Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 53


    "కదిలావా-కత్తులు నీ శరేరాన్ని చీల్చుతాయి. అలాగే కదలకుండా నిలబడు...." అన్నాడు గురవయ్య.
    రాజకుమార్ గోడకానుకుని కదలకుండా నిలబడితే గురవయ్య కత్తులు విసిరాడు.
    గులాబి సంతోషంతో చప్పట్లు కొట్టింది.
    "కత్తులన్నీ వాడిగా ఉన్నాయి. కదిలావా-నీ శరీరం తునాతునక లవుతుంది. అలాగే ఉండు.....నేను వెళ్ళి పోలీసులను పిల్చుకొని వస్తాను" అన్నాడు గురవయ్య.
    "వద్దు...." అన్నాడు రాజకుమార్.
    "నువ్వు నన్నాపలేవు. నేనొచ్చి కత్తులు తీసేదాకా నువ్వు కదలలేవు. వస్తాను" అన్నాడు గురవయ్య.
    రాజకుమార్ గురవయ్యవంకే చూస్తున్నాడు.
    గురవయ్య గులాబితో -"చూడమ్మా! నేను గంటలో పోలీసుల్ని వెంటబెట్టుకుని వస్తాను.....ఈలోగ నీకు నిద్రవస్తే పడుకో" అన్నాడు.
    "నేనూ నీతో వస్తాను" అంది గులాబి.
    "వద్దమ్మా - రాత్రిపూట నువ్వెందుకు?" అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు.
    తండ్రి వెళ్ళగానే తలుపులువేసి రాజకుమార్ దగ్గరకు వెళ్ళింది గులాబి.
    "మా నాన్నంటే ఏమనుకున్నావు? పిస్తోలు చూసి బెదిరిపోతాడనుకున్నావా? అనవసరంగా ఆయన్ను రెచ్చగొట్టి కత్తులబోనులో చిక్కుకున్నావు-" అంది గులాబి.
    రాజకుమార్ నిట్టూర్చి-"నా గురించి నాకు బెంగ లేనేలేదు. నీ గురించీ మీ నాన్నగురించీ బెంగ పెట్టుకున్నాను...." అన్నాడు.
    "ప్రమాదం నీకైతే-మా నాన్నగురించి బెంగెందుకు?" అంది గులాబి.
    "నేను ప్రభుత్వ గూఢచారిని. మన దేశంమీద కుట్రపన్నుతున్న పొరుగుదేశపు పథకం వివరాలు తెలుసుకున్నాను. ఈ లోగా వాళ్ళ మనుషులు నా వెంటబడ్డారు. వాళ్ళ కళ్లుగప్పి నేను మీ యింట్లో ప్రవేశించాను.
    నేను వాళ్ళకు దొరికినా ఫరవాలేదు. ఈ కాగితాలు దొరక్కూడదనుకున్నాను. మీ నాన్న వెంటనే ఒప్పేసుకుంటే బాగుండేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వెడతాడు. పోలీసుల్ని రప్పిస్తాడు. ఊరంతా విదేశీ కుట్రదారులు మాటువేసి ఉన్నారు. వాళ్ళకు నా ఉనికి తెలిసిపోతుంది. వాళ్ళ నాపేశక్తి పోలీసులకులేదు. గూఢచారుల కుతంత్రాలకు పోలీసులు తట్టుకోలేరు. ఆ విధంగా రహస్యపత్రాలు శత్రువుల పాలవుతాయి. నా ప్రాణాలుకూడా శత్రువులు పొట్టన పెట్టుకోవచ్చు.
    ఇంతకూ నీ తండ్రి కారణం. నీ తండ్రిని ప్రభుత్వం అనుమానిస్తుంది. విదేశ గూఢచారి అంటుంది. నేను మీ యింట్లో రహస్య పత్రాలు దాచడానికి ప్రయత్నించానని విదేశీ గూఢచారులకు తెలిస్తే మీ నాన్నకు ప్రభుత్వ గూఢచారులతో సంబంధముందని వాళ్ళనుమానిస్తారు. అన్ని వైపులనుంచీ అందరూ మీ నాన్నను వేటాడ్డం మొదలు పెడతారు....."
    గులాబి భయంగా-"మరి నువ్వు స్మగ్లరువికాదా?" అంది.
    "నన్ను చూస్తే నీ కలాగనిపిస్తోందా?" అన్నాడు రాజకుమార్.
    "లేదు-"అంది గులాబి వెంటనే.
    "నన్ను వెంటనే ఈ కత్తుల బోనులోంచి విడిపించు. ఆ విధంగా మన దేశాన్నీ, మీ నాన్ననూ కూడా రక్షించుకున్నదాని వౌతావు...." అన్నాడు రాజకుమార్.
    "ఇవన్నీ నువ్వు మా నాన్నకు చెప్పాల్సింది....."
    "చెప్పేవాడినే! కానీ అర్ధం చేసుకునే తెలివిలేని వాడికెన్ని చెప్పీ ఏం ప్రయోజనం!" అన్నాడు రాజకుమార్.
    "నాకా తెలివి ఉందా?"
    "కొన్ని విద్యల్లో నేర్పరితనం ఉన్నవారికి లోకజ్ఞానముండదు. మీ నాన్న ముఖం చూడగానే నాకా విషయం తెలిసింది. నీ విషయమలాకాదు. నీ ముఖంలో వర్చస్సుంది. తెలివి కొట్టొచ్చినట్లు కనబడుతోంది...."
    గులాబి మొహమాటంగా నవ్వింది.
    "నీ పేరు?" అన్నాడతడు.
    "గులాబి...." అందామె.
    "రూపానికితగ్గ అందమైన పేరు"-అని అతడు నిట్టూర్చి-"గులాబీ! గతంలో నిన్ను చూసి ఉంటే ప్రమాదకరమైన ఈ గూఢచారి వృత్తిని చేపట్టి ఉండేవాణ్ణి కాదు. హాయిగా నీలాంటి అమ్మాయిని పెళ్ళిచేసుకుని జీవితంలో నలుగురికిల స్థిరపడి ఉండేవాణ్ణి...." అన్నాడు.
    "నీ వృత్తి నీ కిష్టంలేదా?"
    అతడు తిరిగి నిట్టూర్చి- 'చూశావుగా ప్రస్తుతం పరిస్థితి. నీ తండ్రి మంచివాడు. దేశభక్తుడు. ఆయన నన్ననుమానించి బంధిస్తేనే ప్రస్తుతం నా గతిలాగుంది. శత్రువులు బంధిస్తే వేరే చెప్పాలా? వాళ్ళు గుండు సూదులతో గుచ్చి ఆ కన్నాల్లో కారంచల్లి నిమ్మకాయ పిండుతాడు. ఒకో తలవెంట్రుకే పట్టి లాగుతూంటారు. ఆ బాధలు భరించలేరు - ఎటువంటి ధైర్యవంతులూ కూడా!" అన్నాడు.
    "మరి నువ్వెందుకీ వృత్తిని చేపట్టేవు....?" అందామె.
    "ఏం చేయను? నా కెవ్వరూలేరు. ఇంట్లో సవతితల్లి పోరు...." అంటూ అతడు తనకు సంబంధించిన ఓ విషాదగాధ చెప్పాడు.
    ఆ కథవింటూ గులాబి చలించిపోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి.
    "గులాబీ! నన్ను విడిపించవూ?" అన్నాడతడు దీనంగా.
    గులాబి మాట్లాడలేదు.
    "అమాయకమైన నీ ముఖం. అందమైన రూపం, కోమలమైన నీ శరీరం కఠినత్వాల్ని భరించలేవు గులాబీ! నువ్వు నీ దేశం కోసం. నీ తండ్రి కోసం, నా కోసమన్న విడిపించాలి. అందుకు ప్రతిఫలంగా ఒకరోజున నిన్ను భారత ప్రభుత్వం సన్మానిస్తుంది. ప్లీజ్.....నన్ను విడిపించు......గులాబీ! నన్ను విడిపించు....."
    ఏమనుకుందో గులాబి అతణ్ణి సమీపించి-ఒకో కత్తినే తీసి నేలమీద పడేయసాగింది.
    
                                      3

    "ఎంతపని చేశావమ్మా?" అన్నాడు గురవయ్య.
    "ఆడపిల్లల్ని వల్లో వేసుకోవడంలో వాడికి వాడేసాటి. ఇంతవరకూ వాడు-ఆడపిల్లల సాయంతోటే తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈ రోజూ అలాగే జరిగింది-" అంటూ నిట్టూర్చాడు పోలీసిన స్పెక్టర్.
    రాజకుమార్ అసలు పేరదికాదు. అతడికన్ని భాషల్లోనూ అన్ని మతాల్లోనూ పేర్లున్నాయి. అతడి బ్రీఫ్ కేసులో లక్షలు విలువచేసే మాదక ద్రవ్యాలున్నాయి. పోలీసులతన్ని సరైన సమయంలో పట్టుకోబోగా అతడు పారిపోయాడు. అతణ్ణి పోలీసులు తరుముతున్నారు. అన్ని పోలీసు స్టేషన్లకూ రాత్రికి రాత్రి వార్త వెళ్ళింది.
    "చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నాడతడు.
    "మాదక ద్రవ్యాలంటే?" అంది గులాబి.
    "యువతరాన్ని లొంగదీసుకుని నిర్వీర్యులను చేసే మత్తుపదార్ధాలమ్మా అవి!" అంటూ పోలీసినస్పెక్టరామెకు వాటి గురించిన వివరాలు చెప్పాడు.
    "అమ్మయ్యో!" అంది గులాబి.
    ఆమె కళ్ళుముందు అందమైన రాజకుమార్ ముఖం చిరునవ్వులు చిందిస్తూ వెలుగుతోంది.
    అందంవెనుక ఎంత మోసం?
    "గురవయ్యగారూ-మీ కృషికి మిమ్మల్నభినందిస్తున్నాను. కానీ మా అదృష్టం బాగోలేదు. అయితే మా మనుషులు ఊరంతా గాలిస్తున్నారు. అతడు గుండెలు తీసినబంటు అతడు కనుక పట్టుబడితే గుర్తించడానికి మీరు మాకు సహకరించాలి-" అని వెళ్ళిపోయాడు పోలీసినస్పెక్టరు.
    పోలీసులు వెళ్ళిపోయాక గురవయ్య కూతుర్ని బాగా మందలించాడు.
    గులాబి ఏడుస్తూ-"నేనతడి మాటలు నమ్మాను నాన్నా! నీకు ప్రమాదమని భయపడ్డాను-" అంది.
    గురవయ్యకు కూతురి మనసు తెలుసు. ఆమె అమాయకురాలని తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS