నా మనసు లతపట్ల లాగుతున్నది. కానీ రఘు ఆడిన నాటకంలోని ఒక పావుగా, అతడి ఎంగిలి కూడుకు ఆశపడే దౌర్భాగ్యుడిగా నేను మారగలనా?
"నేను నీకు సాయపడలేనన్నాను. అర్ధం చేసుకున్నావా?" అన్నాడు కిషోర్.
"రఘు ఆడిన నాటకం నామీద పనిచేయలేదు. అందుకు నువ్వే కారణం, మరి లత ఏమవుతుంది?" అన్నాను.
"కాలు జారిన ఆడది ఏమవుతుంది?" అన్నాడు కిషోర్ హేళనగా.
"ఆమె అందరికిలా కాదు-" అన్నాను ఆవేశంగా.
"అంటే?"
"లత గనుక ఆత్మహత్య చేసుకుంటే నేను రఘును చంపేస్తాను...." అన్నాను.
"రఘును చంపడంవల్ల నీ జీవితం కూడా నాశనమవుతుంది. అలాంటి పిచ్చి పిచ్చి పనులు తలపెట్టకు-" అన్నాడు కిషోర్.
"కిషోర్ - నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను లతను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. నా లత జీవిత్యంలో నిప్పులు కురిపించిన వాడి బ్రతుకు బయటపెట్టి పదిమందిలో తలెత్తుకోకుండా చేస్తాను. నా దృష్టిలో చంపడం అంటే అదే!" అన్నాను.
"అంతకంటే లతను వివాహం చేసుకొనడం మెరుగు."
"అయ్యో-కిషోర్! నువ్వింకా నన్నర్ధం చేసుకోలేదా? నేను లతనెలాగూ వివాహం చేసుకుంటాను. అయినా రఘును వదిలిపెట్టను. అతడి జీవితం నరకం చేస్తాను-" అన్నాను.
కిషోర్ మళ్ళీ ఆప్యాయంగా నా భుజం తట్టి-" నువ్వు చాలా మంచివాడివి. ఇలాంటి మంచితనం చాలా అరుదు. అయితే ఈ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకునే వారే ఎక్కువ. నా మాట విని ఒక వారం రోజులు ఈ ఊరు వదిలిపెట్టు. అప్పుడు నీలోని ఆవేశం తగ్గి మామోలు మనిషివి కాగల్గుతావు-" అన్నాడు.
"ఈలోగా లత ఏమైపోతుందో?"
"నువ్వు ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఏమీ అనకూడదు కానీ లతమీద కొన్ని అనుమానాలున్నాయి. లత పొరపాటున రఘు వలలో పడిందా-లేక ఆమె ప్రవర్తనలో లోపమున్నదా అన్నది విచారించి ఈ వారం రోజుల్లోనూ నీ కోసం ఓ రిపోర్టు తయారుచేస్తాను......ఒకవేళ ఆమె నిజంగా అమాయకురాలే అయితే-మీ ఇరువురి వివాహాన్నీ నేనే ప్రోత్సహిస్తాను-...."అన్నాడు కిషోర్.
"వారం రోజులు ఎక్కడికి వెళ్ళను? ఏం చేయను?" అన్నాను.
"నేను పని చెబుతాను-" అన్నాడు కిషోర్.
కిషోర్ లో అదే గొప్పతనం. అందరి అవసరాలకూ తనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి అతడికున్నది.
3
నాకు ఓ చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చాడు కిషోర్ నాకు చాలా కుతూహలంగా ఉన్నది-అందులో ఏమున్న దోనని!
ట్రెయిన్ లో తెరిచి చూశాను. సులభంగానే తెరుచుకుంది. అందులో ఒక చీర వున్నది. అదే రంగు బ్లౌజు పీసు ఉన్నది. ఓ చిన్న కాగితం. దానిమీద రంగు రంగుల అక్షరాలు-ఇంగ్లీషులో!
"టు లిల్లీ విత్ లవ్ ఫ్రం కిషోర్."
ఈ బ్రీఫ్ కేసును నేను లిల్లీ కే అందజేయవలసి ఉన్నది. ఆ లిల్లీ యెవరో నాకు తెలియదు. ఆమెతో కిషోర్ కు ప్రేమ తప్ప ఇంకేమీ లేదని ఈ బ్రీఫ్ కేసు ఋజువు చేస్తున్నది.
తాడిచెట్టుక్రింద పాలు తాగినా అనుమానిస్తారు. కిషోర్ పై చాలామందికి ఉన్న అనుమానాలలాంటివేనని నాకు అనిపించింది. అతడామెకుద్దేశించిన చీరలో రహస్యమేధో ఉన్నదని నేననుకోను.
ట్రయిన్ గమ్యస్థానం చేరగానే దిగి-అడ్రసు వెతుక్కుంటూ లిల్లీ ఇంటికి వెళ్ళాను.
అది ఒక చిన్న బంగళా! విశేషమేమిటంటే అంత బంగళాలోనూ లిల్లీ ఒక్కతే మాత్రమే ఉంటున్నది.
లిల్లీ సౌందర్యవతి. ఆ అందానికి ఆమె వేషధారణ తోడై మగవాళ్ళను రెచ్చగొడుతుంది.
ఆమె చాలా ఆత్రుతగా నానుంచి ఆ బ్రీఫ్ కేసు అందుకున్నది. తెరిచి చూసింది. "ఓహ్!" అన్నది సంబరంగా, నేను ఆశ్చర్యపోయి చూస్తూండగా నా కళ్ళముందే చకచకా తనవంటినున్న చీర విప్పి ఆ చీర చుట్టబెట్టుకున్నది.
