కిషోర్ కారణంగానే ఇతరులకు అసాధ్యమైన క్లబ్బుల్లో నాకు ప్రవేశం లభించింది. అక్కడి జీవితం నా డబ్బుతో నేను కొనలేనిది. శారీరకంగా మలినం కాకపోయినా మానసికంగా మలినమయే దృశ్యాలు చాలా చూశాను. నా వయసు కారణంగానేమో-ఆ దృశ్యాలు నాకు జుగుప్సాకరంగాకాక ఆకర్షణీయంగా అనిపించేవి.
నాకు కావాలంటే కిషోర్ ఆడపిల్లల్ని కూడా అప్పగించి ఉండేవాడు. కానీ నేను లతను ప్రేమించాను. మలినపడిన శరీరంతో నేనామెను పొందాలనుకోరాదు. లతవంటి అపురూప యువతికి స్వచ్చమైన యువకుడే అర్హుడు. అందుకే యెన్నోమార్లు నా మనసు పక్కదారులు పట్టినా నిగ్రహించుకోగలిగాను. కిషోర్ నన్నెప్పుడూ నా మనసుకు వ్యతిరేకంగా ప్రోత్సహించడు.
"ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అరేంజ్-" అంటాడతడు.
అందుకే అతడంటే నాకు ఇష్టం.
నా మూలంగా కిషోర్ పొందుతున్న ప్రయోజనాలకు అతడినుంచి నాకు లభించే ప్రతిఫలం స్వల్పమైనదని కొందరంటారు. కిషోర్ కోరికమీద నేను కొన్ని చిన్న చిన్న వస్తువులను కొందరికి అందజేస్తూంటాను. స్నేహితుడిగా నేనతడికి చేసే సాయమది!
ఆ మాత్రం సాయం కిషోర్ కావాలనుకుంటే యే నిరుద్యోగి గ్రాడ్యుయేట్ కో పదిరూపాయలిచ్చి చేయించుకోగలడు. నావల్ల కిషోర్ లాభం పొందుతున్నాడనుకోవడం అహంకారంతో కూడిన భ్రమ అవుతుంది. ఈ మాటలు చాలాసార్లు కిషోర్ తో అన్నాను.
"అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం-" అన్నాడు కిషోర్.
ఇంతకాలం కిషోర్ ను నేనేమీ కోరలేదు. అతడావిషయం తలచుకుని బాధపడుతూండేవాడు. ఈ విషయమై అతడు బాధపడడం నాకు సంతోషంగానే ఉండేది. నాకు కిషోర్ అవసరం యెప్పటికి కలగకూడదని కూడా భగవంతుణ్ణి ప్రార్థించుకునేవాడిని.
కానీ ఇప్పుడు నాకు కిషోర్ అవసరం వచ్చింది.
లత దుఃఖంలో ఉంది. ఆమెను రఘు తిరస్కరించాడు. రఘునూ ఆమెనూ కలపాలి. లత నాక్కాకుండా పోయినా ఫరవాలేదు. ఆమె సుఖంగా వుండాలి. రఘును పెళ్ళాడితే ఆమె తప్పక సుఖసంతోషాలతో మనగలుగుతుంది.
కిషోర్ కు లతను గురించి చెప్పాను.
అతడికి కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు - "వ్వాట్.....నువ్వు ఓ అమ్మాయిని ప్రేమించడమా?" అన్నాడతడు.
"ఏం?" అన్నాను.
"మీ అమ్మా నాన్నా ఏదో సంబంధం చూసి పిలిచేదాకా అసలు నువ్వు ఆడపిల్లల గురించి ఆలోచిస్తావా అనుకున్నాను-" అన్నాడు కిషోర్.
"సరే-లతను నేను ప్రేమిస్తే మాత్రం ఏమయింది? ఆమె నేనెలాగూ పెళ్ళిచేసుకోను-" అన్నాడు.
కిషోర్ మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు నేను లత మోసపోయిన చెప్పాను.
"బాప్ రే-వాడెవరో నీకు తెలిసిందా?" అన్నాడు కిషోర్.
"తెలిసింది. లతను ప్రేమించినందుకు వాడు నాకు శత్రువు. లతచేత ప్రేమించబడడంవల్ల వాడిని నేను తాకనైనా తాకలేను. లత చావుకు వాడు కారకుడైతే వాడిని నేను బ్రతకనివ్వను....." అన్నాడు.
"ఇదంతా నువ్వు నాకెందుకు చెబుతున్నావు?" చిరాగ్గా అడిగాడు కిషోర్.
"ఈ విషయంలో సాయపడగలవాడివి నువ్వే-వాడినీ లతనూ ఒకటి చేయాలి...."
"సారీ.....నేనిలాంటి విషయాల్లో సాయం చేయలేను" కటువుగా అన్నాడు కిషోర్.
నేను లెక్క చేయలేదు - "అయితే ఆ దుర్మార్గుడు రఘు కారణంగా ఓ అమాయకురాలి ప్రాణం అంతం కావలసిందేనా?" అన్నాను.
కిషోర్ ఉలిక్కిపడి-"లతను వంచించినవాడి పేరు రఘుయా?" అన్నాడు.
"అవును-" అన్నాను.
"నీకెలా తెలుసు?"
జరిగిందంతా కిషోర్ కు చెప్పాను. వింటూనే కిషోర్ పిడికిళ్ళు బిగిశాయి. అతడు నా భుజంతట్టి-"ఆ రఘునాకు తెలుసు. వాడిలాంటి పనులు చాలా చేశాడు. అయినా క్షమించాను. కానీ నా స్నేహితుడి ప్రియురాలీని వంచిస్తే వాణ్ణి క్షమించలేను. వాడికి మూడిందనే అనుకో-" అన్నాడు.
"వద్దు కిషోర్....వాళ్ళిద్దర్నీ ఒకటి చేయి-చాలు-" అన్నాను.
"కుదరదనుకుంటాను. అతడికిప్పటికే పెళ్ళయింది...."
నేను మ్రాన్పడిపోయాను.
కిషోర్ నా భుజం తట్టి-"ఏమిటలాగైపోయావు?" అన్నాడు.
"మరి నా లత జీవితం....."
"లత ఆ రఘుకు భార్య కావాలనుకుంటే రఘు భార్యను ఈ లోకంనుంచి పంపేయాలి. అందుకేర్పాట్లు చేయమంటావా?" అన్నాడు కిషోర్.
అది చాలా అన్యాయమనిపించింది-"వద్దు-" అన్నాను.
కిషోర్ నా వంక జాలిగా చూసి-నువ్వేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాను-" అన్నాడు.
"చెప్పు!" అన్నాను.
"రఘుకు లత మొదటి కేసు కాదు. వాడిని నువ్వు చూసే వుంటావు. అమ్మాయిలనిబట్టే ఆకర్షించే రూపం వాడిది....."
నాకు రఘు రూపం గుర్తుకు వచ్చింది. భగవంతుడు వాడికి అందాన్నే కాకుండా క్రూరత్వాన్ని అమాయకత్వంగా ప్రదర్శించగల శక్తి కూడా ఇచ్చాడు. అప్పుడే ఏడ్చి వెళ్ళిన లత వాడి గదినుంచే వెళ్ళిందని వాడి ముఖం చూస్తే యెవ్వరూ అనుకోరు. అప్పుడు వాడొక అమాయకుడిలా దిగులుగా కనిపించాడు.
"రఘు, లత కలిసి-కావాలని నీతో నాటకమాడారన్న అనుమానం నాక్కలుగుతోంది-" అన్నాడు కిషోర్.
"అంటే?" అన్నాను.
"ఇదివరలో రఘు ఇలాగే చేశాడు- ఆవేశంలో నావల్ల ఏదో తప్పు జరిగిపోయింది. నేను వివాహితుడిని కాబట్టి మన వివాహం అసాధ్యం. ఆ జయరాజు నిన్ను ప్రేమ పేరుతో వెంటాడుతున్నాడంటున్నావు కదా-ఒక్కసారి వాడు చూసేలా మనం మాట్లాడుకుందాం. నువ్వు నన్ను ప్రేమించి మోసపోయినట్లు వాడికి తెలియనీ-అని మోసపోయిన ఆ యువతికి చెప్పాడు-" అన్నాడు కిషోర్.
"అందువల్ల ప్రయోజనమేమిటి?"
"ఒక్కసారి లతపట్ల నీకు కలిగిన భావాలు-ఆ సమయంలో యెలా ఉన్నాయో గుర్తుచేసుకో-" అన్నాడు కిషోర్.
ఆ సమయంలో నాకు రఘుపట్ల కలిగిన అసహ్యం కంటే లతమీద కలిగిన జాలి యెక్కువ. ఆ జాలి నాలో ఆవేశాన్ని కూడా రగిలించింది. లత జీవితం అన్యాయం కాకుండా ఆమెను పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నాను.
నేను చెప్పింది విని-"అదే రఘు ఆ లతకు చేయగల ఉపకారం. అందుకే ఆమె చేత అలా నాటకమాడించాడు" అన్నాడు కిషోర్.
తెల్లబోయాను. లత నన్ను ట్రాప్ చేయాలనుకుంటున్నదా? అయితే జరిగినదేమిటి?
నేను లతను ప్రేమించాను. ఆమెను తరచుగా కలుసుకుంటున్నాను ఆమె నన్ను కాకుండా రఘును ప్రేమించి అతడివల్ల మోసపోయింది. ఇప్పుడామెకు వివాహమవుతుందా? ఏదో ఒక రోజున గత చరిత్ర ఆమె భావికి అడ్డు తగలవచ్చు. గతం తెలిసీ అమెనెవడు వివాహం చేసుకుంటాడు?
అందుకు నన్ను సంసిద్దున్ని చేసే పథకం రఘు తయారు చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి?
