Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 51


                               కత్తులబోను

    గురవయ్య తన ముందున్న పళ్ళెంవంక చూసుకుని నవ్వుకున్నాడు. ఆ పళ్ళెంనిండా తళతళ మెరుస్తున్న కత్తులు, కత్తులు వాడిగా ఉన్నాయి. చేత్తో తాకితే క్షణాలమీద రక్తం చిమ్మేటంత వాడి ఉన్నదా కత్తుల్లో.
    సూటిగా గుండెలకు తాకితే బాధ తెలిసేలోగా ప్రాణం తీయగల కత్తులవి.
    గురవయ్య ఆ కత్తులతో పదేళ్ళుగా సాధన చేస్తున్నాడు.
    ఒక్కసారి కూడా అతడి గురి తప్పలేదు.
    ఒక్కసారి కూడా అతడి కత్తి విసురుకు మనిషి రక్తం చిందలేదు.
    గురవయ్య ప్రదర్శన అపూర్వం, అద్భుతం-అని పేరు పడింది.
    అతడి ప్రదర్శన అపూర్వం, అద్భుతం-అని పేరు పడింది.
    అతడి ప్రదర్శన అపూర్వం, అద్భుతం-అని పేరు పడింది.
    అతడి ప్రదర్శన చిన్న చిన్న పాఠశాలల నుంచి-జాతీయ సభావేదికల వరకూ పేరు కాంచింది.
    అంతర్జాతీయంగా అతడి కాహ్వానాలు రప్పించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    గురవయ్యకు రాజకీయంగా పలుకుబడిలేదు. అందుకే అతడికి రావలసినంతగా ప్రచారం లభించలేదు.
    అందుకు గురవయ్య బాధపడలేదు. అతడికి విద్యా ప్రదర్శనలో ఉన్న ఆనందం-ప్రచారంలో లేదు.
    డబ్బెలాగూ అతడు దండిగా సంపాదిస్తూనే ఉన్నాడు.
    గురవయ్య ప్రదర్శనల్లో చాలా విశేషాలున్నాయి.
    గోడకానుకుని నిలబడ్డ మనిషినతడు కత్తులు విసిరి బందీని చేయగలడు. తిరిగి అతడు విడిపించేవరకూ ఆ మనిషి కదలలేడు. కదలనంతకాలం ఆ మనిషికి బాధలేదు. కదిలితే రక్తం చిందక తప్పదు.
    వేదికపై పారిపోతున్న మనిషిని కత్తులు విసిరి ఆపగలడతడు. ముందడుగువేస్తే పాదం ముందు కత్తి.
    ఆ దృశ్యం చూసి ఆనందించవలసిందే!
    ప్రస్తుతం గురవయ్య ముందు పళ్ళెంలో కత్తులున్నాయి. ఇంకాస్త దూరంలో అతడి కూతురు "గులాబి" ఉంది.
    గులాబి గులాబి పూవుకన్న మృదువుగా ఉంటుంది. అందంలో ఆమె కామే సాటి. అందాన్ని మించిన ధైర్యమామెకుంది.
    వేదికపై ఆమె అందం, ధైర్యం-గురవయ్యకు అప్సెట్.
    గురవయ్య తదేక దీక్షతో కూతురివంకే చూస్తూ నెమ్మదిగా కత్తులు విసరసాగాడు.
    గులాబి రెండు చేతులూ అడ్డంగా చాచింది. కాళ్ళు ఎడంగా పెట్టింది.
    ఆమె అప్పుడు జీన్సులో ఉంది.
    గురవయ్య విసిరిన కత్తులామె శరీరాన్ని రాసుకుంటూ వెడుతున్నాయి.
    ఆమె అంగుళం మేరకూడా కదలలేదు.
    కత్తులామెను రాసుకుంటూవెళ్ళి-ఆమె వెనుక సుమారు మూడు గజాల దూరంలో ఉన్న గోడకు గుచ్చుకుంటున్నాయి. కొన్ని ఆమె చేతుల్ని, కొన్ని ఆమె కాళ్ళను, కొన్ని ఆమె మెడను దూసుకుంటూ వెళ్ళి గోడలో గుచ్చుకుంటున్నాయి.
    గురవయ్య పళ్ళెంలోని కత్తులైపోయాయి.
    "సెభాష్ నాన్నా!" అంది గులాబి.
    "నువ్వు నన్ను మెచ్చుకోకూడదు-" అన్నాడు గురవయ్య.
    "మెచ్చుకోకుండా ఎలా నాన్నా? నీకులా కత్తులు విసరగలిగేవాడీ భూమ్మీదుంటాడని అనుకోను-" అంది గులాబి.
    "ముందు నువ్వు గోడదగ్గరకు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు మాట్లాడు-" అన్నాడు గురవయ్య గంభీరంగా.
    గులాబి గోడదగ్గరకు వెళ్ళింది.
    గోడనిండా వరసగా కత్తులు.
    ఆమె నెమ్మదిగా ఆ కత్తులమధ్యకు వెళ్ళి యిరుక్కుంది.
    ఇప్పుడామెను చూస్తూంటే గురవయ్య ఆమెను గోడ కానించి నిలబెట్టి అప్పుడు కత్తులు విసిరాడా అనిపిస్తుంది.
    గురవయ్య తృప్తిగా తలాడించి-"బయటకురా-" అన్నాడు.
    గులాబి జాగ్రత్తగా కత్తుల మధ్యనుంచి బయటకు వచ్చింది.
    "ఇలాంటి విద్య నింతవరకూ ఎవ్వరూ ప్రదర్శించలేదు. మనిషికీ గోడకూ మధ్య దూరముంచి కూడా-తిన్నగా మనిషి ఆకారంలో కత్తులు విసరడం-నేనే కనిపెట్టాను-సాధించాను. ఇది నేను ఎల్లుండి స్టేజిమీద ప్రదర్శిస్తాను నువ్వు మాత్రం ఇదే ధైర్యాన్నప్పుడూ ప్రదర్శించాలి...." అన్నాడు గురవయ్య.
    "ధైర్యం గురించి నువ్వు నాకు చెప్పాలా నాన్నా!" అంది గులాబి.
    "సరే- ఈ రోజుకు ప్రాక్టీసై పోయింది...." అన్నాడు గురవయ్య.
    
                                   2

    రాత్రి పదకొండు గంటలవుతుంది.
    గురవయ్య తనగదిలో మంచంమీద నిద్రపోతున్నాడు.
    ఆ సమయం గురవయ్యింటి ముందో వ్యక్తి ఆగాడు. అతడి చేతిలో ఓ బ్రీఫ్ కేసుంది.
    అతడు నెమ్మదిగా తలుపుతట్టాడు.
    ఆ తలుపు చప్పుడు గులాబి వింది.
    అది గులాబికి కలల సమయం.
    జీవితంమీద, భవిష్యత్తుమీద-ఆమె కెన్నో ఆశలున్నాయి.
    ఆమె మనసునిండా వయసుకు తగ్గ కోర్కెలున్నాయి.
    తండ్రి నిద్రకు పడ్డాక ఆమె తీరుబడిగా పడుకుని కలలు కంటుంది. ఆ కలలనిండా బంగళాలు, కార్లు, రాజకుమారులు.....
    గులాబి పెద్దగా చదువుకోలేదు కానీ-తెలుగొక్కటే కాక ఆమెకు మొత్తం దక్షిణాది భాషలన్నీ వచ్చు.
    ఆపైన హిందీ, ఇంగ్లీషు చక్కటి ఉచ్చారణతో మాట్లాడుతుంది.
    చక్కటి పొడవు, అంగసౌష్టవం కారణంగా-ఆధునిక దుస్తులూ, సంప్రదాయపరమైన దుస్తులూ-అన్నిరకాల అలంకారాలూ ఆమెకు నప్పుతాయి.
    తండ్రి ప్రదర్శనల కారణంగా ఆమె ఎన్నోసార్లు వేదిక నెక్కింది.
    అందువల్ల ఆమె చాలామంది దృష్టికి వచ్చింది.
    ఎందరో ఆమె అంటే యిష్టపడ్డారు.
    వారిలో భాగ్యవంతులున్నారు, రాజకీయ నాయకులున్నారు, విద్యాధికులున్నారు.
    వారందరూ ఆమెకు నచ్చారు కానీ గురవయ్యకు నచ్చలేదు.
    "నువ్వంటే యింకా గొప్పవాళ్ళుకూడా యిష్టపడతారు. నీక్కావలసిం దిష్టం కాదు - ప్రేమ!" అన్నాడు గురవయ్య.
    ప్రేమకూ యిష్టానికీ తేడా ఏమిటో గులాబికి తెలియలేదు.
    గురవయ్య మాత్రం ఆమెకు పరోక్షంగా చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS