లిల్లీ
---వసుంధర
లతను చూడగానే ఒక్కసారి నా హృదయం స్పందించింది. అయితే లత నన్ను చూడలేదు.
లతను నేను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆమె రూపం నా మనసులో స్థిరమైన ముద్ర వేసుకున్నది.
ఆమె నాకు ఆరు నెలలుగా తెలుసు. తొలి చూపు లోనే ఆగలేక ఆమెను పలకరించాను. తర్వాత పరిచయం పెంపొందింది. ఆమెకు నా వివరాలు చెప్పాను. మేము తరచుగా కలుసుకుంటూండేవాళ్ళం.
లత నన్ను ప్రేమించానని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. మేమిద్దరం ఎప్పుడు కలుస్కున్నప్పటికీ-ప్రేమ గురించి తప్ప ఇత్రాలే మాట్లాడుకునే వాళ్ళం. నేనెప్పుడైనా ప్రేమ ప్రసక్తి తీసుకువస్తే లత మార్చేసేది. నన్ను తరచుగా కలుసుకుంటున్నది కాబట్టి ఆమె నన్ను ప్రేమిస్తున్నదానే అనుకున్నాను.
ఈ ఆరు నెలలోనూ నేనొకసారి క్యాంపుకు వెళ్ళాను. అప్పుడు మేమిద్దరమూ ఉత్తరాలు కూడా రాసుకున్నాం. వాటిలో కూడా ఎక్కడా ప్రేమలేదు. అమెరికన్సు రీగన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని విచారించడం కోసం ఆ ఉత్తరాలు రాసుకున్నాం.
లత నాకు అర్ధం కావడంలేదు. కానీ ఆమె నా అర్ధాంగి కావాలన్నది నా కోరిక. అందువల్ల నే ఏమో లత కనబడినప్పుడల్లా నా హృదయం స్పందించక మానదు.
లతా హోటలు ముందాగింది. అది హోటలంటే కాఫీ హోటలు కాదు. అక్కాడ టిఫిను, భోజనం ఏమీ దొరకవు. అది లాడ్జి.
ఆమె లాడ్జిముందు ఆగడం నాకూ చాలా ఆశ్చర్యంగా ఉన్నది. లాడ్జిలో ఆమెకు పనేముంటుంది?
నేను లతను చూస్తూనే ఉన్నాను. ఆమె లాడ్జిలో ప్రవేశించింది.
నేనింకా ఆశ్చర్యపడ్డాను. ఏం చేయాలో అని ఓ క్షణం తటపటాయించాను. చివరకు ధైర్యంచేసి నేనూ లోపలకు వెళ్ళాను.
లత రిసెప్షన్ లో ఏమో అడిగింది. తర్వాత చకచకా నడిచింది.
అక్కడ నాన్నాపే వాళ్ళెవ్వరూ లేరు. కాసేపాగి నేను లతను అనుసరించాను. ఆమె మెట్లెక్కితే నేనూ యెక్కాను. అయితే ఆమె కళ్ళబడకుండా జాగ్రత్త పడ్డాను.
లత ఓ గదిలోకి వెళ్ళింది.
నేను గదిదాకా వెళ్ళి ఆగిపోయాను.
లోపలకు వెడితే?
ఎందుకో మనసొప్పలేదు. అలాగని తలుపు దగ్గర కాపలా కాయలేను.
లోపల్నుంచి అస్పష్టంగా మాటలు వినబడుతున్నాయి.
ఎవరో పురుష పుంగవుడున్నాడు లోపల.
నా చెవులు రిక్కించాను. క్రమంగా అవి పదునెక్కాయి. లోపల మాటలు వినగల్గుతున్నాను.
గదికి ఎదురుగా ఉన్న పిట్టగోడనానుకుని ఎవరికీ అనుమానం కలుగని విధంగా ఆ మాటలు నేను వింటున్నాను. నా ముందునుంచి ఒకరిద్దరు రూం బాయెస్ వెళ్ళడం జరిగింది. యెవరూ నన్ను పట్టించుకోవడంలేదు.
లత గొంతులో తడి ఉన్నది-"నువ్వు నాకు అన్యాయం చేయకూడదు రఘూ!" అన్నదామె.
"అయాం సారీ లతా!" అన్నాడతడు.
"నువ్వొప్పుకోకపోతే ఆత్మహత్యే నాకు గత్యంతరం....."
అతడేమీ మాట్లాడలేదనుకుంటాను. కొద్ది క్షణాలనంతరం లత యేడుపు నాకు వినబడింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నది.
నా హృదయం ద్రవించుకుపోయింది. నా లత యేడుస్తున్నది. ఆమె ఏడుస్తూంటే నిస్సహాయంగా వింటున్నాను.
ఏమయింది లతకు?
ఆ రఘు ఆమెను మోసం చేశాడా? మోసం చేయడమంటే.....
ఒక్కసారి నా శరీరం వణికింది.
నా లత నాకు కాకుండా పోయిందా? ఆమె వేరే దుర్మార్గుడి వలలో చిక్కుకుందా? ఆమె చుట్టూ అల్లుకున్న నా ఆశాలతలను నేను భేదించవలసిందేనా?
లత తమాయించుకున్నట్లుంది-"వెళ్ళొస్తాను రఘూ!" అన్నదామె.
"వెళ్ళేముందు ముఖం కడుక్కుని వెళ్ళు. కళ్ళు బాగా ఉబ్బాయి...."
"ఎందుకులే రఘూ- ఏడుపు నా జీవతానికింక శాశ్వతం-" అంది లత.
నా కేడుపు వచ్చింది. ఏం జరిగింది? ఎలా జరిగింది?
లత ఎంతో తెలివైనది. ఆమె ఓ దుర్మార్గుడి వలలో ఎలా చిక్కుకుంది? లతవంటి యువతిని ఆ దుర్మార్గుడు యెలా తిరస్కరించగల్గుతున్నాడు?
నేను ఆలోచిస్తూనే ఉన్నాను.
భళ్ళున గది తలుపులు తెరుచుకున్నాయి. నాకు తప్పించుకునే వ్యవధి లేకపోయింది. లత నన్ను చూసింది నేనామెను చూశాను.
లత కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి. ముఖంమీద కూడా కన్నీటి చారలు స్పష్టంగా కనబడుతున్నాయి.
లత నన్ను చూసి ఉలిక్కిపడింది. ఏదో ఆడగాలనుకుని ఆగిపోయింది. తర్వాత అపరిచితురాలిలా వెళ్ళి పోయింది చరచరా!
నేనూ లతతో మాట్లాడాలనుకున్నాను. కానీ మాటరాలేదు. ఈలోగా తలుపులు వేసుకునేందుకు కాబోలు అతను వచ్చాడు.
నేనతడిని చూశాను.
రూపం నేనూహించుకున్నట్లు లేదు. అతడు చాలా బాగున్నాడు. చూడగానే అందగాడనీ, మంచివాడనీ అనిపిస్తుంది. అలా ఉండబట్టే లత మోసంలో పడిపోయి ఉంటుంది. ఆశ్చర్యమేమంటే అతడికున్న మీసాలు కూడా అతఃది అందాన్ని పెంచడానికీ, అతడు మరింత మంచివాడనిపించడానికీ దోహదం చేస్తున్నాయి. కానీ అతడు దుర్మార్గుడు!
నేనతడివంక క్రూరంగా చూశాను. నా చూపుల్లోని క్రూరత్వాన్నతడు గుర్తించినట్లు లేదు. మామూలుగా తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు.
లతకేదైనా జరిగితే అతడి అంతు చూస్తానని అప్పట్లో అతడికి తెలిసి వుండదు.
నేను రిసెప్షన్ లో అడిగి రఘు వివరాలన్నీ సేకరించగలిగాను. అందుకని నేను కొన్ని అబద్దాలు కూడా చెప్పవలసి వచ్చింది.
2
నాకున్న మంచి స్నేహితుల్లో కిషోర్ ఒకడు. కిషోర్ తో నాకు ఆర్నెల్లనుంచి స్నేహం.
అతడు సరదా అయినవాడు. హుషారైనవాడు. భాగ్యవంతుల బిడ్డ. ఎందులోనూ లోటు లేనివాడు. అయితే తన సుఖం కోసం యెదుటివారిని కష్టపెట్టే మనస్తత్వం మాత్రం అతడికి లేదు.
అతడి పద్ధతులు మంచివి కావనీ-సమాజ విద్రోహ చర్యలలో అతడికి భాగమున్నదనీ కొందరు నాకు చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఈ రోజుల్లో నేరానికి నిర్వచనం-నేరం చేసినవాడి పలుకుబడినిబట్టి మారుతున్నది. కిషోర్ యెలాంటివాడైతేనేం-సమాజంలో అతడికి మంచి పేరే ఉన్నది. నాతోనూ అతడు మంచిగా ఉంటాడు.
