Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 52


    "నా దగ్గర బాగా డబ్బు చేరుతోంది. ఒకరోజున నేను నిన్ను చాలా గొప్పవాడికిచ్చి పెళ్ళి చేస్తాను. నువ్వు పెళ్ళి చేసుకుని స్థిరంగా కాపురం చేసుకోవాలి" అని గురవయ్య ఆమెకు చెప్పాడు.
    గులాబి అంటే యిష్టపడ్డ వాళ్ళు గురవయ్యకు తెలియకుండా ఆమెను కలుసుకుని మాట్లాడ్డానికి ప్రయత్నించారు. గులాబి వాళ్ళను మాటాడనిచ్చింది కానీ ముందడుగు వెయ్యనివ్వలేదు.
    "మీ నాన్న నీకు పెళ్ళిచేయడు. నిన్నడ్డుగా పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు" అన్నారు కొందరు.
    "అసలు మీ నాన్న గురవయ్యకాడు. వాడు నిన్నెక్కన్నించో ఎత్తుకొచ్చి తన ప్రదర్శనల కుపయోగించుకొంటున్నాడు" అన్నారు కొందరు.
    గులాబి వారి మాటలకు చలించలేదు.
    ప్రేమ విలువ అది పొందేవారికే తెలుస్తుంది.
    గురవయ్య ఆమెకు  తండ్రి అవునా, కాదా అన్నదామెకీ తెలియదు. కానీ ఆమె అతడిలో తండ్రిని చూస్తోంది.
    గురవయ్య ఆమెకు అసలు సిసలు తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు.
    అతడి ననుమానించడం ఆమె మనసుకు నచ్చదు.
    అందుకే ఆమె తండ్రి తనను మోసగిస్తాడనికాక-మంచి యువకుణ్ణి తెచ్చి పెళ్ళిచేస్తాడని నమ్ముతోంది. ఆ నమ్మకమే ఆమెను రాత్రిపూట కలలుకనేలా చేస్తూంది.
    కలలు కన్నాకనే ఆమె నిద్రపోతుంది.
    క్రమశిక్షణ, వ్యాయామం కారణంగా ఆమె శరీరారోగ్యం గొప్పది. అందువల్ల నిద్రలో ఆమెకు కలలు రావు.
    గులాబి నిద్రపోకుండా కలలు కంటున్న సమయంలో తలుపు తట్టిన శబ్దం వినబడి-స్వప్న ప్రపంచంలోంచి బైటకు వచ్చింది.
    నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది.
    ఎదురుగా అతడు.....అతడి చేతిలో బ్రీఫ్ కేసు.....
    తాను తిరిగి స్వప్న ప్రపంచంలోకి వెళ్ళిపోయానా అనుకుందామె.
    అతడు చాలా అందంగా యువతుల స్వప్నసుందరుడిలా ఉన్నాడు.
    అతడి మనోహర మందహాసం-ఏ యువతి గుండెలో నైనా వెన్నెలలు కాయించగలదు.
    "లోపలకు రావచ్చా!" అన్నాడతడు.
    అతడి పలుకుల కామె మనసులో వేయి వీణలు మ్రోగాయి.
    అప్రయత్నంగా పక్కకు తప్పుకుందామె.
    అతడు లోనికి వచ్చి తనే తలుపువేసి "మంచి నీళ్ళుకావాలి" అన్నాడు.
    ఆమె మంత్రముగ్ధురాలిలా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది.
    అప్పటికతడు బ్రీఫ్ కేసు కింద పెట్టేడు. ఆమె ఇచ్చిన మంచినీళ్ళు తాగి-"మీరిచ్చిన మూలాన కాబోలు-తీయగా ఉన్నాయి" అన్నాడు.
    గులాబి మొహమాటంగా నవ్వి-"ఎవరు మీరు?" అంది.
    "కొందరు దుర్మార్గులు నన్ను వెన్నంటి వస్తున్నారు. ఈ బ్రీఫ్ కేసు మీ యింట్లో దాచాలి. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన విలువైన కాగితాలున్నాయి" అన్నాడతడు.
    "ఉండండి-మా నాన్నను నిద్రలేపి వస్తాను" అంది గులాబి.
    "వద్దు-నేను వెళ్ళిపోవాలి"-అన్నాడతడు కంగారుగా.
    అతణ్ణి కాసేపాపాలని ఆమె కనిపించింది - "మా నాన్నను తెలియకుండా ఈ బ్రీఫ్ కేసు మా యింట ఉంచలేను. ఆయన్ను లేపాలి" అందామె.
    "వద్దు" అన్నాడతడు.
    "అయితే బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపొండి" అంది గులాబి.
    "నేను నిజంగా తొందరలో ఉన్నాను. లేకుంటే నీ వంటి అందాల రాశితో కాసేపైనా మాటాడకుండా వెళ్ళిపోగలనా?" అన్నాడతడు.
    తన నతడందాలరాశి అనడం ఆమెకెంతో సంతోషాన్ని కలిగించింది.
    "నాన్నా!" అందామె అప్రయత్నంగా.
    గురవయ్యకా పిలుపు చాలు.
    అతడు చటుక్కున లేచి అక్కడికి వచ్చాడు.
    ఆ యువకుడు తెల్లబోయాడు.
    "ఎవరు మువ్వు?" అన్నాడు గురవయ్య.
    ఆ యువకుడు మాట్లాడకుండా గురవయ్య వంకే చూస్తున్నాడు.
    గులాబి తండ్రికా యువకుడి గురించి చెప్పింది.
    తండ్రి అతడిగురించి తెలుసుకుంటే-అతడంటే యిష్టపడతాడేమోనని ఆమె ఆశ!
    "అంటే ఈ బ్రీఫ్ కేస్ నేను దాచాలంటావు" అన్నాడు గురవయ్య.
    యువకుడు మౌనంగా తలాడించాడు.
    "నీ పేరు?" అన్నాడు గురవయ్య.
    "రాజ్ కుమార్-"
    "అచ్చం రాజకుమారుడి లాగే ఉన్నాడు" అనుకుంది గులాబి.
    "మిస్టర్ రాజ్ కుమార్! ఈ పెట్టెలో ఏముందో నేను చూడొద్దా?" గంభీరంగా అడిగాడు గురవయ్య.
    "చూడకూడదు-" అన్నాడు రాజ్ కుమార్.
    "నేను గౌరవంగా బ్రతుకుతున్నాను. ఒకరిచేత ఇంత వరకూ వేలెత్తి చూపించుకోలేదు. నువ్వు ప్రభుత్వాధికారివో, స్మగ్లరువో నాకు తెలియదు. నీ వంటివాడు నా యింట్లో చొరబడితే-పట్టుకుని పోలీసుల కప్పగించడం నా బాధ్యత. నిజానిజాలు పోలీసులే తేల్చుతారు" అన్నాడు గురవయ్య.
    అప్పుడు యువకుడి చేతిలో నల్లటి వస్తువొకటి నిగ నిగలాడుతూ మెరిసింది.
    అది పిస్తోలు!
    పిస్తోలు తిన్నగా గురవయ్యకే గురిపెట్టబడి ఉంది.
    "ఈ బ్రీఫ్ కేసు మీ యింట్లో ఉంటుంది-తిరిగి నే నొచ్చి తీసుకెళ్ళే వరకూ. ఇది పోలీసుల పరం చేశావా- నువ్వూ నీ కూతురూ వికలాంగులి రోడ్లమీద అడుక్కుంటారు. నేను ప్రమాదకరమైన మనిషిని. నాజోలికి రాకు. నేను చెప్పినట్లు విను" అన్నాడతడు.
    గురవయ్య తెల్లబోయాడు.
    గులాబి ఆరాధనాపూర్వకంగా ఆ యువకుడివంకే చూస్తూంది.
    జరుగుతున్నదేమిటో ఆమెకు తెలియడం లేదు.
    ఆమెకంటి కతడు దుర్మార్గుడిలా కాక హీరోలా కనబడుతున్నాడు.
    "నేను వెడుతున్నాను" అంటూ యువకుడు వెనుకడుగు వేశాడు.
    "ఆగు" అన్నాడు గురవయ్య.
    మరుక్షణం గురవయ్య చేతిలోంచి కత్తి ఒకటి శరవేగంతో రాజకుమార్ కుడిచేతిని తాకింది.
    రాజకుమార్ చేతిలోని పిస్తోలు ఎగిరి దూరంగా పడింది.
    "కదలకు....." అన్నాడు గురవయ్య.
    జరిగిన విశేషానికి రాజకుమార్ నిశ్చేష్టుడయ్యాడు.
    గురవయ్య చేతిలో యిప్పుడు మరో కత్తి ఉంది.
    "నేను కావాలని నీ చేతికి కత్తిపిడి తగిలేలా విసిరాను. కాబట్టి నీకే గాయమూ అవలేదు. కత్తిమొన ఈసారి సూటిగా నీ గుండెల్ని తాకుతుంది...." అన్నాడు గురవయ్య.
    "ఎవర్నువ్వు? ఏదైనా ముఠా నాయకుడివా?" అన్నాడు రాజకుమార్ ఆశ్చర్యంగా.
    "నాపేరు గురవయ్య. నేర్పుగా కత్తి విసరడం నా వృత్తి. నేను విసిరిన కత్తి తుపాకి గుండును మించిన వేగంతో పోతుంది. నా గురి అర్జునుడి గురికంటే గొప్పది."
    "ఓహ్-నీపేరు విన్నాను" అన్నాడతడు.
    "ఇప్పుడు నా నేర్పు చూద్దువుగాని.....ముందు మర్యాదగా లోపలకు నడు...." అన్నాడు గురవయ్య.
    గత్యంతరం లేక అతడు లోపల గదిలోకి నడిచాడు.
    గురవయ్య అతణ్ణి గోడకానుకొని నిలబడమన్నాడు. గోడకు కొత్తగా అట్టతాపడం చేయబడి ఉంది. అతదానుకుని ఉన్నచోట పూర్వపు గుర్తులేమీ లేవు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS