదేహాన్ని తన రెండు చేతులమీదికి తీసుకున్నాడు. రజని తేరుకోనే లేదు.
ఆర్తి సమేతంగా సారథి ఇంటి ముందుకు వచ్చాడు.
"అమ్మా!" అంటూ రజని ముందుకు ఉరకబోయింది బాజీ ఆమెను ఆపుచేశాడు.
సారథి తిరిగిఅయినా చూడలేదు.
"అమ్మ లేదు . నాన్న ఉండడు. జీవతరంగిణి వేగాన్ని పుంజుకున్నది. నువ్వెవరో, నే నెవరో? మరణించేనాడు ఎవరూ ఎవరికి ఏమీ కారు. బంధాలేమీ దాన్ని ఆపలేవు. నిరంతరమైన జీవనసత్యం....ఏదీకాదు నిత్యం."
సారథి కృష్ణమందిర దిశాభిముఖుడై సాగిపోతున్నాడు. కృష్ణదేవుని మురళీరవం అతనికి వినబడుతూంది. తనలో ఐక్యం చేసుకుంటానంటూంది.
ఉషాదేవి నీరాజనాలిస్తూంది, వాసుదేవుని సన్నిధి నీకు మోక్షం ప్రసాదించగలదంటూ.
యుగాలతరబడి భూమి నాశ్రయించి ఉన్న ప్రకృతి రా రమ్మని చేతులు చాచి ఆహ్వానిస్తూంది.
ఒక పథం, ఒక మార్గం- అదె సారథికి కనబడుతున్నది. దానిమీదతప్ప మరి దేనిమీదా దృష్టి లేదు.
ఆ మార్గంలో కోటాను కోట్ల జ్యోతులు. ఆ పథంలో వేలాది అమరజీవులు. అదే....ఆ పథం..... ఆ పథమే ..... అమరప్రేమికుల దివ్యపథం.
* * * *
కాలమనే మహావృక్షం నుండి మరికొన్ని ఆకులు రాలాయి.
తల నెరిసి ముగ్గుబుట్టలా ఉన్నది. నడుము పూర్తిగా వంగిపోయింది. వృద్దుడైన ఒకాయన గీతా భవనాల ఆవరణలో కృష్ణమందిరం ఎదట నాలుగు సమాధుల ముందు కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే పన్నెండేళ్ళ కుర్రవాడు ఆయన చెప్పేదంతా వింటున్నాడు. ఆ కుర్రవాడు తాతగారి వదనంలో ఆవేదన, కళ్ళలో అర్ధంగాని లోతులు స్పష్టంగా చూడగలిగాడు.
"తాతయ్యా, నువ్వొక్కడివే మిగిలి ఉన్నావుకదూ?"
"అవును నాయనా, అవును. అప్పటికీ ఇప్పటికీ సునీత జాడే లేదు. బతికేఉందో, మరణించిందో ఎవరికీ తెలియదు. వాళ్ళు దేవతల్లో కలిశారు. నన్ను మిగిల్చారు. నే నెన్నాళ్ళింకా వాళ్ళ జ్ఞాపకాల్లో జీవించాలో? నన్ను వాళ్ళలో ఎన్నడు కలిపేసుకుంటారో?"
ఆ మాటలు పిల్లవాడు గ్రహించాడు. "వద్దు. నువ్వెక్కడికీ పోవద్దు, తాతయ్యా!"
ఆ వృద్దుడు భారంగా విశ్వసించాడు. కర్ర ఊతగా పట్టుకుని నిల్చుంటూ మరొక చెయ్యి మనవాడి భుజంమీద వేశాడు.
సంధ్య ముసుగు వేసుకుంటున్నది.
సమాధులమీద జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
"ప్రభూ, అసత్యమునుండి సత్యమునకు, తపస్సు నుండి జ్యోతివైపుకు, మృత్యుమార్గమునుండి అమృతమువైపుకు మరలించు." సమాధుల దగ్గిరికి వెళ్ళి, ఆకాశంవైపు చూశాడు.
ఆ కుర్రవాడన్నాడు: "తాతయ్యా, దాన్ని నేనింకో విధంగా చెప్పనా?"
"చెప్పు, నాయనా!"
శ్రావ్యమూ, సుమధురమూ అయిన కంఠాన్ని విప్పాడు ఆ కుర్రవాడు. ఇలా అంటున్నాడు -
"ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ."
-------:సమాప్తం:-------