ఆమె చీర అంత వాగా యెలా కట్టుకుంటుందో తెలియదు. చీర మార్చినా వెంటనే ఆమె షో కేసులో బొమ్మలా తయారైపోయింది. తర్వాత ఆమె నన్నుచూసి నవ్వింది.
నేనింకా షాక్ లోనే వున్నాను.
ఆమె నన్ను సమీపించి-"అయ్యో-నాకు స్ఫురించనే లేదు. నేను చీర నీముందే మార్చుకున్నాను కదూ!" అన్నది.
"నేను మాట్లాడలేదు.
"నాకు సిగ్గులేదనుకుంటున్నావా?" అన్నదామె.
తల ఊపాను. అలాంటి నిజం ఆమె నుండి తెలుసుకోవాలనిపించింది నాకు.
ఆమె వెంటనే నాకు కాస్త దూరంగా వెళ్ళింది-"మంచి చీర చూస్తే వెంటనే కట్టుకోవాలనిపిస్తుంది. అది నా బలహీనత...." అన్నది.
"అయితే నీవు షాపింగుకి వెళ్ళకూడదు-" అన్నాను.
నా విసురామెకు అర్ధమైనట్లే ఉన్నది. మళ్ళీ నవ్వి-"షాపులో అందరి ముందూ ఒకోచీరే కట్టుకుని చూస్తానని కదూ నీ అభిప్రాయం. అలాచేసినా అందులో తప్పేమిటో తెలియదు నాకు. నీలాంటి బుద్దే కిషోర్ దీను. నాక్కావలసిన బట్టలన్నీ తనే పంపిస్తాడు తప్పితే నన్ను షాపింగుకి వెళ్ళొద్దని శాసించాడు-" అన్నదామె.
"నలుగురిముందూ ఒక ఆడది బట్టలు మార్చుకోవడం తప్పని నీకు తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది-" అన్నాను.
"నీ ఆశ్చర్యం సంగతి నువ్వు చెప్పావు. మరి నా ఆశ్చర్యం సంగతి నేను చెబుతాను-" అన్నది లిల్లీ.
"ఆడపిల్ల మాక్సీ వేసుకుంటే తప్పులేదు. బెల్ బాటంలో వుంటే తప్పులేదు. నా వంటిమీద చీర తీసి నపుడు నాలో వున్న మార్పేమిటి? నా వంటిమీద పెట్టీ కోటున్నది. బ్లౌజున్నది. కేరళలో అమ్మాయిలైతే అలాగే ఉంటారు ఎప్పుడూ చీర శరీరానికి అదనంగా చ్చేది ఓ పైట మాత్రమే. పైట లేకుండా ఆడవాళ్ళున్నో డ్రస్సులు వేసుకొని తిరిగితే తప్పులేదు. కానీ ఒక్క చీరలో మాత్రమే పైట లేకపోవడం తప్పు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. నా అభిప్రాయంలో చీర అదనపు అందం ఇస్తుంది తప్పితే-శరీరాన్ని కప్పేది ఏం లేదు. యెప్పుడు పడితే అప్పుడు యెక్కడ పడితే అక్కడ మార్చుకునేందుకు వీలైనది చీర అని నాకు అనిపిస్తుంది. కానీ ఏమిటో - మీ మగవాళ్ళు ఆలోచన్లు నాకు అర్ధంకావు-"
"చాలా తెలివైనదే-" అనుకున్నాను. తెలివైనదే కాదు. ఆమె చాలాదూరం కూడా ఆలోచిస్తుంది. లిల్లీకీ, కిషోర్ కీ ఏం సంబంధమో అనిపించింది.
"నా మాట ఒప్పుకుంటారా?" అన్నది లిల్లీ.
"ఒప్పుకోను-" అన్నాను-"అనాగరికమైన ఆటవికుల్లో కొన్ని జాతుల్లో బట్టలు ధరించే సంప్రదాయమే లేదు. అయినప్పటికీ వాళ్ళు ఆడవాళ్ళను చూసి అన్ని సమయాల్లోనూకాక కొన్ని సమయాల్లో మాత్రమే ఆవేశపడతారు. ఆడపిల్లను అలా చూడ్డానికి వాళ్ళు అలవాటుపడడం అందుకు కారణం.
"నాగరిక ప్రపంచంలో అలా కాదు. ఇక్కడ దుస్తులు ధరించకపోవడం అసాధారణం. అందువల్ల దుస్తులు ధరించనివారు అసాధారణంగా కనబడతారు. అలాగే చీర విషయంలోనూ! చీరను ఒక పద్ధతిలో కట్టుకొనడం అలవాటు. అలా చూడడం మా అలవాటు. ఆ పద్ధతి మారితే నాకు అసాధారణంగానే ఉంటుంది. అందుకు కారణం మనసు అని తెలుసును. అయితే మనస్సును శాసించేది సమాజన్యాయం అనీ నీవు తెలుసుకోవాలి-"
లిల్లీ నవ్వి-"చాలా తెలివైనవాడివి నువ్వు అందుకే కిషోర్ నిన్ను చేరదీసి ఉంటాడు. అది సరే - నేను చటుక్కున చీర మార్చుకుందుకు అసలు కారణం చెప్పనా-" అన్నదామె.
